Wednesday 11 May 2016

పుట్టిన నెల ప్రత్యేకం: 27 సంవత్సరాల్లో నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు....


మంచి చెడు అంటూ ఉండదు మంచి చెడు రెండు కలిస్తేనే మనిషి అవుతాడు అన్న వివేకానంద మాటలు నాకు ఎప్పుడు గుర్తుంటాయి... ఈ లోకంలో పూర్తిగా మంచోళ్ళు ఉండరు.., అలా అని పూర్తిగా చెడ్డోల్లు ఉండరు. పరిస్థితులు మనిషిని ఒక్కో వైపు ముడిపెడతాయి... దేశం లో అయిన సమాజంలో అయిన ఎవ్వరు కూడా గొప్పవాళ్ళు ఉండరు నా దృష్టిలో... దేశం గర్వించే మహామేధావి అబ్దుల్ కలాం కూడా నా దృష్టిలో మంచోడు కానట్టే... అరె ఆయన  మీరన్న మంచోడే అయితే ఇతర దేశాలను నాశనం చేయాలనుకునే లక్ష్యాలున్న మిస్సైల్ లను ఆయన కనిపెట్టకపోయే వాడు.. ఆయన మంచోడే అయితే ఇంకొకరిని చంపే ఆయుధాన్ని తయారుచేసి ఉండేవాడే కాదు. దానికి బదులు శాంతి మంత్రం జపించేవాడు... ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళుగా ఉండరు... ఉండలేరు కూడా... (దీనిపై మళ్ళి చర్చ, వాగ్వ్యుద్దం అనవసరం)  ఈ వేదాంతం ఇప్పుడు మాకెందుకు అనుకోవద్దు కాని కొన్ని కొన్ని సార్లు వేదాంతమే వేల కోట్లు ఇచ్చిన సంతృప్తి ని ఇస్తుంది...

బాల్యంలో మే నెల వస్తే ఏదో ఎండాకాలం సెలవులు వచ్చి మనసార ఆడుకోవటానికి వచ్చిన సమయంగా భావించేవాన్ని... యవ్వన కాలంలో పొద్దున్న పడుకోవటానికి..., మధ్యాహ్నం ఎండ పేరు చెప్పి మల్లి పడుకోవటానికి.., సాయంత్రం స్నేహితులతో బలాదూర్ తిరగటానికి.., రాత్రి నాన్న అంగి జేబులో ఎమన్న నోట్లు తగిలితే స్నేహితులంతా కలిసి తలో యాభై వేసుకొని చల్లటి బీరు వేయటానికి... అదొక అందమైన అనుభూతి... కాని ఇప్పుడు మే నెల అంటే ఆర్ధిక సంవత్సరానికి సరిగ్గా ఒక్క నెల తర్వాత వచ్చేది.... మే లో స్టాక్స్ కొంచెం డౌన్ ఫాల్ లో ఉంటాయి... ఆర్ధిక సంవత్సరం అప్పుడే ఫస్ట్ గేర్ వేసుకొని ముందుకు దూసుకువెళ్ళటానికి ఉన్న సమయం.., పెట్టుబడులకు అనువు కాని నెల..., ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే ఎండ ఎక్కువ కొడితే దీనమ్మ జీవితం ఈ మే నెల ఎప్పుడు పోతుందా అనుకొనే రోజులు.... 

కాని నాకు నేను... గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మే నెలలోనే నేను పుట్టానన్న సంగతి.... మే నెలలో నా పుట్టిన రోజు ఉంటుందన్న విషయం ఎవరన్న గుర్తు చేస్తే తప్పితే గుర్తుకురాదు.... గత సంవత్సరం నుండే మే నెల వస్తే చాలు.. భయం భయపెడుతుంది... ఇంకా ఎం సాధించలేదు సగం జీవితం అప్పుడే అయిపోయిందన్న బెంగ పట్టుకుంది.. ఇంకా చెప్పాలి అంటే జీవితం అతి పెద్ద అచీవ్ మెంట్ గా కొందరు చెప్పుకునే.... "అహ నా పెళ్ళంటా" తంతు ఇంకా కానేలేదు.... గత సంవత్సరం అసలు ఎం సాధించాను అన్న దానిపై ఆగిపోయింది... కాని ఈ సారి మాత్రం కొత్త కొత్త భయాలు సరికొత్తగా మదిలో గూడు కట్టుకుంటున్నాయి... 

