Saturday 31 January 2015

2014 రౌండప్: 2014 సంవత్సర విశేషాలతో సమగ్ర సమాహారం..




ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది రాజకీయ నేతల జాతకాలను 2014 సంవత్సరం మార్చేసింది. ఊహించని అనేక పరిణమాలు జరిగాయి.  రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మన దేశంలో, రాష్ట్రంలో కీలక మార్పులు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో 2014 సంవత్సరం చిరస్థాయిగా మిగిలిపోతుంది. రాష్ట్రం రెండుగా విడిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. రెండు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. సార్వత్రిక ఎన్నికలతోపాటు  రాజ్యసభ, స్థానిక సంస్థలు, రెండు రాష్ట్రాల శాసనసభలకు దాదాపుగా అన్ని ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరిగాయి.  తొలుత మునిసిపల్ ఎన్నికలు, ఆ తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కట్టడంతోపాటు సినిమా హీరో పవన్ కల్యాణ్ మద్దతుతో పోటీ చేసింది.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగానే పోరులో నిలిచింది. ఈ ఏడాది మూడు కొత్త రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఎంఆర్ పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సారధ్యంలో మహాజన్ సోషలిస్ట్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జైసమైక్యాంధ్ర, సినిమా హీరో పవన్ కల్యాణ్ నాయకత్వాన జనసేన పార్టీలు పుట్టుకొచ్చాయి. జనసేన ఎన్నికలలో పోటీ చేయలేదు. మిగిలిన పార్టీలు పోటీ చేసినా ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. ఇక రాజకీయ వలసలు కూడా ఈ ఏడాది విపరీతంగా జరిగాయి.

జనవరిలో బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా మూడవసారి బాధ్యతలు స్వీకరించారు. నేపాల్ కాంగ్రెస్ అధినేత సుశీల్ కోయిరాల ప్రధానిగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరిలో థాయ్ లాండ్ లో హింసాకాండ చెలరేగింది. ఆపద్ధర్మ ప్రధాని ఇంగ్లక్ షినవత్రా దేశ రాజధాని బ్యాంక్ కాక్ వదలి వెళ్లారు. అక్కడకు 150 కిలో మీటర్ల దూరంలో ఉండి పాలన కొనసాగించారు.  ఇంగ్లక్ షినవత్రాను, ఆమె కేబినెట్‌లోని 9 మంది మంత్రులను రాజ్యాంగ కోర్టు మేలో పదవుల నుంచి తొలగించింది. ఎన్నో సైనిక కుట్రలు చవిచూసిన థాయ్‌లాండ్‌లో మళ్లీ సైన్యం తిరుగుబాటు చేసింది. థాయ్‌లాండ్‌ను ఆ దేశ సైన్యం అధీనంలోకి తీసుకుంది. ఆ తరువాత ఇంగ్లక్ షినవత్రాను సైనిక ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. ఉక్రెయిన్ లో భాగంగా ఉన్న క్రిమియా మార్చిలో స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ దేశంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 98.8 శాతం మంది రష్యాలో కలవాలవడానికి ఇష్టపడ్డారు. ఏప్రిల్ లో ఆఫ్ఘనిస్తాన్ లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. తాలిబన్ల హెచ్చరికలను జనం లెక్కచేయలేదు. భారీస్థాయిలో పోలింగ్ జరిగింది. 

రాజకీయ ప్రముఖుల మృతి


మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన రెడ్డి(80) మే 9న కన్నుమూశారు. బీజేపీ ముఖ్య నేతలు ఇద్దరు మృతి చెందారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు, బంగారు లక్ష్మణ్(74) ఫిబ్రవరి 26న, ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలె నరేంద్ర మార్చి 9న కన్నుమూశారు. వైఎస్ఆర్ సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం గూబగుండం మిట్ట వద్ద ఏప్రిల్ 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, 24న కన్నుమూశారు. కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావు జూన్ 15న గుండెపోటుతో మృతి చెందారు. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే మన్నేరు వెంకటరమణ (67) డిసెంబరు 15న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వైఎస్ఆర్ సీపీ నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు, ప్రముఖ సినీ నిర్మాత, విసు సంస్థల అధినేత సీసీ రెడ్డి(చవ్వా చంద్రశేఖర రెడ్డి) అక్టోబరు 6న మృతి చెందారు.


ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2014కు కేంద్ర మంత్రి మండలి ఫిబ్రవరి 7న ఆమోదం తెలిపింది. ఆ నెల 13న లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోక్ సభలో రణరంగమే జరిగింది. లగడపాటి రాజగోపాల్ సభలో పెప్పర్ స్పే చల్లారు. సభ్యులు పరుగులు తీశారు.  18న లోక్ సభలో ఈ బిల్లును ఆమోదించారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఏకమవడంతో సునాయాసంగా ఆమోదం లభించింది. 20న రాజ్యసభలో ఆమోదించారు. ఆ తరువాత రాష్ట్రపతి  ఆమోద ముద్ర పడటంతో 29వ రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించారు. రెండు రాష్ట్రా విభజన - జూన్ 2 అపాయింటెడ్ డే - ఎన్నికల తరువాత ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని ప్రకటన వెలువడింది. జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవ దినోత్సవాన్ని మరో స్వాతంత్ర్య దినోత్సవంలాగా  జరుపుకున్నారు. 10 జిల్లాల తెలంగాణకు అదే రోజు కె.చంద్రశేఖర రావు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా, 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. హామీ ఇచ్చిన ప్రకారం రైతుల రుణాలు మాఫీ చేశారు. బంగారు తెలంగాణ నిర్మిస్తానని కేసీఆర్ హామీలు ఇస్తూ పాలన కొనసాగిస్తున్నారు.

గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ వద్ద జూన్ 8న 12 జిల్లాలతో విడిపోయిన ఏపీకి   చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా, 17 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల సమయంలో గెలుపే ధ్యేయంగా అమలు చేయడానికి  సాధ్యంకాకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక  చంద్రబాబు సతమతమవుతున్నారు.   ప్రధానంగా రుణ మాఫీ విషయంలో ఎన్నో నిబంధనలు విధించడంతో సగానికి సగం మంది అర్హులుకాలేదు.   ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. ఉన్న ఉద్యోగాలనే ఊడబీకుతున్నారు. రాజధాని ఏర్పాటుకు భూముల సేకరణ అంశం కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాబుపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన కొద్ది కాలంలోనే మంచి ఫలితాలను సాధించింది. ఈ పార్టీయే ఏపీలో అధికారంలోకి వస్తుందని చాలామంది భావించారు. అయితే ఏపీలో కేవలం 2 శాతం ఓట్ల తేడాతో అధికారం చేజారిపోయింది. ఎన్నికల సంఘం మే 26న దీనిని రాజకీయ పార్టీగా గుర్తించింది.  ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అయ్యారు. అక్టోబరు 24న వైఎస్ఆర్ సీపి తరపున ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా భూమా అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఏపీలోని 175 శాసనసభ స్థానాలకు మే 7న జరిగిన ఎన్నికలలో  టీడీపీ 102 స్థానాలు, దాని మిత్రపక్షం బీజేపీ నాలుగు స్థానాలు కైవసం చేసుకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు   ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాలను గెలుచుకొని  ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. లోక్ సభ స్థానాలను టీడీపి 15, వైఎస్ఆర్ సీపీ 8, బీజేపీ రెండు స్థానాలు గెలుచుకున్నాయి.  కాంగ్రెస్ కు చావు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల అనేక మంది ప్రముఖులు ఘోరంగా ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, అప్పటి మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, శైలజానాథ్, కొండ్రు మురళీ మోహన్, స్పీకర్ నాదెండ్ల మనోహర్ తదితరులు అందరూ ఘోర పరాజయాన్ని చవిచూశారు. సీపీఐ, సీపిఎం నుంచి ఒక్కరు కూడా గెలవలేదు. టీడీపికి, వైఎస్ఆర్ సీపీకి మధ్య రెండు శాతం ఓట్లు మాత్రమే తేడా ఉంది. వైఎస్ఆర్ సీపీకంటే టీడీపికి 5.6 లక్షల ఓట్లు మాత్రమే అదనంగా వచ్చాయి.

