Saturday 31 January 2015

ప్రత్యేక కథనం: అబ్బాయి ముందు అమ్మాయి-అమ్మాయి ముందు అబ్బాయి



ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. మనతో మాట్లాడుకుందాం.., మనసుతో మాట్లాడుకుందాం....

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికిన తోడొకరుండిన అదే భాగ్యమా అదే సౌఖ్యమా...!! సుప్రసిద్ద కవి అన్న మాటలు ఒక్కసారి గుర్తొచ్చాయి... నిజమే మనల్ని మనల్నిగా ప్రేమించే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు. మనల్ని ప్రేమించే బడే వాళ్ళు ఉంటే కదా.., మనం ప్రేమించబడేది....!!

మనకు తెలిసిన కుర్రాడో, మన పక్కింటి అబ్బాయో, లేదా మన బంధువులబ్బాయో, లేదా మనమే అనుకుందాం మనలో ఒకరని అనుకుందాం. ఎవరో ఒకరు మామూలు సగటు యువకుడు తన జీవితంలో ఎన్నో అవాంతరాలు దాటితే కానీ తన మైలు రాయిని చేరుకోలేడు. యువకుడు ఎంత అద్బుతమైన పదం. శక్తి ఉడుకు వేగం, ఆవేశం, నిర్లక్షం, ఉద్రేకం, ఆకర్షణ, కెరటం, పందెం ఇలా ఎన్నో పర్యాయ పదాలు యువకునికి.. మరి ఏముంది ఆ యువకునిలో ఆకాశానికి నిచ్చెనలు వేయగల దమ్ముంది. కలలు కనే స్వేఛ్చ ఉంది. 'కిరణా'లని కెరటాలని అరచేత్తో అదిమి పట్టగల బలముంది.  ఒక యువకుడు తన యవ్వన కాలం లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటాడు.... కిందపడతాడు, లేచి ప్రయాణం సాగిస్తాడు.. మళ్ళీ పడతాడు.. నిజానికి పడ్డదే ఎక్కువ ఉంటుంది. అయితే అన్నాళ్ళ ఆ యువకుని ప్రయాణంలో అతనికి అర్డమయ్యేదేమిటంటే జీవితంలో సక్సెస్ అవడానికి మామూలు టాలెంటు ఉంటే సరిపోదనీ, ఆకాశాన్నంటే ప్రతిభ, ఆకాశాన్ని తాకినా అక్కణ్ణుంచీ ఎగరాలనే పట్టుదలా, నిరంతర సాధనా... ఇవి కావాలనీ అర్ధమవుతుంది. కొద్దిగా సమయం తీసుకుంటుంది. కొన్ని త్యాగాలూ  చేస్తాడు. కసి, పట్టుదల, ఎదగాలనే ఆకాంక్షతో లక్ష్యాన్ని సాధించాలనే  తపనతో మరుగున పడిపోతున్న ప్రతిభను, మరచిపోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ ప్రోదిచేసుకోని ఒక్కసారి ప్రపంచానికి మనమెంటో చాటి చెప్తాం. ఎందుకంటే మనం యువకులం చాటి చెప్పటమే కాదు వెలుగెత్తి చాటాలి కూడా.., మన ప్రధాన మంత్రి కూడా 'భారత దేశ యువకులనే' తన సైన్యంగా ఫీల్ అయిపోతూ ప్రపంచ దేశాల సదస్సులలో ఎన్నో వేదికలపై దడ దడ లాడే తన ప్రసంగాలతో హోరేత్తిస్తున్నాడు. అదీ యువకుని సత్తా, సామర్థ్యం. అదీ మనకే ఉంది. మనలోనే ఉంది.

