Monday, 30 November 2015

చావు భోజనం తిన్నాను....

కన్ను తెరిస్తే జననం... కన్ను మూస్తే మరణం రెప్ప పాటు కాలమే జీవితం సుప్రసిద్ద కవి అన్న మాటలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. సృష్టిలో మనిషి దేనికన్నా భయపడతాడు అంటే అది ముమ్మాటికి చావుకే. చావంటే భయం అనటం కన్నా బ్రతుకు అంటే ప్రీతీ అనటం ఇంకా బాగుంటుందేమో.

చిన్నప్పుడు ఎవరైనా అందరూ బంధువులు వస్తున్నారు అంటే చాలా ఆసక్తిగా ఉండేది. అందరం కలుస్తామన్న ఆనందం ఉండేది. కాని జీవిత కాలానుక్రమంలో అనుభవాలు అన్ని నేర్పాయి. కాసుల వేటలో పడి కాలాన్ని, కాలంతో పాటు కాదనుకున్న వాళ్ళని మర్చిపోయాను. డబ్బులో అందాన్ని, ఆనందాన్ని, ఆప్యాయతను వెతుక్కున్నాను. ఇప్పటికి నాకు ఏదైనా శుభకార్యం అంటే ఎందుకో వెళ్ళటానికి అసలు మనసొప్పదు. కాని ఒక మనిషి సంతోషంలో ఉంటే పట్టించుకోనవసరం లేదు కాని దుఃఖంలో ఉంటె మాత్రం ఒదార్చటం, ధైర్యం చెప్పటం చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది. అందుకే నాకు కావాల్సిన వాళ్ళు సంతోషంలో ఉన్నారంటే వెళ్ళటానికి ఇష్టపడను కాని బాధలో ఉంటె మాత్రం వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. 

ఈ మధ్య నేనొక చావుకి వెళ్లాను. ఆ చనిపోయిన వ్యక్తి నాకు దగ్గర వ్యక్తి కానప్పటికీ, ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరుండే వ్యక్తి నాకు కావాల్సిన వ్యక్తి కావటంతో వెళ్ళవలసి వచ్చింది. దహనం అయిపోయాక సరిగ్గా పదకొండు రోజులకు కర్మ నిర్వహించారు. ఆ కర్మకు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాను సరే అక్కడ ఏర్పాట్లు చూసి అవక్కాయిపోయి ఆనందపడ్డాను. సరిగ్గా పెళ్లి ఏర్పాట్లకు ఎక్కువ కాకుండా ఒక పెద్ద వేడుకకు తక్కువ కాకుండా హౌరా అనిపించారు.

మనం చనిపోయిన వ్యక్తిని గుర్తు చేసుకొని శ్రద్దాంజలి అర్పించటానికి వచ్చామా.., లేకుంటే ఏదైనా మినీ శుభకార్యానికి వచ్చామా అన్నది నాకు మొదట అక్కడ అర్ధం కాని ప్రశ్న. మొత్తానికి అక్కడ తినటానికి అంతే స్థాయిలో లైన్ కట్టటం మరో అర్ధం కాని అవాక్కు. ఏమైతేనేమి నేను ఆ రక రకాల వెరైటీలు ఉన్న భోజనాన్ని ఆరగించి చనిపోయిన వ్యక్తిని మర్చిపోయి అక్కడ చంపేసిన జంతువులతో కూడిన వంటలు కుదిరాయ లేదా అని మాట్లాడుకుంటూ మొత్తానికి నా చావు భోజనాన్ని ముగించాను. చస్తే అన్ని వంటలతో మంచి భోజనాన్ని పెడతారని అప్పుడు నాకు అర్దమైంది. 

