Saturday 31 January 2015

ఈ సంవత్సరం 2015 క్రొత్తగా సరిక్రొత్తగా......


గడుస్తున్న ఒక్కో సంవత్సరం ఒక్కో జ్ఞాపకం. ఈ సంవత్సరంలో కొన్ని తీపి జ్ఞాపకాలు కొన్ని చేదు జ్ఞాపకాలు... ఒక సంఘటనేమో సంతోషాన్ని సగటు సాటి మనిషి తో పంచుకొని ఆకాశమంత ఎత్తుకు దూకి అంతరిక్షమంత ఆనందాన్ని పంచుకునేదయితే ఇంకో సంఘటన అవని అంత దిక్కులు పిక్కేటేల్ల్లల అరచినా కాని ఆ ఆవేదన తీరనిది.  ఒక క్షణాన్ని పోగొట్టుకుంటే వెతుక్కోవటానికి జీవిత కాలం పడుతుంది. ఒక జ్ఞాపకాన్ని దాచుకుంటే వదిలించుకోవటానికి జీవిత కాలం పడుతుంది. అలాంటి క్షణాలు ఎన్నో, అలాంటి జ్ఞాపకాలు మరెన్నో..  మనసులో మర్చిపోలేని మధురానుభూతులు కొన్నైతే.., మరికొన్ని విషాదాన్ని తోడుగా చేసుకొని వీడ్కోలు పలకాల్సిన విచార క్షణాలు. అవన్నీ గతించిన క్షణాలు. మన జీవితమనే క్యాలెండర్ లో ఒక తిరిగిపోలేని ఒక పుటను తిప్పేయాల్సిన సమయం 'తిరిగి' రానే వచ్చింది. ఇప్పుడో కొత్త పుట......

మరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం.., నూతనంగా, వినూత్నంగా.., ఈ సంవత్సరం కూడా ఎన్నో సంఘటనల సమాహారంగా సిద్దమై మన కోసం వేచి చూస్తుంది....గడిచిన సంవత్సరంలో ఎన్నో ఎదురుదెబ్బలను ఎదుర్కొని, మరెన్నో విజయాలనే తీపి జ్ఞాపకాలను  సైతం చవి చూసిన మనకు రాబోయే ఈ సరి క్రొత్త కాలం ఇంకొన్ని ఘటనలకు వేదిక కాబోతుంది.  కాని ఒకానొక సమయంలో ఏదోక వ్యక్తికి ఎదో గడిచిపోయింది కాలం., కాలం వెళ్తుంది కాలం తో పాటు మనమూ వెళ్తున్నామనే నిరాశ  నిస్పృహలు నిండిన వారూ లేకపోలేదు.., అలాంటి వారికి కాలమే అవరోధంగా కనబడుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలేమో మనం...... మనం ఎదిగే  కొద్ది ప్రారంభంలో అన్ని అవరోధాలుగానే కనిపిస్తాయి కాని ఎదిగిన తర్వాత అవన్నీ అనుభవాలుగా ఉపయోగపడతాయి.... అవి కాలంతో అయిననూ, కాలం వాళ్ళ కలిగిన వివిధ సంఘటనల వల్ల అయిననూ.., అనుభవాలు మనిషికి అవరోధాల నుండి అవలీలగా బయట పడేసే అధిరోహిణిలుగా ఉపయోగపడి మనిషి ఆకాశమనే గమ్యానికి చేరువవుతాడు. అలాంటి గమ్యానికి ఈ సంవత్సరం చేరువ కావాలని......

