Saturday 31 January 2015

'ప్రజల' మధ్య తిరుగుతున్న 'పాశవిక' మృగాలు..!


గుడియాత్తం సమీపంలో ఆరో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన అమానుష సంఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలోని కాంగుప్పం గ్రామానికి చెందిన విజయకుమార్ ఒక నిరుపేద కూలీ. ఇతని రెండో కుమార్తె కీర్తిక మార్చనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు వెళ్లిన కీర్తిక రాత్రి అయినప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ తెలియరాలేదు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చే దారిలోని పెరియాంకుప్పం వద్ద ఉన్న మామిడితోటలో కీర్తిక మృతదే హాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు. కీర్తిక కాళ్లు, చేతులు కట్టి తలపై బాటిల్‌తో కొట్టిన  గాయాలున్నట్లు గుర్తించారు. విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టి వేసి, అత్యాచారం చేసి, తరువాత బాటిల్‌తో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. (Source: Sakshi, Eenadu, Andhra Jyothi, The Hindu)

నల్లని గుర్తులు ప్రపంచ పటం మీద ఇంకా స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి ఇంకా పడుతూనే ఉన్నాయి....  ఎన్నో సంఘటనలు.., ఎన్నో రక్తపు చారలు.., ఎన్నో అత్యాచార ఘటనలు.., రోజుకు రోజుకు ఈ హింసాత్మక సమాజం మరింత హింసాత్మకంగా తయారవుతుంది. ఒక అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం మన భారత దేశం లో ప్రతి 30 నిమిషాలకి ఒక అత్యాచార కేసు నమోదవుతున్నట్లు చెబుతుంది. అందులో మరి ముఖ్యంగా ప్రతి 30 నిమిషాలకు బలయ్యే ఆడపిల్లల్లో 30 శాతం చిట్టితల్లుల ఆర్తనాదాలే ఉండటం మన పాశవికతకు ప్రతీక. నిన్న జరిగిన అతి కర్కశ ఘటన కాలాన్నే తల దించుకునేలా చేస్తుంది. ఒక 11 ఏళ్ళ బాలికతో కొందరు మానవ మృగాలు ప్రవర్తించిన తీరుతో దక్షిణ భారత దేశం ఉలిక్కిపడింది.

అలాంటి వార్తలు చూడటం మనకి కొత్తేమి కాకపోవచ్చు... చాల సార్లు మనం చూసుండచ్చు.. కాని మనం ఎంత వద్దనుకున్న ఎక్కడో మూలన మన మనసు లాగుతుంది. ఎంత వద్దనుకున్న అదే గుర్తొస్తుంది. అణ్యం పుణ్యం తెలియని చిన్నారులు సైతం కర్కషులు ఆడుతున్న క్రామ క్రీడ లో బలైపోతున్నారు. ఎందుకిలా జరుగుతుంది? బంధాలను అనుబంధాలను గౌరవించే భారత దేశంలో ఇలాటి ఘటనలు జరగటానికి కారణం ఏంటి? ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు... అర్ధం అయి, కానటువంటి సమాధానాలు. మరి ఈ సమస్య కు పరిష్కారం చూపించేదేవరు...? ప్రజలను పాలిస్తున్న ప్రభుత్వమా....  ప్రభుత్వంచే పాలించబడుతున్న ప్రజలా.... సమాజంలో, కులానికో మేధావి... మతానికో మేధావి.. వర్గానికో మేధావి ప్రాంతానికో మేధావి అని చెప్పుకు తిరుగుతున్న మహా మేధావులు చెప్తారా.... లేకుంటే ఆ మేధావులు రాత్రి పగలు చెమటోడ్చి రాసిన రాజ్యాంగం చెప్తుందా?? సగటు పౌరుడికి కలిగే ఆవేశం.,ఆక్రోశం.,ఆవేదన ఇది... అదే ఆడపిల్ల ఈ సమాజంపై తిరగబడి విప్లవ నారి అయి విజ్రుంభిస్తే అందుకు ఈ సమాజం సమర్థిస్తుందా? నలుపు రంగు పులుముకున్న న్యాయవ్యవస్థ ఇది న్యాయమేనని నినదిస్తుందా??

