Sunday 13 November 2016

ఒక్క మాట..... ముందు మాట.... (అ4)


దేశమంతా నోట్ల వేడిలో రాజుకుంటున్న సమయం... నల్లవాళ్ళు తమ నలుపుతనాన్ని ఎలా నలుగురికి తెలియకుండా మార్చుకోవాలో అని వాళ్ళ మెదళ్ళకు విరామం ఇవ్వకుండా విరుగుడు ఆలోచిస్తున్న సమయం.... 

సామాన్య జనం తమ దగ్గర కాస్తో కూస్తో ఉన్న పెద్ద నోట్లు ఎక్కడ చెల్లకుండా పోతాయేమో బ్యాంకుల ముందు బారులు తీరి బెదురుతున్న సమయం.....

ఉత్తరాలు పోయి... ఉన్న దగ్గర నుండే ఎక్కడో ఉన్నోనికి కూడా మెయిళ్లు పంపిస్తూ  తపాలా కార్యాలయాలకు తాళం వేసినంత పని చేసి.... మల్లి పెద్ద నోట్ల మార్పిడి కోసం పోస్టాఫీసులోఎన్నడూ లేనంత పని కల్పించి ఆ ఆఫీసు ఎక్కడుందో అని జనాలు వెతుక్కుంటున్న సమయం.....

ఇలాంటి సమయంలో సుమారు అయిదు సంవత్సరాల క్రితం పరిచయమైన ఒక స్నేహితుణ్ని కలవటం.... ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న ఆయన్ని చాల కాలం తర్వాత ప్రశాంత వాతావరణంలో కలవటం మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది.... కానీ ఎప్పటినుండో అడుగుతున్న నా ప్రశ్నకి, నా అనుమానానికి అప్పటివరకు బదులివ్వని ఆయన అప్పుడు అతని మనసులోని సమాధానం బయటపెట్టటం చాలా ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చింది..... 

ఆ ప్రశ్నకు అంకురార్పణ చేసిన సంఘటనలను... ఇక్కడ సంఘటనలు అని ఎందుకు అన్నాను అంటే అది కథ కాదు అతని జీవితంలో అతను నిజంగా జీవించిన, అనుభవించిన క్షణాలు అందుకే సంఘటనలు అన్నాను కానీ కథ అనటానికి నాకు మనసోప్పలేదు..... వాటిని ఒక పుస్తకం రూపంలో నేను తీసుకువస్తానని గత రెండుళ్లుగా నేను ప్రయత్నించాను... కానీ ఆయన వద్దని వారించేవారు. ఇప్పటికి ఆయన మనసు మారిందో... పరిస్థితులు ఆయన్నీ మార్చాయో.... కాలం తన వేగంలో ఆ సంఘటనల ప్రాధాన్యత తగ్గించిందో తెలియదు కానీ.... మొత్తానికి ఆయన తన జీవిత సంఘటనలను పుస్తక రూపములో తీసుకురావటానికి అంగీకరించటం నిజంగా ఒక ఆశ్చర్యం.....

"అతను" ఇప్పుడు భారత దేశంలోనే ఒక ప్రముఖ యువ రాజకీయ నాయకుడవ్వటం.... (ప్రతి గల్లీకి ఒక రాజకీయ నాయకుడు ఉంటారు అందరు ఎవరికీ వారు రాష్ట్ర నేతలు, జాతీయ నాయకులని పత్రికలలో వేయించుకోవటం చాలా మందికి అలవాటు దీనికి ఉదాహారణ కూడా నా 42 ఏళ్ళ స్నేహితుడు తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నాడు) కానీ నాయకుడవ్వటం వేరు.. ఆ నాయకత్వాన్ని నిలబెట్టుకోవటం వేరు నా దృష్టిలో... అలాంటి ఆ నాయకత్వాన్ని నిలబెట్టుకున్న నాయకుడతను... తన మాట తన మౌనం అన్ని ఒక రకంగా ఏదో కారణాన్ని విశ్లేషించేవే.... తన ప్రపంచం నుండి ప్రజల ప్రపంచంలోకి వచ్చి తనను తాను నిరూపించుకొని తనదైన శైలిలో తనకనుగుణంగా ప్రజలను తన తన్మయత్వంలో ఉండేలా, తన ఆవేశాన్ని తనకు అనుకూలంగా ఉండేలా చేసుకొని తన కనుసైగలతో ఒక ప్రాంతాన్నే శాసిస్తున్న 30 ఏళ్ళ ఒక యువ రాజకీయనాయకుని జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను ఒక సంపుటి రూపంలో తీసుకురావటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, ఆ సదవకాశం కల్పించిన ఆ రాజకీయ నేత నా స్నేహితుడవ్వటం నా అదృష్టం...

ఒక చక్కని ప్రేమ కథ.... ఒక నిజమైన కథ... అబద్దానికి అందాలనే రంగులద్ది జీవితాన్నే పణంగా పెట్టిన యదార్థ విధి కథ.... అతని జీవితంలో జరిగినటువంటి నిజ సంఘటనలను అక్షరాలుగా మలిచి మీకు చేరుస్తున్న ఒక అనూహ్య మలుపుల కథ.....

ఒక అందమైన అమాయకత్వంలా కనిపించే అమ్మాయి ఆ అమాయకత్వానికి కావాల్సినంత అభిఙ్ఞానం..... మూడు 'అ' లపై ("అర్థం" (ఆదాయం), "అధికారం", "అబద్దం") అత్యంత అత్యాశ పెంచుకుని అవి లేకుండా ఉండలేని ఒక అబ్బాయి.... రెండు విరుద్ధ మనస్తత్వాలు.... తాను పరిచయం అవ్వాలంటే ముందుగా తన  కోపాన్ని అక్కర్లేకుండా పరిచయం చేసే వ్యక్తి ఒక వైపు.... కాలాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని తనను కాదనుకున్న వ్యక్తులను కూడా తనకనుగుణంగా తన వైపునకు కట్టిపడేసే వ్యక్తిత్వం మరో వైపు...... ఆకాశంలో ఆలోచనలు ఒకరివి.... ఆ ఆకాశమనే ఆలోచనను చేరుకోవాలనే ఆశయం ఇంకొకరిది..... కానీ ఇద్దరి లక్ష్యం ఒక్కటే ప్రజల్లో ఉండాలనుకోవటం... ప్రజలతో మమేకమవ్వాలని కోరుకోవటం.... ఆ చేరుకోవాలనే లక్ష్యం ఇద్దరినీ ఒక ప్రదేశంలో కలిపితే.... ఆ ఇద్దరి హృదయాలు పరస్పరం దగ్గరయితే.... ఆ తర్వాత ఏమైందేన్నదే ఈ యదార్థ కథ.... "అ4" (ఆశ్చర్యపోకండి అనుమానపడకండి పుస్తకం పేరే "అ4") అనే ఈ సంపుటిని దశలవారీగా నా బ్లాగ్ లో 17 సంపుటాలుగా తీసుకురానున్నాను..... (నా బ్లాగ్ లో వచ్చిన స్పందనను బట్టి దీన్ని ఒక పుస్తక రూపంలో పబ్లిష్ చేయనున్నాం) ఈ నిజమైన కథను మీరందరు నిజంగా మంచి మనసుతో ఆదరిస్తారని కోరుకుంటూ....

("అ4" కి అర్ధం పుస్తకము చివర్లో అనగా 17వ సంపుటంలో తెలియజేస్తాను)

మీ హరికాంత్ రెడ్డి

3 comments: