Saturday 31 January 2015

ఆడపిల్లలపై ఆగని అరాచకాలు....



సమాచార విప్లవం సాకారమైంది కాని సామాజిక సంబంధాలు మాత్రం విచ్చిన్నమవుతున్నాయి. అక్షరాస్యుల సంఖ్య అధికం అవుతుంది కాని ఆడపిల్లలపై అకృత్యాలు మాత్రం ఆగని అరిష్టం నెలకొంది మన దేశంలో. నియంతృత్వాలు కూలిపోతున్నాయి కాని నిరంకుశ ధోరణులు పెరిగి దిన దినానికి  నేరాలు అధికమవుతున్నాయి. అందుకే అభద్రత, అలక్ష్యం, ఈ అకృత్యాల బరువుని భరించలేక మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నానాటికి పెరిగి కుంగిపోతుంది. ఇలా ఎంత కాలం..?? మనకు మనం ప్రశ్నించుకోవలసిన ప్రశ్న.

ఆడపిల్లలపై అరాచకాలు రొజూ కొనసాగుతూనే ఉన్నాయి. అతివల ఆక్రందనలు దేశం నలు దిక్కులా ఆణువణువూ వినిపిస్తున్నాయి. దాడులు ప్రతిదాడులు., హత్యలు.., ఆత్మహత్యలు.., పసిమోగ్గలపై పాశవిక ఘటనలు, అమ్మాయిలపై అత్యాచారాలతో కూడిన హింసాత్మక సమాజంలో నివసిస్తున్నామా మనం...?!

నల్లని మరకలు పడుతున్నాయి మన దేశం మీద.., కాదు కాదు మన బంగారు తల్లుల మీద...,నిమిషానికి ఒక్కటి.... ఒక్కో అత్యాచార ఘటన మన దేశ చరిత్రలో ఒక్కో మాయని మచ్చ గా నిలిచిపోతుంది. కామ వ్యాధి పట్టిన కాల యములు సమాజ కారడవిలో కామ క్రీడ ఆడుతుంటే నిర్లజ్జగ చూస్తుండి పోతున్నాం., మదం పట్టిన కొందరు క్రూర మృగాలు మల్లెమొగ్గల్లాంటి ఆడపిల్లలని చెరపట్టగా నిస్సిగ్గుగా చూస్తుండి పోతున్నాము.. ఢిల్లీ నిర్భయ ఘటనను  ఇప్పుడిపుడే దేశం మర్చిపోతుంటే ఈ  మధ్యకాలంలో దేశ రాజధానిలో జరిగిన ఘటన ప్రజలను ఒక్కసారి గా మల్లి ఉలిక్కి పడేలా చేసింది. గుర్గావ్ లో జరిగిన ఈ సంఘటనతో అబల ఇంకా అభద్రత మధ్యే   అమ్మాయిని ఇంటి గడప దాటించటానికి కూడా.., తలిదండ్రులు ఎక్కడ ఎం జరుగుతుందో అని ప్రతి క్షణం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. వరస సంఘటనలు అమ్మాయిల గుండెల్లో అలజడి సృష్టిస్తుంది.

పార్లమెంట్ ఎన్ని చట్టాలు చేసినా, ప్రభుత్వం ఎన్ని భద్రత ఏర్పాట్ల పేరుతో భరోసా ఇచ్చినా ఈ అకృత్యాలకు మాత్రం అడ్డే ఉండటం లేదు.. ! ప్రభుత్వము కూడా ఇలాంటి ఘటనల పట్ల ఇంకా కటినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ రాజధాని నడిబొడ్డున నిర్భయ ఉదంతం జరిగినపుడు కొన్ని రోజులు హడావుడి చేసిన ప్రభుత్వం మరియు నిరసన ప్రదర్శనలు నిర్వహించిన నిజమైన నిరసన కారులు కొన్ని రోజుల తర్వాత ఆడపిల్ల భద్రతను మల్లి అటకెక్కించారు. కొన్ని కటినమైన నిబంధనలతో నిర్భయ చట్టాన్ని ప్రభుత్వం తీసుకోచ్చినప్పటికి ఈ అత్యాచారాలు మాత్రం ఆగలేదు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఎన్నో నిర్భయ కేసు లు నమోదయ్యాయి. ఎన్నో అత్యాచార కేసులు వాయిదాలలో పడి వరదల్లో "కొట్టుకుపోతున్నాయి", దేశ రాజధానిలో ఎన్నికల నగారా మొగినప్పుడు అందరూ ఇదే భద్రత అంశాన్ని నొక్కీ 'వక్కాణించారు'. వాళ్ళందరూ ఇప్పుడు ఆడపిల్ల అడ్రస్సు మరిచారు. మరి బాధితులకి న్యాయం జరిగేది ఎక్కడ అంటే మాత్రం జావాబు లేని ప్రశ్న గానే మిగిలిపోతుంది.

