Monday 30 November 2015

చావు భోజనం తిన్నాను....

కన్ను తెరిస్తే జననం... కన్ను మూస్తే మరణం రెప్ప పాటు కాలమే జీవితం సుప్రసిద్ద కవి అన్న మాటలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. సృష్టిలో మనిషి దేనికన్నా భయపడతాడు అంటే అది ముమ్మాటికి చావుకే. చావంటే భయం అనటం కన్నా బ్రతుకు అంటే ప్రీతీ అనటం ఇంకా బాగుంటుందేమో.

చిన్నప్పుడు ఎవరైనా అందరూ బంధువులు వస్తున్నారు అంటే చాలా ఆసక్తిగా ఉండేది. అందరం కలుస్తామన్న ఆనందం ఉండేది. కాని జీవిత కాలానుక్రమంలో అనుభవాలు అన్ని నేర్పాయి. కాసుల వేటలో పడి కాలాన్ని, కాలంతో పాటు కాదనుకున్న వాళ్ళని మర్చిపోయాను. డబ్బులో అందాన్ని, ఆనందాన్ని, ఆప్యాయతను వెతుక్కున్నాను. ఇప్పటికి నాకు ఏదైనా శుభకార్యం అంటే ఎందుకో వెళ్ళటానికి అసలు మనసొప్పదు. కాని ఒక మనిషి సంతోషంలో ఉంటే పట్టించుకోనవసరం లేదు కాని దుఃఖంలో ఉంటె మాత్రం ఒదార్చటం, ధైర్యం చెప్పటం చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది. అందుకే నాకు కావాల్సిన వాళ్ళు సంతోషంలో ఉన్నారంటే వెళ్ళటానికి ఇష్టపడను కాని బాధలో ఉంటె మాత్రం వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. 

ఈ మధ్య నేనొక చావుకి వెళ్లాను. ఆ చనిపోయిన వ్యక్తి నాకు దగ్గర వ్యక్తి కానప్పటికీ, ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరుండే వ్యక్తి నాకు కావాల్సిన వ్యక్తి కావటంతో వెళ్ళవలసి వచ్చింది. దహనం అయిపోయాక సరిగ్గా పదకొండు రోజులకు కర్మ నిర్వహించారు. ఆ కర్మకు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాను సరే అక్కడ ఏర్పాట్లు చూసి అవక్కాయిపోయి ఆనందపడ్డాను. సరిగ్గా పెళ్లి ఏర్పాట్లకు ఎక్కువ కాకుండా ఒక పెద్ద వేడుకకు తక్కువ కాకుండా హౌరా అనిపించారు.

మనం చనిపోయిన వ్యక్తిని గుర్తు చేసుకొని శ్రద్దాంజలి అర్పించటానికి వచ్చామా.., లేకుంటే ఏదైనా మినీ శుభకార్యానికి వచ్చామా అన్నది నాకు మొదట అక్కడ అర్ధం కాని ప్రశ్న. మొత్తానికి అక్కడ తినటానికి అంతే స్థాయిలో లైన్ కట్టటం మరో అర్ధం కాని అవాక్కు. ఏమైతేనేమి నేను ఆ రక రకాల వెరైటీలు ఉన్న భోజనాన్ని ఆరగించి చనిపోయిన వ్యక్తిని మర్చిపోయి అక్కడ చంపేసిన జంతువులతో కూడిన వంటలు కుదిరాయ లేదా అని మాట్లాడుకుంటూ మొత్తానికి నా చావు భోజనాన్ని ముగించాను. చస్తే అన్ని వంటలతో మంచి భోజనాన్ని పెడతారని అప్పుడు నాకు అర్దమైంది. 

హరికాంత్ రెడ్డి