Monday 19 January 2015

ప్రత్యేక కథనం: మన గురించి ఆలోచిద్దాం... మన కోసం అమలుచేద్దాం!!

భారత దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పేదరికం, నాణ్యత లేని విద్య, అవినీతి. భారత జనాభాలో మూడింట రెండొంతుల మంది ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే బ్రతుకీడుస్తున్నారు. 50 శాతం మందికి తాగే రక్షిత మంచినీరు అందుబాటులో లేదు. చాలా మందికి నాణ్యత గల విద్య అందటం లేదు. అమర్త్య సేన్ అన్నట్లు రెండు భిన్నమైన భారత దేశాలున్నాయి. భారత దేశం పేద ధనవంతమైన దేశం. మొదటి దేశం కాలిఫోర్నియా తరహా లో దూసుకెల్తుండగా, రెండవ దేశం ఆఫ్రికా తరహా లో మగ్గిపోతుంది. దీనిలో ఎంతైనా వాస్తవం ఉంది.

మొదట భారత దేశంలో ధనిక మరియు పేద వర్గాల మధ్య అంతరాలను తగ్గించాలి. భారత దేశ జనాభాలో సుమారు 40 కోట్ల మంది కడు బీదలు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇది అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే. అనధికారిక గణాంకాల ప్రకారం ఇంతకంటే రెట్టింపు ఉన్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంక అవినీతి.., అన్ని రకాల అవినీతికి తల్లి వేరు రాజకీయ అవినీతి. పారదర్శకత, జవాబుదారి తనం పటిష్టంగా వ్యవస్థీకరమైన చోట.., అవినీతి అనేది ఉత్తమాట. గణతంత్ర రాజ్యంగా మన భారత్ అవతరించి అరవై ఏళ్ళు దాటినా అంతటి కట్టుదిట్టమైన యంత్రాంగాన్ని నెలకొల్పుకోలేక పోయినట్లే. ఏ పార్టీ పాలన అన్న దాంతో నిమిత్తం లేకుండా అవినీతి పరులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడున్న భారత దేశం ప్రపంచదేశాలకు దీటుగా సరిక్రొత్త సవాళ్ళను పరిష్కరించే దేశంగా నిలదొక్కుకోవాలంటే ముందుగా మనం అవినీతి వేర్లను పెకిలించి వేయాలి. చాలా దేశాల్లో పటిష్టమైన యంత్రాంగాలు ప్రస్పుటమవుతున్న పాలకుల్లోని జడత్వమే జాతికి ప్రమాదహేతువవుతుంది. ప్రమాణం చేసి అబద్ద సాక్ష్యం చెప్పిన అమెరికా అధ్యక్షున్నే బోనేక్కించిన చరిత్ర అమెరికాకు ఉంది. నీతి తప్పిన నేతల ఏలుబడిలో విచ్చల విడిగా పెరిగిన అవినీతి, దేశ ప్రగతిని కరిమింగిన వెలగ పండును చేస్తుంది. అవినీతి ఆట కట్టించాలంటే, బహుముఖ స్థానాల్లో పోరు సాగించాల్సి ఉంటుంది. కానీ అది ఏ విధంగా అన్నది మన ముందున్న అతి పెద్ద సవాలు ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి రాజకీయ పెద్దల దయ దాక్షిణ్యాలకు అతీతంగా దాన్ని తీర్చిదిద్ది ఏ స్థాయి వారినైనా విచారించగలిగే చట్టబద్ద అధికారాలు కల్పించి దాన్ని పార్లమెంట్ కు తద్వారా ప్రజలకు జవాబుదారితనం చెయ్యటం ద్వారా సరైన పద్దతిలో ఆలోచించాలి. నీతులు చెప్పటమే కాకుండా ప్రజలు సైతం అవినీతి అంతంపై నడుము బిగించాలి.

సువిశాలమైన భారత దేశం ఎన్నో సంక్లిష్టతలమయం. విభిన్న పరిస్థితులు, స్థితిగతులు, పరిణామాలు, ప్రమాణాలు అనివార్యం. మంచిని ఎంచుకొని ముందుకు సాగితేనే ప్రయోజనం. ఉజ్వల భారత్ భవిత నిర్మాణానికి గత అనుభవాలే పునాది రాళ్లు. భారతదేశ అభివృద్ధిలో యువత ప్రధాన పాత్ర తప్పకుండ పోషించగలదు. దీనిలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇప్పుడు మన దేశ ప్రధాన మంత్రి "యువకుల" మంత్రం జపిస్తున్నాడన్నా అదే కారణం. అక్షరాస్యత, పర్యావరణం, సామజిక న్యాయం, గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య తారతమ్యాన్ని తగ్గించటం ఇలాంటి అంశాలపై యువత దృష్టి పెడితే త్వరలోనే మన ఇండియా కలాం కలలు కన్నా ఇండియాగా రూపాంతరం చెందుతుంది.

కెరియర్ లక్ష్యం కోసం పని చేసే యువత కుటుంబం, దేశం, సమాజం, సాటి మనిషి కోసం పరితపించి పనిచేయగలదన్నది ప్రజల దృడ నమ్మకం. దేశానికి, సమాజానికి మంచి అందించటానికి యువత సృజనాత్మకమైన పరిష్కారాలతో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువత గుండెల్లో ప్రజ్వరిల్లే మంట ఈ ధరిత్రిలోనే అత్యంత అతి శక్తిమంతమైన వనరు. అలా జ్వలించిన యువత యోచన, ఆలోచన సక్రమంగా సరి అయిన దిశలో సాగితే దేశ ముఖ చిత్రమే అద్భుత రూపాంతరం చెందుతుంది. అందుకే ప్రగతి సాధనకు యువతరం నిష్పాక్షిక దృక్పథం తో ముందడుగు వేయాలి.

యువత అంచనా వేయటానికి కాదు, అన్వేషణ కోసం కాదు, అమలు చేసేందుకు కాదు, స్థిరమైన పనులకు కాదు, వినూత్న కార్యాలకు... అవును యువత వినూత్న కార్యాలకు......

హరికాంత్

No comments:

Post a Comment