ఏది ఏమైనా 27 సంవత్సరాల జీవితం.. (ఈ మే 21 తో సరిగ్గా 28 సంవత్సరాలు) వెనక్కి తిరిగి చూస్తే సగటు యవ్వన కాలం... కొవ్వొత్తిలా కరిగిపోయింది. ఒక్క క్షణం నేను నమ్మని ఆ దేవుడు వరమివ్వమని అడిగితే ఆయన ఇవ్వని (ఇవ్వలేని) ఈ దశలని(బాల్య,యవ్వన) మల్లి అడగాలని ఉంది... చావంటే భయపడలేదేప్పుడు... అలాగని బ్రతుకు మీద తీపి లేదని కాదు. డబ్బంటే ఇష్టం లేదు... అలాగని డబ్బు లేకుండా బతకలేను.., నాకు డబ్బంటే ఇష్టమంటారు కొందరు... కాని నాకు కాసులంటే(డబ్బు) కసి కాని కకృత్తి కాదు.... మొదట్లో ఆదర్శభావాలు చాలా ఉండేవి. దాన్ని ఇలా చేయాలి అలా చేయాలి.., అలా మార్చెయ్యాలి ఇలా మార్చెయ్యాలి.. కొన్ని రోజులు అడవి బాటలో పయనిద్దామని భావించిన నేను ఆ అడవి తల్లిని చూసేంత అర్హత నాలో లేదని ఆ ఆలోచనను ఆదిలోనే చంపేసి ఆదర్శభావాలను అంగట్లో అమ్మకానికి పెట్టి అమ్మనే (దేశాన్నే) తెగ నమ్మేస్తున్నాను.

ఏది ఏమైనా ఈ సగటు జీవన ప్రయాణంలో కొన్ని తీపి గురుతులు.., కొన్ని ఎదురు దెబ్బలు, ఎదురించడాలు.., ఎక్కడాలు.., దిగడాలు.., భయపడటాలు.., భయపెట్టడాలు.., అనారోగ్యాలు., ఆనందాలు.., అసంతృప్తులు..., అవహేళనలు.., అన్ని ఉన్నాయి. ఇంకా ఇవేం చుశావ్ మున్ముందు పల్టి కొట్టాల్సినవి చాలా ఉన్నాయి..., కింద పడి దెబ్బలు తగిలించుకునే సుదూర తీరాలు ఇంకా ఎంతో ఎత్తులో ఉన్నాయి... అన్నట్టు భవిష్యత్ ఏ బాధ లేకుండా రమ్మని స్వాగతం పలుకుతుంది... ఇవ్వన్ని అందరి జీవితాల్లో కామనే అయినా.... కొన్ని క్షణాలు మాత్రం అలాగే గుర్తుండి పోతాయి... జీవితం అనే ఫోటో ఆల్బంలో బాధ, సంతోషం, దుఖం అనే ఫ్రేమ్ ల లాగ... 

అలాంటి క్షణాలేమో కాని ఈ జీవన ప్రయాణంలో కొందరు గొప్ప వ్యక్తులు నాకు ఎదురయ్యారు... (గొప్ప వ్యక్తులు అనేకన్నా నా ప్రయాణ క్రమంలో తారస పడిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అనటం ఇంకా బెటర్ ఏమో.., ఎందుకంటే గొప్ప వ్యక్తులంటూ ఎవరు ఉండరని నేను ఇంతకు ముందే చెప్పాను..) వీళ్ళు నా ప్రయాణ క్రమాన్ని మార్చలేదు కాని.., ఆ ప్రయాణ క్రమంలో ఎంతో కొంత ప్రభావితం చూపారు... 27 సంవత్సరాలలో ఏడుగురు... 

1)అన్నయ్య: అవును నా అన్న కాబట్టి నాకు గొప్ప వ్యక్తే... నా ఆలోచనల్లో, అవసరాల్లో, ఆనందాల్లో అనుక్షణం ఉన్నాడు కాబట్టి గొప్ప వ్యక్తే ఇంక ఇందులో ఏలాంటి సందేహం అవసరం లేదు. చెప్పవలసిన అవసరం లేదు. 

2)యెడుగూరి సంధింటి అక్కిరెడ్డి: నా జీవితం అతి కీలకమైన మలుపు తీసుకోవటానికి ఉతమిచ్చిన వ్యక్తి... వేళ్ళ మీద కూడా నోట్లు లెక్క పెట్టొచ్చు.., మనుషుల మనస్తత్వాన్ని ముందే కనిపెట్టచ్చు.., బ్రతుక్కి సావుకి మధ్య మనం చేసే పోరాటంలో అటో ఇటో నిర్ణయం తీసుకొనే క్షణాల విలువే ధైర్యమని.., రాజ్యం ఉండాలంటే సంపాదన ఉండాలని సంపాదన కావాలంటే తెలివుండాలని.., తెలివికి లాజిక్ మ్యాజిక్కు రెండు జోడిస్తే ఇంక ఎవడికి వినాల్సిన పని ఉండదని ఇలా ఎన్నో సూత్రాలు ఎన్నో పాటాలు... ప్రపంచంలో "తెల్ల" "నల్ల" అనే పదాలకు అసలు అర్దాలను ఈయన దగ్గరే నేర్చుకోవటం మర్చిపోలేని ముఖ్యమైన ఘట్టం. ఈయన చెప్పిన మాటల్ని, పాటాల్ని నేను నోట్ పాడ్ లోనో... నోట్స్ లోనో రాసుకోలేదు.. మస్థిష్కంలోనే శిలాక్షరాలుగా లిఖించేసుకున్న...

