Saturday 31 January 2015

ఆడపిల్లలపై ఆగని అరాచకాలు....



సమాచార విప్లవం సాకారమైంది కాని సామాజిక సంబంధాలు మాత్రం విచ్చిన్నమవుతున్నాయి. అక్షరాస్యుల సంఖ్య అధికం అవుతుంది కాని ఆడపిల్లలపై అకృత్యాలు మాత్రం ఆగని అరిష్టం నెలకొంది మన దేశంలో. నియంతృత్వాలు కూలిపోతున్నాయి కాని నిరంకుశ ధోరణులు పెరిగి దిన దినానికి  నేరాలు అధికమవుతున్నాయి. అందుకే అభద్రత, అలక్ష్యం, ఈ అకృత్యాల బరువుని భరించలేక మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నానాటికి పెరిగి కుంగిపోతుంది. ఇలా ఎంత కాలం..?? మనకు మనం ప్రశ్నించుకోవలసిన ప్రశ్న.

ఆడపిల్లలపై అరాచకాలు రొజూ కొనసాగుతూనే ఉన్నాయి. అతివల ఆక్రందనలు దేశం నలు దిక్కులా ఆణువణువూ వినిపిస్తున్నాయి. దాడులు ప్రతిదాడులు., హత్యలు.., ఆత్మహత్యలు.., పసిమోగ్గలపై పాశవిక ఘటనలు, అమ్మాయిలపై అత్యాచారాలతో కూడిన హింసాత్మక సమాజంలో నివసిస్తున్నామా మనం...?!

నల్లని మరకలు పడుతున్నాయి మన దేశం మీద.., కాదు కాదు మన బంగారు తల్లుల మీద...,నిమిషానికి ఒక్కటి.... ఒక్కో అత్యాచార ఘటన మన దేశ చరిత్రలో ఒక్కో మాయని మచ్చ గా నిలిచిపోతుంది. కామ వ్యాధి పట్టిన కాల యములు సమాజ కారడవిలో కామ క్రీడ ఆడుతుంటే నిర్లజ్జగ చూస్తుండి పోతున్నాం., మదం పట్టిన కొందరు క్రూర మృగాలు మల్లెమొగ్గల్లాంటి ఆడపిల్లలని చెరపట్టగా నిస్సిగ్గుగా చూస్తుండి పోతున్నాము.. ఢిల్లీ నిర్భయ ఘటనను  ఇప్పుడిపుడే దేశం మర్చిపోతుంటే ఈ  మధ్యకాలంలో దేశ రాజధానిలో జరిగిన ఘటన ప్రజలను ఒక్కసారి గా మల్లి ఉలిక్కి పడేలా చేసింది. గుర్గావ్ లో జరిగిన ఈ సంఘటనతో అబల ఇంకా అభద్రత మధ్యే   అమ్మాయిని ఇంటి గడప దాటించటానికి కూడా.., తలిదండ్రులు ఎక్కడ ఎం జరుగుతుందో అని ప్రతి క్షణం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. వరస సంఘటనలు అమ్మాయిల గుండెల్లో అలజడి సృష్టిస్తుంది.

పార్లమెంట్ ఎన్ని చట్టాలు చేసినా, ప్రభుత్వం ఎన్ని భద్రత ఏర్పాట్ల పేరుతో భరోసా ఇచ్చినా ఈ అకృత్యాలకు మాత్రం అడ్డే ఉండటం లేదు.. ! ప్రభుత్వము కూడా ఇలాంటి ఘటనల పట్ల ఇంకా కటినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ రాజధాని నడిబొడ్డున నిర్భయ ఉదంతం జరిగినపుడు కొన్ని రోజులు హడావుడి చేసిన ప్రభుత్వం మరియు నిరసన ప్రదర్శనలు నిర్వహించిన నిజమైన నిరసన కారులు కొన్ని రోజుల తర్వాత ఆడపిల్ల భద్రతను మల్లి అటకెక్కించారు. కొన్ని కటినమైన నిబంధనలతో నిర్భయ చట్టాన్ని ప్రభుత్వం తీసుకోచ్చినప్పటికి ఈ అత్యాచారాలు మాత్రం ఆగలేదు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఎన్నో నిర్భయ కేసు లు నమోదయ్యాయి. ఎన్నో అత్యాచార కేసులు వాయిదాలలో పడి వరదల్లో "కొట్టుకుపోతున్నాయి", దేశ రాజధానిలో ఎన్నికల నగారా మొగినప్పుడు అందరూ ఇదే భద్రత అంశాన్ని నొక్కీ 'వక్కాణించారు'. వాళ్ళందరూ ఇప్పుడు ఆడపిల్ల అడ్రస్సు మరిచారు. మరి బాధితులకి న్యాయం జరిగేది ఎక్కడ అంటే మాత్రం జావాబు లేని ప్రశ్న గానే మిగిలిపోతుంది.

దేశ రాజధాని సర్వ విభాగాలు కొలువున్న చోటు.., అందరూ అధికారులు ఆవసాముండే మహా నగరం. అలాంటి దేశ రాజధానిలోనే సగటు అమ్మాయికి రక్షణ లేనప్పుడు మిగతా ప్రాంతాల పరిస్థితి ఎంటన్నది ఒక్క సారి పాలకులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నది ఎవరైనా సరే సగటు ఆడపిల్లకు అన్యాయం జరగని రోజు రావాలి. కఠిన చట్టాలు మాత్రమే పరిస్థితిని మార్చలేవు. నిరంతరం అప్రమత్తంగా, జవాబుదారీతనంతో వ్యవహరించే అధికార యంత్రాంగమూ, సత్వర విచారణ జరిపి నేరస్తులను దండించగలిగే వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే సత్ఫలితాలుంటాయి.

ప్రభుత్వం తో పాటు  ప్రజలు కూడా ఇలాంటి ఘటనల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన భాద్యత ప్రతి ఒక్కరి పై ఉంది. అమ్మాయిలు ముఖ్యంగా ఎంతో జాగరూకతతో ఉంటేనే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చు. అత్యాచార నిరోధక చట్టం.., నిర్భయ చట్టం.., ఇలాంటి చట్టాలెన్ని వచ్చినా కాని కేవలం కాగీతాల మీదనే కటినంగా అనిపిస్తున్నాయి. ఈ బిల్లులతో.., ఈ చట్టాలతో.., మహిళ లపై ఆకృత్యాలు ఆగిపోతాయనుకుంటే అది హాస్యాస్పదమే అవుతుంది.

గగనంతరాలవరకి ఎదిగిన మహిళను మల్లి గరిటె పట్టుకోమంటుంది మన ఈ భరత సమాజం.. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆడపిల్లను అత్యాచార ఘటనలతో అవని గర్భంలోకి వెళ్ళమని ఆక్షేపిస్తున్నారు. మరి ఎప్పుడు ఈ అరాచక సంఘటనలకు అంతం...? అత్యాచార ఆలోచన ఉన్న ప్రతి అర్దాయుషు అనామకుడికి అమ్మాయిని చూస్తున్నపుడు మరణపుటంచుల వరకి వెళ్లి మనకి జన్మనిచ్చే అమ్మ గుర్తుకు రావాలి.  మహిళల్లో ఆడతనాన్ని మాత్రమే చూడకుండా అమ్మతనాన్ని కూడా చూడటం ఈ సమాజం అలవర్చుకున్నపుడే ఈ అకృత్యాలు ఆగుతాయి! అంటే ఆ దిశగా ప్రతి ఒక్కరిలో పౌర చైతన్యం రావాలి!! అమ్మాయిని ఇలాంటి అత్యాచార ఘటనలతో ఆమె ఆత్మాభిమానాన్ని అణచివేయాలని చూస్తే మాత్రం అవ"ని"అంతారాలను దాటి తనలో ఉన్న ఆవేదననే అభినివేశంగా అలరార్చి ఆత్మ విశ్వాసమే ఆలంబనగా .., అవరోధాలనే అవకాశాలుగా మలచుకొని ఆకాశమనే అంతిమ లక్ష్యాన్ని చేరుకొని అద్భుతాలు సృష్టించి అందరికి ఆదర్శప్రాయమవుతుంది.  


హరికాంత్ రెడ్డి రామిడి

ఆరు నెలల్లో మోడీ చేసిందేమిటి..!? అసలు సమస్యలేంటి..!?


ఈ మాసమంతా ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గత ఆరు నెలల పాలన పైనే చర్చ నడుస్తుంది. ఏ నలుగురు కలిసినా ఆయన ప్రభుత్వం నడచిన తీరు గూర్చి.., ప్రభుత్వం లోని పథకాల గురించి, జరిగిన అభివృద్ధి గురించే ప్రస్తావన. ఎందుకు ఈ చర్చ? అరవై సంవత్సరాలలో జరగనిది ఆరు నెలలో ఏం జరిగింది అన్నది ప్రశ్న. అసలు ప్రజలు ప్రభుత్వాల నుండి ఎం కోరుకుంటున్నారన్నది ఇంకో ప్రశ్న. ఈ ఆరు నెలల పాలనలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఆరు నెలలలో ఎం చేశారు అనే చర్చ కన్నా ప్రజలకు ఎంతవరకు జవాబుదారితనం తో కూడిన పాలన అందిందన్నది మనం చూడాలి.

67 ఏళ్ళ భారతావని చరిత్ర లో ఏ నాయకుడు ప్రజలకి సరి అయిన భరోసా ఇవ్వలేదు సరి కదా.. ఇచ్చిన మాటలు నీటి మూటలే అయ్యాయి తప్ప., ఏ నాయకుడు వాటిని అమలు చేయలేదు ముందే సిద్దం చేసి పెట్టుకున్న ప్రసంగం చట్ట సభలో ఉన్నది ఉన్నట్టుగా చదివే నాయకులని చూసాము... ముందే రాసి పెట్టుకున్న ప్రసంగం కూడా సరిగా చదవలేక ఇబ్బంది పడ్డ ప్రభుద్దులను కూడా చూసాము...!! ఎందఱో నాయకులు వచ్చారు.., ఎన్నో దశాబ్దాలు గడచిపోయాయి.., కాని దేశంలో అభివృద్ధి ఛాయలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న కఠిన వాస్తవాన్ని దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ అంగీకరించాల్సిన విషయం.

గత ఆరు నెలల కాలం లో ప్రవేశపెట్ట బడ్డ పథకాలు ప్రజల్లో కొంత ఆసక్తి రేకించినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెప్తారు. ఆ పథకాలలో మనం కొన్నింటి గురించి విశ్లేషిస్తే......... "ప్రధాన మంత్రి ధన్ జన్ యోజన"...... గ్రామీణ ప్రాంతం లో ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పం తో ప్రవేశపెట్ట బడ్డ పథకం. ఈ పథకం ద్వార ప్రతి మారుమూల పల్లెకు దేశ ఆర్ధిక కార్యకలాపాలు విస్తరించబడతాయి. దీనివల్ల గ్రామీణ మహిళల్లో కూడా ఆర్ధిక స్వతంత్రం కలిగే అవకాశం ఉంది..... "స్వచ్చ భారత్"....... మహాత్మ గాంధీ పుట్టిన రోజున ప్రారంభించబడ్డ ఈ పథకం భారత దేశ ప్రజలకు పరిసరాల పట్ల బాధ్యతను తెలియజేస్తుంది. దేశ ప్రజలు తమ ఇంటిని శుభ్రం ఉంచుకుంటే సరిపోదని ఇంటితో పాటు మనం వాడే వీధులు పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచన తో ఈ పథకాన్ని మొదలు పెట్టారు. అది ఏ ప్రాంతమైన సరే.., మనం ఉపయోగించే రోడ్లు అయినా.., బడి అయినా.., ప్రభుత్వ కార్యాలయమయినా ఏదైనా కానీ మనకు మనమే శుభ్రంగా ఉంచుకోవటం.., మన భాద్యతని, తెలియ జెప్పే పథకం....... "మేక్ ఇన్ ఇండియా"..... దీని ద్వారా సాధ్యమైన ప్రతి వస్తువు  స్వదేశంలో తయారు చేసే విధంగా వీలైనంత దిగుమతులను తగ్గించి మన దేశం తయారయ్యే వస్తువుల ఎగుమతి ప్రోత్సహించటం. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతం అందిచేలా చేస్తుంది... ఇలా కొన్ని పథకాలు గత ఆరు నెలలలో ప్రవేశపెట్టబడ్డాయి.

వీటి ఉద్దేశం ఎంతో బాగుంది. ఇవి కాగితాల మీద కమనీయంగానే కనిపిస్తున్నా ప్రభుత్వ ఆచరణలో ఏ మాత్రం.., ఎంత మాత్రం.., ప్రజలకు చేరువ అవుతాయన్నది ఆలోచించాల్సిన అంశం. ప్రజల మధ్యకు పథకాలు ఆచరణలోకి వెళ్లేసరికి ఆ ఫలాలు అందాల్సిన వాళ్ళే అందుకుంటున్నారా? నిజంగా లబ్ది పొందాల్సిన వాళ్ళే పొందుతున్నారా అనేదే ప్రశ్న. ఒక వ్యాపార వేత్తని విదేశాలకి పంపితే డాలర్స్ ని మాత్రమే తీసుకొస్తాడు, కాని ఒక అధ్యాపకుణ్ణి విదేశాలకి పంపితే విద్యావంతులైన ఒక తరాన్నే వృద్ధి లోకి తెస్తాడన్న నరేంద్ర మోడీ అన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకుంటే నిజమనిపిస్తుంది. మనకు, మన దేశానికి  ధన రాశులు కాదు కావాల్సింది.. విజ్ఞాన రాశుల్ని అందించే వివేకవంతులు. ఆ వివేకవంతులు, విజ్ఞానం అందించే విద్య ద్వారా పుడతారు. అలాంటి విద్యను దేశానికి అందించే విలువైన ప్రభుత్వం.., దాని సేవలు ప్రజలకు కావాలి.  ఒక నాయకుడికి కావాల్సింది ఆక్స్ఫర్డ్ డిగ్రీ లు కాదు ముఖ్యం.., అభివృద్ధి చేయాలన్న తపన. ఆ తపన ఉన్న నాయకుడు ప్రజలకు ముఖ్యం. అది ఏ పార్టీ నాయకుడైన సరే.  

