Thursday 27 October 2016

సిన్నతనంలో సిల్లీగా....


ఈ వీడియో చూసి నా చిన్నతనం (కౌమార దశ) గుర్తొచ్చింది.....  

(తొమ్మిది, పదవ తరగతి) తెలిసి తెలియని వయసు... ఉరకలేసే ఉత్సాహం.... ఒక చోట నిలవకుండా ఎప్పుడు పరుగెత్తాలనిపించే కాళ్ళు....  అప్పటికింకా అనుబంధాలంటే తెలియని అభిఙ్ఞానం.... ఆలోచన లేని ఆవేశం.... దేనికి వెనుకాడని ధైర్యం.... అర్ధమే తెలియని ఆనందం... వెకిలి చేష్టలు... మకిలి రూపాలు....

అసలు ప్రేమంటే ఏంటి... అసలు ఈ ప్రపంచంలో మనమేంటి... అనుబంధాలేంటి....  ప్రపంచానికి, ప్రేమకి సంబంధమేంటి..? ఇవేవి తెలియనిది ఈ దశలోనే.... అదే సమయంలో ఇక్కడే ఈ ఘాడమైన పదాలకు పునాది రాళ్లు పడతాయి...

పొద్దున్న 9 గంటలకల్లా డబ్బాలో పట్టెడన్నం పెట్టుకొని పటుక్కున  రెడీ అయి పుటుక్కున పరుగెత్తి స్కూల్ కి వెళ్లి... ప్రేయర్ కి లేటయితే నాలుగు దెబ్బలు...., నాలుగు నిమిషాలు ముందెలితే దర్జాగా లైన్ లో నిల్చొని వాళ్లందరితో ప్రేయర్ పదాలను పెదాలతో కలిపినట్టు నటించేయటం.... ఆ తర్వాత క్లాస్ లు.... ఒక్కో పీరియడ్ ఎప్పుడు అయిపోతుందా టైం ని లెక్కేయటం... (లెక్కలు రావ్ కానీ టైం లెక్కలు మాత్రం బాగా వచ్చేవి) మధాహ్నం గంట కొట్టగానే లటుక్కున లంచ్ బాక్స్ తో కుస్తీ పట్టడం... (ఆకలితో సంబంధం లేకుండా) తెచ్చుకోకుంటే నిమిషంలో ఇంటికెళ్లి నిల్చొని మరీ తిని నిలకడ లేకుండా, నీళ్లు కూడా తాగకుండా (నీళ్లు తాగితే టైం వేస్ట్ అవుతుంది మరీ.. లంచ్ టైం అయిపోతే మల్లి ఆడటానికి టైం దొరకదని ఫీలింగ్) మరో నిమిషంలో మల్లి స్కూల్ లో ఉండటం... ఆడుకోవటం కొట్టుకోవటం తన్నుకోవటం.... ఆనందపడటం... అసూయపడటం.... ఆపేక్షపడటం.... ఇవ్వన్నీ అయిపోయిన మల్లి మధ్యాహ్నం క్లాస్ లు... మల్లి యధావిధిగ ఇంటికెళ్లే గంట ఎప్పుడు కొడతారా అని ఈగర్ల్య్ గా వెయిట్ చేయటం.... మధ్యలో బఠాణీలు తినటం....  ఇవ్వన్నీ సరిపోవన్నట్టు మేము సదివె సదువుకు మల్లి సాయంత్రం స్టడీ హవర్ మరీ..... ఆ స్టడీ హవర్ లో ఒకరిపై ఒకరు రాళ్ళేసుకోవటం... (కింద కూర్చుంటే)...... అదొక అద్భుతమైన దశ... ఆనందం అంటే అర్ధమేంటో కూడా తెలియని ఆనంద దశ...... 

