Saturday 31 January 2015

ఆరు నెలల్లో మోడీ చేసిందేమిటి..!? అసలు సమస్యలేంటి..!?


ఈ మాసమంతా ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గత ఆరు నెలల పాలన పైనే చర్చ నడుస్తుంది. ఏ నలుగురు కలిసినా ఆయన ప్రభుత్వం నడచిన తీరు గూర్చి.., ప్రభుత్వం లోని పథకాల గురించి, జరిగిన అభివృద్ధి గురించే ప్రస్తావన. ఎందుకు ఈ చర్చ? అరవై సంవత్సరాలలో జరగనిది ఆరు నెలలో ఏం జరిగింది అన్నది ప్రశ్న. అసలు ప్రజలు ప్రభుత్వాల నుండి ఎం కోరుకుంటున్నారన్నది ఇంకో ప్రశ్న. ఈ ఆరు నెలల పాలనలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఆరు నెలలలో ఎం చేశారు అనే చర్చ కన్నా ప్రజలకు ఎంతవరకు జవాబుదారితనం తో కూడిన పాలన అందిందన్నది మనం చూడాలి.

67 ఏళ్ళ భారతావని చరిత్ర లో ఏ నాయకుడు ప్రజలకి సరి అయిన భరోసా ఇవ్వలేదు సరి కదా.. ఇచ్చిన మాటలు నీటి మూటలే అయ్యాయి తప్ప., ఏ నాయకుడు వాటిని అమలు చేయలేదు ముందే సిద్దం చేసి పెట్టుకున్న ప్రసంగం చట్ట సభలో ఉన్నది ఉన్నట్టుగా చదివే నాయకులని చూసాము... ముందే రాసి పెట్టుకున్న ప్రసంగం కూడా సరిగా చదవలేక ఇబ్బంది పడ్డ ప్రభుద్దులను కూడా చూసాము...!! ఎందఱో నాయకులు వచ్చారు.., ఎన్నో దశాబ్దాలు గడచిపోయాయి.., కాని దేశంలో అభివృద్ధి ఛాయలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న కఠిన వాస్తవాన్ని దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ అంగీకరించాల్సిన విషయం.

గత ఆరు నెలల కాలం లో ప్రవేశపెట్ట బడ్డ పథకాలు ప్రజల్లో కొంత ఆసక్తి రేకించినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెప్తారు. ఆ పథకాలలో మనం కొన్నింటి గురించి విశ్లేషిస్తే......... "ప్రధాన మంత్రి ధన్ జన్ యోజన"...... గ్రామీణ ప్రాంతం లో ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పం తో ప్రవేశపెట్ట బడ్డ పథకం. ఈ పథకం ద్వార ప్రతి మారుమూల పల్లెకు దేశ ఆర్ధిక కార్యకలాపాలు విస్తరించబడతాయి. దీనివల్ల గ్రామీణ మహిళల్లో కూడా ఆర్ధిక స్వతంత్రం కలిగే అవకాశం ఉంది..... "స్వచ్చ భారత్"....... మహాత్మ గాంధీ పుట్టిన రోజున ప్రారంభించబడ్డ ఈ పథకం భారత దేశ ప్రజలకు పరిసరాల పట్ల బాధ్యతను తెలియజేస్తుంది. దేశ ప్రజలు తమ ఇంటిని శుభ్రం ఉంచుకుంటే సరిపోదని ఇంటితో పాటు మనం వాడే వీధులు పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచన తో ఈ పథకాన్ని మొదలు పెట్టారు. అది ఏ ప్రాంతమైన సరే.., మనం ఉపయోగించే రోడ్లు అయినా.., బడి అయినా.., ప్రభుత్వ కార్యాలయమయినా ఏదైనా కానీ మనకు మనమే శుభ్రంగా ఉంచుకోవటం.., మన భాద్యతని, తెలియ జెప్పే పథకం....... "మేక్ ఇన్ ఇండియా"..... దీని ద్వారా సాధ్యమైన ప్రతి వస్తువు  స్వదేశంలో తయారు చేసే విధంగా వీలైనంత దిగుమతులను తగ్గించి మన దేశం తయారయ్యే వస్తువుల ఎగుమతి ప్రోత్సహించటం. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతం అందిచేలా చేస్తుంది... ఇలా కొన్ని పథకాలు గత ఆరు నెలలలో ప్రవేశపెట్టబడ్డాయి.