జీవిత లక్ష్యం కేవలం జీవించటం కాదు ఉన్నతంగా జీవించటం, అంటే అది హోదా పరంగానో, డబ్బు పరంగానో కాదు, మన వ్యక్తిత్వ పరంగా ఉన్నతంగా జీవించటం. ఉన్నతంగా జీవించాలంటే అచంచలమైన ఆత్మ విశ్వాసం కావాలి. తనకు తన మీద విశ్వాసం లేని వాడు ఇతరులను, సమాజాన్ని విశ్వసించడు. తద్వారా ఇతరులను నమ్మడు. మనిషి ఇతరులను నమ్మిన, నమ్మకపోయినా ఈ ప్రపంచం నడిచేది కేవలం నమ్మకం పైనే. కాకపోతే "మనిషి ఉన్నతంగా ఎదగటానికి ఈ ప్రపంచం కావాలి. తాను ఉన్నతంగా ఎదిగాక ఈ ప్రపంచానికి తాను కావాలి", అలాగే జీవితంలో ఎదిగాక గెలుపూ చేరువవుతుంది. అలాగని గెలుపే జీవితం కాదు. జీవితంలో గెలుపోక భాగం... అదొక అనుభూతి.. గెలుపంటే రాజ్యాలు జయించక్కర్లేదు. కోట్లు సంపాదించక్కర్లేదు. మార్కులు, ర్యాంకులు సాధించక్కర్లేదు.., గెలుపంటే మానవత్వం, గెలుపంటే  మళ్ళి ఉన్నతమైన వ్యక్తిత్వం, గెలుపంటే ఇతరుల్లో చెడును కాదు మంచిని చూడటం... అదే గెలుపు.  ఆ గెలుపును, అలాంటి గెలుపును ఈ సంవత్సరంలో పొందాలని.....

మన జీవితంలో ఒక్కోసారి పడిపోనూ వచ్చు.. పడిపోవటం ఎప్పుడూ ఓడిపోవటం కాదు. నువ్వు పైకి లేస్తుంటే విజయం నీకు దగ్గర అవుతుంది. ఆ విజయ పథంలో గాయాలు అనివార్యం. బలహీనుడు గాయాలకు భయపడి రంగం నుండి తప్పుకుంటాడు. బలవంతుడు గాయాల నుండి పాఠాలు నేర్చుకొని ధైర్యంగా ముందుకు వెళతాడు. ఒక సగటు యువకుడు చేసేది కూడా అదే.., అర్రే యువకుడు యువకుడు అంటారు, మన దేశ ప్రధానమంత్రి యువకులే అంటారు.., వ్యాపార వేత్తలు యువకులే అంటారు. ప్రతి వ్యక్తి పాతికేళ్ళ పడుసోనివి నీకేంట్రా అంటారు.. మరి యువకున్ని చూస్తేనేమో నీరు గారి పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. మరసలు ఆ యువకునిలో ఏముంది...??  ఆ యువకునికే తెలియని శక్తి ఆ యువకునిలో ఎందుకుంది..? అవును మరీ ఆ  యువకునిలో ఆకాశానికి నిచ్చెనలు వేయగల దమ్ముంది. కలలు కనే స్వేఛ్చ ఉంది. 'కిరణా'లని కెరటాలని అరచేత్తో అదిమి పట్టగల బలముంది.  ఒక యువకుడు తన యవ్వన కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటాడు.... కిందపడతాడు, లేచి ప్రయాణం సాగిస్తాడు.. మళ్ళీ పడతాడు.. నిజానికి పడ్డదే ఎక్కువ ఉంటుంది. అయితే అన్నాళ్ళ ఆ యువకుని ప్రయాణంలో అతనికి అర్డమయ్యేదేమిటంటే జీవితంలో సక్సెస్ అవడానికి మామూలు టాలెంటు ఉంటే సరిపోదనీ, ఆకాశాన్నంటే ప్రతిభ, ఆకాశాన్ని తాకినా అక్కణ్ణుంచీ ఎగరాలనే పట్టుదలా, నిరంతర సాధనా... ఇవి కావాలనీ అర్ధమవుతుంది. కొద్దిగా సమయం తీసుకుంటుంది. కొన్ని త్యాగాలూ  చేస్తాడు. కసి, పట్టుదల, ఎదగాలనే ఆకాంక్షతో లక్ష్యాన్ని సాధించాలనే  తపనతో మరుగున పడిపోతున్న ప్రతిభను, మరచిపోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ ప్రోదిచేసుకోని ఒక్కసారి ప్రపంచానికి తనేంటో చాటి చెప్తాడు... అలాంటి యువకునికి సరైన సమయం, వేదిక ఈ సంవత్సరమే కావాలని......