స్టడీ హవర్ అయిపోగానే..... తొందరగా బ్యాగేసుకొని బయటకెళ్ళి సైకిళ్ళ పై సర్కస్ ఫీట్లు చేసి అప్పుడే గర్ల్స్ హై స్కూల్ లో నుండి బయటకి వచ్చిన గర్ల్స్ ముందు ఫోజులు కొట్టాలి మరీ..... అంత ఆదుర్దా.... ఒక అమ్మాయిని మాత్రం రోజు ఫాలో సైకిల్ మీద సైలెంట్ గా ఫాలో చేసేవాణ్ణి.... ఆమె అభినయం.... ఆమె అభిఙ్ఞానం.... అందం... అణుకువ... పదే పదే చూస్తుండాలనిపించే అందమైన కళ్ళు... పెడల్స్ ని తొక్కలేక తొక్కుతుండే ఆమె పాదాలు..... అప్పుడే జాజిమల్లెలన్ని కలిసి అల్లుకొని జడగా మారుతున్న కురులు.... సరస్వతి తల్లి తననే అంటిపెట్టుకుందా అని అన్నట్లు అనిపించే తన వదన విజ్ఞాన తేజస్సు....  మాట్లాడాలనుకోవటం... భయపడటం.... (ఎక్కడ స్కూల్లో సార్లకు చెప్తుందో అని.., అది తెలిసి ఇంట్లోనో స్కూల్లోనో నన్ను ఎగెరెగిరి తంతారేమో అని భయం) అప్పుడు ఈ కవి హృదయం లేదు కానీ.... అప్పుడు ఉండుంటే హృదయాన్ని ఉరకలెత్తించి పరవళ్లు తొక్కించేవాణ్ణి..... ఇప్పుడామె నలుగురికి ఉపయోగపడే ఉన్నత స్థానంలో ఉండటం ఆనందం.....

ఏది ఏమైనా కౌమారదశ అదో లోకం... అదొక అద్భుతం....అదోక అనిర్వచనీయం... ఈ దశని వర్ణించాలంటే పదాలు చాలవు... నన్ను పరుగెత్తించి నను శాసిస్తున్న సమయం సరిపోదు.....

హరికాంత్ రెడ్డి



Thursday 20 October 2016

ప్రేమా ఎవరు నీవు.......??!!


నిన్ను నిన్ను గా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికిన తోడొకరుండిన అదే భాగ్యమా అదే సౌఖ్యమా.....!! మళ్ళి సుప్రసిద్ధ కవి మాటలు ఉదయం నుండి నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి......

అసలు ప్రేమంటే ఏంటి...... ఏమో....! ప్రేమా.... అసలు ప్రేమ అనే పదం ఎలా పుట్టింది..... ఏమో...!! నా కళ్ళు నిర్మలమైన ఆకాశం వైపు చూస్తున్నాయి...  నా మదిలో అంతులేనంత ప్రశ్నలు.... సినిమాల్లో చూపించినట్లుగా ప్రేమంటే.... కోటలో రాణి... తోటలో రాముడిలాగా... ఇద్దరు చూసి ప్రేమించుకోవటం, కలుసుకోవటం, పెళ్లి చేసుకోవటం.... ఇదేనా ప్రేమంటే...... నా మదిలో ప్రశ్నలకు నాకు నేనే సమాధానం ఇచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాను..... ప్రేమంటే ప్రేమంటే పాఠమా....? ప్రేమంటే బాధ్యతా....?? ప్రేమంటే అందమా....?? ప్రేమంటే శృంగారమా....???

****************************

గత రెండు రోజులుగా మనసేం బాలేదు.... శరీరం వెలుగులో ఉంటున్నా... మనసు చీకట్లో మదన పడుతుంది.....

ఒక మాల్ లో చూసా... అబ్బాయి ఒక అమ్మాయిని బతిమాలుతున్నాడు ప్రేమించమని, తన కోసం ఏదైనా చేస్తాడని చెప్తున్నాడు..., భారతదేశంలో ఎక్కడికెళ్లినా ఒక సగటు యువకుడు, ఒక సగటు యువతీకి చెప్పేది దాదాపు ఇదే.... ప్రేమంటే ప్రేమించటమని అడగటమా....? ప్రేమంటే ఎదుటివాళ్లకు తగ్గట్టుగా మారటమా....??  ప్రేమంటే ఒకరినొకరు మనసిచ్చుకోవటమా....?? మల్లి అవే ప్రశ్నలు.....