అలాగని మనం(ప్రజలు) ఎన్నుకున్న ఏ ప్రభుత్వం పైన అయినా ఎం ఎక్కువ ఆశలు పెట్టుకొనవసరం లేదేమో... ప్రభుత్వం సగటు పౌరుని కనీసావసరాలు తీర్చగలిగితే చాలు... అవును మరి ప్రజలకు కావాల్సింది కనీసావసరాలు మాత్రమే. గతుకులు లేని బాటలు.. మంచినీరుతో మురుగునీరు కలవని వ్యవస్థ రూపొందాలి. బడిలో చదువు బాగా చెప్పాలి. బడిలో చదువు చెప్పే ఉపాద్యాయుల కొరత  తీరాలి. విరామం లేని విద్యుత్ సరఫరా కావాలి.. ఒక పేదవాడు ఆకలి చావు వినబడని రోజు రావాలి. ఒక కార్మికుడు తన సమస్యల గురించి రోడ్డు పైకి దిగి ధర్నా చేయని రోజు రావాలి. ఒక నేతన్న తను అల్లిన తాడుని తనే ఉరితాడులా ఉపయోగించుకునే స్థితి నుండి బయటపడగలిగే రోజు రావాలి.. ఒక గ్రామీణ ఆడపిల్ల "ఆరుబయట"కి వెళ్లి సిగ్గుపడే వ్యవస్థ నుండి దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలు బయటపడాలి. ఒక గిరిజనుడు దేశం గర్వించే స్థితికి ఎదగగలిగే రోజు రావాలి... ఒక రైతన్న తను ఆకలితో అలమటించి "ఇతరులకి అన్నం పెట్టె మన రైతన్న" తను పండించిన పంటలోనే ఆ పంటకి ఉపయోగించాల్సిన మందు తను 'ఉపయోగించి' చనిపోకుండా ఉండే రోజు రావాలి... ఒక విద్యార్థి విశ్వ విద్యాలయం నుండి పట్టా అందిన మరుక్షణమే ఉద్యోగ నియామక పత్రం అందుకోవాలి. వజ్రాల్లాంటి వనితలలో, దేశ భవిష్యత్ ఆశా కిరణాలయిన అమ్మాయిలలో.., ఒక్క అతివ కూడా అత్యాచారానికి గురవ్వకూడని రోజు రావాలి. అసలు అమ్మాయి అభద్రతా భావం అనే ఆలోచన నుండి బయటపడాలి. ఇవన్ని సాకారం అయ్యే రోజు త్వరలో రావాలనే ప్రజలు  ఆకాంక్షిస్తున్నది ఆశిస్తున్నది.

అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వమైనా, పాలించే పాలకులు ఎవరైనా సరే ప్రజలకు.., అద్దాల మేడలు.., రంగుల గోడలు కాదు కావాల్సింది.., అంతిమంగా మనకు కావాల్సింది అభివృద్ధి. పౌరుల నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ధి అన్న మన నేతల  మాటల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నేటి గాడి తప్పిన వ్యవస్థలన్నిటికి పరిష్కారమే పారదర్శకసహిత అభివృద్ధి మార్గం. ఈ మార్గం సమస్యలు సృష్టించే మార్గం కాదు శాశ్వతమైన పరిష్కారాలు చూపే మార్గం. ఈ మార్గాన్ని ఎన్నో దేశాలు అనుసరించి అగ్ర రాజ్యాలుగా రూపొందాయి. కాని ప్రజలు మరియు ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఎంతవరకు ఆచరిస్తున్నాయన్నదే ప్రశ్న.


హరికాంత్ రెడ్డి రామిడి

యజమాని-ఉద్యోగి సంబంధాలు...



నలుగురితో కలిసి పని చేసేవాడు నాయకుడు.., నలుగురితో పని చేపించేవాడు యజమాని. ఎప్పుడో ఒక మహానుభావుడు యజమానికి మరియు నాయకునికి స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చాడు. అవును యజమాని ఎప్పుడు ఉగ్యోగికి యాజమాని లానే కనబడతాడు. యజమాని ఎప్పుడు ఉద్యోగులపై ఆజమాయిషీ చేయాలనే చూస్తాడు. ఎందుకంటే అతను యజమాని కాబట్టి... ఒక సంస్థ నడపబడాలి అంటే దానిని సమర్థవంతంగా నడిపించే యజమానికి.., ఎంత నైపుణ్యం ఉండాలో, ఎంత ప్రాముఖ్యత కల్పించాలో.., అదే సంస్థలో పని చేసే ఉద్యోగికి., కూడా అంతే నైపుణ్యం కలిగి ఉండాలి, అంతే ప్రాముఖ్యత కల్పించబడాలి. 'యజమాని మరియు సంస్థలో పని చేసే ఉద్యోగులు' మనం నడిపే ద్విచక్ర వాహనానికి ఉండే చక్రాల్లాంటి వారు...., ఏ ఒక్క చక్రం పని చేయకపోయినా లేదా లేకపోయినా ఆ వాహనం వృధా. అందుకే యజమాని ఎంత జాగ్రత్తగా తన ఉద్యోగులతో సఖ్యపూర్వకంగా మెదిలితే సంస్థ లాభాలు కూడా అంతే సఖ్యంగా ఉంటాయనేది వాస్తవం.

యజమాని ఎప్పుడైతే ఉద్యోగుల పట్ల అవివేకంతో వ్యవహరిస్తాడో అప్పుడు ఉద్యోగి తన 'పని' అనే ఆలోచనా ధోరణిని మార్చుకుంటాడు. తన ఉద్యోగుల ద్వారా ఒక వారం రోజుల పనిని  'ఒకే వ్యక్తి ద్వారా ఒకే రోజులో' రాబట్టుకోవచ్చు అనుకుంటారు కొంత మంది యజమానులు. నిజమే ఆ ఉద్యోగి కూడా అంతే మొత్తంలో తన నైపుణ్యానికి పదును పెట్టి, ఆలోచనలకు కార్పెట్ పరచి సంస్థ తన నుండి కోరుకుంటున్న దాని కంటే ఎక్కువే ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే తన నైపుణ్య సామర్థ్యాన్ని సంస్థకు చాటి చెప్పటం కోసం... తన తెలివిని యజమాని గుర్తించటం కోసం...., కాని మరుసటి రోజు నుండి అతని మనసు పొరల్లో ఒక రకమైన భావం ఏర్పడుతుంది. తన పని పట్ల తనకే ఒక విధమైన ఏహ్యమైన భావం కలుగుతుంది. నేనెందుకు ఎప్పుడూ  ఈ 'పనే' చేయాలి అనే భావాన్ని అతను ఏర్పరుచుకుంటాడు. అప్పటివరకు అతని ఆలోచనా పరిధిలో లేనటువంటి ఒక వేరే విధమైన ఆలోచన తన మది ని తాకుతుంది. తను చేస్తున్న పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందా? ఆ ఆలోచన మొదలైనప్పటి నుండి అతని మనసు పని మీద తక్కువ ద్రుష్టి నిలుపుతుంది. కొన్ని సార్లు అతన్ని సోమరితనం ఆవహిస్తుంది.

అతని మనసులో ఆలోచనా బీజం పడేలా చేసే విష్యం ఏంటంటే...  "తన పనికి తగ్గ గుర్తింపు"  అదిగో అక్కడే యజమాని కి ఉద్యోగికి అంతరాలు అలలై ఎగసిపడతాయి. యజమాని తన ఉద్యోగి నుండి ఎంత పని రాబట్టుకున్ననూ .., ఆ పనిలో.., 'ఎంతవరకు' సంస్థకు ఉపయోగపడిందనే చూస్తాడు. ఆ ఉద్యోగి ఇంకా ఎం పని చేయగలడు.., ఎలా చేయగలడు.., ఎంతవరకు చేయగలడు.., ఆ చేసిన పనిని సంస్థకు.., సమర్థవంతంగా ఎలా ఉపయోగించగలడు అనే ఆలోచన యజమాని హృదయాంతరాల్లో చిక్కదు. అక్కడే ఆ ఉద్యోగికి యజమాని కి మనస్పర్థలు ఏర్పడి సంస్థను ప్రభావితం చేస్తుంది. యజమాని వైపు మనం ఆలోచించినపుడు యజమాని యొక్క ఆలోచనా ధోరణి కూడా సరైయినదే అన్న అభిప్రాయం కలుగక మానదు. ఎందుకంటే యజమాని తన సంస్థను ముందుకు తీసుకెళ్లాలన్న జిజ్ఞాస లోనే ఉంటాడు అందుకే తను ఉద్యోగులతో  ఎం పని అవుతుంది, ఎలా పని అవుతుంది, ఎంతవరకు అవుతుంది ఆలోచిస్తాడు తప్ప..., ఆ పనిలో ఎంత నైపుణ్యం ఉంది ఆ నైపుణ్యానికి ఉద్యోగి శ్రమ ఎలా తోడైంది అనే ఆలోచన ఉండదు. అలా ఉన్న సంస్థ, ఆ సంస్థ యజమానీ ఖచ్చితంగా దిగ్విజయాల బాట పడతారు.

ఇక్కడే ఒక అంశం దాగి ఉంటుంది. అదే "సృజనాత్మకత" కొత్తగా ఉంటుంది పదం కాని ప్రయత్నిస్తే కూడా అంతే సరికొత్తఃగా ఉంటుంది. ఉద్యోగి నైపుణ్యాన్ని గుర్తెరిగిన సంస్థ...,  ఆ ఉద్యోగి నైపుణ్యాన్ని ఉపయోగించుకోవటం లోనే తన అధికారాలు ఉపయోగిస్తాడు యజమాని.., కాని ఆ ఉద్యోగికి స్వేచ్చ.., స్వతంత్రాన్ని ఆపాదించి ఆ వ్యక్తి "సృజనాత్మకతను" బయటకి తీయగలిగితే.., ఇంక ఆ ఉద్యోగి పనితనానికే కొత్త సొబగులు అద్దుతాడు. అలా తీయగలిగిన సంస్థ ఎదుగుదలకు ఇంక అడ్డే ఉండదు. కాని యజమానికి ఆ ఉద్యోగి సృజనాత్మకత కన్నా అతని నైపుణ్యం పైనే ఎక్కువగా ఆధార పడతాడు. దాని వల్లే.., అందుకే..,, ఏది కూడా కొత్తగా కనిపించటానికి ఏ సంస్థ కూడా కృషి చేయదు.

అందుకే ఒక్క విషయం ఎవరైనా గుర్తించారో లేదో ప్రపంచం లో ప్రతి నూతన వస్తువు తయారీలో మన భారత దేశం 154 వ స్థానం లో ఉండటం నిజంగా మన దురదృష్టకరం. ఈ విషయంలో గత రెండు సంవత్సరాలుగా జపాన్ అగ్ర స్థానం లో కొనసాగుతుంది. అందుకే ఇటీవల మన దేశ ప్రధాన మంత్రి స్వయంగా జపాన్ ప్రజలని చూసి మనం నేర్చుకోవాల్సి చాలా ఉందని వ్యాఖ్యానించటం గమనార్హం. అలాగని మనం వాళ్ళని చూసి నేర్చుకోవటం కన్నా మనం 'ఇంకా ఎం చేయగలం' అని ఆలోచించినప్పుడే మనం ఇతరులకు కొత్తగా చూపించగలం....అప్పుడే ఉద్యోగి సమర్థత బాహ్య ప్రపంచానికి తేటతెల్లం చేస్తుంది.

కాని కొందరు ఉద్యోగులు తమ నుండి కంపెనీ ఆశిస్తున్న పనిని కూడా సమర్థంగా పోషించరు. దాని వల్ల ఆ ఉద్యోగి ఉద్వాసనకు గురవ్వక తప్పదు. ఆ సమయంలో ఉద్యోగి ఒక్కటే గుర్తించాలి మనమెప్పుడు కాపీరైట్ లకు వేదిక కాకూడదు మన క్రియేటివిటీకి వేదిక కావాలి. కాని కొన్ని సమయాల్లో ఆ ఉద్యోగి నుండి సరైన పనిని రాబట్టుకోలేని యజమాని పాత్రని కూడా మనం తప్పు పట్టలేకుండా ఉండలేము...!! ఎందుకంటే ఆ ఉద్యోగి సమర్థతను "సక్రమంగా" వెలికితీసినప్పుడే యజమాని సమర్థత తెలుస్తుంది. యజమాని ఉద్యోగి నుండి ఎం ఆశించడు అసలు అతనికి సృజనాత్మకత అనే పదమే కొత్తగా అనిపించచ్చు. ఆయనకు కావాల్సింది కేవలం పని.... ఉద్యోగి చేసిన పనిని, పని వేగాన్ని పరిగణలోకి తీసుకుంటాడు తప్ప  పనిలో నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోడు ముఖ్యంగా ఇది ఇప్పుడు భారత దేశం లో ఇదొక తీవ్ర సమస్య గా మారింది.

ఇంక ఉద్యోగి తన నైపుణ్యాన్ని, ఆలోచనలకు పదును పెట్టి తన సంస్థకు ఇంకా... ఏ విధంగా తన పనిని సక్రమంగా, సమర్థవంతంగా అందించగలడో ఆలోచిస్తాడు. కాని అదే సమయం లో ఒక యజమాని నుండి ప్రోత్సాహం అందినప్పుడే ఆ ఉద్యోగి తన నైపుణ్యానికి పదును పెట్టగలడు. ఆ నైపుణ్యం నుండి సృజనాత్మకతను వెలికి తీయగలడు. ఆ సృజనాత్మకత సంస్థను ఈ సృష్టి మొత్తానికే తిరుగులేని సూపర్ శక్తి గా అవతరింప జేస్తుంది. ఆ ఉద్యోగి సృజనాత్మతను వెలికి తీసే సమర్థత గల యజమాని ఉన్నప్పుడు ఆ సంస్థ ఆకాశమే హద్దుగ అవనంతరాలను దాటగలుగుతుంది. ఏ ఉద్యోగైనా ఒక యజమాని నుండి కోరుకునేది...., తనకు గౌరవం, తన పనికి తగిన గుర్తింపు... యజమాని తన ఉద్యోగిలో వీటిని గుర్తించినప్పుడు ఏ సంస్థ కూడా నష్టం అనే పదం దరికి రానివ్వదు.   ఏ ఉద్యోగైనా., ఏ యజమానైనా అంతిమంగా సంస్థ కోసమే పని చేసేది కాని ఆ సంస్థ "ఉన్నదాన్నే" మరింత బాగా.., మరింత వేగంగా చేయటానికి ప్రయత్నిస్తుందా? లేదా ఒక సరి క్రొత్త ఆవిష్కరణకు వేదికవుతుందా?? అనే విషయన్ని ఒక్కసారి యజమాని ఆలోచించినప్పుడు మన దేశం సృజనాత్మకత అనే పదానికి క్రొత్త అర్దాన్నిచ్చి నవనూతన నిత్యావిష్కరణలతో ఈ దేశం ప్రపంచంలోనే అగ్ర దేశంగా.., అన్ని దేశాలు అసూయ పడి "మనల్ని చూసే" విధంగా త్వరలోనే రూపాంతరం చెందుతుంది.  ఒక టాటా,  ఒక విప్రో,  ఒక ఐ.సి.ఐ.సి.ఐ, ఒక జీ.ఎం.ఆర్ సంస్థల స్పూర్తిగా.....

