Monday 19 January 2015

ప్రత్యేకం: మెరుపు తీగతో మెరుపు లాంటి ట్రాఫిక్ ప్రేమ కథ

మనకు జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు అనుకోకుండా జరిగిపోతుంటాయి... కొన్ని కొన్ని మనం కల్పించుకొని మరీ చేస్తుంటాం. అందులో కొన్ని ముగిసిపోతుంటాయి.. అలాంటివి మనం జీవిత కాలనుగమనంలో మరచిపోతుంటాం కూడా... అయితే కొన్ని ప్రత్యేకమైనవి మనల్ని జీవితాంతం వెంటాడుతుంటాయి.. కొన్ని అందులో మధురానుభూతులుగా మిగిలిపోతే మరికొన్నిటికి విషాదాన్ని తోడుగా చేసుకొని వీడ్కోలు పలకాల్సి ఉంటుంది... అలాగే రోజులో ఎంతోమందిని కలుస్తుంటాం... పొద్దున్న నిద్ర లేచిన దగ్గరునుండి రాత్రి పడుకోబోయే వరకి రోజువారీ క్రమంలో ఎంతో మందిని చూస్తాం... అందులో కొన్ని పరిచయాలు తాత్కాలికంగా ముగుస్తాయి.. మరికొన్ని కాకతాళియకంగా మనతో శాశ్వతంగా ఉండిపోతాయి... అసలు విషయానికి వద్దాం.....

మనం జీవితంలో చాలా ప్రయాణాలు చేస్తుంటాం... కొన్ని ప్రయాణాలు మన జీవితాన్ని కొన్ని అనుకోని మలుపులు తిప్పుతాయి. ఆ మలుపులు కూడా ఒక్కోసారి మర్చిపోలేని మధురానుభుతులుగా మారతాయి. ఇప్పుడో చిన్న సంఘటన గురించి మాట్లాడుకుందాం....
ఒక యువకుడు చిన్న ప్రయాణం చేస్తుండగా.... ఆ ప్రయాణం కొంత ఆసక్తికరంగా, ఆ యువకుడికి అభికాంక్షకు తగినట్లుగా తన పయనం కొనసాగితే......

సంఘటన జరిగిన మొదటి రోజు.....
స్థలం: హైదరాబాద్ శివారు ప్రాంతం....
సమయం: శీతాకాల సాయంత్రం సరిగ్గా 7 గంటలు కావస్తుంది..... అందరు తమ తమ పనుల నుండి ఇంటి గూటికి ఎప్పుడు చేరుకుంటామా అని హడావుడి పడుతూ ఆలోచనల్లోని ఆకాంక్షలు వెచ్చగా, పరిసరాలు చల్లగా ఉన్న సమయం..

ప్రస్థానం మొదలయ్యింది..... ఒక యువకుడు తన బైక్ మీద ఆఫీస్ లో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు..... అప్పటికే ఆలస్యం అవటంతో కొంచెం వేగంగానే వెళ్తున్నాడు..., రోజులాగే అతని గమనం నిరంతర ఆలోచనలతో నిరాటంకంగా సాగుతుంది.., అంతలో తన బైక్ పక్క నుండే ఒక అమ్మాయి తన స్కూటీ మీద మెరుపు తీగలా వెళ్ళటం గమనించాడు. ఆ యువకునికి వేగం అంటే ఇష్టమయి ఉండటం చేత సహజంగానే ఆ అమ్మాయి అతని దృష్టి లో పడింది... కాని ఆ అమ్మాయి ఇంకాస్త వేగం పెంచటంతో ఇతనికి ఆశ్చర్యం ఆవేశం రెండూ కలిగి తన బైక్ వేగాన్ని కూడా పెంచాడు. అతనికి ఆశ్చర్యం కలిగేదేంటంటే ఆ అమ్మాయి అంత ట్రాఫిక్ లోనూ చాల చాకచక్యంగా తన బైక్ ను నడుపుతుంది. ఇద్దరు వేగంగా వెళ్తూ ఒకరి దృష్టిలో ఒకరు పడ్డారు. ఆ వెంటనే సిగ్నల్ పడటంతో ఆ అమ్మాయి ఆగింది.. ఆ అబ్బాయి గమనిస్తూ గమనిస్తూ.., ఆ అమ్మాయి పక్కనే తన బైక్ ని తీసుకెళ్ళి ఆపాడు. అప్పుడు కలిసాయి చూపులు.... ఆ అమ్మాయి చాలా దూరం నుండి ఆ అబ్బాయిని గమనిస్తూ వస్తుంది. కాని గమనించి గమనించనట్లుగా చూసింది. అమ్మాయి కూడా అప్పుడప్పుడు చూస్తుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అసలు అమ్మాయి చూస్తుందంటే ఆమెకి.., ఆమె మనసుకి తప్ప రెండో వాడికి తెలియనే తెలియదు.. అంతే కదా అమ్మాయి చూపును ఆదివిష్ణువు కూడా కనిపెట్టలేడు. కాని ఆ అమ్మాయి చూసే చూపు ఉంటుంది చూడు ఆ చూపుని ఎన్ని బాషలలో వర్ణించిన కానీ ఇంకా తక్కువే అన్న అనుభూతి కలుగుతుంది... చూసుకుంటున్నారు చూసుకుంటున్నారు...., చూసుకుంటూనే ఉన్నారు.