ఇక యువకుల సగటు 'లక్ష్యాలు' తీరిపోయి 'లక్షలు' సంపాదించే వయసు వచ్చాక ఇంక., అంత ఓకే రా జీవితం, అనుకున్న దశలో ఒక ప్రశ్న ఎదురవుతుంటుంది.... అలాగే ఒక సవాలు ఎదురవుతుంది. ఆ సవాలును చేదించి సాధిస్తేనే.., ఆ సాధించిన దానితో మిగతా జీవితం దేదిప్యమానంగా వెలిగిపోతుంది. దేనికైనా సమాధానం ఇచ్చి దీటుగా ఎదుర్కొనే యువకుడు ఆ ప్రశ్నకు, ఆ సవాలుకు మాత్రం ఎం సమాధానం చెప్పాలో కూడా అర్ధం కాదు. ఆ సవాలే "పెళ్లి.." అవును మరీ...  పెళ్లి నవ యువకుడి జీవితంలో అతిపెద్ద సవాలు.., ఒకప్పుడు ఈ సవాలు అమ్మాయిలకు ఉండేది. కాని తర్వాత అబ్బాయిలకు కాలనుగమనంగా మారుతూ వచ్చింది. తల్లిదండ్రులు ఆ విషయంలో ఒత్తిడి చేస్తూ ఉంటారు... 'ఏర చూడమంటావా పెళ్లి సంబంధాలు...?' ఇదీ ప్రశ్న.. లేదా ముందే ఎవరినైనా వెతికి పెట్టుకున్నావా? ఈ తరంలో ఇదో కొత్త్త మాట. మొట్ట మొదట అమ్మ అడుగుతుంది ఏరా నాన్న నీకు పెళ్లి చేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది రా... అందుకేరా మా ఈ బాధ అంతా..!! ఏంటో పెళ్లి చేయటం వాళ్ళకి బాధో.., బాధ్యతో.., అర్ధం కాదు. పోను పోను ఇంకా ప్రశ్నలు పెరిగిపోతాయి తప్ప తరగవు. పోను పోను తల్లిదండ్రుల నుండే ఎదుర్కొన్న ప్రశ్నను.., బంధువులు, బంధువుల నుండి సన్నిహితులు.., ఎవరి నుండైన ఈ ప్రశ్న ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆ క్షణం మనకు నచ్చిన అమ్మాయి ఉంటె వెంటనే చెప్పేస్తాం... (సగటు యువకులు చేసే పని). లేదు అంటే ఒక మాములు యువకుడు ఇచ్చే సమాధానం అదేం లేదమ్మా 'మీరే చూడండి మీకు "సరే" అని అనిపిస్తే చెప్పండి' అని చెప్తాడు. అదే సమయంలో ఈ మాటను కూడా ప్రయోగిస్తాడు 'నేను కూడా ఒకసారి మీరు చూసిన అమ్మాయితో మాట్లాడి ఓకే చేసేస్తా' అని తల్లిదండ్రులతో నిక్కచ్చిగా చెప్పేస్తాడు. అవును.., ఇది 'ఈ తరం' మాట. తన తల్లిదండ్రులు స్వయంగా చూసి 'ఓకే' చెప్పిన అమ్మాయిని తను కూడా కలిసి  మాట్లాడనుకుంటాడు. ఎందుకంటే జీవితం అనే పూదోటను ఇద్దరు పంచుకోవాలి. అందుకే మొదట మాటలు పంచుకొని మనసులు తెలుసుకోవాలని ఆరాటపడతాడు. పూలల్లో అవలీలగా దొరికే పూలు ఉంటాయి మరికొన్ని పూలు ముందు ముళ్ళను దాటితే కానీ దొరకవు. అవలీలగా దొరికిన కానీ.., అతికష్టంగా దొరికినా కాని అంతిమంగా కావాల్సింది ఒక మంచి అర్థవంతమైన అనుబంధం. ఏది ఏమైనా తల్లిదండ్రుల నుండి ఏదో ఒక రోజు వర్తమానం వస్తుంది....., 'అమ్మాయి మాకు బాగా నచ్చింది మంచి సంప్రదాయమైన కుటుంబం నువ్వు ఒకసారి "ఆ అమ్మాయితో మాట్లాడి సరే" అంటే మేము ముహూర్తాలు.., ఇతర విషయాల గురించి మాట్లాడుకుంటామని "ఆ అమ్మాయి కూడా నీతో మాట్లాడాలి" అని చెప్పిందట! అని మనకు తల్లిదండ్రులు గుండెలో రాయి వేసినట్లు చెప్తారు. (ఇందులో కొత్తదనమేమి లేదు తర తరాల నుండి వస్తున్నదే) కాకపోతే 'అప్పుడు ఇళ్ళల్లొ, మరియు కోటలలో మాట్లాడుకునేవారు. పూర్వ యుగంలో చెలికత్తెలు తోడురాగా చెలికాడి చక్కనమ్మ వివరాలన్నీ రాబట్టేవాడు', పైగా అప్పటి ఆ విలుకాడిలో సకల విద్య కళలు ఉట్టిపడేవి. ఆ ధీరుడి ధైర్య పరక్రమాలన్ని చూసిన తర్వాతే చిక్కని చక్కనమ్మ తన చెక్కిలిలొ.., బుగ్గన సిగ్గు తెచ్చుకొని చెలికాడికి చిరునవ్వు విసిరేది. అదే చిరునవ్వు తల్లిదండ్రులకు ఇంకోకటి 'కాపీ' ఇచ్చేది. ఇంక వెంటనే పెళ్లి భాజాలు మొగేవి. అయితే అది అప్పుడు....  మరిప్పుడు...???