హరికాంత్

ప్రత్యేక కథనం: అబ్బాయి ముందు అమ్మాయి-అమ్మాయి ముందు అబ్బాయి



ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. మనతో మాట్లాడుకుందాం.., మనసుతో మాట్లాడుకుందాం....

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికిన తోడొకరుండిన అదే భాగ్యమా అదే సౌఖ్యమా...!! సుప్రసిద్ద కవి అన్న మాటలు ఒక్కసారి గుర్తొచ్చాయి... నిజమే మనల్ని మనల్నిగా ప్రేమించే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు. మనల్ని ప్రేమించే బడే వాళ్ళు ఉంటే కదా.., మనం ప్రేమించబడేది....!!

మనకు తెలిసిన కుర్రాడో, మన పక్కింటి అబ్బాయో, లేదా మన బంధువులబ్బాయో, లేదా మనమే అనుకుందాం మనలో ఒకరని అనుకుందాం. ఎవరో ఒకరు మామూలు సగటు యువకుడు తన జీవితంలో ఎన్నో అవాంతరాలు దాటితే కానీ తన మైలు రాయిని చేరుకోలేడు. యువకుడు ఎంత అద్బుతమైన పదం. శక్తి ఉడుకు వేగం, ఆవేశం, నిర్లక్షం, ఉద్రేకం, ఆకర్షణ, కెరటం, పందెం ఇలా ఎన్నో పర్యాయ పదాలు యువకునికి.. మరి ఏముంది ఆ యువకునిలో ఆకాశానికి నిచ్చెనలు వేయగల దమ్ముంది. కలలు కనే స్వేఛ్చ ఉంది. 'కిరణా'లని కెరటాలని అరచేత్తో అదిమి పట్టగల బలముంది.  ఒక యువకుడు తన యవ్వన కాలం లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటాడు.... కిందపడతాడు, లేచి ప్రయాణం సాగిస్తాడు.. మళ్ళీ పడతాడు.. నిజానికి పడ్డదే ఎక్కువ ఉంటుంది. అయితే అన్నాళ్ళ ఆ యువకుని ప్రయాణంలో అతనికి అర్డమయ్యేదేమిటంటే జీవితంలో సక్సెస్ అవడానికి మామూలు టాలెంటు ఉంటే సరిపోదనీ, ఆకాశాన్నంటే ప్రతిభ, ఆకాశాన్ని తాకినా అక్కణ్ణుంచీ ఎగరాలనే పట్టుదలా, నిరంతర సాధనా... ఇవి కావాలనీ అర్ధమవుతుంది. కొద్దిగా సమయం తీసుకుంటుంది. కొన్ని త్యాగాలూ  చేస్తాడు. కసి, పట్టుదల, ఎదగాలనే ఆకాంక్షతో లక్ష్యాన్ని సాధించాలనే  తపనతో మరుగున పడిపోతున్న ప్రతిభను, మరచిపోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ ప్రోదిచేసుకోని ఒక్కసారి ప్రపంచానికి మనమెంటో చాటి చెప్తాం. ఎందుకంటే మనం యువకులం చాటి చెప్పటమే కాదు వెలుగెత్తి చాటాలి కూడా.., మన ప్రధాన మంత్రి కూడా 'భారత దేశ యువకులనే' తన సైన్యంగా ఫీల్ అయిపోతూ ప్రపంచ దేశాల సదస్సులలో ఎన్నో వేదికలపై దడ దడ లాడే తన ప్రసంగాలతో హోరేత్తిస్తున్నాడు. అదీ యువకుని సత్తా, సామర్థ్యం. అదీ మనకే ఉంది. మనలోనే ఉంది.

ఇక యువకుల సగటు 'లక్ష్యాలు' తీరిపోయి 'లక్షలు' సంపాదించే వయసు వచ్చాక ఇంక., అంత ఓకే రా జీవితం, అనుకున్న దశలో ఒక ప్రశ్న ఎదురవుతుంటుంది.... అలాగే ఒక సవాలు ఎదురవుతుంది. ఆ సవాలును చేదించి సాధిస్తేనే.., ఆ సాధించిన దానితో మిగతా జీవితం దేదిప్యమానంగా వెలిగిపోతుంది. దేనికైనా సమాధానం ఇచ్చి దీటుగా ఎదుర్కొనే యువకుడు ఆ ప్రశ్నకు, ఆ సవాలుకు మాత్రం ఎం సమాధానం చెప్పాలో కూడా అర్ధం కాదు. ఆ సవాలే "పెళ్లి.." అవును మరీ...  పెళ్లి నవ యువకుడి జీవితంలో అతిపెద్ద సవాలు.., ఒకప్పుడు ఈ సవాలు అమ్మాయిలకు ఉండేది. కాని తర్వాత అబ్బాయిలకు కాలనుగమనంగా మారుతూ వచ్చింది. తల్లిదండ్రులు ఆ విషయంలో ఒత్తిడి చేస్తూ ఉంటారు... 'ఏర చూడమంటావా పెళ్లి సంబంధాలు...?' ఇదీ ప్రశ్న.. లేదా ముందే ఎవరినైనా వెతికి పెట్టుకున్నావా? ఈ తరంలో ఇదో కొత్త్త మాట. మొట్ట మొదట అమ్మ అడుగుతుంది ఏరా నాన్న నీకు పెళ్లి చేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది రా... అందుకేరా మా ఈ బాధ అంతా..!! ఏంటో పెళ్లి చేయటం వాళ్ళకి బాధో.., బాధ్యతో.., అర్ధం కాదు. పోను పోను ఇంకా ప్రశ్నలు పెరిగిపోతాయి తప్ప తరగవు. పోను పోను తల్లిదండ్రుల నుండే ఎదుర్కొన్న ప్రశ్నను.., బంధువులు, బంధువుల నుండి సన్నిహితులు.., ఎవరి నుండైన ఈ ప్రశ్న ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆ క్షణం మనకు నచ్చిన అమ్మాయి ఉంటె వెంటనే చెప్పేస్తాం... (సగటు యువకులు చేసే పని). లేదు అంటే ఒక మాములు యువకుడు ఇచ్చే సమాధానం అదేం లేదమ్మా 'మీరే చూడండి మీకు "సరే" అని అనిపిస్తే చెప్పండి' అని చెప్తాడు. అదే సమయంలో ఈ మాటను కూడా ప్రయోగిస్తాడు 'నేను కూడా ఒకసారి మీరు చూసిన అమ్మాయితో మాట్లాడి ఓకే చేసేస్తా' అని తల్లిదండ్రులతో నిక్కచ్చిగా చెప్పేస్తాడు. అవును.., ఇది 'ఈ తరం' మాట. తన తల్లిదండ్రులు స్వయంగా చూసి 'ఓకే' చెప్పిన అమ్మాయిని తను కూడా కలిసి  మాట్లాడనుకుంటాడు. ఎందుకంటే జీవితం అనే పూదోటను ఇద్దరు పంచుకోవాలి. అందుకే మొదట మాటలు పంచుకొని మనసులు తెలుసుకోవాలని ఆరాటపడతాడు. పూలల్లో అవలీలగా దొరికే పూలు ఉంటాయి మరికొన్ని పూలు ముందు ముళ్ళను దాటితే కానీ దొరకవు. అవలీలగా దొరికిన కానీ.., అతికష్టంగా దొరికినా కాని అంతిమంగా కావాల్సింది ఒక మంచి అర్థవంతమైన అనుబంధం. ఏది ఏమైనా తల్లిదండ్రుల నుండి ఏదో ఒక రోజు వర్తమానం వస్తుంది....., 'అమ్మాయి మాకు బాగా నచ్చింది మంచి సంప్రదాయమైన కుటుంబం నువ్వు ఒకసారి "ఆ అమ్మాయితో మాట్లాడి సరే" అంటే మేము ముహూర్తాలు.., ఇతర విషయాల గురించి మాట్లాడుకుంటామని "ఆ అమ్మాయి కూడా నీతో మాట్లాడాలి" అని చెప్పిందట! అని మనకు తల్లిదండ్రులు గుండెలో రాయి వేసినట్లు చెప్తారు. (ఇందులో కొత్తదనమేమి లేదు తర తరాల నుండి వస్తున్నదే) కాకపోతే 'అప్పుడు ఇళ్ళల్లొ, మరియు కోటలలో మాట్లాడుకునేవారు. పూర్వ యుగంలో చెలికత్తెలు తోడురాగా చెలికాడి చక్కనమ్మ వివరాలన్నీ రాబట్టేవాడు', పైగా అప్పటి ఆ విలుకాడిలో సకల విద్య కళలు ఉట్టిపడేవి. ఆ ధీరుడి ధైర్య పరక్రమాలన్ని చూసిన తర్వాతే చిక్కని చక్కనమ్మ తన చెక్కిలిలొ.., బుగ్గన సిగ్గు తెచ్చుకొని చెలికాడికి చిరునవ్వు విసిరేది. అదే చిరునవ్వు తల్లిదండ్రులకు ఇంకోకటి 'కాపీ' ఇచ్చేది. ఇంక వెంటనే పెళ్లి భాజాలు మొగేవి. అయితే అది అప్పుడు....  మరిప్పుడు...???

కలియుగంలో మాత్రం వింత పోకడలు పుట్టుకొచ్చాయి. కాలం మారింది.. కాలంతో పాటు మనమూ మారాము..!! అప్పుడు కోటల్లో...,  ఇప్పుడు కేఫ్ ల్లో, కె.ఎఫ్.సి ల్లో, కాఫీడేల్లో, రెస్టారెంట్ లలో ఇంకా ఎక్కువ మాట్లాడితే పబ్బుల్లో.. తల్లిదండ్రులు తధాస్తు అనేసి 'ఓకే' అనేసిన అమ్మాయిని మనం చూడాల్సి వస్తుంది. తనతో మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు ఆ క్షణం 'అమ్మ మాట' మనసులో గుర్తొస్తు ఉంటుంది....., 'ఏరా ఈ అమ్మాయిని ఓకే చేసేయి రా.. చాలా బాగుంటుంది. మంచి సంప్రదాయం రా'  అని అరిగిపోయిన టేప్ రికార్డర్ లా అనునిత్యం అదరగొడుతునే ఉన్న మాట'.......  ఇంక ఏదో ఒక రోజు ఆ క్షణం రానే వస్తుంది ఆ అమ్మాయిని చూసే రోజు....  

పెళ్లి చూపుల ఘట్టం.. ఇది ప్రతి యవ్వనుడికి ప్రధాన ఘట్టం. ఎందుకంటే ఇదో అనుభూతి. అలాగని దీనిలో మొత్తం 'తీపే' ఉండదూ బాసు..!! కొన్ని సార్లు మనం "వెళ్లిన చోట" మన ఊహకు విరుద్దంగా కొంత చేదు కూడా కలగలిసి ఉంటుంది. కదన రంగానికి వెళ్ళే వీరసైనికుడి మల్లె మనకు ఈ ఘట్టం కూడా కదన రంగాన్నే తలపిస్తుంది. ఎందుకంటే మన మనసుతో మనమే పోరాడుతాం. మొత్తానికి అమ్మాయి దగ్గరికి వెళ్ళటానికి సిద్దమవుతాం.

చక్కగా స్నానం చేసిన చేయకపోయినా చక్కగా బట్టలు మాత్రం వేసుకొని, ఉరిమే ఉత్సాహంతో ఉరుకులు పెట్టె మనసుతో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఊరించే  మనసుతో.., లేని పోనీ 'పాష్' ను మన మాటల్లో వ్యక్తపరుస్తూ ఒక కొత్త వ్యక్తిని మనలో మనం చూస్తూ అమ్మాయి ముందుకు వెళ్తాం. కానీ ఒక్క మాట అప్పుడు ఆ క్షణంలో కొన్ని మాటలు మనం జ్ఞప్తికి తెచ్చుకోవలేమో.....  "ఎవర్ని మోసగించడానికి? ఎవర్ని మభ్యపెట్టడానికి? మనం మనంగా ప్రపంచానికి కనిపించినప్పుడే కదా గౌరవమైనా! అవమానమైనా!! మరీ అంత కృత్రిమత్వం మనిషికి అవసరమా? నువ్వు నువ్వుగా ఈ లోకానికి కనిపిస్తే తప్పేమిటసలు.."  మనం ఆ అమ్మాయి దగ్గర మనం మనంగా కనిపిస్తే చాలేమో..., లేని పోనీ డంబారికాలు మనల్ని ఇబ్బందుల పాలు చేస్తాయి తప్ప.. మనల్ని తదుపరి ఘట్టానికి తీసుకెళ్లవు. అందుకే అక్కడ ఆ క్షణం మనం మనంగా కనిపించటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే అక్కడ మనం చూసే అమ్మాయి.., మనం మాట్లాడే అమ్మాయి..., మనతో జీవితాంతం కలిసుండి మన జీవితానికే ఒక అర్ధాన్నిచ్చే అమ్మాయి... అలాంటి అమ్మాయి ముందు.., మనం మనంగా కనిపిస్తే తప్పేమిటసలు... అలా కనిపించినపుడే కదా.. మన నిజమైన మనసులు నిజంగా కలిసి ఒక బలమైన బంధాన్ని ఏర్పరచి బతుక్కు ఒక అర్ధాన్ని ఇస్తాయి. ఒక సగటు యువకుడు తన యవ్వన కాలంలో ఎందర్నో అమ్మాయిలను చూసి ఉండచ్చు కాని ఎక్కడోచోట మనకు రాసి పెట్టిన అమ్మాయి, మనకు ప్రత్యేకంగా కనిపించే అమ్మాయి తగులుతుంది. అప్పుడు ఆ క్షణం ఆ అమ్మాయిని చూసినప్పుడు మనసు మదన పడుతుంది.. యద లోపల యుద్ధం ప్రారంభవుతుంది.... శరీరం షాక్ కొట్టినట్లు అవుతుంది.., చూపులు బాణాలవుతాయి.., చేతులు చేసిన పనినే మల్లి మల్లి చేస్తాయి... ఆ సమయంలో మన శరీరంలో సరిగ్గా పని చేసే పార్ట్ ఏదైనా ఉంది అంటే అవి కన్నులే..., చూస్తూ ఉంటాము చూస్తూనే ఉంటాం.. అలా ఆమయిని చూస్తున్నపుడు.., ఒక్కసారి మన ఆలోచనలు మందగిస్తాయి. కాలం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. మన హృదయం ఒక 'పుటగా'.., మన కన్నులు 'కలంగా' మారి ఆద్యంతం మైమరిపించి బంగారు అక్షరాలతో మన మనసు అనే అధ్యాయంలో ఒక పేజి ని సృష్టిస్తాయి.  

