Saturday 31 January 2015

బద్దకిస్తే ఓడిపోతావ్.. బలం తెచ్చుకో గెలుస్తావ్..!


ఈ సృష్టిలో మనమెంత.., ఈ విశ్వంలో ఈ సృష్టి ఎంత..., అనంత ఖగోళ రాశుల్లో విశ్వమెంత...! ఒక మహానుభావుని మాటలు గుర్తొచ్చాయి. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, ఏదైనా మొదలుపెట్టాలనుకున్నప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నేను అది సాధించగలనా.., నేనది చేయగలనా... నేనది ఆచరించగలనా అని. అందుకే ఆ మహానుభావుడు అలా అన్నాడు. ఏదైనా సాధించాలనుకున్నపుడు మనకు ఆ సాధించాలనుకున్నదే, ఆ చెయ్యాలనుకున్నదే చాలా పెద్దదిగా కనబడుతుంది. మనిషి స్వభావమే అంతేమో..!

మహానది బిందువు తోనే ఆరంభమవుతుంది. ఒక బిందువే సమస్త విశ్వంగా విస్తరిస్తుంది. తల్లి కడుపులో బిడ్డ ఒక బిందువు గానే ఉత్పన్నమవుతుంది. మొదట వేసిన ఒక అడుగే వేలాది అడుగులుగా మారి గమ్యాన్ని నిర్ణయిస్తుంది. మనిషి కుచించుకొని ఉన్నప్పుడు "నేను" అనే చిన్న పరిధి లో ఉంటాడు. ముందు "నేను నాది" లోంచి విస్తరిస్తూ "మనం మనదిగా" విస్తృతమై మన లోంచి మనం అనే లోకాన్ని జయించి.., నేను నా అనే సువిశాల నిజ అనంతంలోకి, ఏకత్వంలోకి లయం చేస్తూ ఆత్మ భావం లో స్థిరపడిపోవాలి.

మనం మన గదిలో ఉన్నప్పుడు "నా గది" అంటాము మన కుటుంబీకులతో.., పక్కింటి వాళ్ళతో "మా ఇల్లు" అంటాము.., అలాగే ఊరు వరకి వచ్చేవరకు మా ఊరు అంటాము. ఇలా ఊరు, దేశం, ప్రపంచం సంకుచితత్వాన్ని వదిలిపెడితే సర్వం మనదే అన్న భావంలో లీనమైపోతాం.

మన శరీరానికి జబ్బు చేస్తే మనమే చికిత్స తీసుకుంటాం. ఎవరో చేయించాలనో, ఎవరో రావాలనో సాధారణంగా ఆశించం. సమాజానికి అంతేనేమో. ఈ సమాజం మనది. ఎం చేసినా మనమే చేయాలి. ఈ సువిశాల విశ్వం, ఈ ప్రపంచంలో ఇందులో నేనెంత...? అని అనుకుంటాం. కాని ఒక అణువే అణుబాంబు అవుతుంది. ఒక చిన్న చిట్టెలుక ఒక కొండ ను త్రవ్వగలదు. కాళ్ళు చేతులు లేని ఒక చిన్న చేప సముద్రాన్ని ఈద గలదు. ఒక చిన్న పక్షి ఆకాశాన్నే ఏలగలదు.

ఎవరైనా, ఎంత మందైన మనకు తోడుగా ఉండని మంచిదే.. కానీ ఎవరి సహకారమైన మనం ఎందుకు ఆశించాలి..? వాళ్ళ వెన్ను దన్ను కోసం మనం బెరుగ్గా ఎందుకు ఎదురు చూడాలి. మన శక్తి, మన మనో ధైర్యం, మన మనో స్థైర్యం మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు సాగటం ప్రారంభిస్తే మనం నడిచే దారి మంచిదైతే, గమ్యం సరైనదైతే.., మన వెనక అడుగుల చప్పుడు మనకు వినబడుతుంది. మన గుండె చప్పుడులో కలిసిపోతుంది. నేడు లోకంలో ఎంతో స్వార్థం, దౌర్జన్యం, దౌష్ట్యం, అవినీతి, అన్యాయం, కష్టాలు, కన్నీళ్ళు...., మనదైన ఈ లోకాన్ని, ఈ దేశాన్ని క్షేమంగా సౌకర్యవంతంగా ఉండేలా మనమెందుకు ప్రయత్నించకూడదు. అందుకు కావాల్సింది "ఉక్కు పిడికిలి.., ఒక బలమైన ఆలోచన సంకల్పం".

చివరగా నాలుగు మాటలు:
బద్దకిస్తే ఓడిపోతావు
బలం తెచ్చుకో గెలుస్తావు
భయపడితే కుచించుకుపోతావు
పోరాడు విశాలమవుతావు


హరికాంత్

No comments:

Post a Comment