కాదు కానే కాదనిపిస్తుంది.... 

ఈ కాలంలో అందరు ఒకరికోసం ఒకరు త్యాగాలుచేయటం.., ఒకరికోసం మారటం ఇదే ప్రేమని అనుకుంటున్నారు ప్రేమంటే రాజి పడటం కానే కాదు...... 

మరి ప్రేమంటే ఏంటి... ఈ అనంత సృష్టిని సృష్టించిన ఆ కనిపించని శక్తి, కనిపిస్తే అడగాలని ఉంది..... ప్రేమంటే ఏంటని.....!!

ప్రేమంటే మనం తల్లి గర్భం నుండి బయటపడ్డాక ఏ కల్మషం లేకుండా మనల్ని తొలిసారి చూస్తుంది చూడు.... నన్ను నన్ను గా చూడటం... అది ప్రేమంటే.......!!

నేను ఎలా ఉన్నా నా తల్లి నన్ను నన్నుగానే అంగీకరిస్తుంది... నన్ను నన్నుగానే ప్రేమిస్తుంది నా తల్లి..... అది ప్రేమంటే....!!

తొలి చూపు ప్రణయం.... ఆ ప్రణయం జీవిత ప్రయాణంగా కొనసాగాలంటే ఎలా మొదటిసారి నన్ను చూసావో.... అదే తొలిచూపు ప్రేమ చివరి చూపు వరకు కొనసాగించు అది ప్రేమంటే....!!

హరికాంత్ రెడ్డి

Wednesday 19 October 2016

అప్పుడెప్పుడో అశోక్ నగర్లో ఆమె....


అది 2009-2010 మధ్య అనుకుంటా (సుమారుగా).....  

అప్పుడే ఆదర్శ భావాలతో.., ఆవేశంతో కూడిన స్పూర్తితో సమాజానికి ఏదో చేసేద్దామని కొత్తగా రాజధానిలోని అశోక్ నగర్ లో (హైదరాబాద్) అడుగుపెట్టిన రోజులవి.... (మొదటి సారి పట్నం వరకు రావటం) అది ఆర్ సి రెడ్డి స్టడీ సర్కిల్ ప్రాంతం....  కాదనలేని మధ్యతరగతి పల్లెటూరి బ్రతుకులు..., ఖాలీ చేతులు...., కాలే కడుపులు...., కళ్ళలో కనబడే కసి..., తొందరగా చదివేసి అధికారిగా ఎంపికయ్యి అందరి మన్ననలు అందుకొని ఏదేదో చేసేయాలన్న ఆతృత..... ఇద్దరం కూడా ఉండలేని ఇరుకైన అద్దె గదిలో అరడజను మంది ఉంటూ... అశోక్ నగర్ అంగట్లో దొరికిన పుస్తకాలతో కుస్తీ పట్టడం... అంతులేనంత ఆలోచనలు.., అందుకోవాలనే ఆశయాలు.., ఆ వెంటనే ఆందోళనలు.... ఏ పుస్తకంలో ఏ సమాచారం ఉందేమో అని..... పుస్తకాలే ప్రపంచంగా.., పరీక్షలే పరమావధిగా..., నిరంతరం నాలో నేనే పోటీ పడుతూ.. యద లోపల యుద్ధం చేస్తున్న కాలమది.... అందరు రకరకాల ప్రాంతాల నుండి వచ్చిన స్నేహితులు... నేను తెలంగాణ మారుమూల ప్రాంతం నుండయినా..., (అప్పటికింకా రాష్ట్రం విడిపోలేదు) నాతో చదువుకునే నా స్నేహితులందరూ కొందరు రాయలసీమ అనంతపురం, చిత్తూర్, కడప జిల్లాలకి చెందిన వారు కావటంతో వారి ప్రాంత సమస్యలు చెబుతున్నపుడల్లా తెలంగాణ కంటే ఇంకా వెనకబడ్డ ప్రాంతాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని అనిపించేది. ఏది ఏమైనా అందరి ఆశయం ఒక్కటే.... ఎలాగైనా ఈ పోటీ ప్రపంచంలో నెగ్గి తమను తాము నిరూపించుకోవాలని.... 

