Thursday 27 October 2016

సిన్నతనంలో సిల్లీగా....


ఈ వీడియో చూసి నా చిన్నతనం (కౌమార దశ) గుర్తొచ్చింది.....  

(తొమ్మిది, పదవ తరగతి) తెలిసి తెలియని వయసు... ఉరకలేసే ఉత్సాహం.... ఒక చోట నిలవకుండా ఎప్పుడు పరుగెత్తాలనిపించే కాళ్ళు....  అప్పటికింకా అనుబంధాలంటే తెలియని అభిఙ్ఞానం.... ఆలోచన లేని ఆవేశం.... దేనికి వెనుకాడని ధైర్యం.... అర్ధమే తెలియని ఆనందం... వెకిలి చేష్టలు... మకిలి రూపాలు....

అసలు ప్రేమంటే ఏంటి... అసలు ఈ ప్రపంచంలో మనమేంటి... అనుబంధాలేంటి....  ప్రపంచానికి, ప్రేమకి సంబంధమేంటి..? ఇవేవి తెలియనిది ఈ దశలోనే.... అదే సమయంలో ఇక్కడే ఈ ఘాడమైన పదాలకు పునాది రాళ్లు పడతాయి...

పొద్దున్న 9 గంటలకల్లా డబ్బాలో పట్టెడన్నం పెట్టుకొని పటుక్కున  రెడీ అయి పుటుక్కున పరుగెత్తి స్కూల్ కి వెళ్లి... ప్రేయర్ కి లేటయితే నాలుగు దెబ్బలు...., నాలుగు నిమిషాలు ముందెలితే దర్జాగా లైన్ లో నిల్చొని వాళ్లందరితో ప్రేయర్ పదాలను పెదాలతో కలిపినట్టు నటించేయటం.... ఆ తర్వాత క్లాస్ లు.... ఒక్కో పీరియడ్ ఎప్పుడు అయిపోతుందా టైం ని లెక్కేయటం... (లెక్కలు రావ్ కానీ టైం లెక్కలు మాత్రం బాగా వచ్చేవి) మధాహ్నం గంట కొట్టగానే లటుక్కున లంచ్ బాక్స్ తో కుస్తీ పట్టడం... (ఆకలితో సంబంధం లేకుండా) తెచ్చుకోకుంటే నిమిషంలో ఇంటికెళ్లి నిల్చొని మరీ తిని నిలకడ లేకుండా, నీళ్లు కూడా తాగకుండా (నీళ్లు తాగితే టైం వేస్ట్ అవుతుంది మరీ.. లంచ్ టైం అయిపోతే మల్లి ఆడటానికి టైం దొరకదని ఫీలింగ్) మరో నిమిషంలో మల్లి స్కూల్ లో ఉండటం... ఆడుకోవటం కొట్టుకోవటం తన్నుకోవటం.... ఆనందపడటం... అసూయపడటం.... ఆపేక్షపడటం.... ఇవ్వన్నీ అయిపోయిన మల్లి మధ్యాహ్నం క్లాస్ లు... మల్లి యధావిధిగ ఇంటికెళ్లే గంట ఎప్పుడు కొడతారా అని ఈగర్ల్య్ గా వెయిట్ చేయటం.... మధ్యలో బఠాణీలు తినటం....  ఇవ్వన్నీ సరిపోవన్నట్టు మేము సదివె సదువుకు మల్లి సాయంత్రం స్టడీ హవర్ మరీ..... ఆ స్టడీ హవర్ లో ఒకరిపై ఒకరు రాళ్ళేసుకోవటం... (కింద కూర్చుంటే)...... అదొక అద్భుతమైన దశ... ఆనందం అంటే అర్ధమేంటో కూడా తెలియని ఆనంద దశ...... 

స్టడీ హవర్ అయిపోగానే..... తొందరగా బ్యాగేసుకొని బయటకెళ్ళి సైకిళ్ళ పై సర్కస్ ఫీట్లు చేసి అప్పుడే గర్ల్స్ హై స్కూల్ లో నుండి బయటకి వచ్చిన గర్ల్స్ ముందు ఫోజులు కొట్టాలి మరీ..... అంత ఆదుర్దా.... ఒక అమ్మాయిని మాత్రం రోజు ఫాలో సైకిల్ మీద సైలెంట్ గా ఫాలో చేసేవాణ్ణి.... ఆమె అభినయం.... ఆమె అభిఙ్ఞానం.... అందం... అణుకువ... పదే పదే చూస్తుండాలనిపించే అందమైన కళ్ళు... పెడల్స్ ని తొక్కలేక తొక్కుతుండే ఆమె పాదాలు..... అప్పుడే జాజిమల్లెలన్ని కలిసి అల్లుకొని జడగా మారుతున్న కురులు.... సరస్వతి తల్లి తననే అంటిపెట్టుకుందా అని అన్నట్లు అనిపించే తన వదన విజ్ఞాన తేజస్సు....  మాట్లాడాలనుకోవటం... భయపడటం.... (ఎక్కడ స్కూల్లో సార్లకు చెప్తుందో అని.., అది తెలిసి ఇంట్లోనో స్కూల్లోనో నన్ను ఎగెరెగిరి తంతారేమో అని భయం) అప్పుడు ఈ కవి హృదయం లేదు కానీ.... అప్పుడు ఉండుంటే హృదయాన్ని ఉరకలెత్తించి పరవళ్లు తొక్కించేవాణ్ణి..... ఇప్పుడామె నలుగురికి ఉపయోగపడే ఉన్నత స్థానంలో ఉండటం ఆనందం.....

ఏది ఏమైనా కౌమారదశ అదో లోకం... అదొక అద్భుతం....అదోక అనిర్వచనీయం... ఈ దశని వర్ణించాలంటే పదాలు చాలవు... నన్ను పరుగెత్తించి నను శాసిస్తున్న సమయం సరిపోదు.....

హరికాంత్ రెడ్డి



No comments:

Post a Comment