మొదటిసారి..., మొట్ట మొదటి సారి...,
తను మొదటి సారి తనతో మొదటిసారి...
నయనాలు తన కోసం నాట్యం చేస్తుంటాయి.... మనసు తొందర పడుతుంది... హృదయం ఉరకలేస్తుంది... ఆలోచన మందగిస్తుంది... ఎక్కడో తన శ్వాస మనల్ని స్పృశిస్తుంది.... తనని చూసి ఆనందం ఆకాశపు హద్దులు తాకమంటుంది... తనే తలంపు.... ఎక్కడ తనెక్కడ అన్న ప్రశ్న మనల్నే ప్రశ్నిస్తూ ఉంటుంది.
రానే వస్తుంది ఆ సమయం..
ఆ అబ్బాయి ముందుగా అమ్మాయి.... ఆ అమ్మాయి ఎదురుగా అబ్బాయి...
మనసు వినీలాకాశంలో విహరిస్తూ ఉంటుంది...  ఎలా వర్ణించాలని అనిపిస్తుంది... పికాసో ముందు పెయింటింగ్ వేయమంటే ఎలా ఉంటుంది.. బిల్ గేట్స్ ముందు బిజినెస్ మాట్లాడమంటే ఎలా ఉంటుంది...
చేతులు వణుకుతుంటాయి.., కాళ్ళు తడబడుతుంటాయి... మరెవ్వరు కనిపించరు...  కేవలం ఇద్దరు మాత్రమే ఆ గదిలో ఉన్నారేమో అని.., అసలు ఈ లోకంలో తామిద్దరమే ఉన్నామేమో అన్న అబ్బాయి మాయ లోకం నుండి అమ్మాయి విసిరిన బాణం లాంటి ఒక్క చూపు.., దాన్నుండి బయటపడేస్తుంది...
ఓహో ఆ అందం.... తన కన్నులు స్వయంగా దేవుడే తన హస్తాన్ని ఉలిగా చేసుకొని చేక్కినట్లుగా ఉంటాయి..
తన చూపు చంద్రున్నయిన ఒక్క క్షణం భూమి చుట్టూ తిరగటం మర్చిపోయేలా చేస్తుందేమో..
తన మొహంలో అమాయకత్వం... తన మాటల్లో అమృతం... చివరిగా వెళ్ళేప్పుడు.., మనసు భారమవుతున్న వేళా., తను తిరిగినప్పుడు వయ్యారమైన ఆ వాలు జడ ఉంటుంది చూడు బాసు ఆ జడ లోనే అమ్మాయి అందమంతా దాగుందా అని అనిపిస్తుంటుంది...
అమ్మాయి ఉన్న ఒక్క పది క్షణాలు అబ్బాయి ప్రపంచాన్ని మురిపించి మైమరిపించి ఆసాంతం అతన్ని అయోమయంలో పడేసిన ఆ "అమ్మాయి" అందానికి "అబ్బాయి" వందనం అందానిభివందనం.

ప్రపంచంలో ఎందరో అబ్బాయిలు తమ తల్లిదండ్రుల మాటకి గౌరవిస్తూ.., తమ అభిప్రాయాన్ని వాళ్ళకి అర్ధమయ్యేలా విశదీకరిస్తూ ఎంతో పరిణతిని కనబరిచి తమ బలానికి "భార్య" అనే బలం జోడించుకుంటున్న యువకులకు అభినందనలు. మన ముందు తరాల వారు పెళ్లి "చూపుల" నుండి "చూపులు" ఆగిపోయేంతవరకు ఎన్ని సందేహలోచ్చిన, ఎంత కోపమొచ్చిన కాని వందేళ్ళు కష్ట సుఖాలని తమవిద్దరివే(ఆలు మగలు) అనుకున్నారు... కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. ఎన్ని అవాంతరాలు వచ్చిన.., ఎన్ని అడ్డుగోడలచ్చిన అవన్నీ వారికి అడ్డు కాలేదు.. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మనకు వెలకట్టలేని ఆలు మగల బంధం గూర్చి భవిష్యత్ తరాలకు నేర్పినటువంటి అటువంటి ఎందఱో మహా దంపతులకు "ఈ తరం అబ్బాయి అమ్మాయి" శతకోటి వందానిభివందనాలు....

హరికాంత్

దక్షిణ భారతంలో కూడా బిజెపి పాగా వేయనుందా...!!



దక్షిణ భారత దేశంలో కీలక పాత్ర పోషించటానికి భారతీయ జనతా పార్టీ  (బిజెపి) పావులు కలుపుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే బిజెపి స్థానిక నాయకులు కూడా ఇందుకు కొన్ని ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తుంది. ఈ మధ్యే తెలంగాణ రాష్ట్రం లో పర్యటించిన అమిత్ షా ప్రతి నెలకొకసారి దక్షిన భారతదేశం లో.., ప్రతి మూడు నెలల కొకసారి తెలంగాణా లో పర్యటిస్తానని చెప్పారు. ఉత్తర భారత దేశంలో మోడీ సహకారం తో  పార్టీ ని ఒంటి చేత్తో నడిపించి స్థానిక పార్టీల కోటలను బద్దలు కొట్టి మరీ.., ఘన విజయం సాధించి పెట్టిన  అమిత్ షా ఇప్పుడు దక్షిణ భారతంలో పార్టీ బలోపేతం పై ద్రుష్టి పెడుతున్నారని సమాచారం.

అమిత్ షా ఈ ప్రాంతంలో ఎలా అయిన బిజెపి ని అధికారం లోకి తీసుకురావాలని కనీసం అధికారం లోకి రాని చోట మన ఉనికిని చాటి చెప్పాలని.., మెల్లిగా మన ప్రాబల్యాన్ని విస్తరించాలని స్థానిక బిజెపి నాయకులకు హిత బోధ చేసి మరీ వెళ్లారు. దానికి ఉదాహరణగా మహారాష్ట్ర ను చూపిస్తున్నారు. గత సంవత్సర కాలంగా కార్యకర్తలు తీవ్రంగా శ్రమించి ప్రతి ప్రాంత ప్రజల్లోకి పార్టీ ని తీసుకెళ్ళారు. దాని వల్లే మహారాష్ట్ర లో విజయం సాధించామని చెప్పుకోచ్చారు. కనుక దక్షిణ భారత దేశం లో పార్టీ ని బల పర్చాతనికి ప్రతి ఒక్కరు కష్ట పడాలని, ఏవైనా ఆంతర్గిక గ్రూప్ తగాదాలు ఉంటె అవన్నీ పరిష్కరించుకొని పార్టీ కోసం కష్ట పడాలను సూచించి మరీ వెళ్లారు. ప్రతి రాష్ట్రములో పార్టీ పనితీరును పరిశీలించటానికి అమిత్ షా ఒక రహస్య పరిశీలకుడిని నియమించినట్లు సమాచారం. ఆ పరిశీలకుడు ఎప్పటికప్పుడు పార్టీ పని తీరుపై బిజెపి అధిష్టానానికి నివేదికలు కూడా పంపుతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా త్వరలో జరగనున్న తమిళ నాడు ఎన్నికలకు బిజెపి పార్టీ అత్యధిక ప్రాముఖ్యత ని ఇస్తున్నట్లు తెలుస్తుంది.

అందులో భాగంగానే తమిళ నాడు లోని ఒక పేరు మోసిన సినీ ప్రముఖుడిని బిజెపి లోకి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు కాని ఆ నటుడు అందుకు అంగీకరించక పోవటం తో.., స్వయంగా మోడీ కూడా ఆ సుప్రసిద్ధ నటుడిని సంప్రదించినప్పటికీ.., ఆ తమిళుల ఆరాధ్య నటుడు సున్నితంగా తిరస్కరించినట్లు అక్కడి పార్టీ స్థానిక నేతలు చెప్తున్నారు. కాని ఎన్నికల సమయం వరకు ఏ అద్భుతమైన జరిగి ఆ నటుడు మనసు మార్చుకొని మోడీ ప్రయత్నం తో, అమిత్ షా సంప్రదింపులతో అప్పటివరకు రావచ్చేమో అని స్థానిక బిజెపి నాయకులు చర్చించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇంకో తమిళ నటుడు విజయ్ మోడీ కి మద్దతుగా ఢిల్లీ కి వెళ్లి కలిసి వచ్చారు కాని ఆయన ప్రత్యేకంగా పార్టీ పెట్టె ఆలోచన చేసినప్పటికీ ఆయన సన్నిహితులు కొంత మంది వద్దని అనటంతో అప్పటికి ఆ ఆలోచన విరమించుకొని బిజెపికే  మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెల్సుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో సుప్రసిద్ధ నటుడు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టాక కూడా బిజెపి తరపున మద్దతుగా నిలిచి ప్రచారంలో పాలు పంచుకున్నారు. అక్కడ ఆంద్ర ప్రదేశ్ లో ఆ ఫార్ములా సక్సెస్ కావటం తో తమిళ నాడు లో కూడా అదే విజయ సూత్రాన్ని అనుసరించ బోతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యే బిజెపి లోకి ఒక సినీ ప్రముఖుడిని సంప్రదించి తమ పార్టీ లోకి రావాలని ఆహ్వానించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ ను బిజెపి ఆకర్షించగలిగింది. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సమక్షం లో ఈయన పార్టీలో చేరబోతున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే తమిళ నాడు ఇన్ ఛార్జ్ గా ఉన్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అమరన్ మాట్లాడారు. ఈయన చేరిక పార్టీ కి కొంత లబ్ది చేకూరే అవకాశం ఉందని తమిళ నాడు బిజెపి వర్గాల అంచనా.

తమిళ నాడులో ఉన్న ప్రముఖులపై దృష్టి పెట్టి బిజెపి తమ పార్టీ లోకి ఆకర్షించాలని భావిస్తుందని తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్క ప్రముఖుడికి వర్తమానం పంపి పార్టీ ప్రచారం లో పాలు పంచుకునేలా చేయటానికి బిజెపి తరపున ప్రధాన కార్యదర్శి మురళిధర రావు పై ఈ బాధ్యత ని పెట్టారని  పార్టీ వర్గాలు చెప్తున్నాయి  ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క అంశం పై  ద్రుష్టి పెట్టి పార్టీ దక్షిణం నలు దిశల వ్యాపింప జేయాలని అమిత్ షా యోచిస్తున్నట్లు ఇది అమిత్ షా ఆలోచన్ మాత్రమే కాదని దీనికి ముందే మోడీ కూడా అమిత్ షా కు కొన్ని మార్గ దర్శకత్వాలు ముందే ఇచ్చారని అందుకే అమిత్ షా పార్టీ బలోపేతం పై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

హరికాంత్

'ప్రజల' మధ్య తిరుగుతున్న 'పాశవిక' మృగాలు..!


గుడియాత్తం సమీపంలో ఆరో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన అమానుష సంఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలోని కాంగుప్పం గ్రామానికి చెందిన విజయకుమార్ ఒక నిరుపేద కూలీ. ఇతని రెండో కుమార్తె కీర్తిక మార్చనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు వెళ్లిన కీర్తిక రాత్రి అయినప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ తెలియరాలేదు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చే దారిలోని పెరియాంకుప్పం వద్ద ఉన్న మామిడితోటలో కీర్తిక మృతదే హాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు. కీర్తిక కాళ్లు, చేతులు కట్టి తలపై బాటిల్‌తో కొట్టిన  గాయాలున్నట్లు గుర్తించారు. విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టి వేసి, అత్యాచారం చేసి, తరువాత బాటిల్‌తో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. (Source: Sakshi, Eenadu, Andhra Jyothi, The Hindu)

నల్లని గుర్తులు ప్రపంచ పటం మీద ఇంకా స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి ఇంకా పడుతూనే ఉన్నాయి....  ఎన్నో సంఘటనలు.., ఎన్నో రక్తపు చారలు.., ఎన్నో అత్యాచార ఘటనలు.., రోజుకు రోజుకు ఈ హింసాత్మక సమాజం మరింత హింసాత్మకంగా తయారవుతుంది. ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం మన భారత దేశం లో ప్రతి 30 నిమిషాలకి ఒక అత్యాచార కేసు నమోదవుతున్నట్లు చెబుతుంది. అందులో మరి ముఖ్యంగా ప్రతి 30 నిమిషాలకు బలయ్యే ఆడపిల్లల్లో 30 శాతం చిట్టితల్లుల ఆర్తనాదాలే ఉండటం మన పాశవికతకు ప్రతీక. నిన్న జరిగిన అతి కర్కశ ఘటన కాలాన్నే తల దించుకునేలా చేస్తుంది. ఒక 11 ఏళ్ళ బాలికతో కొందరు మానవ మృగాలు ప్రవర్తించిన తీరుతో దక్షిణ భారత దేశం ఉలిక్కిపడింది.

అలాంటి వార్తలు చూడటం మనకి కొత్తేమి కాకపోవచ్చు... చాల సార్లు మనం చూసుండచ్చు.. కాని మనం ఎంత వద్దనుకున్న ఎక్కడో మూలన మన మనసు లాగుతుంది. ఎంత వద్దనుకున్న అదే గుర్తొస్తుంది. అణ్యం పుణ్యం తెలియని చిన్నారులు సైతం కర్కషులు ఆడుతున్న క్రామ క్రీడ లో బలైపోతున్నారు. ఎందుకిలా జరుగుతుంది? బంధాలను అనుబంధాలను గౌరవించే భారత దేశంలో ఇలాటి ఘటనలు జరగటానికి కారణం ఏంటి? ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు... అర్ధం అయి, కానటువంటి సమాధానాలు. మరి ఈ సమస్య కు పరిష్కారం చూపించేదేవరు...? ప్రజలను పాలిస్తున్న ప్రభుత్వమా....  ప్రభుత్వంచే పాలించబడుతున్న ప్రజలా.... సమాజంలో, కులానికో మేధావి... మతానికో మేధావి.. వర్గానికో మేధావి ప్రాంతానికో మేధావి అని చెప్పుకు తిరుగుతున్న మహా మేధావులు చెప్తారా.... లేకుంటే ఆ మేధావులు రాత్రి పగలు చెమటోడ్చి రాసిన రాజ్యాంగం చెప్తుందా?? సగటు పౌరుడికి కలిగే ఆవేశం.,ఆక్రోశం.,ఆవేదన ఇది... అదే ఆడపిల్ల ఈ సమాజంపై తిరగబడి విప్లవ నారి అయి విజ్రుంభిస్తే అందుకు ఈ సమాజం సమర్థిస్తుందా? నలుపు రంగు పులుముకున్న న్యాయవ్యవస్థ ఇది న్యాయమేనని నినదిస్తుందా??