ఆ ప్రాంతమంతా ఎటు చూసిన పోటీ తత్వమే కనిపించేది.... తోటి విద్యార్థిని కదిలిస్తే కావాల్సినంత విజ్ఞానము... కోరుకున్నంత సమాచారం.... తననుకున్న లక్ష్యానికి 24 గంటలు కూడా సరిపోతాయో లేదో అని యదలో ఆందోళన.... ఒక చేతిలో హిందూ పేపర్.., మరో చేతిలో ఆ రోజు చదివేసి పూర్తి చేయాల్సిన బరువైన పుస్తకాలు... 

ఒకానొక రోజు.........

ఆర్ సి రెడ్డి స్టడీ సర్కిల్ ముందు టీ కొట్టున్న ప్రాంతం...... పొద్దున్న నుండి తీరిక లేకుండా.., బుక్కులతో తెగ బోరీంగా మాకు మేమె ఫీలయిపోయి నేను నా స్నేహితులతో (అందరివి పల్లెటూరి సదువులే) కలిసి నిమ్మకాయ చాయ్ (లెమన్ టీ) తాగుదామని బయటికొచ్చాం... (ఆ ప్రాంతంలో ఆ చాయ్ చాల ఫెమస్)..... అక్కడే ఒక అమ్మాయి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు..... అరేయ్ అటు చూడరా ఆ అమ్మాయే మొన్న గ్రూప్ 1 కి సెలెక్ట్ అయ్యింది అంటూ ఒక అబ్బాయి అంతు లేని అత్యుత్సాహం..... గ్రూప్ 1 పరీక్ష పాస్ అయ్యిందన్న మాట వినగానే నా కళ్ళు వెంటనే ఆమె వైపు తిరిగాయి..... చూడచక్కని సౌందర్యం... నక్షత్రాల్లాంటి నయనాలు... బాణాల్లాంటి చూపులు.... చందమామ లాంటి మోము.... చదువుల తల్లి జ్ఞాన సరస్వతి తననే అంటిపెట్టుకుందా అన్నట్లుగా కనిపించే తన వదన విజ్ఞాన తేజస్సు..... అందం... అందానికి తగ్గ అభిఙ్ఞానం ఆమె సొంతమనిపించింది... అందానికి ఒక లక్ష్యమంటూ ఉంటె ఆమె అని అనిపించింది...... అందానికే అసూయ పుడుతుంది ఆమెని చూస్తే.... పేరు.. ఆ పేరుకు తగ్గ అభినయం.... (అప్పుడే మొదటిసారిగా ఆమె పేరు వినటం).... చేమంతి పూవంటి చందం... తొలి పొద్దు కిరణాల స్పర్శకి విచ్చుకున్న పొద్దు తిరుగుడు పువ్వల్లె..... అచ్చ తెలుగమ్మాయంటే కవుల రాతల్లోనో, కళాకారుల ఆకృతుల్లోనో ఉంటాయనుకున్నా కానీ నా అభిప్రాయం తప్పేమో అనిపించింది అప్పుడు.... 