దేశ రాజధాని సర్వ విభాగాలు కొలువున్న చోటు.., అందరూ అధికారులు ఆవసాముండే మహా నగరం. అలాంటి దేశ రాజధానిలోనే సగటు అమ్మాయికి రక్షణ లేనప్పుడు మిగతా ప్రాంతాల పరిస్థితి ఎంటన్నది ఒక్క సారి పాలకులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నది ఎవరైనా సరే సగటు ఆడపిల్లకు అన్యాయం జరగని రోజు రావాలి. కఠిన చట్టాలు మాత్రమే పరిస్థితిని మార్చలేవు. నిరంతరం అప్రమత్తంగా, జవాబుదారీతనంతో వ్యవహరించే అధికార యంత్రాంగమూ, సత్వర విచారణ జరిపి నేరస్తులను దండించగలిగే వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే సత్ఫలితాలుంటాయి.

ప్రభుత్వం తో పాటు  ప్రజలు కూడా ఇలాంటి ఘటనల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి పై ఉంది. అమ్మాయిలు ముఖ్యంగా ఎంతో జాగరూకతతో ఉంటేనే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చు. అత్యాచార నిరోధక చట్టం.., నిర్భయ చట్టం.., ఇలాంటి చట్టాలెన్ని వచ్చినా కాని కేవలం కాగీతాల మీదనే కటినంగా అనిపిస్తున్నాయి. ఈ బిల్లులతో.., ఈ చట్టాలతో.., మహిళ లపై ఆకృత్యాలు ఆగిపోతాయనుకుంటే అది హాస్యాస్పదమే అవుతుంది.

గగనంతరాలవరకి ఎదిగిన మహిళను మల్లి గరిటె పట్టుకోమంటుంది మన ఈ భరత సమాజం.. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆడపిల్లను అత్యాచార ఘటనలతో అవని గర్భంలోకి వెళ్ళమని ఆక్షేపిస్తున్నారు. మరి ఎప్పుడు ఈ అరాచక సంఘటనలకు అంతం...? అత్యాచార ఆలోచన ఉన్న ప్రతి అర్దాయుషు అనామకుడికి అమ్మాయిని చూస్తున్నపుడు మరణపుటంచుల వరకి వెళ్లి మనకి జన్మనిచ్చే అమ్మ గుర్తుకు రావాలి.  మహిళల్లో ఆడతనాన్ని మాత్రమే చూడకుండా అమ్మతనాన్ని కూడా చూడటం ఈ సమాజం అలవర్చుకున్నపుడే ఈ అకృత్యాలు ఆగుతాయి! అంటే ఆ దిశగా ప్రతి ఒక్కరిలో పౌర చైతన్యం రావాలి!! అమ్మాయిని ఇలాంటి అత్యాచార ఘటనలతో ఆమె ఆత్మాభిమానాన్ని అణచివేయాలని చూస్తే మాత్రం అవ"ని"అంతారాలను దాటి తనలో ఉన్న ఆవేదననే అభినివేశంగా అలరార్చి ఆత్మ విశ్వాసమే ఆలంబనగా .., అవరోధాలనే అవకాశాలుగా మలచుకొని ఆకాశమనే అంతిమ లక్ష్యాన్ని చేరుకొని అద్భుతాలు సృష్టించి అందరికి ఆదర్శప్రాయమవుతుంది.  


హరికాంత్ రెడ్డి రామిడి

No comments:

Post a Comment