Saturday 31 January 2015

బిజినెస్: స్పైస్ జెట్ మళ్ళి స్పైస్ గా మారనుందా..!



మళ్ళి స్పైస్ జెట్ వార్తల్లో నిలిచింది. ఇప్పటికే సంస్థ పూర్తి నష్టాల్లోకి కూరుకుపోయి చేతలుడిగిన స్థాయిలో ఉన్న స్పైస్ జెట్ మళ్ళి తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించుకునే పనిలో పడింది. ఇప్పటికే స్పైస్ జెట్ వాటాను పూర్తిగా సంస్థ లోని మిగతా సభ్యులకు విక్రయించిన కళానిధి మారన్ ఇప్పుడు సంస్థ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు సంస్థ మొత్తం క్రొత్త యాజమాన్యానికి పూర్తిగా బదిలీ అయినట్టే. మరి నష్టాల్లో ఉన్న సంస్థ పూర్తిగా తన ఆధీనం లోకి తీసుకొని అంత ధైర్యం చేసిన వ్యక్తి ఎవరని అటు వ్యాపార ప్రపంచమే కాదు… ఇటు సాధారణ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. సినిమా లలో మాములుగా చూస్తుంటాం….. ఒక సంస్థ ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసి, ఇంక ఎన్నో ప్రయత్నాల అనంతరం ఆ యాజమాన్యం కూడా చేతులేత్తేసినపుడు ఒక హీరో వచ్చి ఆ నష్టాల్లో మునిగిన సంస్థకు జవసత్వాలు అందింప జేసి, ఆ సంస్థను మళ్ళి దిగ్విజయంగా లాభాల బాట పట్టించి, చరిత్ర సృష్టిస్తాడు. మరి ఇది సినిమా లలో…. మరి సరిగ్గా ఇలాంటి సంఘటనే భారత వ్యాపార రంగలో చోటు చేసుకోనుందా..??

ఆర్థికంగా కుదేలయిపోయి, కేంద్రం వైఖరితో నిరాశ నిస్పృహ లతో ఉన్న.., ఇంక ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఆశ తో ఎదురు చూస్తున్న స్పైస్ జెట్ విమానానికి మళ్ళి ఒక టేక్ ఆఫ్ ఇచ్చి గాల్లోకి లేపే కత్తి లాంటి కొత్త పైలట్ (యాజమాన్యం) రానున్నాడ..? ఇప్పుడిదే చర్చ నడుస్తుంది కొన్ని వ్యాపార వర్గాల్లో… ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసింది. అటు కేంద్ర సహహయాన్ని కూడా అర్థించిన విషయం తెలిసిందే.., కాని కేంద్ర సహాయాన్ని అందిచటానికి తిరస్కరించటంతో ఇంక ఎటు పాలుపోలేని సంస్థ యాజమాన్యం దాదాపుగా చేతుల్ని ఎత్తిసింది. కాని స్పైస్ జెట్ లో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ కేంద్రానికి కలవర పుట్టించాయి. స్పైస్ జెట్ చాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ యాజమాన్యం వల్ల కాలేదు. అందుకే షేర్ మార్కెట్ లో స్పైస్ జెట్ ఒక్కో షేరు ధర 48 రూపాయలు ఉండగా, ఈ పరిణామాలతో ఒక్కసారిగా పతనావస్థ కు చేరుకుంది. కాని ఇప్పుడు ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను గట్టెక్కించటానికి కొత్త యాజమాన్యం రానుందని వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి. అవును స్పైస్ జెట్ సంస్థ త్వరలోనే చేతులు మారనుందనే ఊహాగానానికి స్పైస్ జెట్ అసలు ప్రమోటర్ అయిన అజయ్ సింగ్ వ్యాఖ్యలు ఆ ఒహాగానాలు నిజమేనని ఝూడీ చేస్తున్నాయి.

తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఊహాగానాలు నిజం కానున్నాయనే వాదనలు బలపడుతున్నాయి. భారత్, విదేశాలకు చెందిన కొందరు ఇన్వెస్టర్లు కంపెనీలో సుమారు రూ.1,400-1,500 కోట్లమేర కొత్తగా పెట్టుబడులు పెట్టి.. ఆమేరకు వాటాను దక్కించుకోవడానికి సుముఖంగా ఉన్నారని సమాచారం. కంపెనీ బ్యాలెన్స్‌షీట్, ఆర్థిక పరిస్థితిని మదింపు (డ్యూడెలిజెన్స్) చేసిన తర్వాత పెట్టుబడులపై స్పష్టత వస్తుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీలు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ)కి బకాయిలు చెల్లించకపోవడంతో ఐదు రోజుల క్రితం స్పైస్‌జెట్ విమాన సేవలు పూర్తిగా నిలిచిపోయి కంపెనీ దాదాపు కుప్పకూలే దశకు చేరిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర పౌర విమానయాన శాఖ జోక్యంతో చమురు కంపెనీలు, ఏఏఐ బకాయిల చెల్లింపునకు కొంత వ్యవధి ఇవ్వడంతో స్పైస్‌జెట్‌కు తాత్కాలికంగా కొంత ఊరట లభించింది. కాని ఈ పరిణామాలన్నీ గమనించిన వ్యాపార వేత్త అజయ్ సింగ్ ఆర్ధిక ఊబిలో కూరుకుపోయిన స్పైస్ జెట్ ని తన భుజాల మీదకు ఎత్తుకోవటానికి సిద్దమవుతున్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీని తీసుకోవటానికి వచ్చిన ఆ “హీరో” ఎవరు…?? కష్టాల్లో ఉన్న స్పైస్‌జెట్‌పై ఈ కంపెనీని నెలకొల్పిన అసలు ప్రమోటర్ అజయ్ సింగ్ మళ్లీ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.

కంపెనీని గాడిలోపెట్టడంతోపాటు ఇతర ఇన్వెస్టర్లతో కలిసి మళ్లీ పెట్టుబడులు పెట్టే ప్రణాళికల్లో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సింగ్ పలుమార్లు భేటీ కావడంతో ఈ వాదనలు జోరందుకున్నాయి. అజయ్ సింగ్ మరెవరో కాదు స్పైస్ జెట్ అసలు ప్రమోటర్. స్పైస్ జెట్ దేశం లో ఇంతగా ప్రాచుర్యం పొందటానికి కారణమైన వ్యక్తి. స్పైస్‌జెట్‌ను గట్టెక్కించేందుకు దీని అసలు ప్రమోటర్ అజయ్ సింగ్ తెరపైకి రావడంతో అందరికళ్లూ ఇప్పుడు ఆయనపైనే ఉన్నాయి. ఢిల్లీ ఐఐటీలో పట్టాపుచ్చుకున్న సింగ్.. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. పారిశ్రామికవేత్త ఎస్‌కే మోడీకి చెందిన నష్టజాతక మోడీలుఫ్ట్ ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేసిన తర్వాత దీని పేరును స్పైస్‌జెట్‌గా మార్చి.. లాభాలబాట పట్టించారు. దేశంలో ప్రధాన చౌక విమానయాన సంస్థగా తీర్చిదిద్దిన ఘనత అజయ్ సింగ్‌కే దక్కుతుంది. అయితే, 2010లో కంపెనీలో ఇతర ప్రధాన ఇన్వెస్టర్లు తమ వాటాను మారన్‌కు విక్రయిండచంతో యాజమాన్యం చేతులు మారింది. ఇదిలాఉంటే… అధికార బీజీపీ ప్రభుత్వంతో సింగ్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో స్పైస్‌జెట్ ఉదంతం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఎందుకంటే తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం విషయంలో సింగ్ కీలక పాత్ర పోషించారు.