అక్కడే ఆమె చాయ్ తాగుంతుంటే ఇంకా అందరు ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు..... ఆమె నాన్న కూడా ఒక పెద్ద ఆఫీసరట అందుకే ఆమె అంతలా చదివిందని మొత్తానికి ఆమె స్థాయి ఇక మారిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు... కానీ నాకు ఆమెని చూస్తే అలా అనిపించలేదు.... చాలా సాదా సీదాగా ఉంది... ఎవర్ని పట్టించుకోని వ్యక్తిత్వం..... తన ఆశయమే అవధిగా తన ప్రపంచంలో తాను ఉంటుంది... ఆ తర్వాతి రోజు నుండి ఆమెనే గమనించేవాణ్ణి.... (ఆమెనే చుస్తున్నానన్న విషయం ఆమె గమనించకుండా నేను గమనించేవాణ్ణి).... తానే కార్ డ్రైవ్ చేసుకుంటూ స్వయంగా వచ్చేది... భుజానికి వంకాయ రంగు బ్యాగు..., నుదుటిన ముదురు ఎరుపు రంగులో పెద్దగా గుండ్రటి బొట్టు.... చెవులకు పెద్ద రింగుల కమ్మలు... కుదురుగా ఉండకుండా చెవిపై పడుతున్న కురులను సరిచేస్తూ అప్పుడే స్టడీ రూమ్ లోకి సీరియస్ గా ఎంటరవుతున్న అందమైన అమాయకత్వం.... ఆమె ఒక పచ్చటి పైరులా.., పెరటిలోన ఒక సీతాకోకచిలుకలా అనిపించేది.... సంప్రదాయానికి సరితూగే సరైన వస్త్ర ధారణ.....  సంపన్న కుటుంబం నుండి వచ్చినామె... అందుకే ఆమెకు ఉద్యోగమచ్చిందని మా స్నేహితులు గుసగుసలాడుకునేవాళ్ళు... (కానీ చదువాలనే ధృడ సంకల్పం, అంకిత భావం ఉండాలే కానీ ఏ కుటుంబం నుండి వస్తే ఏంటి... ఉన్నతాధికారిగా ఎంపికయ్యి కోటేసుకొని కలెక్టరయిపోవచ్చని నేను మనసులోనే అనుకునేవాణ్ణి)....... తాను రోజు స్టడీ రూమ్ లో చదువుకుంటూ ఉండేది.... దాదాపుగా తన వెనక కుర్చీ లోనే ప్రతిరోజు నేను కూర్చొనేవాడిని.... తాను పుస్తకాన్ని తప్ప మరో వంక అయినా కన్నెత్తి చూసేది కాదు... నేనేమో తాను ఏ బుక్ చదువుతుందా.. ఎంత సేపు చదువుతుందా.... మనమూ దాన్ని ఫాలో అయిపోదామని అటు వైపు తొంగి తొంగి చూసేవాణ్ణి... ఆమె పుస్తకాన్ని చూస్తుండేది... నేనేమో తనని చూస్తుండేవాణ్ణి..... తానేం చదువుతుందా  ఎలా చదువుతుందా అడిగేయాలని ఆతృతగా ఉండేది.... కానీ భయం అడ్డొచ్చేది.... ఊరి నుండి వచ్చిన మనుషులం... ఎం మాట్లాడితే ఎం తప్పవుతుందేమో అన్న భయం.... పైగా ఇంగ్లీష్ మాట్లాడటం అంటే నవ్వుతారేమో అన్న జంకు, బిడియం... నన్ను నేనే తక్కువ చేసుకోవటం అన్న భావన మనసులో ఆమెతో మాట్లాడకుండా అడ్డుకునేది.... అప్పుడప్పుడు టీ కొట్టు దగ్గరికి వచ్చేది.... శివా అంటూ పిలిచి టీ అడిగేది... (ఆ టీ కొట్టు యజమాని పేరు శివ)...... ఆ సంవత్సరం కాకుండ ఆ తదుపరి సంవత్సరమే అనుకుంటా.... ఆమె దేశ అత్యున్నతస్థాయి పరీక్షను ఉన్నత శ్రేణిలో పాసయ్యి ఉన్నాతాధికారిగా బాధ్యతలందుకుంది.... ఆమె ఇప్పుడు ఒక జిల్లా స్థాయిలో బాధ్యతలందిస్తుంది. ఆమెని చూసినప్పుడల్లా ఏదో తెలియని అనుభూతి.... ఆనందం.... ఒక ఉద్వేగం...


హరికాంత్ రెడ్డి

Thursday 6 October 2016

ఇంకేం కావాలి ఈ జీవితానికి......