తెలంగాణలోని 119 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికలలో  టీఆర్ఎస్ 63, కాంగ్రెస్ 21, టీడీపి 15, బీజేపీ 5, ఎంఐఎం 7, వైఎస్ఆర్ సీపి 3, బీఎస్ పీ 2, సీపీఐ, సీపీఎం ఒక్కో స్థానంలో గెలిచాయి. 17 లోక్ సభ స్థానాలలో టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 2, టీడీపి, బీజేపీ, ఎంఐఎం, వైఎస్ఆర్ సీపీ ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకున్నాయి.

మోదీ ప్రభంజనం!
కేంద్ర రాజకీయాలలో ఈ ఏడాది కీలక మార్పులు జరిగాయి. వరుసగా మూడు దఫాలు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని 2014 ప్రధానినిని చేసింది.  రాజకీయ నేతల గతినేకాదు, దేశ గతిని, రాష్ట్రాల గతిని మార్చేసింది. కొత్తగా 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. కాంగ్రెస్ కు చావు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి లోక్‌సభలో ప్రస్తుతం 44 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కలేదు. దేశమంతా మోదీ ప్రభంజనం. ఊహించని విధంగా బీజేపీ ఒక్కటే లోక్ సభలో పూర్తి మెజార్టీ స్థానాలు సాధించింది. సార్వత్రిక ఎన్నికల తరువాత వివిధ రాష్ట్రాలలో కూడా మోదీ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది.  మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మరి కొన్ని రాష్ట్రాలలో కూడా ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడింది. వివిధ దేశాలలో పర్యటించి  మోదీ తన ప్రసంగాల ద్వారా అంతర్జాతీయంగా కూడా మంచి పేరు, గుర్తింపు సంపాధించారు. అయితే నల్లధనాన్ని  బయట తీసుకువచ్చే విషయంలో కేంద్రం ఆశించిన ఫలితాలను సాధించలేకోయింది.

ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు దేశవ్యాప్తంగా 9 విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మోదీ సునామీతో ఒక్క బీజేపీయే 285 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలకు దిగజారిపోయింది. అన్నాడిఎంకె 37, తృణమూల్ కాంగ్రెస్ 34 స్థానాలను గెలుచుకున్నాయి. మే 26న నరేంద్ర మోదీ 15వ ప్రధానిగా ప్రమాణం చేశారు. సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపి,  తెలంగాణ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఏపీలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. దాదాపు 15 కోట్ల మంది యువతీ యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదు కావడంతో దేశంలోని మొత్తం ఓటర్లలో 47 శాతం మంది 18-35 ఏళ్ల లోపు యువ ఓటర్లే ఉన్నారు.

సామాన్యుల ఆశాదీపంగా  ప్రారంభమైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 2013లో ఢిల్లీలో అనూహ్య విజయం సాధించింది. ఈ ఏడాది జనవరి 2న ఢిల్లీ శాసనసభలో అరవింద్  కేజ్రీవాల్ ప్రభుత్వం విశ్వాసపరీక్ష నెగ్గింది. అదే నెల 14న శాసనసభలో జన్ లోక్ పాల్ బిల్లు తీరస్కరణకు గురికావడంతో కేజ్రీవాల్ రాజీనామా చేశారు. సామాన్యుల ఆశలన్నీ ఒమ్ముచేస్తూ ఆప్ పాలన 49 రోజుల్లో ముగిసింది. నవంబర్ లో శాసనసభను కూడా రద్దు చేశారు.
జనవరి 31న రాజ్యసభకు 37 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 7న జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలలో మొట్టమొదటి సారి నోటా ఆప్షన్ ప్రవేశపెట్టారు.   నవంబర్ లో కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తమిళనాట కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.  తన తండ్రి స్థాపించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తమిళ మానిల కాంగ్రెస్ పేరునే ఆయన పార్టీ పేరుగా ప్రకటించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జె.జయలలితను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దోషిగా బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబరు 28న నిర్ధారించింది. ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఆమెను బెంగళూరు నగర శివారులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.ఆ తరువాత ఆమె బెయిలుపై బయటకు వచ్చారు. ఆమె శాసనసభ్యత్వం కోల్పోయారు.