పదకొండేళ్ళ చిన్నారి పసి మొగ్గను..., ఇంటికి వెళ్లటానికి బస్సు కోసం ఎదురు చూస్తున్న ఆడపిల్లను..., ఇంటికి బస్సు లో వెళితే అంత సేఫ్ కాదని కర్మ కాలీ క్యాబ్ లో వెళ్ళాలనుకున్న ఆడపిల్లను..., ఇలా ఎన్నో సంఘటనలు...  ఆ సంఘటనల వెనుక సవాలక్ష కారణాలు.., 'ఏ సంఘటన చుసినా ఏమున్నది మానవత్వం...! శరం లేని క్రూరత్వం....!!' వాళ్ళు బలి తీసుకుంటున్నది భావి తరాలను వృద్ధి చేసి.., సృష్టికే ప్రతిసృష్టి చేసే అచెంచల ఆత్మ విశ్వాసం కలిగిన అతివలని తెలియదా..?? ఆ అతికర్కొటక ప్రబుద్దులు తాము ఆకాశం నుండి ఊడిపడలేదని, తమకు, తమ బ్రతుక్కు ఒక ఆడదే అర్దాన్నిచ్చిందన్న విషయం తెలియదా..??
ఇలాంటప్పుడే ప్రజాస్వామ్యం ఇలాంటి ప్రబుద్దుల మధ్య బ్రతకలేదని అనిపిస్తుంది. ఇలాంటప్పుడే న్యాయవ్యవస్థ నాలుగు గోడల మద్య నలిగిపోతుంది... ఇలాంటప్పుడే తనను తాను రక్షించుకోవటానికి సగటు ఆడపిల్లకు, తన అరచేతే ఆయుధమైతే బాగుండనిపిస్తుంది... కాని ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రశ్నలను ప్రశ్నార్థకాలు గానే మిగులుస్తున్నాయేమో అన్న అభిప్రాయం కలుగక మానదు. ఏవైనా కొన్ని సంఘటనలు జరిగాక గానీ కొన్ని రోజులు హడావుడి చేసే ప్రభుత్వం వీటికి శాశ్వత పరిష్కారాలు చూపించేదపుడనీ, ఆడపిల్లల అనుమానాలను నివృత్తి చేసేదేపుడని మహిళా లోకం ప్రశ్నిస్తుంది.

అత్యాచార ఆలోచన ఉన్న ప్రతి అర్దాయుషు అనామకుడికి అమ్మాయిని చూస్తున్నపుడు అమ్మ గుర్తుకు రావాలి. ముఖ్యంగా మహిళల్లో ఆడతనాన్ని మాత్రమే చూడకుండా అమ్మతనాన్ని కూడా చూడటం ఈ సమాజం అలవర్చుకున్నపుడే ఈ అకృత్యాలు ఆగుతాయి... ప్రభుత్వాలే కాదు ప్రజల ఆలోచనా ధోరణీ మారాలి.... అంటే ఆ దిశగా ప్రతి ఒక్కరిలో పౌర చైతన్యం రావాలి. ఆ పౌర చైతన్యానికి ప్రభుత్వం ముందడుగు వేయాలి.

ఈ డిసెంబర్ 16 తో నిర్భయ ఘటన జరిగి సరిగ్గా ఏడాది పూర్తి కావస్తుంది. దేశంలో అలాంటి నిర్భయలెందరో బలయ్యారు. వారి కోసం.., వారి కుటుంబసభ్యుల కన్నీరును ఆపటం కోసం ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు మేల్కొనాలన్నదే మా ఉద్దేశం.. నిర్భయ లాంటి.., అభం శుభం తెలియని చిన్నారుల లాంటి.., అసువులు బాసిన ఆడబిడ్డలందరి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ.... 

నల్లని మరకలు పడుతున్నాయి మన దేశం మీద.., కాదు కాదు మన బంగారు తల్లుల మీద...,నిమిషానికి ఒక్కటి...
పడితే పడనీ., మన వాంఛ తీరిందని తృప్తి పడదాము..!
స్నేహితుడే మోహితుడై కిరాతకుడవుతున్నాడు., ప్రేమికుడే పామై కాటేస్తున్నాడు.,
బంధువే రాబందువై మీద పడి తార్చుతున్నాడు., చివరికి కని పెంచిన కన్న తండ్రే కరుణ లేని కసాయివాడై కరుస్తున్నాడు...
ఆదమరచి నిద్రిస్తున్నాయి నేటి అనుబంధాలు..
నిద్రపొనీ., మన వాంఛ తీరిందని తృప్తి పడదాము..!
కామ వ్యాధి పట్టిన కాల యములు సమాజ కారడవిలో కామ క్రీడ ఆడుతుంటే నిర్లజ్జగ చూస్తుంది ఈ మా'లోకం'., మదం పట్టిన మగ జాతి మిమ్మల్ని చెరపట్టగా నిస్సిగ్గుగా చూస్తుంది ఈ న'సమాజం'.. చూడనీ., మన వాంఛ తీరిందని తృప్తి పడదాము..!
ఆడదనే అమ్మ ఉన్నంతవరకు మల్లి మల్లి పుడతారు... ఆ ఆడదానికే సమాధి కడతారు.
గల్లి గల్లికి పెట్టిన గాంధి బొమ్మలు సిగ్గుతో తల దించుకుంటున్నాయి... కన్న కలల్ని కోల్పోయి కన్నీటికి ప్రతిరూపంగా మారుతుంది మా కన్న ఆడ తల్లి...
మారని., మన వాంఛ తీరిందని తృప్తి పడదాము..!
ఇంకా కంపు కొడుతున్నాయి అత్యాచారానికి గురై అతి కర్కశంగా హత్య గావింపబడ్డ మా చిట్టితల్లుల మృతదేహాలు...
కొట్టనీ., ఆ వాసనలను సువాసనలుగా మార్చుకొని మళ్ళి మళ్ళి ఆ దేహాన్ని చిద్రం చేద్దాము.. మన వాంఛ తీరిందని తృప్తి పడదాము..!!

హరికాంత్

గాంధీ వర్ధంతి సందర్భంగా…ఆయన చూపిన బాటను గుర్తు చేస్తూ...అనుసరిస్తూ…



జనవరి ౩౦ గాంధీ వర్ధంతి సందర్భంగా, గాంధీ భావాలను మననం చేసుకుంటూ…. ఆయన చూపిన బాటను గుర్తు చేస్తూ….

ఆకలితో మల మల మాడే కడుపులు.. ఆ కాలే కడుపులకు ఇదిగో తినండి మేము ఇస్తున్నాం ఉచిత నాలుగు బియ్యం రాళ్ళు అని చెప్పి ప్రజలని ఇంకా దౌర్భాగ్య స్థితి లోకి నెడుతున్న ప్రభుత్వాలు… దాహం తో గొంతు ఎండుకుపోయే పల్లెలు… ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురుచూసే గ్రామీణ అమాయకపు ప్రజలు… కనీసం చదువుతో అయిన మా జీవితాల్లో మా కుటుంబాల్లో వెలుగు నింపుకొందామంటే ఆ చదువులతోనే వ్యాపారాలు.. కుల వృత్తుల్లేవు, వ్యాపారల్లేవు, ఉద్యోగాల్లేవు, ఉపాధి లేదు ఇదా మనకు గాంధీజీ స్వతంత్ర పోరాటం నుండి ఇచ్చింది మనకు దాన్నుండి వచ్చింది… కొందరు యువకుల హృదయంతరాల్లో మెదలుతున్న ప్రశ్న ఇది…. ఉదయం నుండి గాంధీ భావాలు అందరికి మనసులో మెదలుతూనే ఉన్నాయి. ఆయన సిద్దాంతాలు ఆ భావనలు ప్రతి నిమిషం గుర్తొస్తున్నాయి. ఏ దేశమైన ఒక క్రొత్త ఆయుదాన్ని తయారు చేసుకొని తన అమ్ముల పొదిలో వేసుకొని ప్రపంచ దేశాల ద్రుష్టి ని ఆకర్షిద్దామా అని చూస్తున్న రోజుల్లో “శాంతి అహింస” అనే సరిక్రొత్త ఆయుధాలని సృష్టించి ఎన్నో దేశాలకు ఆదర్శ ప్రాయుడయ్యాడు మన బాపూజీ…..

ప్రజాస్వామ్య పథం లో ప్రవేశిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతుంది. కాని పాలనాధికారం మాత్రం కొందరికే పరిమితం అవుతుంది.

సమాచార విప్లవం సాకారమైంది… కాని సామజిక సంబందాలు విచ్చిన్నమవుతున్నాయి

అక్షరాస్యుల సంఖ్య అధికమవుతుంది… కానీ సమాచార సాంకేతిక విజ్ఞానం ఇంకా కొందరి చేతుల్లోనే ఉంది.

నియంత్రుత్వాలు కూలిపోతున్నాయి కాని నిరంకుశ ధోరణులు పెరిగిపోతున్నాయి.

వ్యక్తి ప్రయోజనాలకి, సమాజ లక్ష్యాలకు మద్య ఏర్పడుతున్న భయంకర వైరుధ్యాలివి. సత్యం అహింస లే ప్రాణంగా జీవించి వందల కోట్ల ప్రజానీకాన్ని శాసించిన మహాత్ముడు ప్రభవించిన నా భారత ఖండం ఇప్పుడు హింసోన్మాదంలో కొట్టుకుపోతుంది. స్వతంత్రం తరువాత భారత్ అహింస నుండి అణుబాంబు కి దగ్గరైంది. రాజకీయాలు విషపూరితమయ్యాయి. దాడులు ప్రతీకార దాడులు హత్యలు మానభంగాలు లాంటి హింసాత్మక సమాజం లో నివసిస్తున్నాం మనం. ఎందుకిలా జరుగుతుంది? ఆయుధమే సమాధానమని భావించే వర్గాలు పెరిగిపోతున్న ఈ సమాజం లో బ్రతుక్కి చావుకి మద్య అంతరం తగ్గిపోతుంది. నిజానికి ఈ తరహ సమాజాన్ని ఎలా సంస్కరించుకోవటం అనేదే పెద్ద సమస్య. సమాజం లో మార్పు ని తీసుకురావటం కోసం ప్రజలందరినీ ఒకే తాటి ఫై నడిపించటం ఎలానో … వారి మద్య సంఘీభావాన్ని పెంచటం ఎలానో… ఆచరణాత్మకంగా రుజువు చేసారు మన బాపూజీ. ఆయన భావాలూ విశ్వమంతా విశాలమైనవి. ఒక రుషిగా, విప్లవవాదిగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, తాత్వికుడిగా, విద్యావేత్తగా, సత్యగ్రహిగా, అహింస వాదిగా, ఆదర్శవాదిగా ఆయనది బహుముఖ విన్యాసం. నైతిక విలువలు, సత్య నిబద్దత, సహనం వంటి విలువలకు విలువ లేకుండా అవి వట్టి భావనలుగా పరిగణిస్తున్న క్రొత్త తరం ఇప్పుడు కనిపిస్తుంది. డబ్బు తప్ప మరేది అంత విలువైనది కాదనే అసహజ సిద్దంతాలు పుట్టుకొస్తున్నాయి. ఇది ఎంతో ప్రమాదకర ధోరణి. మన సమాజం లో అత్యధికులు హింస, అహింసలలో దేని వైపు మొగ్గు చూపుతారని అడిగితే వచ్చే సమాధానం సుస్పష్టం. మనిషి మనిషి గా బ్రతకటం కోసం మార్గాన్ని వెతుక్కుంటున్న ఈ సమయం లో కొందరికి గుర్తున్నది…. ఇంకొందరికి గుర్తుకు రావాల్సింది గాంధిజీయే. నేటి గాడి తప్పిన వ్యవస్థలన్నిటికి పరిష్కారమే గాంధి మార్గం. ఈ మార్గం సమస్యలు సృష్టించే మార్గం కాదు శాశ్వతమైన పరిష్కారాలు చూపే మార్గం. ఈ మార్గాన్ని ఎన్నో దేశాలు అనుసరిస్తున్నాయి.. కాని మనం ఎంతవరకు ఆచరిస్తున్నామన్నదే ప్రశ్న.

ఆగష్టు 15 1947 గాంధీ పోరాట ఫలితం, ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం వల్ల బ్రిటిష్ వారు మనకు స్వేచ్చని ఇచ్చి స్వతంత్రం ప్రసాదించారు.. ఆ రోజు రెడ్ ఫోర్టులో తొలిసారిగా భారత మొట్ట మొదటి ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రు గారి చేతుల మీదుగా త్రివర్ణ పతాకం రెప రెప లాడింది. సకల భారతావని సంతోషించింది. ఆ రోజు స్వతంత్ర సమరయోధులు భావించింది వేరు, ఈ రోజు మనం ఆచరిస్తున్నది వేరు. సరిగ్గా 67 సంవత్సరాలు గడిచిపోయాయి. అనుకున్న లక్ష్యాలను ఇంకా అధిగమించలేక పోతున్నాం. లోపం ఎక్కడుంది పాలకులలోనా..?! ప్రజలలోనా ..?!! సమాచార విప్లవం సాకారమైంది కాని సామాజిక సంబంధాలు విచ్చిన్నమవుతున్నాయి. అక్షరాస్యుల సంఖ్య అధికం అవుతుంది కాని సమాచార సాంకేతిక విజ్ఞానం ఇంకా కొందరి చేతుల్లోనే ఉంది. గణాంకాల రిత్యా దారిద్రం తగ్గుతుంది కాని ఇతరులతో పోల్చుకొని పేదలమని కుమిలిపోయే వారి సంఖ్య పెరుగుతుంది. నియంత్ర్రుత్వాలు కూలిపోతున్నాయి కాని నిరంకుశ ధోరణులు పెరుగుతున్నాయి.