స్పైస్‌జెట్ యాజమాన్యం తమను ఆదుకోవాలంటూ ఎన్నివిజ్ఞప్తులు చేసినా పట్టించుకోని మోదీ సర్కారు.. అజయ్ సింగ్ రంగంలోకి దిగాక ఊరటకల్పించే చర్యలు చేపట్టడం గమనార్హం. మోడీ తో కూడా అజయ్ సింగ్ కి మంచి సంభంధాలు ఉండటం గమనార్హం గుజారత్ ఎన్నికలలో పలు మార్లు మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అప్పటినుండే మోడీ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా స్పైస్‌జెట్‌లో పెట్టుబడులకు ఇది మంచి తరుణమని.. కంపెనీకి మళ్లీ పుంజుకోగల సత్తా ఉందంటూ వ్యాఖ్యానించారుకూడా. దీన్ని బట్టి ఆయన కంపెనీ ని పూర్తిగా తన ఆధీనం లోకి తీసుకోనున్నరనే ఊహాగానాలకు ఊతం ఇచ్చిన వారయ్యారు 2010లో సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్.. స్పైస్‌జెట్ ఇన్వెస్టర్లయిన కన్సాగ్రా, విల్బర్ రాస్ నుంచి 38% వాటాను కొనుగోలు చేయడం తెలిసిందే. ఆతర్వాత ఓపెన్ ఆఫర్ ద్వారా కొంత వాటాను దక్కించుకోవడంతో యాజమాన్యం ఆయన చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం మారన్, సన్‌గ్రూప్‌లకు స్పైస్‌జెట్‌లో 53.48 శాతం వాటా ఉంది.

ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో మైనారిటీ వాటాదారుగా ఉన్న అజయ్ సింగ్‌కు సుమారు 5 శాతం వాటా ఉంది. కాగా, కంపెనీ ఆస్తులు, ఇతరత్రా అంశాలను మదింపుచేసేందుకు 4-6 వారాల వ్యవధి పట్టొచ్చని.. ఆ తర్వాత పెట్టుబడులపై ఇన్వెస్టర్ల నుంచి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే.. మారన్, సన్‌గ్రూప్ వద్దనుంచి యాజమాన్య నియంత్రణ ఇతర ఇన్వెస్టర్లకు వెళ్తుంది. తక్షణావసరం రూ.1,400 కోట్లు… ఇప్పటికిప్పుడు సంస్థకు 1400 కోట్లు అవసరం. కాని ఆ 1400 కోట్లను ఎలా సమకూర్చాలన్నదే అసలు సమస్య… విమానాలను లీజుకిచ్చిన సంస్థలు, ఆయిల్ కంపెనీలు, ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు ఇతరత్రా సంస్థలకు స్పైస్‌జెట్ రూ.1,400 కోట్లమేర బకాయి పడింది. కంపెనీ గట్టెక్కాలంటే తక్షణం ఈ మొత్తం అవసరం. మరో రూ.2,000 కోట్లకుపైగా రుణ భారం కూడా ఉంది. కాగా, స్పైస్‌జెట్‌లో పెట్టుబడుల విషయంలో బడా ఇన్వెస్టర్లతో అజయ్ సింగ్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వాళ్లుగనుక వాటా కొనుగోలు చేస్తే.. యాజమాన్య మార్పిడితో పాటు రుణాల చెల్లింపు బాధ్యతను కూడా తలకెత్తుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా.. విమానయాన సేవలు సజావుగా సాగేందుకు మరిన్ని నిధులను కూడా వెచ్చించాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ(షేర్ల మొత్తం విలువ) రూ.900 కోట్లుగా ఉంది. అప్పట్లో ఒక్కో షేరుకు రూ.48 చొప్పున మారన్ వాటాను కొన్నారు. కంపెనీ కష్టాల నేపథ్యంలో ఇటీవలే రూ.13 స్థాయిని తాకిన షేరు.. తాజాగా అజయ్ సింగ్ స్పైస్ జెట్ పగ్గాలు అందుకోన్నారనే వార్తల నేపథ్యంలో మళ్లీ 16 రూపాయల స్థాయికి కోలుకుంది. ఏది ఏమైనా అజయ్ సింగ్ స్పైస్ జెట్ ని ఆర్ధిక కష్టాల నుండి అలవోకగా బయటకి తీసుకురాగాలడని వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి.

హరికాంత్

No comments:

Post a Comment