Saturday 31 January 2015

ఒక వస్తువు-చేరువ చేసే విధానం-విజయ పరంపర....


భారతదేశంలో ఎన్నో వనరులు ఉన్నాయి. ఆ వనరులకు తగినట్లుగానే నైపుణ్యం కలిగిన మానవ శక్తి ఉంది. అద్భుతమైన మేధా శక్తి మన సొంతం. కాని భారతదేశం దేనిలోను "పరిపూర్ణతను" చూపలేకపోతుంది. పరిపూర్ణత అనే పదమే అందరికి క్రొత్తగా అనిపించచ్చు. మనం ఒక పనిని చేస్తున్నప్పుడు ఆ పని చివరి వరకు అంటే మనం నిర్దేశించుకున్న గమ్యం వరకు చేరువ అవుతుందా లేదా అనేది చూసుకోవటమే "పరిపూర్ణత" ఇది కొన్ని సార్లు చూపకపోవటానికి అనేక కారణాలు ఉండచ్చు. ఒక దానిలో మనం విజయం సాధించిన మాత్రాన ప్రతి దానిలో మనం నెగ్గుకురాలేము. దానికి కొంత ఓర్పుతో జత కలిసిన సాధన అవసరమవుతుంది. సాధనతో అనుభవమూ జత కూరుతుంది. వీటికి తగిన నైపుణ్యం, ఓపిక, చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు ఆ పనికి "పరిపూర్ణత" ఏర్పడుతుంది. ఇవ్వన్ని ఒక పనిని దిగ్విజయంగా పూర్తి చేయటానికి ఉపయోగపడతాయి.

మనమొక వస్తువును అభివృద్ధి చేస్తున్నాం.. ఆ వస్తువు మన సుసంపన్నమైన మేధా శక్తితో రూపొందించాము. ఎంతో అద్భుతంగా తయారయ్యింది ఆ వస్తువు. పలు దేశాలకు దీటుగా కేవలం మన సొంత నైపుణ్యం తో తయారు చేసిన ఆ వస్తువు కొందరిని నివ్వెర పరచింది. అపార మేధస్సును పోసి తయారు చేసిన ఆ వస్తువు చివరికి వచ్చేసరికి దాన్ని చేరేచోటికి చేరువ చేయలేకపోయాము. అంటే అక్కడ అంత అద్భుతమైన, పలు దేశాలనే నివ్వెర పరచిన ఆ వస్తువు దాని గమ్యాన్ని చేరలేక, మనం అనుకున్న లక్ష్యాన్ని తాకలేకపోయింది. అంటే ఇక్కడ ఆ వస్తువు చేరలేకపొవటానికి కారణం ఏమిటి?? వస్తువే కారణమా?? ఇంకా వేరే కారణాలు ఉన్నాయా?? ఒక చిన్న ఉదాహారణ ద్వారా తెలుసుకుందాం.

ఒక రైతు మామిడి మొక్క ను పెడతాడు. అది పెరిగి చెట్టు అయ్యాక చివరికి అది ఫలాలను ఇచ్చే దశకు వస్తుంది. ఆ చెట్టు మంచి మేలి రకమైన ఫలాలను ఇస్తుంది. ఒక్కో ఫలం చాలా బాగుంటుంది. ఆ చెట్టు పని ఆ చెట్టు చేసింది. ఆ చెట్టు పని ఏంటి ఫలాలను ఇవ్వటం... ఇచ్చింది. ఇప్పుడు తర్వాత పని రైతుది. ఆ రైతు ఆ చెట్టు ఇచ్చిన ఫలాలను వ్యాపారికి అమ్ముతాడు. ఆ వ్యాపారి ఆ ఫలాలు అద్భుతంగా ఉండటం చేత వాటిని కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపటమే మొత్తం పండ్లను తీసుకుంటాడు. ఆ తర్వాత..... ఆ పండ్లను వ్యాపారి సంతలో అయినా, రోడ్డు పైనో రోడ్డు కిందో పెట్టి రుచి చూపించి మరీ ఆ ఫలాలను అమ్ముతాడు. చివరికి ఆ ఫలం చేరాల్సిన వాడికి చేరుతుంది.

ఇప్పుడు దీనిలో ఎవరు విజయవంతం అయ్యారు. మొక్కను పెట్టిన రైతా? ఫలాలను అమ్మిన వ్యాపారా? లేక ఆ ఫలం గొప్పతనమా. నిజం చెప్పాలి అంటే ఇందులో అందరి గొప్పతనం ఇమిడి ఉంది. ఏ ఒక్కరికో ఈ గొప్పతనాన్ని ఆపాదించటం కుదరదు. చెట్టు అద్భుతమైన, మేలిమిరకమైన పండ్లను ఇచ్చి తన గొప్పతనాన్ని చాటుకుంది. ఆ చెట్టు ఫలాలను వ్యాపారికి అమ్మటం ద్వారా ఆ రైతు తన బాధ్యతను పూర్తి చేసుకున్నాడు. ఆ రుచికరమైన పండ్లను ప్రజలకి అమ్మి తనను తాను నిరూపించుకున్నాడు వ్యాపారి. ఇందులో ప్రతి ఒక్కరి కృషి దాగి ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఆ పండ్లను కోయటానికి రైతు ఉపయోగించిన కర్ర/కత్తి కృషి కూడా దీనిలో ఉంది. దాన్ని ఉపయోగించి ఆ ఫలాలను జాగ్రత్తగా తెంపిన ఆ రైతు శ్రమ దాగి ఉంది. ఏ ఒక్కరి కృషి లేకపోయినా ఆ వస్తువు(ఫలం) చివరి వరకు చేరేది కాదు. ఇందులో ఎవరు చేసే పని వారు సంక్రమంగా చేసిన పిమ్మటే ఆ వస్తువు చేరువయ్యింది. అంతే కాని అందులో చెట్టు పోయి వ్యాపారికి పండ్లు అమ్మలేదు. వ్యాపారి పోయి చెట్టు పండ్లను తీసుకురాలేదు. చెట్టే ఫలాలను అమ్మమనటం కూడా అవివేకమే, అసంభంధం కూడా.

కనుక ఒక వస్తువు చేరువ కావాలంటే దాన్ని తయారు చేసేవాడు ఎంత ముఖ్యమో దాన్ని ప్రజలకు లేదా చేరాల్సిన వాళ్ళకు చేరువ చేయటం కూడా అంతే ముఖ్యం. ఇందులో ఏ ఒక్కరు సరిగా కాని, నిర్లక్షంగా కాని చేసిన ఆ వస్తువు లేదా పండు అక్కడే ఉండిపోయి మరుగున పడిపోతుంది.  కారులో నాలుగు చక్రాలు సరిగా ఉన్నప్పుడే కారు కదులుతుంది. ఏ ఒక్క చక్రం పని చేయకపోయినా ఆ కారు ఎంత నడంగ ఉంది ఎం ప్రయోజనం. అది ఎంత అద్భుతంగా ఉన్నా సరే. ప్రపంచ దేశాలను నివ్వెర పరచే అబ్బురమైన వస్తువైనా దాన్ని చేరువ చేయాల్సిన వాళ్ళకు చేయకపోతే ఆ ఉత్పాదనే వ్యర్థం. ఎంత అద్భుతమైన కానీ ఆ అద్భుతాన్ని చేరువ చేసే నైపుణ్యం, మానవ వనరు, మేధా సంపత్తి కావలి అప్పుడే ఆ వస్తువు లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది. అప్పుడే ఆ వస్తువుకి "పరిపూర్ణత" చేకూరుతుంది.

No comments:

Post a Comment