ఇంతలో గ్రీన్ సిగ్నల్ కూడా పడింది. మల్లి రెండు బైక్ లు వేగాన్ని అందుకున్నాయి... ఆ అమ్మాయి చాలా వేగంగా వెళ్తుంది. ఆ యువకుడు తన మనసు వేగంతో పాటు బైక్ వేగాన్ని పెంచుతున్నాడు. ఆ అమ్మాయి బైక్ కు ఉన్న అద్దంలో ఆ అమ్మాయి చంద్రబింబం లాంటి చక్కనైన ముఖాన్ని చూసాడా అబ్బాయి. ఇంకేముంది ఆ అబ్బాయికి ఏదో ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. ఎప్పుడూ లేని ఒక ఉత్తేజితానుభుతి కలిగింది. అమ్మాయిని చూసిన ఆ అబ్బాయి ఆనందం ఆకాశము హద్దులు తాకుతున్నట్లుగా అనిపిస్తుంది... ఆ అబ్బాయికి.., ఆ అమ్మాయి కన్నులు స్వయంగా దేవుడే తన హస్తాన్ని ఉలిగా చేసుకొని చేక్కినట్లుగా ఉన్నాయి.. ఆ అమ్మాయి చూపు చంద్రున్నయిన ఒక్క క్షణం భూమి చుట్టూ తిరగటం మర్చిపోయేలా చేస్తుందేమో అన్న అనుభూతిని ఆ అబ్బాయికి కలిగిస్తుంది. ఇంక అబ్బాయి తను చేరుకునే గమ్యాన్ని మరిచాడు. కాని అదృష్టం కొద్ది ఆ అమ్మాయి వెళ్తున్న వైపే ఇతని గమ్యస్థానం ఉండటం గమనార్హం. ఇంతలో మరో సిగ్నల్ రానే వచ్చింది.. తుమ్మెద ఎక్కడుంటుంది అంటే పువ్వు పక్కనే అన్నట్లుగా... మల్లి తన బైక్ ను ఆ అమ్మాయి బైక్ పక్కనే ఆపాడు, ఈ సారి ఇంకాస్త దగ్గరగా.., మల్లి చూపులు కలిసాయి.... ఆ అమ్మాయి చూపులు ఆ అబ్బాయి మనసును అగాథం లో పడేస్తున్నాయి.. కాని ఆ చూపు ఉంది చూడు... అసలు అమ్మాయి చూపుల గురించి పుస్తకం రాయాలి అంటే ఈ ప్రపంచం సరిపోదేమో... . ఆ చూపుల వల్ల అబ్బాయిలకు మనసులో ఏదో మాయ ప్రారంభమవుతుంది, శరీరం షాక్ కొట్టినట్లు అవుతుంది.... ఆ సమయంలో మన శరీరంలో సరిగ్గా పని చేసే పార్ట్ ఏదైనా ఉంది అంటే అవి కన్నులే..., ఇంతలో ఆ అమ్మాయి తన గమ్య స్థానానికి చేరువ అవుతున్నట్లు ఆ అబ్బాయికి అనిపించింది.