హరికాంత్ రెడ్డి

Sunday, 4 October 2015

సౌకర్యం లేని స్టైల్ ఎందుకో....?! (వనితల వస్త్ర ధారణపై వ్యక్తిగత అభిప్రాయం)



అమ్మాయి అందంగా ఉండాలి... ఉండాలంటే మంచి డ్రెస్ వేయాలి. ఆ డ్రెస్ వల్ల తనకు అందం రావాలి. ఆ అందంతో చుట్టూ ఉన్న వాళ్ళను ఆకట్టుకోవాలి. సరే ఇంతవరకు బానే ఉంది మరీ.....!! మరీ ఆ డ్రెస్ వల్ల ఇతరులు ఆమ్మాయి పట్ల ఆకర్షితులు అవుతున్నారు కరెక్టే....!! మరి తన పరిస్థితి ఏంటి....!? ఆ అమ్మాయి సౌకర్యంగా ఉందా? అసలు సరిగ్గా అక్కడే ఆలోచించాల్సిన ప్రశ్న.... ఈ రోజు కార్ లో జుబ్లిహిల్ల్స్ నుండి ఇంటికి వెళ్తుండగా ట్రాఫిక్ లో వస్తుంటే చూసాను... ఒక అమ్మాయి మామూలుఒక పొట్టి టీ షర్టు వేసుకొని ఎం చక్కా ద్వి చక్ర వాహనం పై కూర్చుంది.. ముందు ఎవరో వ్యక్తి నడుపుతున్నారు. దాదాపు ఒక నాలుగు కిలోమీటర్లు గమనించాను. చాల అవస్థ పడుతుంది. ఆ టీ షర్టు ఊరకే పైకి లేస్తుంటే మల్లి సర్దుకుంటుంది. అలా ఒక వంద సార్లు చేసి ఉంటుంది. ఆ టీ షర్టు ని సర్దుకోలేక సరిగ్గా కూర్చోలేక.., తన అవస్థ వర్ణనాతీతం. ఆమె తన ఇల్లు చేరుకునే సరికి ఇంకా ఎంత అవస్థ పడుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఇలాంటి సంఘటనలు చాలా మంది అమ్మాయిలు ఎదుర్కొని ఉంటారు. సరిగ్గా ఇలాంటి ఇంకొక సంఘటన రాత్రి ఎక్కిన బస్సులో ఒక వింత డ్రెస్ ధరించి ఎక్కిన ఆ అమ్మాయి తన వస్తువులను చక్కగా తన సీట్ పై ఉన్న సెల్ఫ్ లో సర్దుకుంది. పొద్దున్న బస్సు చేరాల్సిన చోటుకి చేరుకుంది. అందరు ఎవరి వస్తువులను వాళ్ళు తీసుకొని బస్సు దిగటానికి సిద్దమవుతున్నారు. కాని ఆ అమ్మాయి మాత్రం తన వస్తువులను తీసుకోలేకపోతుంది. అచ్చం ఒక సినిమాలో చూపించినట్లుగా తెగ అవస్థ పడుతుంది. బస్ లో ఉన్న ఎవరో ఒక అబ్బాయి ఆ అమ్మాయి అవస్థని గమనించి ఆ అమ్మాయి సామాన్లని తీసి ఇచ్చాడు. ఇంకోదరేమో ఆఫీసులలో ఉద్యోగాలు చేస్తారు... ప్రత్యేకంగా కనిపించాలనుకొని తమ అలకంరణ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆఫీసు రాగానే అది అసౌకర్యంగా ఉండటంతో చాలా ఇబ్బంది పడతారు. ఎదుటివాళ్ళ ముందు కనిపించాలి అంటే తమను తాము మరొకసారి సరి చేస్కొని వాళ్ళకు కనిపిస్తారు. ఆ అసౌకర్యాన్ని అయిన అలవోకగా తట్టుకుంటారు కాని అలంకరణని మాత్రం వదిలిపెట్టరు.