3)కృపాదానం: గురువు... నాకు చిన్నప్పటి నుండి గురువులంటే ఏదో పాటాలు చెప్పి నెలాఖరు రాగానే వాళ్ళ జీతం తీసుకుపోయే వ్యక్తుల లాగ అనిపించేవాళ్ళు... అందుకే నా మీద ఏ గురువు ప్రభావితం చేయలేదు. చేయలేడు కూడా....  కాని ఈ గురువు మాత్రం నా ప్రాపంచిక జ్ఞానానికి నాంది పలికిన విజ్ఞాన దాతగా మిగిలిపోతారు... ఎన్నో విషయాలు ముఖ్యంగా ఆర్ధిక విషయాలపై నాలో అఖండ జ్ఞాన సంపత్తిని నెలకొల్పిన ఈయనకు నేను రుణపడి ఉండాలి అనే మాట చాలా చిన్నది అవుతుంది. 

4)ప్రియాంక: మర్చిపోయిన ఒక మధురమైన జ్ఞాపకం... ఈమె గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కొందరు వ్యక్తులు మన జీవితాల్లోకి కొన్ని విలువైన విషయాలు నేర్పించటానికి వస్తరంటారు. ఈమె ఆ కోవలోకే వస్తుంది. 

5)బాబాయ్: ఈయన నా మీద ఎంతో కొంత ప్రభావితం చూపారు... ముఖ్యంగా నాలో డబ్బు కసిని పెంచిన వ్యక్తి. ఈయన గురించి మాట్లాడేంత గొప్పవాణ్ణి కాదేమో కాని... నైతిక విలువలను నాలో పెంపోదింపజేసిన వ్యక్తి... నాలో అంతో కొంతో మానవత్వపు జాడలు బయటకి కనిపిస్తున్నాయంటే ఈయన వ్యక్తిత్వమే ముమ్మాటికి కారణం. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈయన వ్యక్తిత్వం చూస్తూ పెరిగాను. బంధాలు, భవబంధాలు, అనుబంధాలకు ఎంత విలువిస్తే అనురాగాలు అంత పెనవేసుకుంటాయని, అవి ఒక వెల కట్టలేని ఆస్తి అని నాలో ఆలోచన కలుగజేసిన వ్యక్తి...... కాని నేను మనిషి కంటే మనీకే ఎక్కువ విలువనిచ్చాను. (ఆఫ్ కోర్స్ ఆ తర్వాత ఆయన కూడా ఆప్యాయతలు తెచ్చేవాటికంటే ఆదాయాలు వచ్చేవాటికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు.)

6)వంకిడి కృష్ణ ప్రసాద్: నన్ను ఆర్థికంగా ఆలోచిపజేసిన వ్యక్తి..., నాలోని ఆలోచనలకు అర్దమిచ్చిన వ్యక్తి. నాలో అణువణువునా ఆర్ధిక కోణాన్ని చూసిన వ్యక్తి.

7)రోహిత్ కృష్ణ రావు: స్నేహితుడు కాని స్నేహితుడు.. (కొందరు వ్యక్తులు వారి ప్రమేయం ఏమి లేకుండానే ఎదుటి వ్యక్తులపై ప్రభావితం చూపిస్తారు. ఆ కోవలోకే ఈ వ్యక్తి కూడా వస్తాడు.. కొన్ని సార్లు కొన్ని సందర్భాల్లో ఇతని ప్రమేయం లేకుండానే నా మీద ప్రభావితం చూపిన వ్యక్తి.) నా 27 ఏళ్ళ జీవితంలో ఒక అర్ధం కాని వ్యక్తిగా మిగిలిపోయే వ్యక్తంటూ ఉంటె కచ్చితంగా ఇతనే... ఇతని నుండి చిన్నప్పటి నుండి చాలా నేర్చుకున్న... కొన్ని సార్లు మదికి అందని మహోన్నత వ్యక్తిగా కనిపిస్తాడు. కొన్ని సార్లు  సంపాదన కోసమే సప్త సముద్రాలను దాటిన వ్యక్తిగా కనిపిస్తాడు... మల్లి ఆ డబ్బు మీద పెద్దగా వ్యామోహం ప్రదర్శించని వ్యక్తిగా కనిపిస్తాడు. ఇప్పటికి నాకు ఆర్థికంగా అర్ధం కాని వ్యక్తి.... ఆలోచన పరంగా అందని వ్యక్తి...

వీళ్ళు కాక ఇంకో ముఖ్యమైనది.... 

నా ఆలోచన: అవును నన్ను నేను ఎంటన్నది ఆలోచింపజేసిన నా ఆలోచన కూడా గొప్పదే... !

మొత్తానికి ఈ 27 సంవత్సరాలలో ఈ ఏడుగురు (7+1) నా ప్రయాణ క్రమంలో ప్రభావితం చూపి పరోక్షంగానో, ప్రత్యక్షంగానో నా ఎదుగుదలకో పతనానికో తోడ్పడినవారు....

హరికాంత్ రెడ్డి