అయ్యో ఎలా ఆ అమ్మాయిని మళ్ళి ఎలా కలవాలి... ప్రయాణం అయిపోయేంతలోపు కొనసాగిన చూపులన్నీ ప్రయాణం అయిపోగానే ఆ అబ్బాయి మనసు మదన పడుతుంది.. యద లోపల యుద్ధం ప్రారంభమయ్యింది...  ఈ సమయంలోనే గడచిపోయిన ప్రయాణ క్షణాలు మరొక్కసారి తిరిగొస్తే బాగుండు అనిపించింది ఆ అబ్బాయికి .., ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ దొరికితే బాగుండనిపిస్తుంది... కాని ఎలా ఆ అబ్బాయి మనసు లో ఒకే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. "ఎలా?" అనే ఒకే ప్రశ్న తన మనసులో తనే ప్రశ్నించుకుంటున్నాడు. "ఎలా?" అనే ప్రశ్ననే ప్రశ్నిస్తున్నాడు "ఎలా?" అని......  ఇద్దరు మెల్లిగా వెళ్తున్నారు. ఆ అమ్మాయి బైక్ ఏదో వైపుకు తిరిగిన తానూ తిరుగుతున్నాడు. తన చూపులే ఆ అబ్బాయి మనసును తాకుతున్నాయి... ఇద్దరి ప్రయాణాలు కొనసాగుతున్న క్రమంలో..... ఆ అమ్మాయి బైక్ వేగాన్ని పెంచటం చేత, అదే సమయంలో ఆ ట్రాఫిక్ లో కొంచెం నేర్పు తో తన బైక్ ను ఆ అమ్మాయి నడపటం చేత ఆ అమ్మాయి ని ఆ యువకుడు అందుకోలేకపోయాడు. ఇంక రోడ్డు కనిపించినంత దూరం ఆ యువకుడి కళ్ళు ఆ అమ్మాయి కోసం వెతకటం ఆరంభించాయి. కాని అతని ప్రయత్నానికి ప్రయోజనమే లేకుండా పోయింది. అతని అభిలాష ఆరంభంలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇంక చేసేది లేక నిదుర పట్టనీయని జ్ఞాపకంతో, నిరుత్సాహంతో తన మనసును తనే నిందించుకుంటూ ఆ యువకుడు వెనుదిరిగాడు. ఇంక అక్కడితో ఆ సంఘటన పరిసమాప్తంగానే పరిగణించాడు.

సంఘటన తాలుకు కొనసాగింపు రోజు (రెండవ రోజు):
స్థలం: హైదరాబాద్ శివారు ప్రాంతం
సమయం: అటు ఇటుగా సాయంత్రం 7 గంటలు

ప్రస్థానం మొదలయిన రెండవ రోజు...... ఆ యువకుడు అదే సమయంలో ఆఫీస్ నుండి ఇంటికి బయల్దేరాడు. ఆ రోజు పెద్దగా ఆలోచనలు లేవు. ఆలోచనల్లో ఆకాంక్షలు లేవు... ఆ రోజు తన హృదయం వేగం తగ్గింది.., హృదయ వేగం తో పాటు బైక్ వేగమూ తగ్గింది. ఆ పయనం పరమ బోర్ గా సాగుతున్న సమయం. అప్రయత్నంగానే ఆలోచన ముందు రోజు చూసిన అమ్మాయి మీదకు వెళ్తుంది. కానీ మనసు వద్దని వారిస్తుంది. ఆలోచనే ఆలోచించమని అర్థిస్తుంది. మనసు రెండు వైపులా మారాం చేస్తూ ఆ మగువ కోసం మనసులోనే మౌనంగా మదన పడుతుంది. నిరుత్సాహంగానే ఆ యువకుడు సగం దూరాన్ని భారంగా చేరుకున్నాడు. ఒకానొక దగ్గర సిగ్నల్ పడటంతో ఓపిక తెచ్చుకొని మరీ ఆగిన సమయం... ఆ అమ్మాయి ఆలోచన నుండి మనసును మరిపించటానికి మస్థిష్కం మర్దన చేస్తున్న సమయం.... ఆవేశం అసహనం రెండూ అంతరాల్లోంచి ఎగసిపడుతున్న తరుణం..... యథాలాపంగానే ఆ అబ్బాయి చూపులు పక్కకి తిరిగాయి. ఆ చూపు ఒక మలుపు.. ఒక్కసారిగా అతని కళ్ళలో ఆశ్చర్యం. సరిగ్గా ముందు రోజు చూసిన అమ్మాయి.... పక్కనే పది అడుగుల దూరంలో ఉంది. ఒక్కసారిగా అబ్బాయి ఆవేశం ఆసక్తిగా, అసహనం ఆనందంగా మారింది. నరాలు జివ్వున లాగుతున్నట్లు అనిపించింది. ఒక మంచి అనుభూతి ఆకాశం లో నాట్యం చేస్తుంది. ఆలోచనలు అరక్షణంలో ఈ ప్రపంచాన్ని చుట్టేలా పరిగెడుతున్నాయి. హృదయం వేగమందుకుంది...... నిజంగా ముందు రోజు చుసిన అమ్మాయి మల్లి ఆ తర్వాత కనిపించటం యాదృచ్చికమే అయినప్పటికీ అన్ని కోట్ల మందిలో అదే అమ్మాయి మళ్ళి ఆతర్వాత కూడా అదే యువకుని కంటబడటం కూడా నిజంగా ఒక అద్భుతమే,ఇంకో పక్క ఆశ్చర్యమే....