ఆశయాలు పర్వతంలా స్థిరంగా ఉండాలి ఆలోచనలు కాలంతో పాటు మారాలన్న వ్యాఖ్యల్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే.... ఈ సంవత్సరం మనలో కొన్ని క్రొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని, ఆ ఆలోచనలు మన జీవితానికి పెను మార్పునిచ్చే అద్భుతాలుగా మారాలని అనుకుందాం. అలాగే జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలకు రాబోయే కాలం నిదర్శనంగా నిలుస్తుంది. రాబోయే కాలంలో కొన్ని బంధాలకు బీటలు పడనూ వచ్చు. సరిక్రొత్త అనుభందానికి తెర తీయనూ వచ్చు. అలాంటి కొన్ని అనుభంధాలు అందమైన మన జీవితానికి ఒక అర్థాన్నిచ్చే విధంగా ఈ సంవత్సరం ఆ వెల కట్టలేని బంధాలు ముడిపడాలని....

కాలం విసిరే సవాళ్ళకు దీటైన జవాబు చెప్పగల జాతులే అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటాయి. తక్కినవన్ని సన్నగిల్లి, నీరసించి, కాల గర్భంలో కలిసిపోతాయన్నది చారిత్రకంగా నీరుపితమైన స్వప్నం. చరిత్ర చూపునకందని కాలం నుంచి ఆటుపోట్లని తట్టుకొని ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న భరత జాతి.... గడచిన అరవై ఏళ్ళుగా స్వరూప జ్ఞానం కొరవడి కొట్టుమిట్టాడుతుంది. వ్యక్తి దృష్టిని మాని సమిష్టి నాయకత్వం (Leader ship) కరవైన ఫలితంగా గుండెల నిండిన ఆత్మ విశ్వాసంతో దేశం పట్ల గర్వంగా ఉండాల్సిన యువకులకు, సగటు సామాన్యులకు భవిష్యత్ పై ఎదో అలజడి. ఆ అలజడి ఈ సంవత్సరంలోనే అంతమొందాలని....

