Saturday 31 January 2015

గాంధీ వర్ధంతి సందర్భంగా…ఆయన చూపిన బాటను గుర్తు చేస్తూ...అనుసరిస్తూ…



జనవరి ౩౦ గాంధీ వర్ధంతి సందర్భంగా, గాంధీ భావాలను మననం చేసుకుంటూ…. ఆయన చూపిన బాటను గుర్తు చేస్తూ….

ఆకలితో మల మల మాడే కడుపులు.. ఆ కాలే కడుపులకు ఇదిగో తినండి మేము ఇస్తున్నాం ఉచిత నాలుగు బియ్యం రాళ్ళు అని చెప్పి ప్రజలని ఇంకా దౌర్భాగ్య స్థితి లోకి నెడుతున్న ప్రభుత్వాలు… దాహం తో గొంతు ఎండుకుపోయే పల్లెలు… ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురుచూసే గ్రామీణ అమాయకపు ప్రజలు… కనీసం చదువుతో అయిన మా జీవితాల్లో మా కుటుంబాల్లో వెలుగు నింపుకొందామంటే ఆ చదువులతోనే వ్యాపారాలు.. కుల వృత్తుల్లేవు, వ్యాపారల్లేవు, ఉద్యోగాల్లేవు, ఉపాధి లేదు ఇదా మనకు గాంధీజీ స్వతంత్ర పోరాటం నుండి ఇచ్చింది మనకు దాన్నుండి వచ్చింది… కొందరు యువకుల హృదయంతరాల్లో మెదలుతున్న ప్రశ్న ఇది…. ఉదయం నుండి గాంధీ భావాలు అందరికి మనసులో మెదలుతూనే ఉన్నాయి. ఆయన సిద్దాంతాలు ఆ భావనలు ప్రతి నిమిషం గుర్తొస్తున్నాయి. ఏ దేశమైన ఒక క్రొత్త ఆయుదాన్ని తయారు చేసుకొని తన అమ్ముల పొదిలో వేసుకొని ప్రపంచ దేశాల ద్రుష్టి ని ఆకర్షిద్దామా అని చూస్తున్న రోజుల్లో “శాంతి అహింస” అనే సరిక్రొత్త ఆయుధాలని సృష్టించి ఎన్నో దేశాలకు ఆదర్శ ప్రాయుడయ్యాడు మన బాపూజీ…..

ప్రజాస్వామ్య పథం లో ప్రవేశిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతుంది. కాని పాలనాధికారం మాత్రం కొందరికే పరిమితం అవుతుంది.

సమాచార విప్లవం సాకారమైంది… కాని సామజిక సంబందాలు విచ్చిన్నమవుతున్నాయి

అక్షరాస్యుల సంఖ్య అధికమవుతుంది… కానీ సమాచార సాంకేతిక విజ్ఞానం ఇంకా కొందరి చేతుల్లోనే ఉంది.

నియంత్రుత్వాలు కూలిపోతున్నాయి కాని నిరంకుశ ధోరణులు పెరిగిపోతున్నాయి.

వ్యక్తి ప్రయోజనాలకి, సమాజ లక్ష్యాలకు మద్య ఏర్పడుతున్న భయంకర వైరుధ్యాలివి. సత్యం అహింస లే ప్రాణంగా జీవించి వందల కోట్ల ప్రజానీకాన్ని శాసించిన మహాత్ముడు ప్రభవించిన నా భారత ఖండం ఇప్పుడు హింసోన్మాదంలో కొట్టుకుపోతుంది. స్వతంత్రం తరువాత భారత్ అహింస నుండి అణుబాంబు కి దగ్గరైంది. రాజకీయాలు విషపూరితమయ్యాయి. దాడులు ప్రతీకార దాడులు హత్యలు మానభంగాలు లాంటి హింసాత్మక సమాజం లో నివసిస్తున్నాం మనం. ఎందుకిలా జరుగుతుంది? ఆయుధమే సమాధానమని భావించే వర్గాలు పెరిగిపోతున్న ఈ సమాజం లో బ్రతుక్కి చావుకి మద్య అంతరం తగ్గిపోతుంది. నిజానికి ఈ తరహ సమాజాన్ని ఎలా సంస్కరించుకోవటం అనేదే పెద్ద సమస్య. సమాజం లో మార్పు ని తీసుకురావటం కోసం ప్రజలందరినీ ఒకే తాటి ఫై నడిపించటం ఎలానో … వారి మద్య సంఘీభావాన్ని పెంచటం ఎలానో… ఆచరణాత్మకంగా రుజువు చేసారు మన బాపూజీ. ఆయన భావాలూ విశ్వమంతా విశాలమైనవి. ఒక రుషిగా, విప్లవవాదిగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, తాత్వికుడిగా, విద్యావేత్తగా, సత్యగ్రహిగా, అహింస వాదిగా, ఆదర్శవాదిగా ఆయనది బహుముఖ విన్యాసం. నైతిక విలువలు, సత్య నిబద్దత, సహనం వంటి విలువలకు విలువ లేకుండా అవి వట్టి భావనలుగా పరిగణిస్తున్న క్రొత్త తరం ఇప్పుడు కనిపిస్తుంది. డబ్బు తప్ప మరేది అంత విలువైనది కాదనే అసహజ సిద్దంతాలు పుట్టుకొస్తున్నాయి. ఇది ఎంతో ప్రమాదకర ధోరణి. మన సమాజం లో అత్యధికులు హింస, అహింసలలో దేని వైపు మొగ్గు చూపుతారని అడిగితే వచ్చే సమాధానం సుస్పష్టం. మనిషి మనిషి గా బ్రతకటం కోసం మార్గాన్ని వెతుక్కుంటున్న ఈ సమయం లో కొందరికి గుర్తున్నది…. ఇంకొందరికి గుర్తుకు రావాల్సింది గాంధిజీయే. నేటి గాడి తప్పిన వ్యవస్థలన్నిటికి పరిష్కారమే గాంధి మార్గం. ఈ మార్గం సమస్యలు సృష్టించే మార్గం కాదు శాశ్వతమైన పరిష్కారాలు చూపే మార్గం. ఈ మార్గాన్ని ఎన్నో దేశాలు అనుసరిస్తున్నాయి.. కాని మనం ఎంతవరకు ఆచరిస్తున్నామన్నదే ప్రశ్న.