కలియుగంలో మాత్రం వింత పోకడలు పుట్టుకొచ్చాయి. కాలం మారింది.. కాలంతో పాటు మనమూ మారాము..!! అప్పుడు కోటల్లో...,  ఇప్పుడు కేఫ్ ల్లో, కె.ఎఫ్.సి ల్లో, కాఫీడేల్లో, రెస్టారెంట్ లలో ఇంకా ఎక్కువ మాట్లాడితే పబ్బుల్లో.. తల్లిదండ్రులు తధాస్తు అనేసి 'ఓకే' అనేసిన అమ్మాయిని మనం చూడాల్సి వస్తుంది. తనతో మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు ఆ క్షణం 'అమ్మ మాట' మనసులో గుర్తొస్తు ఉంటుంది....., 'ఏరా ఈ అమ్మాయిని ఓకే చేసేయి రా.. చాలా బాగుంటుంది. మంచి సంప్రదాయం రా'  అని అరిగిపోయిన టేప్ రికార్డర్ లా అనునిత్యం అదరగొడుతునే ఉన్న మాట'.......  ఇంక ఏదో ఒక రోజు ఆ క్షణం రానే వస్తుంది ఆ అమ్మాయిని చూసే రోజు....  

పెళ్లి చూపుల ఘట్టం.. ఇది ప్రతి యవ్వనుడికి ప్రధాన ఘట్టం. ఎందుకంటే ఇదో అనుభూతి. అలాగని దీనిలో మొత్తం 'తీపే' ఉండదూ బాసు..!! కొన్ని సార్లు మనం "వెళ్లిన చోట" మన ఊహకు విరుద్దంగా కొంత చేదు కూడా కలగలిసి ఉంటుంది. కదన రంగానికి వెళ్ళే వీరసైనికుడి మల్లె మనకు ఈ ఘట్టం కూడా కదన రంగాన్నే తలపిస్తుంది. ఎందుకంటే మన మనసుతో మనమే పోరాడుతాం. మొత్తానికి అమ్మాయి దగ్గరికి వెళ్ళటానికి సిద్దమవుతాం.