ఎప్పుడు కాని ఒక ఆడపిల్ల ధరించే వస్త్ర విధానం తనకు సౌకర్యంగా ఉందా లేదా అని చూసుకోవాలి కాని స్టైల్ గా ఉందా లేదా అని కాదేమో...! సౌకర్యంగా ఉన్న వస్త్ర ధారణ ఎదుటి వాళ్ళను ఆకర్షించలేకపోవచ్చు. కాని అదే ఎదుటి వాళ్ళు మనల్ని "అదో రకంగా" చూడకపోతే చాలు. ఇదివరకే ఒక ఉన్న్నత స్థాయి డిజిపి అధికారి సైతం ఒకానొక సందర్భంలో అమ్మాయిల వస్త్ర ధారణ పై సంచలనాత్మక వ్యాఖ్యలు చేసి.., తన మాటల్లో తప్పుంటే క్షమించమని.., కాని తన వ్యాఖ్యల్లో మాత్రం కొంత నిజముందని బహిరంగంగా ప్రకటించాడు. కనీసం ఇప్పటికైనా మహిళా సంఘాల్లో, మేధావుల్లో అమ్మాయిల వస్త్ర ధారణ పై చర్చ జరగాల్సిన అవసరం ఉందేమో. మహిళల్లో ఆడతనాన్ని మాత్రమే చూడకుండా అమ్మతనాన్ని కూడా చూడటం ఈ సమాజం అలవర్చుకున్నపుడే సమాజం బాగుంటుంది! కాని అదే సమాజంలో మంచి తో పాటు సమానంగా చెడు కూడా ప్రయాణిస్తూ ఉంటుదన్న సంగతి మరువకూడదేమో!! అంటే ఆ దిశగా ప్రతి ఒక్కరిలో పౌర చైతన్యం రావాలి!! పాశ్చాత్య దేశాల సంస్కృతి ని మన భారత నారీమణులు అనుసరించటం లో తప్పేమీ లేకపోవచ్చు. కాని మన దేశ సంస్కృతి ని మరచిపోకూడదు! భారతీయ యువతులు వారి వారి వస్త్ర ధారణ పట్ల పున్హసమిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందేమో!!


హరికాంత్ రెడ్డి

Tuesday, 8 September 2015

ఎక్కడ ఆగానంటే తన అందం దగ్గర ఆగాను....


అబ్బ ఏమందం... అందమా అది....  ఆ అందమైన సౌందర్యం ఇంకా నా కళ్ళల్లో కదలాడుతుంది. డబ్బు చుట్టూ తిరుగుతున్న నా ప్రపంచం, లెక్కలేస్తున్న నా ప్రపంచం తన అందానికి మాత్రం లెక్కంటూ లేనే లేదని చెప్పింది.... ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచనతో ఉండే నా ప్రపంచం తన అందం దగ్గర ఆగిపోయింది.  కాదేమో నేనే తన అందం దగ్గర నా ప్రపంచాన్ని ఆపాను. సంపాదన చుట్టూ ఉరకలేస్తూ పరుగెడుతున్న నా వేగం తన అందం దగ్గర ఆగమని ఆరాటపడింది. ఆ బొమ్మని చెక్కిన బ్రహ్మకే ఆ అపురూపం రూపు దిద్దుకునెప్పుడు ఈర్ష కలగలేదా అనిపించింది. 

ఏమని వర్ణించను తన అందాన్ని.... తన చూపు ఒక వరం... తన నవ్వు ఒక నిండు చందమామ... తన పెదాలను చూస్తూ ఈ లోకంలో పూలు ఉన్నాయన్న సంగతే మర్చిపోతాను... తనను చూస్తూ ఈ ప్రపంచాన్ని జయిస్తాను., తనను చూస్తూ ఈ ప్రపంచాన్ని జయించాననే ఆనందాన్ని మర్చిపోతాను., తనని చూస్తూ ఆనందానికే ఆనందం అంటే ఇదని చెప్తాను., తనని చూస్తూ అందానికే కొత్త నిర్వచనం ఇస్తాను., తనను చూస్తూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లో అందం అంటే ఆమె అని, కొత్త పదాన్ని చేరుస్తాను., తన నృత్యాన్ని చూస్తూ నలుదిక్కులను ఒకే దిక్కుకు తీసుకొస్తాను., తన అందాన్ని ఇంకా అందంగా చూపించటానికి తన అందాన్ని ఆకాశానికి ఆశ పెట్టి అమృతం కురిపిస్తాను., సుతిమెత్తని పూలపై తన పాదం పెట్టి ఆ పూలకే అందం తెప్పిస్తాను., ఆ అందానికే అసలైన అందానిచ్చిన  వయ్యారంగా వంపులు తిరిగినటువంటి ఆ నడుముని చెక్కిన బ్రహ్మకి నాస్తికులచే బ్రహ్మోత్సవం జరిపిస్తాను.,  ముద్దు ముద్దుగా చెక్కిల్ల్లతో కూడిన ఆ చేమంతి పూవంటి చందం... తొలి పొద్దు కిరణాల స్పర్శకి విచ్చుకున్న పొద్దు తిరుగుడు పువ్వుకు అందమంటే అదని అందంగా ఆ అందాన్ని చూపిస్తాను.,

