Thursday 18 August 2016

అందాన్ని చూసాను......!


చూసాను.... ప్రేమతో చూసాను... 
అసలైన అందాన్ని చూసాను... అసలు రంగులంటూ అద్దని (మేకప్ లేని) రూపాన్ని చూసాను....

చందమామ మనసు కూడా చివుక్కుమనేలా చక్కనైన మోము....
నక్షత్రాల్లాంటి నయనాలు
ముట్టుకుంటే మాసిపోయే లేలేత చెక్కిళ్ళు
లేత ఎరుపు రంగు పెదాలు
పెదాల అందాన్ని రెట్టింపు చేసి మత్తెక్కించ్చే పుట్టుమచ్చ...
తన మెడ పైన నుండి జాలువారిన వయ్యారమైన వాలు జడ....
చెవులపై పడుతున్న వెంట్రుకలను సరి చేస్తూ బాణాల్లాంటి చూపులను విసిరే అందాన్ని చూసాను.... 

బ్రహ్మ అందానికి అచ్చుగా ఆ అమ్మాయిని అచ్చేసాడా.....
తన కనురెప్పల శబ్దం నాకే వినబడుతుంది....
మురిపిస్తుంది 
మైమరిపిస్తోంది
వా.... ఆ అనుభూతి.... 

చూసాను అసలైన అందాన్ని చూసాను... అసలు అద్దానికి కూడా అసూయ కలిగే అందాన్ని చూసాను....

హరికాంత్ రెడ్డి 

Sunday 14 August 2016

స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా......కలల భారత దేశాన్ని ఆవిష్కరిస్తూ.....


దేశానికి స్వాతంత్రం వచ్చి సరిగ్గా 70 సంవత్సరాలు గడచిపోయాయి... దేశ ప్రధాని ప్రతి సంవత్సరం ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరవేసినప్పుడల్లా శరీరంపై రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. ఏదో తెలియని గర్వం... నా దేశమని....  కానీ ఏదో మూల ఒక ఆవేదన. రాజ్యాంగానికి రూపకల్పన చేసి కూడా ఎన్నో ఏళ్ళు గడచిపోయాయి. కాని మనం దానిలో నాలుగో వంతు కాలం కూడా ముందుకు వెళ్ళలేదు. దేశ ప్రజలు స్వేచ్చ వాయువులు పీల్చుకొని ఆరు దశబ్దాలు దాటి ఏడవ దశాబ్దం లోకి అడుగు పెడుతున్నప్పటికినీ ఇప్పటికి కూడా ఇంకా దేశం పేదరిక విషపరిష్వంగంలోనే విలవిలలాడుతుండటం మన దురదృష్టం. 

సంపద పంపిణీలో అనూహ్యంగా పెరుగుతున్న అసమానతల కట్టడిపై ఏ ప్రభుత్వాలకు శ్రద్ధ లేకపోవటం వల్లే దేశ జనాభాలో సగానికి సగం దుర్భర దారిద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రపంచంలో మరెక్కడా లేనంతమంది నిరక్షరాస్యులు, నిరుద్యోగులు భారత్ లో ఉన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుధ్య సౌకర్యాలే గీటురాయిగ ప్రాంతీయ అసమానతలకు తావు లేకుండా విప్లవాత్మక వేగంతో, తిరుగులేని నిబద్దతతో ఎన్నుకోబడ్డ ఒక మంచి ప్రభుత్వం పని చేయాల్సిన సందర్భం ఇది. కాని ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ఒక మంచి "నాయకత్వం"(Leadership) కరవైన ఫలితంగా గుండెలు నిండిన ఆత్మవిశ్వాసంతో దేశం పట్ల గర్వంగా ఉండాల్సిన మనకు భవిష్యత్తు పట్ల ఏదో అలజడి.

ఆర్ధిక అభివృద్ధి విషయంలో అన్యాయమైన అసమానతలు కనిపిస్తున్నాయి. దేశ పౌరులందరికీ సామాజిక ఆర్ధిక, రాజకీయ రంగాల్లో సమన న్యాయాన్ని కల్పిస్తామని పుస్తకాలలోని రాజ్యాంగం చెప్తుంది. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి... ఉంటున్నాయి. సామజిక ఆర్ధిక స్వేచ్చ వల్ల ఒరిగిందేమీ లేదు. అసమానతలపై "పోరాటం" పేరిట దేశంలో మావోయిస్టులు తుపాకులు ఎక్కు పెట్టి దేశంలో కొన్ని ప్రాంతాల్లో హింసతో ఇప్పటికి రాజ్యమేలుతున్నారు. నిజానికి వీరి వల్ల సమస్యలు మరింత సంక్లిష్టం అవుతున్నాయి కానీ పరిష్కారాలు మాత్రం సాధ్యం కావటం లేదు. 

ఒక మేధావి తన మాటల్లో చెప్తుంటే విన్నాను మన ప్రజాస్వామ్యం సంపన్నుల కోసం సంపన్నులు నడుపుతున్నట్లుగా మారిపోయిందని. ప్రజా ప్రతినిధి ఉన్నది ప్రజా శ్రేయస్సు కోసం కాదు పదవిని కాపాడుకోడానికే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఈ పాలకులకు ఎప్పుడు కనువిప్పు అవుతుంది?  అయిదేళ్ళ కొకసారి ఎన్నికల సందర్భంగా మాత్రమే ప్రజలకు గౌరవం దక్కుతుంది. ఆ ఓట్ల పండగ పూర్తయిన తరువాత ఇక అయిదేళ్ళ పాటు ప్రజాశ్రేయం పట్ల సంపూర్ణ నిబద్దతతో భాద్యతాయుతంగా పాలన సాగించే నాయకుడు మనకు ఎక్కడ దొరకాలి?