అంతలో సిగ్నల్ పడటంతో  బైక్ తన వేగాన్ని పెంచుకొని గెలుపు గుర్రమై ఆ అమ్మాయనే గమ్యానికి పరుగులు పెడుతుంది. ఈ సారి ఎలాగైనా ఆ అమ్మాయి ని అందుకోవాలనే ఆతృత ఆసక్తి రెండూ కలగలసి మనసును తొందర పెడుతున్నాయి. అందుకే బైక్ వేగాన్ని పెంచి సరిగ్గా ఆమె బైక్ కి ముందు రెండు అడగుల దూరంలో ఆ యువకుడు వెళ్తున్నాడు.. ఆ యువకుని బైక్ అద్దంలో ఆ అమ్మాయి అందాన్ని ఆస్వాదించే విధంగా.... ఆ అమ్మాయి కూడా అబ్బాయిని గమనించింది. కాని ఆ అమ్మాయి ముఖంలో ఏ విధమైన హావభావాలు కనిపించలేదు. ఇంక ఆ అబ్బాయి తనను గుర్తించలేదేమో అన్న ఆందోళనతో కొంచెం తన బైక్ వేగాన్ని తగ్గించాడు. మళ్ళి ఆ అమ్మాయి వెనకగా వచ్చాడు. ఆ అమ్మాయి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. ఇంకా ఆ యువకుడి ఆనందం అధిరోహినై అంబరాన్నంటే విధంగా అవని హద్దులు చెరిపేస్తుంది. ఆ అమ్మాయి బైక్ కు ఉన్న అద్దంలో ఆమె వదనం వెన్నెలలా ప్రకాశిస్తుంది. అలానే చూస్తూ తన బైక్ వేగాన్ని పెంచాడు... ఈ సారి కూడా ఆమె తన కనుల నుండి కరిగిపోకుండా.... అదే సమయంలో ఆ అమ్మాయి బైక్ అద్దంలో ఆ అమ్మాయి పెదాలపై చిరునవ్వు ను గమినించాడు. ఒహో ఆ చిరునవ్వు చిద్విలాసమై చీకట్లు లేని చిన్న లోకాన్ని సృష్టించబోతుందన్నట్లుగా ఉంది. ఆ అధరాలపై అమృతాల్లాంటి పలుకులు కదలాడతాయని ఆ చిరునవ్వు కమనీయంగా కనిపించి చెప్తుంది...... అసలా అందం అద్భుతం చేత అద్భుతమని అనిపిస్తుంది. తను వెనకాల ఉన్నప్పుడు వయ్యారమైన ఆ వాలు జడ ఉంది చూడు ఆ జడ లోనే ఆమె అందమంతా దాగుందా అనిపిస్తుందా ఆ యువకునికి.. తను ఉన్న ఒక్క పది క్షణాలు ఆ అబ్బాయి ప్రపంచాన్ని మురిపించి మైమరిపించి తనను ఆసాంతం అయోమయంలో పడేసిన అమ్మాయికి, అమ్మాయి అందానికి ఆ అబ్బాయి (హృదయ) అంతరంలోనే అందానిభివందనం అర్పించాడు.