వీటి ఉద్దేశం ఎంతో బాగుంది. ఇవి కాగితాల మీద కమనీయంగానే కనిపిస్తున్నా ప్రభుత్వ ఆచరణలో ఏ మాత్రం.., ఎంత మాత్రం.., ప్రజలకు చేరువ అవుతాయన్నది ఆలోచించాల్సిన అంశం. ప్రజల మధ్యకు పథకాలు ఆచరణలోకి వెళ్లేసరికి ఆ ఫలాలు అందాల్సిన వాళ్ళే అందుకుంటున్నారా? నిజంగా లబ్ది పొందాల్సిన వాళ్ళే పొందుతున్నారా అనేదే ప్రశ్న. ఒక వ్యాపార వేత్తని విదేశాలకి పంపితే డాలర్స్ ని మాత్రమే తీసుకొస్తాడు, కాని ఒక అధ్యాపకుణ్ణి విదేశాలకి పంపితే విద్యావంతులైన ఒక తరాన్నే వృద్ధి లోకి తెస్తాడన్న నరేంద్ర మోడీ అన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకుంటే నిజమనిపిస్తుంది. మనకు, మన దేశానికి  ధన రాశులు కాదు కావాల్సింది.. విజ్ఞాన రాశుల్ని అందించే వివేకవంతులు. ఆ వివేకవంతులు, విజ్ఞానం అందించే విద్య ద్వారా పుడతారు. అలాంటి విద్యను దేశానికి అందించే విలువైన ప్రభుత్వం.., దాని సేవలు ప్రజలకు కావాలి.  ఒక నాయకుడికి కావాల్సింది ఆక్స్ఫర్డ్ డిగ్రీ లు కాదు ముఖ్యం.., అభివృద్ధి చేయాలన్న తపన. ఆ తపన ఉన్న నాయకుడు ప్రజలకు ముఖ్యం. అది ఏ పార్టీ నాయకుడైన సరే.  

అలాగని మనం(ప్రజలు) ఎన్నుకున్న ఏ ప్రభుత్వం పైన అయినా ఎం ఎక్కువ ఆశలు పెట్టుకొనవసరం లేదేమో... ప్రభుత్వం సగటు పౌరుని కనీసావసరాలు తీర్చగలిగితే చాలు... అవును మరి ప్రజలకు కావాల్సింది కనీసావసరాలు మాత్రమే. గతుకులు లేని బాటలు.. మంచినీరుతో మురుగునీరు కలవని వ్యవస్థ రూపొందాలి. బడిలో చదువు బాగా చెప్పాలి. బడిలో చదువు చెప్పే ఉపాద్యాయుల కొరత  తీరాలి. విరామం లేని విద్యుత్ సరఫరా కావాలి.. ఒక పేదవాడు ఆకలి చావు వినబడని రోజు రావాలి. ఒక కార్మికుడు తన సమస్యల గురించి రోడ్డు పైకి దిగి ధర్నా చేయని రోజు రావాలి. ఒక నేతన్న తను అల్లిన తాడుని తనే ఉరితాడులా ఉపయోగించుకునే స్థితి నుండి బయటపడగలిగే రోజు రావాలి.. ఒక గ్రామీణ ఆడపిల్ల "ఆరుబయట"కి వెళ్లి సిగ్గుపడే వ్యవస్థ నుండి దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలు బయటపడాలి. ఒక గిరిజనుడు దేశం గర్వించే స్థితికి ఎదగగలిగే రోజు రావాలి... ఒక రైతన్న తను ఆకలితో అలమటించి "ఇతరులకి అన్నం పెట్టె మన రైతన్న" తను పండించిన పంటలోనే ఆ పంటకి ఉపయోగించాల్సిన మందు తను 'ఉపయోగించి' చనిపోకుండా ఉండే రోజు రావాలి... ఒక విద్యార్థి విశ్వ విద్యాలయం నుండి పట్టా అందిన మరుక్షణమే ఉద్యోగ నియామక పత్రం అందుకోవాలి. వజ్రాల్లాంటి వనితలలో, దేశ భవిష్యత్ ఆశా కిరణాలయిన అమ్మాయిలలో.., ఒక్క అతివ కూడా అత్యాచారానికి గురవ్వకూడని రోజు రావాలి. అసలు అమ్మాయి అభద్రతా భావం అనే ఆలోచన నుండి బయటపడాలి. ఇవన్ని సాకారం అయ్యే రోజు త్వరలో రావాలనే ప్రజలు  ఆకాంక్షిస్తున్నది ఆశిస్తున్నది.

అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వమైనా, పాలించే పాలకులు ఎవరైనా సరే ప్రజలకు.., అద్దాల మేడలు.., రంగుల గోడలు కాదు కావాల్సింది.., అంతిమంగా మనకు కావాల్సింది అభివృద్ధి. పౌరుల నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ధి అన్న మన నేతల  మాటల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నేటి గాడి తప్పిన వ్యవస్థలన్నిటికి పరిష్కారమే పారదర్శకసహిత అభివృద్ధి మార్గం. ఈ మార్గం సమస్యలు సృష్టించే మార్గం కాదు శాశ్వతమైన పరిష్కారాలు చూపే మార్గం. ఈ మార్గాన్ని ఎన్నో దేశాలు అనుసరించి అగ్ర రాజ్యాలుగా రూపొందాయి. కాని ప్రజలు మరియు ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఎంతవరకు ఆచరిస్తున్నాయన్నదే ప్రశ్న.


హరికాంత్ రెడ్డి రామిడి

No comments:

Post a Comment