మనకు ఈ క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా ఏమి అవసరం లేదు.. ఎకరం భూమి లో మునుపటి కంటే రెట్టింపు పండించగల రైతు కావాలి. అలా పండించిన రైతు పండించిన పంట లోనే తన పంటకు వాడే పురుగు మందు తను వాడి చనిపోకుండా ఉండే రోజు కావాలి. నిబద్దతగా పని చేసి పారిశ్రామికోత్పత్తిని ఇంతకంతలు చేయగల కార్మికుడు కావాలి. న్యాయమైన ధరకు సరకులు సరఫరా చేసే వర్తకుడు మనకు కావాలి. అహాన్ని వీడి ప్రజాసేవ చేయగల ప్రభుత్వోద్యోగి మనకు కావాలి. ఇవ్వన్నింటిని సాకారం చేయగలిగే పారదర్శక పాలన అందించటానికి దేశాన్ని ముందుండి నడిపించే ఒక మంచి నాయకుడు కావాలి. అలాంటి నాయకుణ్ణి ఇప్పుడున్న "నేత"లో చూడాలని... ఈ సంవత్సరమే అది జరగాలని.....
వీటన్నిటికంటే ముఖ్యమైనది, ప్రధానమైనది....
ఒక సగటు ఆడపిల్ల అర్దరాత్రి రోడ్డుపై అడుగేయకపోయినా పర్వాలేదు కానీ మిట్ట మధ్యాహ్నం మానవజాతి చూస్తుండగా స్నేహితుడే మోహితుడై కిరాతకుడవుతున్నాడు., ప్రేమికుడే పామై కాటేస్తున్నాడు., బంధువే రాబందువై మీద పడి తార్చుతున్నాడు., చివరికి కని పెంచిన కన్న తండ్రే కరుణ లేని కసాయివాడై కరుస్తున్నాడు...మదం పట్టిన మగ జాతి మగువలను చెరపట్టగా నిస్సిగ్గుగా చూసే ఈ (నా)న'సమాజం' నవ సమాజంగా రూపాంతరం చెందాలి. సగటు ఆడపిల్లకి అన్యాయం జరిగితే న్యాయమా నివేక్కడ అని న్యాయాన్నే దీనంగా అర్థించని రోజు రావాలి..... అమ్మాయి ఆత్మాభిమానాన్ని అణచివేయకుండా ఉండబడే రోజు రావాలి.....  సగటు ఆడపిల్ల అవనంతాతరాలను దాటి ఆత్మ విశ్వాసమే ఆలంబనగా, అవరోధాలనే అవకాశాలుగా మలచుకొని ఆకాశమనే అంతిమ లక్ష్యాన్ని చేరుకొని అద్భుతాలు సృష్టించి అందరికి ఆదర్శప్రాయమవ్వాలి. ఈ సంవత్సరం ఆడపిల్లల ఆక్రందనలు ఆగిపోవాలని.......

ఇందులో ప్రతి ఒక అంశం నెరవేరాలని నేను మనస్పూర్తిగా అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ సరిక్రొత్త ఆలోచనలతో సరిక్రొత్త సవాళ్లతో నూతన సంవత్సరానికి స్వాగతం చెప్తూ....... ఈ సంవత్సరం.., ఒక తల్లి తన కొడుకును ఒక మంచి ప్రయోజకుడిగా చూసే సంవత్సరం.., ఒక తండ్రి తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచే సంవత్సరం.., ఒక కూతురు తన తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చే సంవత్సరం.., ఒక యువకుడు తన గమ్యం అనే తీరాన్ని చేరుకొని తను మనసు పడ్డ అమ్మాయిని మనువాడే సంవత్సరం.., ఒక సగటు సామాన్యుడు తన కలలను సాకారం చేసుకుని సగర్వంగా బ్రతికే సంవత్సరం.., ఒక ప్రజస్వామ్యనేత తన దేశాన్ని తన కళ్ళతో ఎలా అయితే చూడాలనుకుంటున్నాడో అలా రూపుదిద్దుకునే సంవత్సరం.., భారత ఆడపిల్లలు అణచివేయకుండా తన ఆత్మాభిమానాన్ని ప్రతి ఒక్కరు గౌరవించే ఆడపిల్లల సంవత్సరం.., ఒక ఓటమికి వేదికయ్యే సంవత్సరం .., అలాగే గెలుపు గుర్తుండిపోయే సంవత్సరం..... ఇలాంటి అద్భుతమైన సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాము. ఈ సంవత్సరంలో లక్ష్యాలు తీరిపోయి లక్షలు సంపాదించే సామర్థ్యం కలిగిన యువకులందరికి ఒక మల్లె తీగ లాంటి అందమైన అమ్మాయి అల్లుకోవాలని మనస్పూర్తిగా ఆశిస్తూ, ఆశపడుతూ, అపేక్షిస్తూ......... నూతన సంవత్సర శుభాకాంక్షలతో చివరగా ఈ మాటలు

రాబోయే నవశకంలో.........
సంతాపాలను స్వీకరిద్దాం
సంఘర్షణలను అనుభవిద్దాం
కష్టాలను ఆదరిద్దాం
కన్నీళ్లను గౌరవిద్దాం
మనమే విజేతలం
కాలానికి నిర్ణేతలం.

No comments:

Post a Comment