Thursday 23 July 2015

ఆరని అగ్ని పర్వతం.... మరువని మధుర జ్ఞాపకం....




ఇన్నాళ్ళలో... ఈ మధ్యలో 'ఒక ముగింపు' ఇచ్చే సమయం ఎప్పుడు దొరకలేదు.... ఇప్పుడు చేతిలోని కలం తెల్లటి కాగితంలో అక్షరాలుగా మలువమని మారం చేసింది..... 

(ఇంతకు ముందు వ్యాసాలు చదివిన వాళ్ళకు మాత్రమే ఇది అర్ధమవుతుంది)

తనొక కల... ఒక అమ్మాయితో కలల ప్రపంచం కట్టుకున్న నేను ఆ అమ్మాయే నా ముందున్న జీవితమని భావించాను... ఆశలే లోకంగా ఆకాశమే సరిహద్దుగా విహరించాను.... తన కంటే ఎక్కువ ఏది కాదని.., తనుంటే చాలని తనే ఊపిరిగా ఊహల్లో బ్రతికేస్తుంటే కాలం కారణాలు వెతికింది వేరు చేయటానికి..., 'కొన్ని నిజాలు' నిప్పుల కొలిమిలా భగ్గుమన్నాయి...  ఒకప్పుడు కనురెప్పల కదలికల్లో ఉన్న కొలువైన తను ఉన్నట్లుండి కనుమరుగయ్యాక నా కలల ప్రపంచం ఒక్కసారి కూలిపోయింది.  కట్టుకున్న కలల ప్రపంచాన్ని కథగా మలుచుకొని 'చెలి'మిని చిదిమేసుకొని కాలంతో పరుగెడుతుంటే నా ఎద లోతుల్లో ఎప్పుడో సమాధి చేసిన జ్ఞాపకాలు నిత్యం అలలై ఎగసి తడి ఆరిన కనుల కొలనులో కన్నీటి కలువలు పూయించాయి... ఆ కలువలు పూస్తున్నది తను నా నుండి దూరం అయినందుకో.., నా కలల సామ్రాజ్యం కూలినందుకో కాదు. నా కలల కలువ ఇంకా అదే కొలిమిలో ప్రయాణిస్తున్నందుకు...!  నా కలల కలువ ఇంకా అదే కలల్లోనే బ్రతుకుతున్నదుకు....!!  ఊహల ఊబిలో ఊపిరిపోసుకున్న ఆమె ఆలోచనలు తప్పని చెప్పినా ఆమె తెలుసుకోలేక ఆ ఊహ ప్రపంచంలోనే ఏదో ఊహించలేని శక్తి ఉందని నమ్మి తప్పుడు బాటనే తాననుకుంటున్న బంగారు బాట అని.., దానిలోనే బోలెడు ప్రపంచం దాగుందని అనుకుంటుంది.  మరువలేని మధుర జ్ఞాపకమై మదిలోనే గూడుకట్టుకున్న తను ఇప్పుడు రగులుతున్న అగ్నిపర్వతమల్లే మారింది. ఏది ఏమైనా వరమో శాపమో నేను ఊహించని ఇన్నాళ్ళు గడిపిన నిరాడంబర సామాన్య జీవితాన ఉదయించి అస్తమించిన తన పరిచయం ఒక మర్చిపోలేని మధుర జ్ఞాపకం... 



ఇకనైనా..., ఇప్పటికైనా తను నా ఓపికను అహాన్ని పరీక్షించటం మానేసి..., తన అహాన్ని అదుపులో పెట్టుకొని 'చీకట్లో' కాకుండా వెలుగు బాటలో పయనించాలని, నలుగురికి వెలుగు చూపించే దారిలో వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....

ఇప్పటికి ఎప్పటికి తనకు నీడలా ఉండే తన శ్రేయోభిలాషి.....

హరికాంత్ రెడ్డి రామిడి