ఆధునికత అంటూ ఆగమైపోతున్న ఈ లోకంలోకి ఆశ్చర్యంగా వచ్చింది నా లోకంలోకి.... అందానికి అసూయ పుట్టలేదా తనని చూసి...! అచ్చ తెలుగమ్మాయంటే కవుల రాతల్లోనో, కళాకారుల ఆకృతుల్లోనో ఉంటాయనకున్నా కాని, నా అభిప్రాయం తప్పేమో అనిపించింది. మెరుపులా మెరిసింది తన అందంతో... పచ్చటి పైరులా, పెరటిలోన సీతకోకచిలుకలా... అయ్యో ఆ అందం... ఒక అద్భుతం.., అపురూపం.., అమూల్యం..., 

హరికాంత్ రెడ్డి

Monday, 7 September 2015

భారత గడ్డ భారతీయుల కోసం.... 'బయటి' వారి కోసం కానే కాదు....!!


భారత దేశం భిన్న సంస్కృతుల దేశం.., విభిన్న వర్గాలతో అనునిత్యం ప్రశాంతతే పరమావధిగా దేశం విరాజిల్లుతుంది... కొన్ని కొన్ని సార్లు స్వల్ప చేదు సంఘటనలు మినహా దేశం ఎప్పుడు ప్రశాంతతే కోరుకుంటూ వచ్చింది.... అది ముమ్మాటికి భారతీయుల గొప్పతనం. భారత దేశ ప్రజలు శాంతి కాముకులని ప్రపంచానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని హింసించి పరిపాలించిన బ్రిటిష్ వాడి పైనే మనం చేయేత్తలేదు. శాంతికి అసలైన వారసుడు గాంధి నేతృత్వంలో ఎంతో ఓపికతో స్వతంత్రాన్ని సాధించుకున్న భారతీయులం మనం...

ఇంత గొప్ప చరిత్ర కలిగి ఉన్న మనకు.. ఇప్పుడు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మొత్తం తమ పాలన విధానాలతో దేశ ప్రజల స్థితి గతుల పైనే ప్రభావం చూపిస్తున్నాయేమో అన్న భావం కలిగేలా వ్యవహరిస్తున్నాయి. కొన్ని సార్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రజల అస్థిత్వాన్నే ప్రశ్నిస్తున్నాయి....

నైజీరియన్లు.... ఇప్పుడు భారత దేశంలో పాతుకుపోయిన ఒక వలస వర్గం... దాదాపు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో చదువు పేరుతో, వివిధ పనుల పేరుతో దేశంలో ఎన్నో అరాచక పనులు చేపడుతున్న ఈ దేశస్తులు ఇప్పుడు దేశంలోని కొన్ని ప్రాంతాలలో రాజ్యమేలుతున్నారు... మొన్నటికి మొన్న దేశంలో ఎంతో పేరు కలిగిన ఒక ఐపిఎస్ అధికారి పేరు వాడుకొని లక్షల్లో మోసం చేశారు... ఏ దినపత్రిక చూసిన.., ఏ టి వి ఛానల్ పెట్టినా కాని.., వారే వారానికోసారి నైజీరియన్లు వార్తల్లో నిలవటం గమనార్హం. కొన్ని నెలల క్రితం ఏదో కేసుపై నైజీరియన్ల ముఠాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువస్తే మొత్తం అక్కడి పోలీస్ స్టేషన్ లో.., పోలీస్ లనే హడలెత్తించిన ఘన చరిత్ర నైజీరియన్ల సొంతం.  

డ్రగ్స్ అనే మహమ్మారిని వారు అంటించుకుంటూ.., మన దేశ ప్రజలకు ఆ మహమ్మారిని వ్యాపింప జేస్తూ దేశ ప్రజల జీవన విధానాన్నే మార్చేస్తూ దేశ పోలీస్ వ్యవస్థకే సవాలు విసురుతున్నారు. దేశంలో ఏ  ప్రధాన సైబర్ నేరం జరిగిన కాని.., ఆ నేరానికి సంబంధించిన పునాదులు మల్లి నైజీరియన్ల వద్దే ఉండటం నిజంగా శోచనీయం... డ్రగ్స్ తో, దొంగతనాలు దోపిడీలతో, సైబర్ నేరాలతో, అసాంఘిక కార్యకలాపాలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న నైజీరియన్ల వల్ల మరి దేశానికి నిజంగానే ఉపయోగం ఉందా అంటే.., ఆ విషయం మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకే తెలియాలి. ఎందుకంటే దేశంలోని కొన్ని వర్గాలు తమ ప్రాంతం ఇదని, తమ బాష ఇదని, తమ మతం ఇదని..,ఎన్నో ప్రాంతీయ ఉద్యమాలు, ఎన్నో పోరు ఉద్యమాలు జరిగాయి.., జరుగుతున్నాయి. కాని మన దేశంలోకి ఎవడో వచ్చి మన దేశ ప్రజల జీవన విధానాన్నే దెబ్బ కొడుతున్న ఇతర దేశాల అరాచక శక్తులపై మాత్రం మన దేశ ప్రజలు మాత్రం ఇది మా దేశమని వారికి మన గొంతు వినిపించకపోవటం నిజంగా మన దురదృష్టం. 

అసలు నైజీరియన్ల మరియు మిగతా ఇతర వివాదాస్పద దేశాల ప్రజల వీసాలను జారి చేసి వారిని అనుమతించటం ద్వారా.., మనకు ఆర్థికంగా కాని ఏ ఇతర విషయాల ద్వారా కాని, ఏ రకంగా చూసుకున్నా మన దేశానికి, మన దేశ ప్రజలకు నష్టమే తప్పితే కించిత్తు లాభం కూడా లేదు.... వారి వీసాలను అనుమతించటం ద్వారా.., మన విశ్వవిద్యాలయాల్లో చదువుకోవటానికి అనుమతించటం ద్వారా మన ఆర్ధిక వ్యవస్థకు ఎంత లాభం ఉందో తెలియదు కాని.., వారు ఇక్కడకి వచ్చి చేసే పనుల వల్ల మాత్రం మన దేశానికి, దేశ ప్రజలకి రెట్టింపుకి రెట్టింపు  నష్టం ఉందన్నది జగమెరిగిన సత్యం.

ప్రపంచంలోని చాలా దేశాలు తమ విదేశీ వ్యవహారాల విధానాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి.., కొన్ని వివాదాస్పద దేశాల ప్రజలకు వీసా కాదు కదా తమ దేశం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా వ్యవహరిస్తున్న తీరుని మన భారత దేశం ఎందుకు గమనించటం లేదన్నది దేశ ప్రజలకి బొత్తిగా అర్థం కావటం లేదు. ఇప్పటికైనా మన విదేశాంగ విధానాలనే సమూలంగా మార్చి సంస్కరణల దిశగా అడుగులు వేస్తే దేశానికి, దేశ రక్షణకి., పాలకులు ఎంతో మేలు చేసిన వారవుతారు. 

హరికాంత్ రెడ్డి రామిడి 

Wednesday, 2 September 2015

కాఫీ డేలో కళ్యాణ చూపులు......



