Friday 8 January 2016

అవును ముమ్మాటికి నేను హంతకుడినే....!


అవును నేను ముమ్మాటికి హంతకుడినే... ఒకటా రెండా? ఎన్నో హత్యలు చేసి మోసాలకు, కుట్రలకు దొరకకుండా తిరుగుతున్నాను. ఏ పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ నన్ను వేలెత్తి చూపించలేదు. ఏ ప్రభుత్వమూ నన్ను సన్మానించకుండా ఉండలేదు. ఎందుకంటే నేను చేసిన హత్యల వలన నేను బాగుపడుతున్నాను. సమాజమూ బాగుపడుతుంది. అందుకనే మీరు కూడా హత్యలు చేయండి. మీరు బాగుంటారు. నీ స్వార్ధం నీవు చూసుకో, ఎవరు ఎలా పోతే నీకేమిటి? అని నిత్యం శాసించే మనసును నిర్ధాక్షిణ్యంగా చంపేశాను. నిన్ను తమ స్వార్ధాలకు ఉపయోగించుకుని వాడుకునే వ్యక్తులతో కల్సే అవసరాన్ని కలిగిస్తున్న కాలాన్ని చంపేశాను. కంటి మీద నిద్ర, గుండెల్లో ప్రశాంతత లేకుండా చేస్తున్న ఆశలను చంపేశాను. నన్ను నాశనం చేయాలనుకుంటున్న అహంకారాలనూ, మమకారాలనూ నిర్ధాక్షిణ్యంగా చంపేసి పూడ్చి వేశాను. అదేమిటో నేను హత్యలు చేస్తున్నా నాలో శత్రువులు కొత్తగా పుట్టుకొస్తూనే వున్నారు. ఎన్నని చంపను? ఏమని చేయను? అయినప్పటికీ నేను చంపుతూనే ఉన్నాను. నేను దేనిని వదలను. ప్రతిదాన్ని చంపేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేనొక హంతకుడిని...! అవును ముమ్మాటికి నేను హంతకుడినే....!!

హరికాంత్ రెడ్డి రామిడి

Sunday 3 January 2016

ధైర్యముందా బాస్...... అయితే అక్కడ చూపించు....!!


మనకు జీవితంలో కొన్ని కొన్ని సార్లు..,  కొన్ని కొన్ని సంఘటనలు  అనుకోకుండా జరిగిపోతుంటాయి... నేను నచ్చే అమ్మాయికి నా భావాలు నచ్చలేదు... నన్ను ఇష్టపడే అమ్మాయిని నేను అంతే ఇష్టంగా కాదనుకున్నాను. ఎక్కడో ఒకచోట సరైన అమ్మాయి సరాసరి మన దగ్గరికే వస్తుందని సమయాన్ని, సమయం నాతో చేస్తున్న సరదాను సంయమనంగా చూస్తూ సంవత్సరం కాదు లేదు అనకుండా గడిపేశాను... కొన్ని సంఘటనలు సడెన్ గా జరిగి ఒక సర్ ప్రైజ్ లాగ మన జీవితంలోకి వస్తుంటాయి. ఇంకొన్ని సంఘటనలేమో మనం కల్పించుకొని మరీ చేస్తుంటాం. అందులో కొన్ని ముగిసిపోతుంటాయి.. అలాంటివి మనం జీవిత కాలనుగమనంలో మరచిపోతుంటాం కూడా... అయితే కొన్ని ప్రత్యేకమైనవి మనల్ని జీవితాంతం వెంటాడుతుంటాయి.. కొన్ని అందులో మధురానుభూతులుగా మిగిలిపోతే మరికొన్నిటికి విషాదాన్ని తోడుగా చేసుకొని వీడ్కోలు పలకాల్సి ఉంటుంది... అలాగే రోజులో ఎంతోమందిని కలుస్తుంటాం... పొద్దున్న నిద్ర లేచిన దగ్గరునుండి రాత్రి పడుకోబోయే వరకు రోజువారీ క్రమంలో ఎంతో మందిని చూస్తాం... ఎంతో మందిని పలకరిస్తాం... అందులో మనకు కావలసిన వాళ్ళు ఉండచ్చు.., చిన్న పిల్లలు ఉండచ్చు.., పెద్దవాళ్ళు ఉండచ్చు.., అబ్బాయిలు ఉండచ్చు..,  "అమ్మాయిలు" ఉండచ్చు.., ఎవరైనా ఉండచ్చు. అందులో కొన్ని పరిచయాలు తాత్కాలికంగా ముగుస్తాయి.. మరికొన్ని కాకతాళియకంగా మనతో శాశ్వతంగా ఉండిపోతాయి... అసలు విషయానికి వస్తే.....

మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడో.... పొద్దున్నే ఏ గుళ్లోనే.., ఏ టిఫిన్ సెంటర్ లోనో.., ఏ కాఫీ షాప్ లోనో.., ఏ రెస్టారెంట్ లోనో.., ఏ షాపింగ్ మాల్ లోనో.., మనం పని చేసే ఆఫీస్ లోనో.., కోట్ల లాటరీ ఫోన్ లో బంపెర్ ఆఫర్ కింద తగిలినట్లు, అదృష్టం ఎక్కువయి ఎగిరితంతే ఏ రాంగ్ కాల్ లోనో.., ఇంకా యూత్ గా చెప్పాలి అంటే ఏ పబ్ లోనో.., ఎదో ఒక రోజు.., ఎక్కడో ఒక చోటా.., ఎవరో ఒక అమ్మాయిని చూస్తాం... ఎక్కడో మనసుకు నచ్చుతుంది...  (కొందరు అనుకుంటారు..ప్రతి అమ్మాయిని చూస్తుంటాం నాకైతే ప్రతి అందంగా ఉన్న అమ్మాయి నచ్చుతుందని... దానికి వేరే పేరు ఉంది దాన్నే కామం అంటారు అది వేరు... ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే మగతనం వేరు.., మనసు వేరు.., మనసులో ఫీలింగ్స్ వేరు)...., (ఇంకా, కొందరంటారు నేను చూస్తాను.., అందాన్ని ఆస్వాదిస్తాను, అక్కడే వదిలేస్తాను అని. "అందాన్ని" ఆస్వాదించే అర్ధవంతమైన అబ్బాయి "బంధాన్ని" గౌరవిస్తాడన్న నమ్మకం ఉంటుందేమో) ఎందర్నో అమ్మాయిలను చూసిన మనకు ఎక్కడోచోట ఒక అమ్మాయి ప్రత్యేకంగా అనిపిస్తుంది.. మనసుకు నచ్చి కళ్ళు జీగెల్ మంటాయి. శరీరం షాక్ కొట్టినట్లు అవుతుంది..,చూపులు బాణాలవుతాయి.., చేతులు చేసిన పనినే మల్లి మల్లి చేస్తాయి... ఆ సమయంలో మన శరీరంలో సరిగ్గా పని చేసే పార్ట్ ఏదైనా ఉంది అంటే అవి కన్నులే..., అమ్మాయి కూడా చూస్తుంది.. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అసలు అమ్మాయి చూస్తుంది అంటే ఆమెకి.., ఆమె మనసుకి తప్ప రెండో వాడికి తెలియనే తెలియదు.. (అమ్మాయి చూపును ఆదివిష్ణువు కూడా కనిపెట్టలేడు) ప్రాచీన యుగం నుండి .., ప్రస్తుత యుగం వరకు అమ్మాయి చూపుకు అర్ధం కనిపెట్టలేదు... కనిపెట్టలేడు కూడా.., కాని ఆ అమ్మాయి చూసే చూపు ఉంటుంది చూడు.., ఆ చూపు ని ఎన్ని బాషలలో వర్ణించిన, ఎన్ని అక్షరాలు ఉపయోగించినా.., ఎన్ని భావాలలో విశదికరించినా..,  ఇంకా తక్కువే అన్న అనుభూతి కలుగుతుంది... ఇద్దరు చూస్తారు చూస్తారు.. చూసుకుంటూనే ఉంటారు... టిఫిన్ షాప్ లో టిఫిన్ చేయటం అయిపోయేంత లోపు... కాఫీ షాపు లో కాఫీ తాగేంతలోపు.... షాపింగ్ మాల్ లో కొనాల్సినవి కొనేసి బిల్ అయిపోయేంతలోపు.., రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చినవి ఆరగించేలోపు.., ఈ చూపులు కొనసాగుతూనే ఉంటాయి........