అందుకే పేదరికం, నిరుద్యోగం, ఆకలి, అలక్ష్యం, అవినీతి, అభద్రత ల బరువుని భరించలేక మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నానాటికి పెరిగి కుంగిపోతుంది. ఇలా ఎంత కాలం..?? మనకు మనం ప్రశ్నించుకోవలసిన ప్రశ్న. స్వతంత్రం తర్వాత భారత దేశం అహింస నుండి అణుబాంబుకి దగ్గరైంది. రాజకీయాలు విషపూరితమయ్యాయి. దాడులు ప్రతిదాడులు హత్యలు ఆత్మహత్యలు మానభంగాలతో కూడిన హింసాత్మక సమాజంలో మనం నివసిస్తున్నాం. దేశ జనాభాలో సగం మంది ఉన్న యువత ఇప్పటికైనా మేల్కొనాలి.. మేధావుల అభిప్రాయం ప్రకారం మొత్తం పాలనా వ్యవస్థ లోనే సుపరిపాలన విధానాల అమలుకు నడుముకు అందరు నడుము బిగించాలి. దైనందిన జీవితం లో సగటు సామాన్య పౌరుడికి ఆ మార్పు స్పష్టంగా కనపడాలి. బడిలో చదువు బాగా చెప్పాలి. అంటే ఉపాధ్యాయుల కొరత తీరాలి. బడి సమస్యలు పోవాలి. నిరుద్యోగ సమస్యని పారద్రోలాలి. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో డాక్టర్లు మందులు అందుబాటులో ఉండాలి. వాహన సంచారానికి అనువుగా గతుకులు లేని రహదారులు కావాలి. త్రాగునీరు తో మురుగునీరు కలవని నీటి వ్యవస్థలు రూపొందాలి. సేవల కోసం వచ్చిన ప్రజలకి సిబ్బంది నుండి గౌరవం దక్కాలి. విద్యుత్ కోతలు పోవాలి. దోపిడీ దొంగతనాలు జరగని వ్యవస్థ కావాలి. భద్రత విషయంలో భరోసా ఇచ్చే పోలీస్ వ్యవస్థ కావాలి. అన్నింటిని మించి రాజకీయ నాయకులు ఎటువంటి పోలీస్ రక్షణ లేకుండా నిర్బయంగా తిరగగలిగే సువ్యవస్థ ఆవిష్కృతం కావాలి. సుపరిపాలన స్వపరిపాలనకు ఏనాటికి ప్రత్యామ్నాయం కాలేదని నినదించి, బ్రిటిష్ వారిని ఎదిరించి.. పోరి తెచ్చుకున్న స్వాతంత్రానికి నిజమైన అర్ధం కల్పించగల నిబద్ధత కలిగిన నాయకులు “మంచి నాయకులు” మన దేశానికి అవసరం..! గాంధీ చూపిన బాటను అనుసరించి అమలు చేసే మంచి నేతలు మన దేశానికి అత్యవసరం…!! ఈ రోజు గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చూపిన బాటను అనుసరిస్తూ, అమలుచేస్తూ..... 

హరికాంత్ 

బిజినెస్: స్పైస్ జెట్ మళ్ళి స్పైస్ గా మారనుందా..!



మళ్ళి స్పైస్ జెట్ వార్తల్లో నిలిచింది. ఇప్పటికే సంస్థ పూర్తి నష్టాల్లోకి కూరుకుపోయి చేతలుడిగిన స్థాయిలో ఉన్న స్పైస్ జెట్ మళ్ళి తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించుకునే పనిలో పడింది. ఇప్పటికే స్పైస్ జెట్ వాటాను పూర్తిగా సంస్థ లోని మిగతా సభ్యులకు విక్రయించిన కళానిధి మారన్ ఇప్పుడు సంస్థ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు సంస్థ మొత్తం క్రొత్త యాజమాన్యానికి పూర్తిగా బదిలీ అయినట్టే. మరి నష్టాల్లో ఉన్న సంస్థ పూర్తిగా తన ఆధీనం లోకి తీసుకొని అంత ధైర్యం చేసిన వ్యక్తి ఎవరని అటు వ్యాపార ప్రపంచమే కాదు… ఇటు సాధారణ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. సినిమా లలో మాములుగా చూస్తుంటాం….. ఒక సంస్థ ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసి, ఇంక ఎన్నో ప్రయత్నాల అనంతరం ఆ యాజమాన్యం కూడా చేతులేత్తేసినపుడు ఒక హీరో వచ్చి ఆ నష్టాల్లో మునిగిన సంస్థకు జవసత్వాలు అందింప జేసి, ఆ సంస్థను మళ్ళి దిగ్విజయంగా లాభాల బాట పట్టించి, చరిత్ర సృష్టిస్తాడు. మరి ఇది సినిమా లలో…. మరి సరిగ్గా ఇలాంటి సంఘటనే భారత వ్యాపార రంగలో చోటు చేసుకోనుందా..??

ఆర్థికంగా కుదేలయిపోయి, కేంద్రం వైఖరితో నిరాశ నిస్పృహ లతో ఉన్న.., ఇంక ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఆశ తో ఎదురు చూస్తున్న స్పైస్ జెట్ విమానానికి మళ్ళి ఒక టేక్ ఆఫ్ ఇచ్చి గాల్లోకి లేపే కత్తి లాంటి కొత్త పైలట్ (యాజమాన్యం) రానున్నాడ..? ఇప్పుడిదే చర్చ నడుస్తుంది కొన్ని వ్యాపార వర్గాల్లో… ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసింది. అటు కేంద్ర సహహయాన్ని కూడా అర్థించిన విషయం తెలిసిందే.., కాని కేంద్ర సహాయాన్ని అందిచటానికి తిరస్కరించటంతో ఇంక ఎటు పాలుపోలేని సంస్థ యాజమాన్యం దాదాపుగా చేతుల్ని ఎత్తిసింది. కాని స్పైస్ జెట్ లో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ కేంద్రానికి కలవర పుట్టించాయి. స్పైస్ జెట్ చాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ యాజమాన్యం వల్ల కాలేదు. అందుకే షేర్ మార్కెట్ లో స్పైస్ జెట్ ఒక్కో షేరు ధర 48 రూపాయలు ఉండగా, ఈ పరిణామాలతో ఒక్కసారిగా పతనావస్థ కు చేరుకుంది. కాని ఇప్పుడు ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన సంస్థను గట్టెక్కించటానికి కొత్త యాజమాన్యం రానుందని వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి. అవును స్పైస్ జెట్ సంస్థ త్వరలోనే చేతులు మారనుందనే ఊహాగానానికి స్పైస్ జెట్ అసలు ప్రమోటర్ అయిన అజయ్ సింగ్ వ్యాఖ్యలు ఆ ఒహాగానాలు నిజమేనని ఝూడీ చేస్తున్నాయి.

తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ఊహాగానాలు నిజం కానున్నాయనే వాదనలు బలపడుతున్నాయి. భారత్, విదేశాలకు చెందిన కొందరు ఇన్వెస్టర్లు కంపెనీలో సుమారు రూ.1,400-1,500 కోట్లమేర కొత్తగా పెట్టుబడులు పెట్టి.. ఆమేరకు వాటాను దక్కించుకోవడానికి సుముఖంగా ఉన్నారని సమాచారం. కంపెనీ బ్యాలెన్స్‌షీట్, ఆర్థిక పరిస్థితిని మదింపు (డ్యూడెలిజెన్స్) చేసిన తర్వాత పెట్టుబడులపై స్పష్టత వస్తుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఆయిల్ కంపెనీలు, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ(ఏఏఐ)కి బకాయిలు చెల్లించకపోవడంతో ఐదు రోజుల క్రితం స్పైస్‌జెట్ విమాన సేవలు పూర్తిగా నిలిచిపోయి కంపెనీ దాదాపు కుప్పకూలే దశకు చేరిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర పౌర విమానయాన శాఖ జోక్యంతో చమురు కంపెనీలు, ఏఏఐ బకాయిల చెల్లింపునకు కొంత వ్యవధి ఇవ్వడంతో స్పైస్‌జెట్‌కు తాత్కాలికంగా కొంత ఊరట లభించింది. కాని ఈ పరిణామాలన్నీ గమనించిన వ్యాపార వేత్త అజయ్ సింగ్ ఆర్ధిక ఊబిలో కూరుకుపోయిన స్పైస్ జెట్ ని తన భుజాల మీదకు ఎత్తుకోవటానికి సిద్దమవుతున్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీని తీసుకోవటానికి వచ్చిన ఆ “హీరో” ఎవరు…?? కష్టాల్లో ఉన్న స్పైస్‌జెట్‌పై ఈ కంపెనీని నెలకొల్పిన అసలు ప్రమోటర్ అజయ్ సింగ్ మళ్లీ ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.

కంపెనీని గాడిలోపెట్టడంతోపాటు ఇతర ఇన్వెస్టర్లతో కలిసి మళ్లీ పెట్టుబడులు పెట్టే ప్రణాళికల్లో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సింగ్ పలుమార్లు భేటీ కావడంతో ఈ వాదనలు జోరందుకున్నాయి. అజయ్ సింగ్ మరెవరో కాదు స్పైస్ జెట్ అసలు ప్రమోటర్. స్పైస్ జెట్ దేశం లో ఇంతగా ప్రాచుర్యం పొందటానికి కారణమైన వ్యక్తి. స్పైస్‌జెట్‌ను గట్టెక్కించేందుకు దీని అసలు ప్రమోటర్ అజయ్ సింగ్ తెరపైకి రావడంతో అందరికళ్లూ ఇప్పుడు ఆయనపైనే ఉన్నాయి. ఢిల్లీ ఐఐటీలో పట్టాపుచ్చుకున్న సింగ్.. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. పారిశ్రామికవేత్త ఎస్‌కే మోడీకి చెందిన నష్టజాతక మోడీలుఫ్ట్ ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేసిన తర్వాత దీని పేరును స్పైస్‌జెట్‌గా మార్చి.. లాభాలబాట పట్టించారు. దేశంలో ప్రధాన చౌక విమానయాన సంస్థగా తీర్చిదిద్దిన ఘనత అజయ్ సింగ్‌కే దక్కుతుంది. అయితే, 2010లో కంపెనీలో ఇతర ప్రధాన ఇన్వెస్టర్లు తమ వాటాను మారన్‌కు విక్రయిండచంతో యాజమాన్యం చేతులు మారింది. ఇదిలాఉంటే… అధికార బీజీపీ ప్రభుత్వంతో సింగ్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో స్పైస్‌జెట్ ఉదంతం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఎందుకంటే తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం విషయంలో సింగ్ కీలక పాత్ర పోషించారు.

స్పైస్‌జెట్ యాజమాన్యం తమను ఆదుకోవాలంటూ ఎన్నివిజ్ఞప్తులు చేసినా పట్టించుకోని మోదీ సర్కారు.. అజయ్ సింగ్ రంగంలోకి దిగాక ఊరటకల్పించే చర్యలు చేపట్టడం గమనార్హం. మోడీ తో కూడా అజయ్ సింగ్ కి మంచి సంభంధాలు ఉండటం గమనార్హం గుజారత్ ఎన్నికలలో పలు మార్లు మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అప్పటినుండే మోడీ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా స్పైస్‌జెట్‌లో పెట్టుబడులకు ఇది మంచి తరుణమని.. కంపెనీకి మళ్లీ పుంజుకోగల సత్తా ఉందంటూ వ్యాఖ్యానించారుకూడా. దీన్ని బట్టి ఆయన కంపెనీ ని పూర్తిగా తన ఆధీనం లోకి తీసుకోనున్నరనే ఊహాగానాలకు ఊతం ఇచ్చిన వారయ్యారు 2010లో సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్.. స్పైస్‌జెట్ ఇన్వెస్టర్లయిన కన్సాగ్రా, విల్బర్ రాస్ నుంచి 38% వాటాను కొనుగోలు చేయడం తెలిసిందే. ఆతర్వాత ఓపెన్ ఆఫర్ ద్వారా కొంత వాటాను దక్కించుకోవడంతో యాజమాన్యం ఆయన చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం మారన్, సన్‌గ్రూప్‌లకు స్పైస్‌జెట్‌లో 53.48 శాతం వాటా ఉంది.

ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో మైనారిటీ వాటాదారుగా ఉన్న అజయ్ సింగ్‌కు సుమారు 5 శాతం వాటా ఉంది. కాగా, కంపెనీ ఆస్తులు, ఇతరత్రా అంశాలను మదింపుచేసేందుకు 4-6 వారాల వ్యవధి పట్టొచ్చని.. ఆ తర్వాత పెట్టుబడులపై ఇన్వెస్టర్ల నుంచి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే.. మారన్, సన్‌గ్రూప్ వద్దనుంచి యాజమాన్య నియంత్రణ ఇతర ఇన్వెస్టర్లకు వెళ్తుంది. తక్షణావసరం రూ.1,400 కోట్లు… ఇప్పటికిప్పుడు సంస్థకు 1400 కోట్లు అవసరం. కాని ఆ 1400 కోట్లను ఎలా సమకూర్చాలన్నదే అసలు సమస్య… విమానాలను లీజుకిచ్చిన సంస్థలు, ఆయిల్ కంపెనీలు, ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు ఇతరత్రా సంస్థలకు స్పైస్‌జెట్ రూ.1,400 కోట్లమేర బకాయి పడింది. కంపెనీ గట్టెక్కాలంటే తక్షణం ఈ మొత్తం అవసరం. మరో రూ.2,000 కోట్లకుపైగా రుణ భారం కూడా ఉంది. కాగా, స్పైస్‌జెట్‌లో పెట్టుబడుల విషయంలో బడా ఇన్వెస్టర్లతో అజయ్ సింగ్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వాళ్లుగనుక వాటా కొనుగోలు చేస్తే.. యాజమాన్య మార్పిడితో పాటు రుణాల చెల్లింపు బాధ్యతను కూడా తలకెత్తుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా.. విమానయాన సేవలు సజావుగా సాగేందుకు మరిన్ని నిధులను కూడా వెచ్చించాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ(షేర్ల మొత్తం విలువ) రూ.900 కోట్లుగా ఉంది. అప్పట్లో ఒక్కో షేరుకు రూ.48 చొప్పున మారన్ వాటాను కొన్నారు. కంపెనీ కష్టాల నేపథ్యంలో ఇటీవలే రూ.13 స్థాయిని తాకిన షేరు.. తాజాగా అజయ్ సింగ్ స్పైస్ జెట్ పగ్గాలు అందుకోన్నారనే వార్తల నేపథ్యంలో మళ్లీ 16 రూపాయల స్థాయికి కోలుకుంది. ఏది ఏమైనా అజయ్ సింగ్ స్పైస్ జెట్ ని ఆర్ధిక కష్టాల నుండి అలవోకగా బయటకి తీసుకురాగాలడని వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి.