అలానే ఆ రెండు బైక్ లు తమ గమనాన్ని కొనసాగిస్తున్న సమయంలో, గమ్య స్థానం కూడా చేరువవుతున్న సమయంలో..,  ఈ సారి ఆ అమ్మాయిని ఎలాగైనా కలిసి మాట్లాడాలని యదలోపల యుద్ధం మళ్ళి ప్రారంభమైన తరుణంలో, ఆ అమ్మాయినే తన గమ్యస్థానంగా మార్చుకున్న వేళలో...  ఆ అమ్మాయి బైక్ నే ఆ యువకుడు అనుసరిస్తున్నాడు. ఆ సమయంలో ఆ అబ్బాయి మనసులో ఒకటే ఆలోచన.., ఆ అమ్మాయిని కలుసుకోవటం.., ఆ అమ్మాయి తన గమ్యస్థానానికి చేరువ కావటానికి సమయం ఆసన్నమైంది.

ఆ అమ్మాయి గమ్యస్థానం ఎక్కడ దగ్గరపడుతుందో అని అతని మనసు భారమవుతున్న వేళా.., చివరికి ఆ అమ్మాయి గమ్యస్థానం రానే వచ్చింది.., అమ్మాయి అలా తన బైక్ ఆపగానే ఆ అబ్బాయి ఈ లోకంలోకి వచ్చాడు, ఇంతకి ఇక్కడ విశేషం ఏంటంటే ఆ అమ్మాయి బైక్ ఎక్కడో ఆగలేదు, ఆ అమ్మాయి గమ్యస్థానం ఎక్కడో లేదు. ఆ అబ్బాయి ఉండే అపార్ట్ మెంట్ ముందుండే ఇంటిలో ఆ అమ్మాయి బైక్ ఆగింది. ఓ పక్క ఆనందం మరో పక్క భయం.. ఆ అమ్మాయితో ఎలా మాటలు కలపాలా అని...,  ఆ అమ్మాయితో ఒక్కసారి మాట్లాడితే బాగుండనిపిస్తుంది, అమ్మాయి దగ్గరికి వెళ్లాలా వద్దా.. వెళ్తే భయం అసలు ఏమవుతుందోనని..., ఆ సమయంలో ఆ అబ్బాయి గుండె చప్పుడు ఆ అబ్బాయికే వినిపించేంత నిశ్యబ్ద వాతావరణం ఆ పరిసరాల్లో, ఆ అబ్బాయిలో కూడా.., ఆ అమ్మాయి ఇంకా ఆ ఇంటిముందే ఉంది.., యదలోపల యుద్ధం తారాస్థాయికి చేరింది.. ఆ అబ్బాయికి వెళ్లి మాట్లాడాలనిపిస్తుంది., కాని మాట్లాడలేడు,  అప్పుడు ఆ అబ్బాయికి సంస్కారం అడ్డొస్తుంది.., భయం భయపెడుతుంది.. సంస్కార భయం సమాజ భయం రెండు ఉన్నాయి... ఇంకా ఆ ఆధ్యాయం అక్కడితో అంతం అయినట్లు అనిపించింది.. ఆ చిన్న ప్రేమ కథ అంతటితో ఆగిపోతుందని అనిపించింది... "చక్రాల" మీద పుట్టిన ప్రేమ జీవితమనే సహజ సిద్దమైన "చక్రంలో" కలిసిపోయిందని అనిపించింది. అప్పటికప్పుడు పుట్టే ప్రేమ ఎంత వరకు వాస్తవమో తెలియదు కాని..,  కొందరి జీవితాల్లో ఇలాంటి అనుకోని ప్రేమ సంఘటనలు సక్సెస్ అయిన సందర్భాలుంటాయి... లైఫ్ లో లక్షణంగా సెటిల్ అయి ఇంక కావాల్సిన తంతు ఒక్కటే మిగిలి ఉంది అని అనుకున్న ధైర్యశాలి ఇక్కడ ధైర్యం చేస్తాడు.. అడుగు ముందుకు వేసి అమ్మాయి దగ్గరకి వెళ్తాడు.. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఒప్పుకుంటుందా లేకపోతే ఒక ఓర చూపు చూసేసి వెళ్ళిపోతుందా అనేది ఆ తర్వాత ఆలోచన.. అప్పటికప్పుడు అక్కడ కావాల్సింది అడుగు వేయటం...  ధైర్యం చేయటం....

(దీనిలో మిగతా భాగం కొనసాగితే కచ్చితంగా ఆ కమ్మని కథను మీకు చేర వేస్తాను)

హరికాంత్ :-)

No comments:

Post a Comment