ఆగష్టు 15 1947 గాంధీ పోరాట ఫలితం, ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం వల్ల బ్రిటిష్ వారు మనకు స్వేచ్చని ఇచ్చి స్వతంత్రం ప్రసాదించారు.. ఆ రోజు రెడ్ ఫోర్టులో తొలిసారిగా భారత మొట్ట మొదటి ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రు గారి చేతుల మీదుగా త్రివర్ణ పతాకం రెప రెప లాడింది. సకల భారతావని సంతోషించింది. ఆ రోజు స్వతంత్ర సమరయోధులు భావించింది వేరు, ఈ రోజు మనం ఆచరిస్తున్నది వేరు. సరిగ్గా 67 సంవత్సరాలు గడిచిపోయాయి. అనుకున్న లక్ష్యాలను ఇంకా అధిగమించలేక పోతున్నాం. లోపం ఎక్కడుంది పాలకులలోనా..?! ప్రజలలోనా ..?!! సమాచార విప్లవం సాకారమైంది కాని సామాజిక సంబంధాలు విచ్చిన్నమవుతున్నాయి. అక్షరాస్యుల సంఖ్య అధికం అవుతుంది కాని సమాచార సాంకేతిక విజ్ఞానం ఇంకా కొందరి చేతుల్లోనే ఉంది. గణాంకాల రిత్యా దారిద్రం తగ్గుతుంది కాని ఇతరులతో పోల్చుకొని పేదలమని కుమిలిపోయే వారి సంఖ్య పెరుగుతుంది. నియంత్ర్రుత్వాలు కూలిపోతున్నాయి కాని నిరంకుశ ధోరణులు పెరుగుతున్నాయి.

అందుకే పేదరికం, నిరుద్యోగం, ఆకలి, అలక్ష్యం, అవినీతి, అభద్రత ల బరువుని భరించలేక మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నానాటికి పెరిగి కుంగిపోతుంది. ఇలా ఎంత కాలం..?? మనకు మనం ప్రశ్నించుకోవలసిన ప్రశ్న. స్వతంత్రం తర్వాత భారత దేశం అహింస నుండి అణుబాంబుకి దగ్గరైంది. రాజకీయాలు విషపూరితమయ్యాయి. దాడులు ప్రతిదాడులు హత్యలు ఆత్మహత్యలు మానభంగాలతో కూడిన హింసాత్మక సమాజంలో మనం నివసిస్తున్నాం. దేశ జనాభాలో సగం మంది ఉన్న యువత ఇప్పటికైనా మేల్కొనాలి.. మేధావుల అభిప్రాయం ప్రకారం మొత్తం పాలనా వ్యవస్థ లోనే సుపరిపాలన విధానాల అమలుకు నడుముకు అందరు నడుము బిగించాలి. దైనందిన జీవితం లో సగటు సామాన్య పౌరుడికి ఆ మార్పు స్పష్టంగా కనపడాలి. బడిలో చదువు బాగా చెప్పాలి. అంటే ఉపాధ్యాయుల కొరత తీరాలి. బడి సమస్యలు పోవాలి. నిరుద్యోగ సమస్యని పారద్రోలాలి. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో డాక్టర్లు మందులు అందుబాటులో ఉండాలి. వాహన సంచారానికి అనువుగా గతుకులు లేని రహదారులు కావాలి. త్రాగునీరు తో మురుగునీరు కలవని నీటి వ్యవస్థలు రూపొందాలి. సేవల కోసం వచ్చిన ప్రజలకి సిబ్బంది నుండి గౌరవం దక్కాలి. విద్యుత్ కోతలు పోవాలి. దోపిడీ దొంగతనాలు జరగని వ్యవస్థ కావాలి. భద్రత విషయంలో భరోసా ఇచ్చే పోలీస్ వ్యవస్థ కావాలి. అన్నింటిని మించి రాజకీయ నాయకులు ఎటువంటి పోలీస్ రక్షణ లేకుండా నిర్బయంగా తిరగగలిగే సువ్యవస్థ ఆవిష్కృతం కావాలి. సుపరిపాలన స్వపరిపాలనకు ఏనాటికి ప్రత్యామ్నాయం కాలేదని నినదించి, బ్రిటిష్ వారిని ఎదిరించి.. పోరి తెచ్చుకున్న స్వాతంత్రానికి నిజమైన అర్ధం కల్పించగల నిబద్ధత కలిగిన నాయకులు “మంచి నాయకులు” మన దేశానికి అవసరం..! గాంధీ చూపిన బాటను అనుసరించి అమలు చేసే మంచి నేతలు మన దేశానికి అత్యవసరం…!! ఈ రోజు గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చూపిన బాటను అనుసరిస్తూ, అమలుచేస్తూ..... 

హరికాంత్ 

No comments:

Post a Comment