దేశ జనాభాలో సగం మంది ఉన్న యువత ఇప్పటికైనా మేల్కొనాలి.. నా అభిప్రాయం ప్రకారం మొత్తం పాలనా వ్యవస్థ లోనే సుపరిపాలన విధానాల అమలుకు నడుముకు అందరు నడుము బిగించాలి. దైనందిన జీవితం లో సగటు సామాన్య పౌరుడికి ఆ మార్పు స్పష్టంగా కనపడాలి. బడిలో చదువు బాగా చెప్పాలి. అంటే ఉపాధ్యాయుల కొరత తీరాలి. బడి సమస్యలు పోవాలి. నిరుద్యోగ సమస్యని పారద్రోలాలి. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో డాక్టర్లు మందులు అందుబాటులో ఉండాలి. వాహన సంచారానికి అనువుగా గతుకులు లేని రహదారులు కావాలి. త్రాగునీరు తో మురుగునీరు కలవని నీటి వ్యవస్థలు రూపొందాలి. సేవల కోసం వచ్చిన ప్రజలకి సిబ్బంది నుండి గౌరవం దక్కాలి. విద్యుత్ కోతలు పోవాలి. దోపిడీ దొంగతనాలు జరగని వ్యవస్థ కావాలి. భద్రత విషయంలో భరోసా ఇచ్చే పోలీస్ వ్యవస్థ కావాలి. అన్నింటిని మించి రాజకీయ నాయకులు ఎటువంటి పోలీస్ రక్షణ లేకుండా నిర్బయంగా తిరగగలిగే సువ్యవస్థ ఆవిష్కృతం కావాలి. సుపరిపాలన స్వపరిపాలనకు ఏనాటికి ప్రత్యామ్నాయం కాలేదని నినదించి, బ్రిటిష్ వారిని ఎదిరించి.. పోరి తెచ్చుకున్న స్వాతంత్రానికి నిజమైన అర్ధం కల్పించగల నిబద్ధత కలిగిన నాయకులు "మంచి నాయకులు" మన దేశానికి అవసరం..! అత్యవసరం...!! అంతిమంగా మనందరం కలసి అబ్దుల్ కలాం కలలు కన్న అభివృద్ధి చెందిన భారతావనిని ఆవిష్కరించాలి. 
ఇది మన దేశం...!!

ఇకనైనా ప్రజల ఆశయాలు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకొనే ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నెలకొల్పే సమయం ఆసన్నమైందన్న విషయాన్నీ పాలకులు, ప్రజా ప్రతినిధులు గ్రహించాలి.

నా సోదర సోదరీమణులకు 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో....


హరికాంత్ రెడ్డి

Friday 5 August 2016

ఇది నా భారత దేశమిది బ్రదర్.... (This is India Dude)


ఇది భారత దేశం బాబు... ఏ దేశమంటే ఇది నా దేశంరా బాబు....

మద్యపానం తప్పు అంటారు... మత్తులో ఉంటేనే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలమని వైన్ షాప్ కి లైన్ కట్టిస్తారు...
మందు కొడతారు.. మందేసిన తర్వాత మందిని కొడతారు.... ఇది నా భారత దేశం బాబు
స్వచ్ఛ భారత్ అంటాం... కానీ ఎక్కడంటే అక్కడే స్వేచ్ఛగా ఉచ్చోసుకుంటాం... ఇది నా దేశం బాబు....
సంపన్నుడు బ్యాంకులో సాఫీగా సొమ్ము తీసుకొని ఏ మాఫీ లేకుండా టోపీ పెట్టచ్చు.... అదే పేదోడు పైసలు తీసుకుంటే పేచీ పెట్టి వాని గోచి ఊడేలా కొట్టి మరీ రాబడతారు. ఇది నా భారత దేశం...
పైసోన్నోడు స్పెషల్ ఇక్కడ... మనీ లేకపోతే మనిషి కిందే చూడరెక్కడ....
మన దగ్గర ఉన్నదీ లేదనుకుంటాం.... లేనిదీ కావాలనుకుంటాం ఇది నా భారత దేశం బాబు... 
రౌడీ అంటూ ఆరోపిస్తామ్ ... కానీ అదే రౌడీకి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని అరచేతిలో పెట్టి మరి అప్పగిస్తాం...
కుల గజ్జి ఇంకా పోదురా అంటూ క్లాసులు పీకుతాము... అదే మన చెల్లెనో, కూతురో కులాంతరం అంటే కళ్ళెర్ర జేస్తాం... ఇది నా దేశం బాబు... 
తెలివిన్నోనితో తీయగా మాట్లాడతారు... తెలివిలేనోన్ని తెల్ల మొహం వేపిస్తారు ఇది నా దేశం... 
పన్ను కట్టడానికి చట్టాలను వాడతాం.. అదే పన్నుని ఎగ్గొట్టడానికి మల్లి మనమే మినహాయింపు చట్టాలను చేస్తాం....
భారత దేశం ఇక్కడ... బంగారు భవిష్యత్తు ఉందక్కడ.... 


హరికాంత్ రెడ్డి