Saturday 31 January 2015

అబ్బాయి-అమ్మాయి చిన్న ప్రేమ కథ....

సరదాగా చిన్న ప్రేమ కథ...

బంధాలు భవబంధాలు అనుబంధాలు కొన్ని సార్లు విచిత్రంగా అనిపిస్తాయి... దగ్గరగా ఉన్న దూరంగా ఉంటాయి. దూరాన్ని తగ్గించేకొలది దగ్గర దూరమవుతుంది... మనిషి ఈ స్వార్థపు నీడ నుండి దూరం జరిగే వరకు అనుభంధాలు కనుమరుగవుతూనే ఉంటాయి. ‪రూపాయి‬ వెనకే ఉండే మరో రూపం 'మని'షి.... అవును మరీ మనిషి ఎప్పుడూ రూపాయి కోసం పరుగెత్తే నేటి సమాజంలో మనిషి ఒక యాంత్రికమైన వస్తువే అంటే అతిశయోక్తి కాదేమో...  కానీ ఆ మనిషి అనే వస్తువుకు కూడా ఎదో 'ఒక బంధం' మరువలేని "అనుబంధంగా" మిగిలిపోతుంది. ఒక మంచి బంధం అంటే ఆడపిల్ల గురించే చెప్పుకోవాలేమో...!! అవును మరి ఆడపిల్లలకు అనురాగం విలువ తెలిస్తుంది, ఆప్యాయత విలువ తెలుస్తుంది.., ఆ ఆడపిల్ల ఉన్నచోట అనుభంధాలు ఉంటాయి.. ఆడపిల్ల ఉన్నచోట ఆనందం ఉంటుంది. అసలు ఆడపిల్ల అంటేనే ఆనందం... ఆడపిల్లను ఆనందాన్ని వేరుగా చేసి చూడలేమేమో!! తను ఉన్న చోట ఆహ్లాదం ఉంటుంది. హాస్యం ఉంటుంది... వెన్నెల వెలుగుల్లాంటి చిరునవ్వులుంటాయి...ఆ చిరునవ్వుని గుర్తు చేసుకుంటే మనకి చిమ్మని చీకట్లో కూడా మిరుమిట్లు కొలిపే కాంతి కనిపిస్తుంది...
తన ముద్దు ఒక వరం.. మనల్ని "ఎక్కడికో" తీసుకుపోయే "ఒక్క చూపు" ఎన్నో జన్మల పుణ్య ఫలం.. తనో వర్షపు చుక్క...వర్షం వస్తుందనగానే సంతోషంతో ఒళ్ళు ఎలా పరవశిస్తుందో ఆడపిల్ల అనగానే పెదాలపై చిరునవ్వు తొణికిసలాడుతుంది.. ఈ పుడమి ఇంకా మన భారాన్ని మోస్తుంది అంటే దానికి కారణం పడతి. రెండిళ్ళకు వారధైన ఆడపిల్ల ఈ లోకానికి శ్రీరామ రక్ష.... అలాంటి ఆడపిల్ల ఒకేసారి తన సకల కళలు చూపిస్తే, కోపం, బాధ, సంతోషం, కన్నీరు, భయం, ప్రేమ,  అన్ని ఒకేదగ్గర చూసే అదృష్టం కలిగితే.....

స్థలం: ఢిల్లీ...,

అది ఢిల్లీలోని ఒక ప్రధాన వాణిజ్య స్థలం.., బిజీ బిజీ నగరం, బిజీ బిజీ బ్రతుకులు.., ఒక్కసారి ప్రపంచం ఆగిపోతే బాగుండని ప్రతి మనిషికి అనిపిస్తుంది. ఒక అబ్బాయి.... ఒక అమ్మాయి... వారిద్దరిని అతిదగ్గరగా పరిశీలించిన మరో అబ్బాయి. అతని భావ వ్యక్తీకరణలో ఆ అబ్బాయి అమ్మాయి గురించి ఒక్కసారి, ఒక్క క్షణం, కొన్ని మాటలు....