హరికాంత్

ప్రత్యేక కథనం: సినీ రంగులకు, సామాజిక రంగులను అద్దిన అపురూప దర్శకుడు



భారత చలన చిత్ర పరిశ్రమలో ఒక అంకం ముగిసింది. చిత్ర పరిశ్రమకు పితామహుని లాంటి వ్యక్తి, దేశానికే గర్వకారణమైన చిత్రాలు తీసిన వ్యక్తి ఇక సెలవంటూ వెళ్ళిపోయారు. నిజంగా బాలచందర్ మన దేశం గర్వించే ఒక గొప్ప దర్శకుడు., దక్షిణ భారతదేశంలో ఏ భాషను తీసుకున్న, ఏ ప్రాంతాన్ని తీసుకున్న కాని, ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడాయన. కళామతల్లి "తను" లేని కళను ఎలా చూస్తుందో తెలియదు కాని భారత సినీ రంగం మొత్తం తల్లడిల్లే రోజు ఈ రోజు. దక్షిణ భారత సినీ చరిత్రను తీసుకుంటే అది 'ఈ మహా వ్యక్తి' తో మొదలు పెట్టి మళ్ళి 'ఈ మహా వ్యక్తి' తర్వాత అని చెప్పాల్సి వస్తుందంటే నిజంగా ఆశ్చర్య పడక్కర్లేదు. ఇప్పుడున్న 'అగ్ర నటులకు' ఆయనే నటనలో ఓనమాలు దిద్దించింది. ఆయనను ఓ కళలో భాగంగా మనం చూడలేమేమో..! ఎందుకంటే ఆయనే కళకు.., కళ అంటే ఇదనీ నేర్పించిన సృష్టికర్త అంటే అతిశయోక్తి కాదేమో...!!

"నేను ప్రపంచంతో పోట్లాడటం లేదు ప్రపంచమే నాతో పోట్లాడుతుంది.." గౌతమ బుద్దుడు అన్న మాటలు గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి. బాలచందర్ జీవితాన్ని తీసుకుంటే ఈ మాటలు నిజమేమో అనిపిస్తాయి. అందరికి ఆయన ఆలోచనలే, ఆయన జ్ఞాపకాలే.., నిజమే ఆయనేప్పుడు ఎదుటివారితో పోరాడలేదు, పోటి పడనూ లేదు. ఆయనకు పోటీ సాటి మరెవరునూ లేరు. ఆయన ఆలోచనలకు ఆయన ఆలోచనలే పోటి.. అసలు ఆయనకు ఆయనే పోటేమో. ఆయన నిత్య సంఘర్శకుడు. ఆయన ప్రపంచానికి నేనిది అని ఎప్పుడూ చెప్పలేదు.. ఆయనకు ఆయన ఈ ప్రపంచానికి పరిచయం చేసుకోనూలేదు.. ఎందుకంటే ఆయన చిత్రాలే ఆయన ఇది అని ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆయన ప్రపంచానికి సమాధానం చెప్పాలని అనుకున్నప్పుడు కూడా ప్రత్యక్షంగా ఎప్పుడు సమాధానం చెప్పలేదు. తన చిత్రం ద్వారా ఈ ప్రపంచానికి తన జవాబు ఇచ్చాడు. ఒక్కో చిత్రం ఒక్కో సంఘర్షణ. ఒక్కో చిత్రం ఒక్కో సామాజిక బాధ్యత. ఆయన సినిమా తీయాలి అని సినిమా తీయలేదు. 'సినిమాలో ఈ సమాజాన్ని తీయాలని' సినిమా తీసాడు.

ఏ హాలీవుడ్ అని తీసుకున్న,ఏ వుడ్ అని తీసుకున్న., అంతర్జాతీయ ప్రేక్షకులైన, అంతరిక్ష ప్రేక్షకులైన.., ఎవరైనా సరే వారికి ఏ స్టీవెన్ స్పీల్ బర్గో, ఇంకెవరన్నా గొప్పవారు కావచ్చు కాని భారత ప్రేక్షకుల ప్రేమించే మనసులకు మాత్రం బాల చందరే గొప్ప అని గర్వంగా చెప్తారు.., చెప్పగలరు కూడా.. ఎందుకంటే ఏ అనుభవం ఉన్న దర్శకుడైన, ఏ ఆపార జ్ఞానం ఉన్న దర్శకుడైన ఎవరైనా సరే లేని కథను ఉన్నట్లుగా సృష్టించి చిత్రంగా మలచి మన ముందుకు తీసుకురాగలరు కావచ్చు.., కాని బాల చందర్ మాత్రం ఉన్నది ఉన్నట్లుగా.., కళ్ళకు కట్టినట్లుగా చూపించటమే ఆయన ప్రత్యేకత. అవును మరీ.. అదీ నిజమే కదా.. బాల చందర్ ఈ సమాజాన్ని చిత్రంగా మలిచాడు,, సమాజంలో ఉన్న సమస్యలను చిత్రంగా మలిచాడు.., అదీ ఆయన గొప్పతనం.. బాలచందర్ జీవిత గ్రంధాన్ని చదవాలి అంటే మనకు అందులో ఒక పుట చాలేమో.. ఆ పుట ఒక్కటి చాలు చిత్ర రంగం విజయ గర్వంతో పూనీతం కావటానికి... అన్నం ఉడికింది తెలియాలి అంటే ఒక్క మెతుకు పట్ట్టుకుంటే చాలు మనకు తెలిసిపోతుంది అంటారు. మనకు తన జీవితం గురించి తెలుసుకోవాలన్న, ఒక్కసారి ఆయన ప్రతిభా పాటవాల్ని వినాలన్న ఆయన సినిమా ఒక్కటి చాలు. ఒక్కటంటే ఒక్కటి చాలు... ఆయనేంటో మనకు తెలుస్తుంది.

అది భారత దేశం తీవ్ర నిరుద్యోగంతో అల్లాడుతున్న సమయం.. దేశమంతా తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఏ పల్లె వెళ్ళినా కరవు కాటకాలు. పల్లెల్లోనే అలా ఉంటె నగరాల్లో భయంకరమైన దారిద్ర్యం. అప్పుడు తీసుకొచ్చాడు మన 'సామాజిక సినీ కెరటం' బాల చందర్... నిరుద్యోగ భారత దేశాన్ని కళ్ళకు కట్టేలా చూపించిన చిత్రమది.. "ఆకలి రాజ్యం". అందులోని పాత్రది అన్యాయానికి ఎదురొడ్డి నిలిచే విప్లవ కవి అంతరంగం అది... కుల వివక్ష అనే కుళ్ళు ను కడిగి పారేసే ఒక యువకుణి అంతరంగం అది... స్వయం కృషి తో బతకాలనే తపన ఉన్న తరుణిడి అంతరంగం అది.... సమాజానికి ఉపయోగపడాలానే కసి కలిగిన సామాజిక బాధ్యత కలిగిన నవ యువకుడి నిజమైన అంతరంగం అది... అందులో సినిమాను చూపించలేదు... సమాజాన్ని చూపించాడు, మన నిరుద్యోగ భారతాన్ని బంధించాడు. నటులను చూపించలేదు.., నిరుద్యోగం తో సతమవుతున్న నవతరాన్ని చూపించాడు. కాలే కడుపులతో, భగ భగ మండే మనసులతో, మల మల మాడే పనికి రాని మేధస్సుతో, బరువెక్కుతున్న బాధలతో, నిప్పుకణికల్లాంటి నిరుద్యోగ యువతరాన్ని నిజంగా ఈ నింగికి చూపించాడు, 'నేలకూ' చూపించాడు నేటి తరన్నాయిన దారిలో పెడతారని... దేశ రాజధాని నడి బొడ్డున ఆనాటి నవ యవ్వన యువ భారతాన్ని సృష్టించాడు. అదొక సినిమా కాదు చూసి తరించటానికీ, అదొక పాఠం కాదు విని మర్చిపోవటానికీ.. అదొక సందేశం కాదు పుస్తకాల్లో రాసి పెట్టుకొని చూసుకోవటానికీ...., అదొక 'నిజం'...అవును అదొక 'నిజమే'.. విని తట్టుకోగలగాలి. అది సమాజంలో జరుగుతున్న 'నిజం'.. అందుకే నిజాన్ని నిస్సంకోచంగా చూపించాడు. కేవలం చూపించలేదు చూస్తున్న ప్రేక్షకుల చేత కూడా 'నిజమని' అనిపించాడు. అందుకే ఆయన నిజమైన దర్శకుడు, కాదు కాదు నిజమైన గొప్ప దార్శనికుడు...

ఆయన తీసిన ఒక చిత్రంలో(రుద్ర వీణ) గుడి మీదుగా ఆ చిత్రం ప్రారంభమై.., ఒక చిన్నవాడు మడి కట్టుకొని మంత్రాలు జపిస్తూ ఉండటం వల్ల ఒక ముసాలావిడకు సహాయం చేయలేకపోతాడు. అప్పడు అక్కడ ఏ సందేశం వినిపించలేదు. ఒక చిన్న వ్యాఖ్యం మాత్రం మన మదిలో మర్చిపోలేని మంచి మాటగా నిలుస్తుంది. "మనకు రెండు చేతులు ఇచ్చింది ఒకటి నీ కోసం, ఇంకొకటి పక్క వాడి చేయూత కోసం..." అవును మరి ఆయన తన చిత్రం లో ఎప్పుడు 'పక్కా వ్యాపారం' చూడలేదు ఎప్ప్పుడూ 'పక్కవాడి' గురించే చూపించాడు.., పక్కవాడికి ఎలా చేయూతనందించాలో చూపించాడు..., అప్పుడు అక్కడ ఆ క్షణం ఒక చరణం ప్రారంభం అవుతుంది... "చుట్టూ పక్కల చూడరా చిన్నవాడ... చుక్కల్లో నీ చూపు చిక్కుకున్నవాడ...." అవును మరీ ఆయన చిత్రం ద్వారా కేవలం "చిత్రాన్ని" చూపించలేదు.. చుట్టుపక్కల జరుగుతున్న వి"చిత్రాలను" చిత్రాలుగా మలిచి చూపించాడు.

రుద్రవీణ భారత దేశ యువకుల హృదయాలను తాకిన చిత్రమది.., భారతదేశ యువకుల అంతరంగమే ఆత్మ దీపమై ఆత్మ పరిశీలన చేసుకునేలా చేసే చిత్రమది.... "కులమా నీవెక్కడ అంటే కుల్చేస్తాను.... మతమా నీ జాడేక్కడ అంటే మండే జ్వాలగ్నినై మంటలో కలుపుతాను... మానవత్వమా.. అయితే నేనిక్కడ అనే యువకుల హృదయాంతరాల్లో చెరగని ముద్ర వేసుకున్న చిత్రమది...," భారత యువకులను "తామేంటి" అని ఆలోచింపజేసేలా చేసిన చిత్రమది... ఉడుకు రక్తం ఎగసి పడే యువకులను.., నువ్వు మందు కొట్టి తాగి పడేసే సీసాలో నీ రక్తాన్ని ఎగసి పడనివ్వకు.., నువ్వు గమ్ము గా తాగే దమ్ము పీలుస్తున్న పొగ లో నీ రక్తం వృధా కానివ్వకు.. నీ రక్తం ఉవ్వెత్తున ఎగసి పడాల్సింది భారత దేశ పల్లెల్లో.., వారి ఇళ్ళల్లో.., ఇళ్ళ గడపల్లో... అని, నేటి యువకుని చెంప చెల్ల్లుమనిపించేలా చేసిన చిత్రమది.... ఆవేశం ఎగసి పడాల్సింది, ఎక్కడో కాదు.., పేదరికాన్ని శాశ్వతంగా తమ ఇంట్లో ఉంచి ఆ పేదరికం తోనే పెరిగి, తమ తదుపరి తరాన్ని మళ్ళి ఆపేదరికం తోనే పెంచుతున్న కడు పేదలను పేదరికం అనుభవించేలా చేస్తున్న ఆ "పేదరికం గుండెల్లో" నీ ఆవేశం ఎగసిపడాలి అని నవతరం నరనరాలు ఉప్పొంగి ఉత్తేజపూరితమయ్యేలా చేసిన చిత్రమది....

ఈ రెండు మెతుకులు చాలదా ఆయనేంటో అర్దమవటానికి..., ఈ రెండు ఆణిముత్యాలు చాలదా ఆయన బ్రతుకు అనే బంగారు"చంద"నంలోని జీవిత సుగంధపు పరిమళాలు ఆస్వాదించటానికి.., ఇంకా ఏమని వర్ణించేది ఆయన గురించి.. ఒకటా రెండా ఎన్నో ఆణిముత్యాలు.., సినీ వినీలాకాశంలో ధృవతారల్ల వెలిగే సుదరమైన చిత్రాలు... ఆయన గురించి మనం మాట్లాడుకునే ఈ నాలుగు మాటలు సరిపోతాయా.... ఆయన ఆలోచన ఆకాశం, ఆయన బాట అనుసరణీయం, ఆయన పలుకులు అద్భుతం, ఆయన భావాలు ఆశ్చర్యం, ఆయన చేతలు ఆదర్శం, ఆయన చిత్రాలు అపూర్వం... లెక్క లేనన్ని అవార్డు లు అందుకున్న ఆయనకి భారతదేశ కళారంగం ఏమిచ్చి అతని రుణం తీర్చుకోగలదు. అతని కళా హృదయాన్ని అందరి మనస్సులో నిక్షిప్తం చేయటం తప్ప... ఒక మహా కవి అన్న మాటలు మదిలో స్పూరణకు వచ్చాయి... మనం మనంగా ఈ లోకానికి కనిపించాలి.., మన మాటలు మనంగా ఈ లోకానికి ప్రతిద్వనింపజేయాలి..... అవును మరీ బాల చందర్ "అతడు అతనిగానే ఈ లోకానికి పరిచయం చేసుకున్నాడు... అతడు అతడిగానే ఈ లోకానికి కనిపించాడు.. అతడు అతడు గానే ఈ లోకం నుండి వీడ్కోలు తీసుకున్నాడు... దక్షిణ భారత దేశ సినీ ప్రపంచానికి తన జీవితమనే అధ్యాయాన్ని అంకితమిచ్చిన గొప్ప దర్శకుడికి బాధాతప్త హృదయంతో.... అశ్రు నివాళి!!

హరికాంత్

అబ్బాయి-అమ్మాయి చిన్న ప్రేమ కథ....

సరదాగా చిన్న ప్రేమ కథ...