అక్కడ మొదలవుతుంది అసలు విషయం.. అయిపోయేంతలోపు కొనసాగిన చూపులన్నీ అయిపోగానే మనకు ప్రత్యేకంగా కనిపించిన ఆ అమ్మాయి దూరంగా వెళ్తుంది అని తెలుసుకోగానే.., మనసు మదన పడుతుంది.. యద లోపల యుద్ధం ప్రారంభవుతుంది... అమ్మాయి దగ్గరికి వెళ్లాలా వద్దా.. వెళ్తే భయం, అసలు ఏం అవుతుందోనని.. ఈ సమయంలోనే గడచిపోయిన క్షణాలు తిరిగొస్తే బాగుండనిపిస్తుంది.., ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ దొరికితే బాగుండు అనిపిస్తుంది... ఫాలో అయితే బాగుండు అనిపిస్తుంది.., కాని చేయలేము... సంస్కారం అడ్డొస్తుంది.., భయం భయపెడుతుంది.. సంస్కార భయం, సమాజ భయం రెండూ ఉంటాయి... ఇంకా ఆ ఆధ్యాయం అక్కడితో అంతం అవుతుంది.. ఆ "చిన్న ప్రేమ కథ" అంతటితో ఆగిపోతుంది... అప్పటికప్పుడు పుట్టే ప్రేమ ఎంత వరకు వాస్తవమో మనకు తెలియదు కాని.., ఇలాంటి సంఘటన జీవితంలో ప్రతి ఒక్కరికి తారసపడుతుంది. కానీ కొందరి జీవితాల్లో ఇలాంటి సంఘటనలు సక్సెస్ అయిన సందర్భాలు ఉంటాయి... లైఫ్ లో లక్షణంగా సెటిల్ అయి, "లక్ష్యాలు" తీరిపోయి "లక్షలు" సంపాదించే సమయం వచ్చాక.., ఇంక కావాల్సిన తంతు ఒక్కటే మిగిలి ఉంది అని అనుకున్న ధైర్యశాలి ఇక్కడ ధైర్యం చేయాలి.. అడుగు ముందుకు వేసి అమ్మాయి దగ్గరకి వెళ్ళాలి.. ధైర్యంగా తన ప్రేమను వ్యక్తపరచాలి... ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా.., లేకపోతే ఒక ఓర చూపు చూసేసి వెళ్ళిపోతుందా.., లేక ఒంటి చేత్తో లాగి ఒకటి పీకుతుందా.., ఓర్పు తో నాకు-నీకు సెట్ అవ్వదని సైలెంట్ గా సమాధానం చెప్పి వెళ్ళిపోతుందా..అనేది ఆ తర్వాత ఆలోచన..... అప్పటికప్పుడు అక్కడ కావాల్సింది అడుగు వేయటం.. ధైర్యంగా మాట్లాడటం..... గులాభి ఇచ్చి ప్రపోస్ చేయకపోయినా పర్లేదు... గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని గుక్క తిప్పుకోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకునేలా గుప్పెడంత ప్రేమని చూపించు చాలు... నీ ప్రేమ అక్కడ ఫ్రేమ్ అయినట్లే....!!


హరికాంత్ రెడ్డి