సంవత్సరం అయ్యేలోపు పెళ్ళి చేసేస్కోవాలని పాకెట్లో ప్రింటవుట్ తీసిన ప్రొఫైల్ పెట్టుకొని మెడలో దేవుడి గొలుసులు.., చేతికి తాయత్తులు కట్టుకొని తిరుగుతున్నా కానీ నాకు, నా భావాలకి సరైన అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో అని ఒంటరి జీవితాన్ని తుంటరిగా గడుపుతున్న దరిద్రపు రోజులు....

గత వారం క్రితం నా స్నేహిత దరిద్రుడు ఒక రెండు రోజులు అలా రిఫ్రెష్ అయినట్టు ఉంటుందని సిటీ కి దూరంగా ఉన్న ఫాం హౌస్ కి వెళ్లి మరీ మల్లి ఫాం లోకి వద్దామని అనుకోని రెండు రోజులు ఏదో 3 బీర్లు 6 వోడ్కా లతో సరిపెట్టుకొని... ఫ్రెష్ గా మైండ్  ని రిఫ్రెష్ చేసుకొని అలా తిరిగి సిటీ కి వచ్చిన రెండు రోజులకే.... ఇంకో స్నేహిత దరిద్రుడు వచ్చి అరే హరీ.... నీకో మంచి అమ్మాయిని చూసి పెట్టన్రా అంటే నా జీవితానికి హలోజన్ బల్ప్ లా వెలుగు నివ్వటానికి వచ్చిన హాలీవుడ్ హీరో లా కనిపించాడు ఆ దరిద్రపు నా సన్... (క్షమించాలి వాణ్ణి తిట్టటానికి ఇంత కంటే బూతులు దొరకటం లేదు). అమ్మాయి అప్పర్ మిడిల్ క్లాసని.., కొంచెం లిబరల్ గా పెరిగిందని.., అలాగే సంప్రదాయాన్ని కూడా గౌరవిస్తుందని... నీ గురించి చెప్తేనే ఆ అమ్మాయి నీతో మాట్లాడాలని చెప్పిందని చెప్పాడు. మాట్లాడాలి అంటే తను భవిష్యత్ గురించి తన ఆలోచనల గురించి ఏమైనా చెప్పాలని అనుకుంటుందేమో అని నేననుకున్నాను.

రిఫ్రెష్ అయిన నాకు మల్లి ఫ్రెష్ గా ఒక అమ్మాయి ఫోటో చూపించి నా మతి పోగొట్టాడు నా స్నేహితుడు ఫోటో చూడగానే కుందనపు బొమ్మ బొమ్మా అని బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ వస్తే బాగుండని అనిపించింది.... ఆ ఫోటో చూడగానే ఇన్నాళ్ళు ఎవరి కోసమైతే తిరిగానో ఆ ముగ్గు బుట్ట తనే అని నా మనసులో గంట కొడుతుంటే... మైండ్ మాత్రం ఇప్పుడే బ్లైండ్ గా ప్రొసీడ్ అవ్వద్దని హెచ్చరించింది. ఏమో ఎన్నో ప్రొఫైల్స్ లోని ఫోటో లు చూసిన మనం ఇది కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దాం అంటుంది మనసు... కాని బయటకి కనపడటం లేదు కాని ఏదో మూలన మనసు మదన పడుతుంది..... కాని ఆ అమ్మాయితో సూటిగా నా మనసులో ఏముందో చెప్పాలని ఫిక్స్ అయ్యా....  మొత్తానికి ఫోటో చూపించిన మరుసటి రోజు ఆ అమ్మాయికి నాకు చూపులు లాంటి మీటింగ్ అరేంజ్ చేసాడు నా స్నేహితుడు... 