పదకొండేళ్ళ చిన్నారి పసి మొగ్గను..., ఇంటికి వెళ్లటానికి బస్సు కోసం ఎదురు చూస్తున్న ఆడపిల్లను..., ఇంటికి బస్సు లో వెళితే అంత సేఫ్ కాదని కర్మ కాలీ క్యాబ్ లో వెళ్ళాలనుకున్న ఆడపిల్లను..., ఇలా ఎన్నో సంఘటనలు...  ఆ సంఘటనల వెనుక సవాలక్ష కారణాలు.., 'ఏ సంఘటన చుసినా ఏమున్నది మానవత్వం...! శరం లేని క్రూరత్వం....!!' వాళ్ళు బలి తీసుకుంటున్నది భావి తరాలను వృద్ధి చేసి.., సృష్టికే ప్రతిసృష్టి చేసే అచెంచల ఆత్మ విశ్వాసం కలిగిన అతివలని తెలియదా..?? ఆ అతికర్కొటక ప్రబుద్దులు తాము ఆకాశం నుండి ఊడిపడలేదని, తమకు, తమ బ్రతుక్కు ఒక ఆడదే అర్దాన్నిచ్చిందన్న విషయం తెలియదా..??
ఇలాంటప్పుడే ప్రజాస్వామ్యం ఇలాంటి ప్రబుద్దుల మధ్య బ్రతకలేదని అనిపిస్తుంది. ఇలాంటప్పుడే న్యాయవ్యవస్థ నాలుగు గోడల మద్య నలిగిపోతుంది... ఇలాంటప్పుడే తనను తాను రక్షించుకోవటానికి సగటు ఆడపిల్లకు, తన అరచేతే ఆయుధమైతే బాగుండనిపిస్తుంది... కాని ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రశ్నలను ప్రశ్నార్థకాలు గానే మిగులుస్తున్నాయేమో అన్న అభిప్రాయం కలుగక మానదు. ఏవైనా కొన్ని సంఘటనలు జరిగాక గానీ కొన్ని రోజులు హడావుడి చేసే ప్రభుత్వం వీటికి శాశ్వత పరిష్కారాలు చూపించేదపుడనీ, ఆడపిల్లల అనుమానాలను నివృత్తి చేసేదేపుడని మహిళా లోకం ప్రశ్నిస్తుంది.

అత్యాచార ఆలోచన ఉన్న ప్రతి అర్దాయుషు అనామకుడికి అమ్మాయిని చూస్తున్నపుడు అమ్మ గుర్తుకు రావాలి. ముఖ్యంగా మహిళల్లో ఆడతనాన్ని మాత్రమే చూడకుండా అమ్మతనాన్ని కూడా చూడటం ఈ సమాజం అలవర్చుకున్నపుడే ఈ అకృత్యాలు ఆగుతాయి... ప్రభుత్వాలే కాదు ప్రజల ఆలోచనా ధోరణీ మారాలి.... అంటే ఆ దిశగా ప్రతి ఒక్కరిలో పౌర చైతన్యం రావాలి. ఆ పౌర చైతన్యానికి ప్రభుత్వం ముందడుగు వేయాలి.

ఈ డిసెంబర్ 16 తో నిర్భయ ఘటన జరిగి సరిగ్గా ఏడాది పూర్తి కావస్తుంది. దేశంలో అలాంటి నిర్భయలెందరో బలయ్యారు. వారి కోసం.., వారి కుటుంబసభ్యుల కన్నీరును ఆపటం కోసం ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు మేల్కొనాలన్నదే మా ఉద్దేశం.. నిర్భయ లాంటి.., అభం శుభం తెలియని చిన్నారుల లాంటి.., అసువులు బాసిన ఆడబిడ్డలందరి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ.... 

నల్లని మరకలు పడుతున్నాయి మన దేశం మీద.., కాదు కాదు మన బంగారు తల్లుల మీద...,నిమిషానికి ఒక్కటి...
పడితే పడనీ., మన వాంఛ తీరిందని తృప్తి పడదాము..!
స్నేహితుడే మోహితుడై కిరాతకుడవుతున్నాడు., ప్రేమికుడే పామై కాటేస్తున్నాడు.,
బంధువే రాబందువై మీద పడి తార్చుతున్నాడు., చివరికి కని పెంచిన కన్న తండ్రే కరుణ లేని కసాయివాడై కరుస్తున్నాడు...
ఆదమరచి నిద్రిస్తున్నాయి నేటి అనుబంధాలు..
నిద్రపొనీ., మన వాంఛ తీరిందని తృప్తి పడదాము..!
కామ వ్యాధి పట్టిన కాల యములు సమాజ కారడవిలో కామ క్రీడ ఆడుతుంటే నిర్లజ్జగ చూస్తుంది ఈ మా'లోకం'., మదం పట్టిన మగ జాతి మిమ్మల్ని చెరపట్టగా నిస్సిగ్గుగా చూస్తుంది ఈ న'సమాజం'.. చూడనీ., మన వాంఛ తీరిందని తృప్తి పడదాము..!
ఆడదనే అమ్మ ఉన్నంతవరకు మల్లి మల్లి పుడతారు... ఆ ఆడదానికే సమాధి కడతారు.
గల్లి గల్లికి పెట్టిన గాంధి బొమ్మలు సిగ్గుతో తల దించుకుంటున్నాయి... కన్న కలల్ని కోల్పోయి కన్నీటికి ప్రతిరూపంగా మారుతుంది మా కన్న ఆడ తల్లి...
మారని., మన వాంఛ తీరిందని తృప్తి పడదాము..!
ఇంకా కంపు కొడుతున్నాయి అత్యాచారానికి గురై అతి కర్కశంగా హత్య గావింపబడ్డ మా చిట్టితల్లుల మృతదేహాలు...
కొట్టనీ., ఆ వాసనలను సువాసనలుగా మార్చుకొని మళ్ళి మళ్ళి ఆ దేహాన్ని చిద్రం చేద్దాము.. మన వాంఛ తీరిందని తృప్తి పడదాము..!!

హరికాంత్

No comments:

Post a Comment