ఒక అబ్బాయి ఒక వ్యక్తిగత పని మీద ఒక కార్యాలయంలో పని ముగించుకొని వేరే పనిపై స్నేహితుని కోసం ఒక ప్రధాన కేంద్రం దగ్గర ఎదురు చూస్తున్నాడు. చాలా సేపు అక్కడ ఎదురు చూసిన అతనికి విసుగొస్తున్న సమయంలో.., అతని చరవాణికి తన స్నేహితుని నుండి కాల్ వచ్చింది...  అతని స్నేహితుడికి  కొంచెం ఆలస్యం అవుతుందని వేచి చూడకుండా భోజనం చేయమని దాని సారాంశం... యధావిధిగా ఒక నిట్టుర్పు విడ్చి అతను అన్న 'భోజనం' అనే మాట వీనులవిందు గానే ఉన్నప్పటికి అంత భోజనం అనే పదానికి సరితూగే పదార్థాలు అక్కడ (మళ్ళి ఢిల్లీ వంటి మహా నగరంలో ఎక్కడని వెతుకుతాడు) ఏమి దొరకవు కావున ఎప్పటిలాగానే ఇన్ స్టాంట్ ఫుడ్ కోసం వెతికాడు. గత 3 సంవత్సరాలుగా అతని  కష్ట సుఖాల్లో, అతని లాభ నష్టాల బేరిజులతో... అతని వాణిజ్య విషయాల్లో చేదోడు వాదోడుగ నిల్చినటువంటి KFC వైపుకు అతని మనసు మళ్ళింది. దగ్గరలోనే ఉండటం వల్ల తొందరగా వెళ్లి అతడు ఎప్పుడూ ఇచ్చే ఆర్డర్ ఇచ్చి తీసుకొని వచ్చి హాయీగ నింపాదిగా ఒక మంచి స్థలం చూసుకొని కూచున్నాడు....అ అబ్బాయి అంత అమాయకుడు కాదేమో ఎందుకంటే అమ్మాయిలందరూ కూర్చొనే దగ్గర వచ్చి వారిని చూస్తూ ఇటు తన తిండిని, అటు అమ్మాయిలను చూస్తూ నయనానందం పొందుతున్నాడు......

అంతలో ఒక జంట... ఆ జంటను వర్ణించాలంటే మాటలు చాలవు... పదాలు ఏరులై..,సిరిపువ్వులై పారాలి... అంత అద్బుతంగా ఉన్న ఆ  ప్రేమ జంట.....,

ప్రేమ పక్షులకు ప్రతి రూపమైన ఆ జంట సరిగ్గా అతని ముందు టేబుల్లో కూర్చొని ఉండటంతో పరిశీలనగా చూసాడు.... ఇద్దరు మౌనంగా కూర్చొని ఉండటం గమనించాడు. వాళ్ళిద్దరికీ ఏదో గొడవ జరిగిందని వారి మొహంలో హావ భావాలను చూస్తే అతనికి అర్థమైంది... అలా ఒక్క పది నిమిషాల తర్వాత..