స్పాట్: జూబ్లిహిల్స్ కాఫీ డే......  (లైఫ్ టర్నింగ్ స్పాటేమో అని నేననుకుంటున్న స్పాట్ అది)
సమయం: ఉదయం 10.30


10.30 కి కాఫీ డే లో ఉంటానని అంతకు ముందు రోజే ఆ అమ్మాయి నా వాట్సప్ కి మెసేజ్ చేసి ఉన్నందున 10.30 కంటే ముందే ఉండాలని ఆదుర్దాగా బయలుదేరి సమయానికి చేరుకొని కార్ పార్క్ చేసి... ఇప్పుడే మొఘల్ సామ్రాజ్యాన్ని మట్టి కరిపించి నెక్స్ట్ ఒక కాఫీ తాగి కాకతీయ సామ్రాజ్యాన్ని కదన రంగంలో కడతెర్చడానికి వెళ్తున్న కథానాయకుడి మల్లె కాఫీ డే ముందు నిల్చున్నా స్టైల్ గా... మనసు అంతోద్దు రోయి... ఎక్కడో బ్రహ్మానందం డైలాగ్ వినబడుతుంది... ఎక్కడో బొక్క బోర్ల పడతావ్రోయని...... కాఫీ డే బయటకి లోపలకి తిరుగుతూ ఉంటె అక్కడి సెక్యురిటి గార్డ్ వింతగా చూస్తున్నాడు... అప్పటికే ఒక కోల్డ్ కాఫీ, ఒక హాట్ కాఫీ చెప్పి రెండింటికి న్యాయం చేకూర్చా..... మనసులో తనతో ఎం మాట్లాడాలో పదే పదే అనుకోని అనుకోని  మొత్తానికి ఈ సారి రీలు కథల్లా కాకుండా రియల్ గా తనతో నా భవిష్యత్ లక్ష్యాలను ముక్కు సూటిగా చెప్పి తన భావాలు ఏంటో తెలుసుకోవాలని  ఫిక్స్ అయ్యా....

ఏది ఎక్కడ తను... నా కన్నులు తనొచ్చే రోడ్ వైపే వెతుకుతున్నాయి...

గంట యిట్టె గడచిపోయింది... ఇంకో గంట అయిపోతుంది అనటానికి 10 నిమిషాలు ఉందనగా అమ్మడు దిగింది... ఎవరో తెలియదు కార్ లో దింపి వెళ్ళిపోయారు. కృత్రిమ నవ్వు తో చెప్పి చెప్పనట్టు హాయ్ విసిరి నా ముందు వచ్చి కూర్చుంది... సారీ అంటూ అందరు చెప్పే రీసన్ ఏ ఫుల్ ట్రాఫిక్ అంటూ రావటానికి కాస్త ఆలస్యం అయిందంటూ ఏదో చెప్పటానికి ప్రయత్నించింది. నేను వెంటనే నా కుడి వైపుకు ఉన్న వాచ్ చూసా... అంతటితో ఆ ఎక్ష్ప్లైన్ ఆపేసింది.... కాని తనని చూసాక ఫోటో చూసినప్పుడు ఎం మాయ చేసావ్ లో కుందనపు బొమ్మా పాట బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఉండాలనిపించటం కరెక్టే అనిపించింది. మొత్తానికి తననే చూస్తుంటే నాలోని కవి హృదయం ఉప్పొంగి నా మనసులోనే వీర తాండవం చేస్తున్నాడు... మెల్లిగా ఇంటికి పోయాక ఆ కవికి పని చెప్పచు లే అనుకోని కామ్ గా కూర్చొని ఆ అమ్మాయి అందాన్ని వర్ణించాలని తహ తహ లాడుతున్న నాలోని పిచ్చి కవిని కంట్రోల్ చేస్తుండగా... ఆ లోపు వెయిటర్ మా దగ్గరకి రావటం జరిగింది... ఆర్డర్ చెప్పమని అనటంతో తను ఏదో చాక్లెట్ ఫ్లేవర్ చెప్పి..., నా వైపు చూస్తే వెంటనే నేను ఒక హాట్ కాఫీ చెప్పాను... ఈ టైంలో హోటేందుకు ఏదైనా కోల్డ్ కాఫీ చెప్పండి అంటూ తనే ఆర్డర్ చేసింది ఏదో ఫ్లేవర్..... నేను ఇంకేం మాట్లడలేదు. 