కడుపు నిండిన వాడికేం తెలుసు మన కడుపు ఖాళి ఉందని..... ఆసాంతం ఆకు నాకాకా అడగటమెందుకు ఆకలేస్తుందా అని...... డబ్బున్న వాడు డబ్బే కాదు కదా ప్రపంచం అంటాడు ఎందుకంటే వాడి కడుపు నిండుగా ఉందని.... డబ్బు లేని వాడు, డబ్బంటే కసి ఉన్నవాడు డబ్బే కదా ప్రపంచం అంటాడు... ఎందుకంటే వాడి కడుపు ఖాళి ఉందని..... ఎవడెన్ని నీతులైన చెప్తాడు కాలే వాడికే తెలుస్తుంది 'ఖాళి' విలువ... ఒక సగటు యువకుని మనసులో మాటలివి....


తర్వాత......


ఆరంభం


అమ్మ గర్భం నుండి..... అవని గర్భంలో కలిసేవరకూ కావాల్సినంత ప్రేమ....
చిన్నప్పుడు ఆడే ఆటల్లో చిన్న దెబ్బలు....
అమ్మ అదిలింపులు.... నాన్న బెదిరింపులు....
చిన్న చిన్న ఆనందాలు.... చివుక్కుమనే మనస్తత్వాలు....
చూస్తుంటే చూడాలనిపించే అందం.... చూస్తూ బ్రతికేయాలనిపించే ఆ అందంతో బంధం....
అందానికి అతికినట్టుండే అద్దం లాంటి మనసుతో మనువు...
బ్రతకటానికి కావల్సిన బలం.., ఆ బలమెంతో తెలుసుకోవటానికి బరువులు బాధ్యతలు...
ఆనందాలు..., అంతకుమించి ఆప్యాయతలు...
చెలి (భార్య) చెక్కిలి మీద నుండి కన్నీరు జారువాలుతుండగా తన ముందే కన్ను మూయటం..... 

అంతం

ఇంకేం కావాలి జీవితానికి..... 

లేదు అదేనా జీవితం.... అమంగళం ప్రతిఘటితమవు గాక......!!

ఆ స్థలాలేవీ... ఆ స్వర్ణాలేవి.... అన్వేషణలేవీ... ఆలోచనలేవి... ఎదురీదడాలేవి.... ఎదురించడాలేవి... ఈగోలేవి.., ఈసడించుకోడాలేవి.... అసలు నా నిఘంటువులోనే ముఖ్యమైన పదమైన డబ్బేది... ఛ ఛ అది కాదు.. అది కానే కాదు జీవితం....

(ఈ మధ్యే ఎక్కడో చదివాను మనిషి సగటు జీవిత కాలం 61 సంవత్సరాలని... దాన్ని అనుసరించి రాసాను)

హరికాంత్ రెడ్డి

Wednesday 5 October 2016

అందాలానందాల ఆరబోత పండుగచ్చింది.....


ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ....!
ఏమేమి కాయప్పునే గౌరమ్మ.....!
తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ...!! తంగేడు కాయప్పునే గౌరమ్మ.....!!

పల్లెలన్నీ ఒళ్ళు విరుచుకొని ప్రజ్వలించే పండుగ...
ఆడబిడ్డల ఆనందాలు అంబరాన్నెంటే పండుగ...
అమ్మాయిల అందాల ఆరబోత పండుగ....
ఆడపిల్లల ఆలింగనాల పండుగ... 
ఇంటికాడున్న ఆభరణాలన్ని ఒంటిమీదకొచ్చే పండుగ....
పట్టుచీరలన్నీ పక్కున ప్రకాశించే పండుగ....
ముసలోళ్ల మూసి మూసి నవ్వుల పండుగ...
అరుగు మీద అవ్వ ఆనందంగా ఉండే పండుగ...
మగువల సొగసు ఆటను చూసి మబ్బులు సిగ్గుపడే పండుగ...
ముద్దుగుమ్మలు మురిసిపోయే ముచ్చట్ల పండుగ... 
పడుసు పోరగాండ్ల పరాక్రమ ప్రదర్శనల పండుగ...
పడచుల నయనాలు నాట్యమాడే పండుగ....
కన్నె పెదాల ఎరుపుకు ఆకాశంలోని చుక్కలు కూడా చీకట్లలోకెళ్లే పండుగ....
కోలాటాల కౌగిలింతల పండుగ...

ఇది నా తెలంగాణ పూల పండుగ.....!!


హరికాంత్ రెడ్డి