కాసేపు ఆ జంట అలా ఉన్న తర్వాత ఆ అ జంట లోని అబ్బాయి, అమ్మాయి చేతిను పట్టుకొని క్షమించమని అడిగాడు.., ఆ అమ్మాయి ఒక్కసారిగా చేతు విసిరి కొట్టింది.. తర్వాత ఆ అబ్బాయి పట్టు వదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు... ఈ ప్రయత్న సందర్భంలో కొంచెం సేపు రోజులో అదో భాగం అన్నట్లుగా కంట కన్నీరు పెట్టింది. ఏదో ఒక విధంగా తన కష్టాలు తను పడి ఆ అమ్మాయిని శాంతింపజేశాడు... తర్వాత ఇంకా నోటికి రెండు విధాల పని చెప్పటం స్టార్ట్ చేసింది... ఒక విధంగా తిండితో మరో విధంగా వినేవాడు ఉంటె పుష్కర కాలమైన ఇంకా మెదడులో చెప్పాల్సినవి ఇంకా ఏవో మిగిలిపోయాయి అన్నట్లుగా ఉండే తన మాటలతో ఆ అబ్బాయిని ఆ భయంకరమైన వాగుడితో హూరేత్తిస్తుంది. మధ్యలో ఏదో కుర్చీ పడి పెద్ద శబ్దం వస్తే ఉలిక్కిపడి ఇదిగో "రా" అని తెచ్చుకున్న "భయాన్ని" ఆ అబ్బాయి చేతు పట్టుకొని చూపించింది. (ఇంతకు మించి వాఖ్యలు చేస్తే ఇక్కడ మా తెలుగు విశేష్ సెన్సార్ ఒప్పుకోదేమో..!) ఆ భయం నుంచి తెరుకున్నట్టుగా ఆమె కి అనిపించి తేరుకొని మల్లి తనకు మాత్రమే వర్తించే వారసత్వపు హక్కుగా తన వాగుడు ప్రవాహాన్ని కొనసాగించింది.. మధ్య మధ్యలో కొనుక్కుని తెచ్చుకున్న నవ్వుతో ఆ అబ్బాయి కొన్ని వింటున్నాడు. కొన్ని విన్నట్టుగా నటిస్తున్నాడు. మాటల మధ్యలో ఆ అబ్బాయి ఏదో బాగుంది కదాని ఎవరో అమ్మాయి వైపు చూసి చూడనట్టుగా చూస్తే అది గమనించి, ఆమె ఆవేశంగా ఒక్క చూపు చూస్తే ఆ చూపుతోనే సగం చచ్చాడు ఆ అబ్బాయి. మల్లి యధా విధిగా ఒక సారీ అనే పదాన్ని తన దగ్గర అయిపోయి పక్క వాళ్ళ దగ్గర అరువు తీసుకోచినట్టుగా చెప్పాడు... మల్లి యధావిధి గానే ఒక "చిన్న నవ్వు" నవ్వింది... తను ఇచ్చే నవ్వుతో ఈ ప్రపంచాన్నే కోనేయచ్చాన్న ధీమా ఆ అబ్బాయిలో కల్పించి లేచింది. వెంటనే ఆ అబ్బాయి కూడా తన చేతు అందుకొని కూడా వెళ్ళిపోయాడు.

నిజంగా ఈ అనంత విశ్వం లో ముందుగా ఆడజీవే పుట్టిందని అనటానికి ఆధారాలు లేకపోయినప్పటికీ నేటి ఆధునిక ఆడపిల్లను చూసే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడెమో అనిపిస్తుంది. ఒక్క రోజులో కాదు కాదు ఒక్క గంటలో కాదు కాదు ఒక్క సెకన్ లో నవరసాలు చూపించగల గొప్ప నైపుణ్యం నేటి ఆధునిక యువతీలో తప్ప ఎక్కడ చూడగలం అని మనసులో ఒక చిన్నమూలన దాచిపెట్టుకున్న భావాన్ని అణగదొక్కి ఢిల్లీ లో ఆ జంట ను చూసిన ఆ అబ్బాయి అతని స్నేహితుని కాల్ రాగానే హడావుడిగా లేచి అతని వ్యక్తిగత పని గుర్తొచ్చి ఈ రోజు ఏదో కొత్త విషయం కనుక్కున్న ధీరుడిలా అతనికి అతడే ఫీల్ అయిపోతు పని అనే చట్ర బంధంలో ఇరుక్కోటానికి బయలుదేరాడు.... మళ్ళి ఈ బిజీ బ్రతుకుల ప్రపంచంలో బిజీ బిజీగా గడపటానికి.....  

హరికాంత్

No comments:

Post a Comment