జూన్ లో ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి గోపినాథ్ ముండే దుర్మరణం చెందారు. నవంబరులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవర (77) కన్నుమూశారు. డిసెంబరులో కాంగ్రెస్ వృద్ధ నేత, మహారాష్ట్ర తొలి ముస్లీం ముఖ్యమంత్రి ఏఆర్ అంతులే(85), ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు, కమ్యూనిస్టు యోధుడు, 1987 రాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్.వెంకట్రామన్ పై పోటీ చేసిన  వి.ఆర్. కృష్ణయ్యర్(100) కన్నుమూశారు.
కలిసి ఉందాం!

ఈ ఏడాది అంతర్జాతీయంగా జరిగిన రాజకీయ పరిణామాలలో స్కాట్లాండ్, క్రిమియాలలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపాయి.  రెండు చోట్ల కలసి ఉందామనే అభిప్రాయమే వ్యక్తమైంది. క్రిమియా స్వతంత్ర దేశంగా అవతరించింది.  నేపాల్ లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది.

సెప్టెంబరులో జరిగిన స్కాట్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణలో సమైక్యవాదానికే మద్దతు లభించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై జరిగిన రిఫరెండంలో సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజలు ఓటు వేశారు.  సమైక్యవాదానికి అనుకూలంగా 55 శాతం మంది ఓట్లు  వేస్తే, వ్యతిరేకంగా 45 శాతం మంది ఓటు వేశారు. దీంతో, 300 ఏళ్ల బ్రిటన్-స్కాట్లాండ్ అనుబంధం యథావిధిగా కొనసాగుతోంది.
దశాబ్దన్నర క్రితం లాటిన్ అమెరికా ఖండాన్ని ఊపేసిన 'గులాబీ విప్లవం' ప్రభావం ఇంకా తగ్గలేదని అక్టోబరులో జరిగిన బ్రెజిల్ ఎన్నికలు మరోసారి చాటిచెప్పాయి. దక్షిణ అమెరికా ఖండంలోని అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌ అధ్యక్ష పదవికి నువ్వా నేనా అన్నట్లు అక్టోబరు 25న జరిగిన ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ(పీటీ)కి ప్రాతినిథ్యం వహిస్తున్న దేశాధ్యక్షురాలు, ఒకనాటి కమ్యూనిస్టు గెరిల్లా దిల్మా రోసెఫ్ స్వల్ప మెజారిటీతోనే అయినా విజయాన్ని సొంతం చేసుకోగలిగారు. 

అమెరికా పార్లమెంటు ఉభయసభలకు నవంబర్ లో జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు బరాక్ ఒబామాను, అధికార డెమొక్రాటిక్ పార్టీని కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లోని 36 స్థానాలకు(మొత్తం 100 సీట్లు), మొత్తం 50 రాష్ట్రాలకు 36 రాష్ట్రాల్లో గవర్నర్ పోస్టులకు ఎన్నికలు జరిగాయి.  ప్రతినిధుల సభ, సెనెట్.. రెండింటిలోనూ రిపబ్లికన్లు ఆధిపత్యం సాధించారు. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు 235 సీట్లు దక్కించుకోగా, డెమోక్రాట్లు 157 స్థానాలకే పరిమితమయ్యారు. ఎన్నికలకు ముందు ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 199, డెమోక్రాట్లకు 233 స్థానాలు ఉన్నాయి. సెనెట్‌లో రిపబ్లికన్లు 52 సీట్లలో, డెమోక్రాట్లు 43 స్థానాల్లో గెలుపొందారు.

డిసెంబర్ లో ఆఖరున అత్యంత విషాదకరమైన సంఘటన అందరిని కలచివేసింది. మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం డిసెంబర్ 28 న 162 మంది ప్రయాణికులతో ఇండోనేషియా వెళ్తూ ఒక్కసారిగా అదృశ్యమైంది. ఆ అదృశ్యమైన విమానం జావా సముద్రం లో కూలిపోవటం అంతులేని ఆవేదనను మిగిల్చింది. 162 మంది ప్రయాణికులు జలసమాధి కావటం నిజంగా దురదృష్టకరం. ప్రపంచమంతా ఈ సంఘటనతో తీవ్ర బాధకు గురైంది. ఏది ఏమైనా ఈ స్మవ్స్తారం కొన్ని సంతోషాలను మిగిల్చితే కొన్ని విషాదాలకు కూడా వేదికయ్యింది.

హరికాంత్

No comments:

Post a Comment