బంధాలు భవబంధాలు అనుబంధాలు కొన్ని సార్లు విచిత్రంగా అనిపిస్తాయి... దగ్గరగా ఉన్న దూరంగా ఉంటాయి. దూరాన్ని తగ్గించేకొలది దగ్గర దూరమవుతుంది... మనిషి ఈ స్వార్థపు నీడ నుండి దూరం జరిగే వరకు అనుభంధాలు కనుమరుగవుతూనే ఉంటాయి. ‪రూపాయి‬ వెనకే ఉండే మరో రూపం 'మని'షి.... అవును మరీ మనిషి ఎప్పుడూ రూపాయి కోసం పరుగెత్తే నేటి సమాజంలో మనిషి ఒక యాంత్రికమైన వస్తువే అంటే అతిశయోక్తి కాదేమో...  కానీ ఆ మనిషి అనే వస్తువుకు కూడా ఎదో 'ఒక బంధం' మరువలేని "అనుబంధంగా" మిగిలిపోతుంది. ఒక మంచి బంధం అంటే ఆడపిల్ల గురించే చెప్పుకోవాలేమో...!! అవును మరి ఆడపిల్లలకు అనురాగం విలువ తెలిస్తుంది, ఆప్యాయత విలువ తెలుస్తుంది.., ఆ ఆడపిల్ల ఉన్నచోట అనుభంధాలు ఉంటాయి.. ఆడపిల్ల ఉన్నచోట ఆనందం ఉంటుంది. అసలు ఆడపిల్ల అంటేనే ఆనందం... ఆడపిల్లను ఆనందాన్ని వేరుగా చేసి చూడలేమేమో!! తను ఉన్న చోట ఆహ్లాదం ఉంటుంది. హాస్యం ఉంటుంది... వెన్నెల వెలుగుల్లాంటి చిరునవ్వులుంటాయి...ఆ చిరునవ్వుని గుర్తు చేసుకుంటే మనకి చిమ్మని చీకట్లో కూడా మిరుమిట్లు కొలిపే కాంతి కనిపిస్తుంది...
తన ముద్దు ఒక వరం.. మనల్ని "ఎక్కడికో" తీసుకుపోయే "ఒక్క చూపు" ఎన్నో జన్మల పుణ్య ఫలం.. తనో వర్షపు చుక్క...వర్షం వస్తుందనగానే సంతోషంతో ఒళ్ళు ఎలా పరవశిస్తుందో ఆడపిల్ల అనగానే పెదాలపై చిరునవ్వు తొణికిసలాడుతుంది.. ఈ పుడమి ఇంకా మన భారాన్ని మోస్తుంది అంటే దానికి కారణం పడతి. రెండిళ్ళకు వారధైన ఆడపిల్ల ఈ లోకానికి శ్రీరామ రక్ష.... అలాంటి ఆడపిల్ల ఒకేసారి తన సకల కళలు చూపిస్తే, కోపం, బాధ, సంతోషం, కన్నీరు, భయం, ప్రేమ,  అన్ని ఒకేదగ్గర చూసే అదృష్టం కలిగితే.....

స్థలం: ఢిల్లీ...,

అది ఢిల్లీలోని ఒక ప్రధాన వాణిజ్య స్థలం.., బిజీ బిజీ నగరం, బిజీ బిజీ బ్రతుకులు.., ఒక్కసారి ప్రపంచం ఆగిపోతే బాగుండని ప్రతి మనిషికి అనిపిస్తుంది. ఒక అబ్బాయి.... ఒక అమ్మాయి... వారిద్దరిని అతిదగ్గరగా పరిశీలించిన మరో అబ్బాయి. అతని భావ వ్యక్తీకరణలో ఆ అబ్బాయి అమ్మాయి గురించి ఒక్కసారి, ఒక్క క్షణం, కొన్ని మాటలు....

ఒక అబ్బాయి ఒక వ్యక్తిగత పని మీద ఒక కార్యాలయంలో పని ముగించుకొని వేరే పనిపై స్నేహితుని కోసం ఒక ప్రధాన కేంద్రం దగ్గర ఎదురు చూస్తున్నాడు. చాలా సేపు అక్కడ ఎదురు చూసిన అతనికి విసుగొస్తున్న సమయంలో.., అతని చరవాణికి తన స్నేహితుని నుండి కాల్ వచ్చింది...  అతని స్నేహితుడికి  కొంచెం ఆలస్యం అవుతుందని వేచి చూడకుండా భోజనం చేయమని దాని సారాంశం... యధావిధిగా ఒక నిట్టుర్పు విడ్చి అతను అన్న 'భోజనం' అనే మాట వీనులవిందు గానే ఉన్నప్పటికి అంత భోజనం అనే పదానికి సరితూగే పదార్థాలు అక్కడ (మళ్ళి ఢిల్లీ వంటి మహా నగరంలో ఎక్కడని వెతుకుతాడు) ఏమి దొరకవు కావున ఎప్పటిలాగానే ఇన్ స్టాంట్ ఫుడ్ కోసం వెతికాడు. గత 3 సంవత్సరాలుగా అతని  కష్ట సుఖాల్లో, అతని లాభ నష్టాల బేరిజులతో... అతని వాణిజ్య విషయాల్లో చేదోడు వాదోడుగ నిల్చినటువంటి KFC వైపుకు అతని మనసు మళ్ళింది. దగ్గరలోనే ఉండటం వల్ల తొందరగా వెళ్లి అతడు ఎప్పుడూ ఇచ్చే ఆర్డర్ ఇచ్చి తీసుకొని వచ్చి హాయీగ నింపాదిగా ఒక మంచి స్థలం చూసుకొని కూచున్నాడు....అ అబ్బాయి అంత అమాయకుడు కాదేమో ఎందుకంటే అమ్మాయిలందరూ కూర్చొనే దగ్గర వచ్చి వారిని చూస్తూ ఇటు తన తిండిని, అటు అమ్మాయిలను చూస్తూ నయనానందం పొందుతున్నాడు......

అంతలో ఒక జంట... ఆ జంటను వర్ణించాలంటే మాటలు చాలవు... పదాలు ఏరులై..,సిరిపువ్వులై పారాలి... అంత అద్బుతంగా ఉన్న ఆ  ప్రేమ జంట.....,

ప్రేమ పక్షులకు ప్రతి రూపమైన ఆ జంట సరిగ్గా అతని ముందు టేబుల్లో కూర్చొని ఉండటంతో పరిశీలనగా చూసాడు.... ఇద్దరు మౌనంగా కూర్చొని ఉండటం గమనించాడు. వాళ్ళిద్దరికీ ఏదో గొడవ జరిగిందని వారి మొహంలో హావ భావాలను చూస్తే అతనికి అర్థమైంది... అలా ఒక్క పది నిమిషాల తర్వాత..

కాసేపు ఆ జంట అలా ఉన్న తర్వాత ఆ అ జంట లోని అబ్బాయి, అమ్మాయి చేతిను పట్టుకొని క్షమించమని అడిగాడు.., ఆ అమ్మాయి ఒక్కసారిగా చేతు విసిరి కొట్టింది.. తర్వాత ఆ అబ్బాయి పట్టు వదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు... ఈ ప్రయత్న సందర్భంలో కొంచెం సేపు రోజులో అదో భాగం అన్నట్లుగా కంట కన్నీరు పెట్టింది. ఏదో ఒక విధంగా తన కష్టాలు తను పడి ఆ అమ్మాయిని శాంతింపజేశాడు... తర్వాత ఇంకా నోటికి రెండు విధాల పని చెప్పటం స్టార్ట్ చేసింది... ఒక విధంగా తిండితో మరో విధంగా వినేవాడు ఉంటె పుష్కర కాలమైన ఇంకా మెదడులో చెప్పాల్సినవి ఇంకా ఏవో మిగిలిపోయాయి అన్నట్లుగా ఉండే తన మాటలతో ఆ అబ్బాయిని ఆ భయంకరమైన వాగుడితో హూరేత్తిస్తుంది. మధ్యలో ఏదో కుర్చీ పడి పెద్ద శబ్దం వస్తే ఉలిక్కిపడి ఇదిగో "రా" అని తెచ్చుకున్న "భయాన్ని" ఆ అబ్బాయి చేతు పట్టుకొని చూపించింది. (ఇంతకు మించి వాఖ్యలు చేస్తే ఇక్కడ మా తెలుగు విశేష్ సెన్సార్ ఒప్పుకోదేమో..!) ఆ భయం నుంచి తెరుకున్నట్టుగా ఆమె కి అనిపించి తేరుకొని మల్లి తనకు మాత్రమే వర్తించే వారసత్వపు హక్కుగా తన వాగుడు ప్రవాహాన్ని కొనసాగించింది.. మధ్య మధ్యలో కొనుక్కుని తెచ్చుకున్న నవ్వుతో ఆ అబ్బాయి కొన్ని వింటున్నాడు. కొన్ని విన్నట్టుగా నటిస్తున్నాడు. మాటల మధ్యలో ఆ అబ్బాయి ఏదో బాగుంది కదాని ఎవరో అమ్మాయి వైపు చూసి చూడనట్టుగా చూస్తే అది గమనించి, ఆమె ఆవేశంగా ఒక్క చూపు చూస్తే ఆ చూపుతోనే సగం చచ్చాడు ఆ అబ్బాయి. మల్లి యధా విధిగా ఒక సారీ అనే పదాన్ని తన దగ్గర అయిపోయి పక్క వాళ్ళ దగ్గర అరువు తీసుకోచినట్టుగా చెప్పాడు... మల్లి యధావిధి గానే ఒక "చిన్న నవ్వు" నవ్వింది... తను ఇచ్చే నవ్వుతో ఈ ప్రపంచాన్నే కోనేయచ్చాన్న ధీమా ఆ అబ్బాయిలో కల్పించి లేచింది. వెంటనే ఆ అబ్బాయి కూడా తన చేతు అందుకొని కూడా వెళ్ళిపోయాడు.

నిజంగా ఈ అనంత విశ్వం లో ముందుగా ఆడజీవే పుట్టిందని అనటానికి ఆధారాలు లేకపోయినప్పటికీ నేటి ఆధునిక ఆడపిల్లను చూసే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడెమో అనిపిస్తుంది. ఒక్క రోజులో కాదు కాదు ఒక్క గంటలో కాదు కాదు ఒక్క సెకన్ లో నవరసాలు చూపించగల గొప్ప నైపుణ్యం నేటి ఆధునిక యువతీలో తప్ప ఎక్కడ చూడగలం అని మనసులో ఒక చిన్నమూలన దాచిపెట్టుకున్న భావాన్ని అణగదొక్కి ఢిల్లీ లో ఆ జంట ను చూసిన ఆ అబ్బాయి అతని స్నేహితుని కాల్ రాగానే హడావుడిగా లేచి అతని వ్యక్తిగత పని గుర్తొచ్చి ఈ రోజు ఏదో కొత్త విషయం కనుక్కున్న ధీరుడిలా అతనికి అతడే ఫీల్ అయిపోతు పని అనే చట్ర బంధంలో ఇరుక్కోటానికి బయలుదేరాడు.... మళ్ళి ఈ బిజీ బ్రతుకుల ప్రపంచంలో బిజీ బిజీగా గడపటానికి.....  

హరికాంత్

బద్దకిస్తే ఓడిపోతావ్.. బలం తెచ్చుకో గెలుస్తావ్..!


ఈ సృష్టిలో మనమెంత.., ఈ విశ్వంలో ఈ సృష్టి ఎంత..., అనంత ఖగోళ రాశుల్లో విశ్వమెంత...! ఒక మహానుభావుని మాటలు గుర్తొచ్చాయి. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, ఏదైనా మొదలుపెట్టాలనుకున్నప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నేను అది సాధించగలనా.., నేనది చేయగలనా... నేనది ఆచరించగలనా అని. అందుకే ఆ మహానుభావుడు అలా అన్నాడు. ఏదైనా సాధించాలనుకున్నపుడు మనకు ఆ సాధించాలనుకున్నదే, ఆ చెయ్యాలనుకున్నదే చాలా పెద్దదిగా కనబడుతుంది. మనిషి స్వభావమే అంతేమో..!

మహానది బిందువు తోనే ఆరంభమవుతుంది. ఒక బిందువే సమస్త విశ్వంగా విస్తరిస్తుంది. తల్లి కడుపులో బిడ్డ ఒక బిందువు గానే ఉత్పన్నమవుతుంది. మొదట వేసిన ఒక అడుగే వేలాది అడుగులుగా మారి గమ్యాన్ని నిర్ణయిస్తుంది. మనిషి కుచించుకొని ఉన్నప్పుడు "నేను" అనే చిన్న పరిధి లో ఉంటాడు. ముందు "నేను నాది" లోంచి విస్తరిస్తూ "మనం మనదిగా" విస్తృతమై మన లోంచి మనం అనే లోకాన్ని జయించి.., నేను నా అనే సువిశాల నిజ అనంతంలోకి, ఏకత్వంలోకి లయం చేస్తూ ఆత్మ భావం లో స్థిరపడిపోవాలి.

మనం మన గదిలో ఉన్నప్పుడు "నా గది" అంటాము మన కుటుంబీకులతో.., పక్కింటి వాళ్ళతో "మా ఇల్లు" అంటాము.., అలాగే ఊరు వరకి వచ్చేవరకు మా ఊరు అంటాము. ఇలా ఊరు, దేశం, ప్రపంచం సంకుచితత్వాన్ని వదిలిపెడితే సర్వం మనదే అన్న భావంలో లీనమైపోతాం.

మన శరీరానికి జబ్బు చేస్తే మనమే చికిత్స తీసుకుంటాం. ఎవరో చేయించాలనో, ఎవరో రావాలనో సాధారణంగా ఆశించం. సమాజానికి అంతేనేమో. ఈ సమాజం మనది. ఎం చేసినా మనమే చేయాలి. ఈ సువిశాల విశ్వం, ఈ ప్రపంచంలో ఇందులో నేనెంత...? అని అనుకుంటాం. కాని ఒక అణువే అణుబాంబు అవుతుంది. ఒక చిన్న చిట్టెలుక ఒక కొండ ను త్రవ్వగలదు. కాళ్ళు చేతులు లేని ఒక చిన్న చేప సముద్రాన్ని ఈద గలదు. ఒక చిన్న పక్షి ఆకాశాన్నే ఏలగలదు.

ఎవరైనా, ఎంత మందైన మనకు తోడుగా ఉండని మంచిదే.. కానీ ఎవరి సహకారమైన మనం ఎందుకు ఆశించాలి..? వాళ్ళ వెన్ను దన్ను కోసం మనం బెరుగ్గా ఎందుకు ఎదురు చూడాలి. మన శక్తి, మన మనో ధైర్యం, మన మనో స్థైర్యం మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు సాగటం ప్రారంభిస్తే మనం నడిచే దారి మంచిదైతే, గమ్యం సరైనదైతే.., మన వెనక అడుగుల చప్పుడు మనకు వినబడుతుంది. మన గుండె చప్పుడులో కలిసిపోతుంది. నేడు లోకంలో ఎంతో స్వార్థం, దౌర్జన్యం, దౌష్ట్యం, అవినీతి, అన్యాయం, కష్టాలు, కన్నీళ్ళు...., మనదైన ఈ లోకాన్ని, ఈ దేశాన్ని క్షేమంగా సౌకర్యవంతంగా ఉండేలా మనమెందుకు ప్రయత్నించకూడదు. అందుకు కావాల్సింది "ఉక్కు పిడికిలి.., ఒక బలమైన ఆలోచన సంకల్పం".

చివరగా నాలుగు మాటలు:
బద్దకిస్తే ఓడిపోతావు
బలం తెచ్చుకో గెలుస్తావు
భయపడితే కుచించుకుపోతావు
పోరాడు విశాలమవుతావు


హరికాంత్