చక్కగా స్నానం చేసిన చేయకపోయినా చక్కగా బట్టలు మాత్రం వేసుకొని, ఉరిమే ఉత్సాహంతో ఉరుకులు పెట్టె మనసుతో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఊరించే  మనసుతో.., లేని పోనీ 'పాష్' ను మన మాటల్లో వ్యక్తపరుస్తూ ఒక కొత్త వ్యక్తిని మనలో మనం చూస్తూ అమ్మాయి ముందుకు వెళ్తాం. కానీ ఒక్క మాట అప్పుడు ఆ క్షణంలో కొన్ని మాటలు మనం జ్ఞప్తికి తెచ్చుకోవలేమో.....  "ఎవర్ని మోసగించడానికి? ఎవర్ని మభ్యపెట్టడానికి? మనం మనంగా ప్రపంచానికి కనిపించినప్పుడే కదా గౌరవమైనా! అవమానమైనా!! మరీ అంత కృత్రిమత్వం మనిషికి అవసరమా? నువ్వు నువ్వుగా ఈ లోకానికి కనిపిస్తే తప్పేమిటసలు.."  మనం ఆ అమ్మాయి దగ్గర మనం మనంగా కనిపిస్తే చాలేమో..., లేని పోనీ డంబారికాలు మనల్ని ఇబ్బందుల పాలు చేస్తాయి తప్ప.. మనల్ని తదుపరి ఘట్టానికి తీసుకెళ్లవు. అందుకే అక్కడ ఆ క్షణం మనం మనంగా కనిపించటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే అక్కడ మనం చూసే అమ్మాయి.., మనం మాట్లాడే అమ్మాయి..., మనతో జీవితాంతం కలిసుండి మన జీవితానికే ఒక అర్ధాన్నిచ్చే అమ్మాయి... అలాంటి అమ్మాయి ముందు.., మనం మనంగా కనిపిస్తే తప్పేమిటసలు... అలా కనిపించినపుడే కదా.. మన నిజమైన మనసులు నిజంగా కలిసి ఒక బలమైన బంధాన్ని ఏర్పరచి బతుక్కు ఒక అర్ధాన్ని ఇస్తాయి. ఒక సగటు యువకుడు తన యవ్వన కాలంలో ఎందర్నో అమ్మాయిలను చూసి ఉండచ్చు కాని ఎక్కడోచోట మనకు రాసి పెట్టిన అమ్మాయి, మనకు ప్రత్యేకంగా కనిపించే అమ్మాయి తగులుతుంది. అప్పుడు ఆ క్షణం ఆ అమ్మాయిని చూసినప్పుడు మనసు మదన పడుతుంది.. యద లోపల యుద్ధం ప్రారంభవుతుంది.... శరీరం షాక్ కొట్టినట్లు అవుతుంది.., చూపులు బాణాలవుతాయి.., చేతులు చేసిన పనినే మల్లి మల్లి చేస్తాయి... ఆ సమయంలో మన శరీరంలో సరిగ్గా పని చేసే పార్ట్ ఏదైనా ఉంది అంటే అవి కన్నులే..., చూస్తూ ఉంటాము చూస్తూనే ఉంటాం.. అలా ఆమయిని చూస్తున్నపుడు.., ఒక్కసారి మన ఆలోచనలు మందగిస్తాయి. కాలం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. మన హృదయం ఒక 'పుటగా'.., మన కన్నులు 'కలంగా' మారి ఆద్యంతం మైమరిపించి బంగారు అక్షరాలతో మన మనసు అనే అధ్యాయంలో ఒక పేజి ని సృష్టిస్తాయి.  

మొదటిసారి..., మొట్ట మొదటి సారి...,
తను మొదటి సారి తనతో మొదటిసారి...
నయనాలు తన కోసం నాట్యం చేస్తుంటాయి.... మనసు తొందర పడుతుంది... హృదయం ఉరకలేస్తుంది... ఆలోచన మందగిస్తుంది... ఎక్కడో తన శ్వాస మనల్ని స్పృశిస్తుంది.... తనని చూసి ఆనందం ఆకాశపు హద్దులు తాకమంటుంది... తనే తలంపు.... ఎక్కడ తనెక్కడ అన్న ప్రశ్న మనల్నే ప్రశ్నిస్తూ ఉంటుంది.
రానే వస్తుంది ఆ సమయం..
ఆ అబ్బాయి ముందుగా అమ్మాయి.... ఆ అమ్మాయి ఎదురుగా అబ్బాయి...
మనసు వినీలాకాశంలో విహరిస్తూ ఉంటుంది...  ఎలా వర్ణించాలని అనిపిస్తుంది... పికాసో ముందు పెయింటింగ్ వేయమంటే ఎలా ఉంటుంది.. బిల్ గేట్స్ ముందు బిజినెస్ మాట్లాడమంటే ఎలా ఉంటుంది...
చేతులు వణుకుతుంటాయి.., కాళ్ళు తడబడుతుంటాయి... మరెవ్వరు కనిపించరు...  కేవలం ఇద్దరు మాత్రమే ఆ గదిలో ఉన్నారేమో అని.., అసలు ఈ లోకంలో తామిద్దరమే ఉన్నామేమో అన్న అబ్బాయి మాయ లోకం నుండి అమ్మాయి విసిరిన బాణం లాంటి ఒక్క చూపు.., దాన్నుండి బయటపడేస్తుంది...
ఓహో ఆ అందం.... తన కన్నులు స్వయంగా దేవుడే తన హస్తాన్ని ఉలిగా చేసుకొని చేక్కినట్లుగా ఉంటాయి..
తన చూపు చంద్రున్నయిన ఒక్క క్షణం భూమి చుట్టూ తిరగటం మర్చిపోయేలా చేస్తుందేమో..
తన మొహంలో అమాయకత్వం... తన మాటల్లో అమృతం... చివరిగా వెళ్ళేప్పుడు.., మనసు భారమవుతున్న వేళా., తను తిరిగినప్పుడు వయ్యారమైన ఆ వాలు జడ ఉంటుంది చూడు బాసు ఆ జడ లోనే అమ్మాయి అందమంతా దాగుందా అని అనిపిస్తుంటుంది...
అమ్మాయి ఉన్న ఒక్క పది క్షణాలు అబ్బాయి ప్రపంచాన్ని మురిపించి మైమరిపించి ఆసాంతం అతన్ని అయోమయంలో పడేసిన ఆ "అమ్మాయి" అందానికి "అబ్బాయి" వందనం అందానిభివందనం.

ప్రపంచంలో ఎందరో అబ్బాయిలు తమ తల్లిదండ్రుల మాటకి గౌరవిస్తూ.., తమ అభిప్రాయాన్ని వాళ్ళకి అర్ధమయ్యేలా విశదీకరిస్తూ ఎంతో పరిణతిని కనబరిచి తమ బలానికి "భార్య" అనే బలం జోడించుకుంటున్న యువకులకు అభినందనలు. మన ముందు తరాల వారు పెళ్లి "చూపుల" నుండి "చూపులు" ఆగిపోయేంతవరకు ఎన్ని సందేహలోచ్చిన, ఎంత కోపమొచ్చిన కాని వందేళ్ళు కష్ట సుఖాలని తమవిద్దరివే(ఆలు మగలు) అనుకున్నారు... కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. ఎన్ని అవాంతరాలు వచ్చిన.., ఎన్ని అడ్డుగోడలచ్చిన అవన్నీ వారికి అడ్డు కాలేదు.. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మనకు వెలకట్టలేని ఆలు మగల బంధం గూర్చి భవిష్యత్ తరాలకు నేర్పినటువంటి అటువంటి ఎందఱో మహా దంపతులకు "ఈ తరం అబ్బాయి అమ్మాయి" శతకోటి వందానిభివందనాలు....

హరికాంత్

No comments:

Post a Comment