ఇద్దరం మాటలు కలిపాం... (అప్పుడే బ్యాక్ గ్రౌండ్ లో శ్రీమంతుడి సినిమాలోని.... జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే.., అడుగులు రెండు జత కలిసే సాంగ్).......  మొదట చదువుతో ఆరంభమై... ప్రెసెంట్ వర్క్ ఎలా ఉందనే టాపిక్ కంటిన్యూ చేస్తుంటే మధ్యలో మేమిచ్చిన ఆర్డర్ రానే వచ్చింది. అంతలో తాను ఆర్డర్ చేసిన ఫ్లేవర్ అది కాదని మరీ వెయిటర్ తో గొడవ పెట్టుకొని మరీ ఇంకో ఫ్లేవర్ తెప్పించుకుంది. మల్లి ఎం మాట్లడుకుంటున్నామని తనే టాపిక్ ని....  రైలు తప్పిన పట్టాలని క్షమించండి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నేనేం మాట్లాడుతున్నానో అర్థం కావటం లేదు... పట్టాల్ని తప్పిన రైలుని తనే బలవంతంగా తీసుకువచ్చి మరీ., మల్లి రైలుని పట్టాల మీదకి తీసుకుపోయి తనే డ్రైవర్ అయి నడుపుతున్నట్లు అనిపించింది... తన పెదాలు నిత్యం కదలాడుతునే ఉన్నాయి... (ఆఫ్ కోర్సు ఆ పెదాలను చూస్తూ ఈ  జన్మంతా గడిపేయచ్చు... అదే సమయంలో ఆ మాటలని వింటే మాత్రం మరు జన్మంటూ వద్దని అక్కడే డిసైడై డీలా పడతాం కూడా) నేను మాట్లాడదాం అనుకునేలోపు తను వేరే అంశం తెర ముందుకు తీసుకొస్తూ ఉంది.  కాని తను మాట్లాడుతున్నంత సేపు తన ఆలోచనలంతా గాల్లోనే తేలుతున్నట్లు అనిపించింది. ఇంకా నేను మాట్లాడకుండా ఉండటమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చే ముందే.. అంత నేనే మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడరేం అంది. హమ్మయ్య ఇక నైన నాకు మాట్లాడే అవకాశం వచ్చింది అనుకుంటూ మనసులోనే ఆనందపడుతూ గంభీరంగా... సి మిస్ నిహారిక (ఆ అమ్మాయి పేరు అది) అని స్టార్ట్ చేసి... ఏదో చెప్పాలని ట్రై చేసి ఏమి చెప్పలేక నా మనసులో ఉన్నదీ కక్కలేక అక్కడికే ఇంక కట్ చెప్పాలని అనుకోని కన్క్లూజన్ కి వచ్చే లోపు.. ఇది నా సంగతి మీ దిక్కు వేరు నా దిక్కు వేరని అంటుండగానే.... తనే కల్పించుకొని మీ భావాలకి నా ఆలోచనలకి సెట్ అవ్వవు అంటూ చేయి కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చి నా చేయి ని షేక్ చేసి మరీ అల్ ది బెస్ట్ చెప్పి వెళ్లిపోయింది. మొత్తానికి తను చాలా అడ్వాన్స్డ్ అయినప్పటికినీ సాటి మనిషిని అర్థం చేసుకొనే ఆడపిల్లలా అనిపించింది... అలా కాఫీ డేలో కళ్యాణ చూపులు కాదు లేదు అనకుండా అలా అరగంటలో ముగిసిపోయాయి. ఇంక ఆ అమ్మాయి ఆలోచనలు పక్కన పెట్టి అక్కడి నుండి నా ఆఫీసు కి బయల్దేరాను....

హరికాంత్ రెడ్డి 

Tuesday, 1 September 2015

శ్రీమంతున్ని నేను.......



'మనీ'షిగా శ్రీమంతున్ని
అంధకారంలో శ్రీమంతున్ని 
అభిమానంలో మానం లేని శ్రీమంతున్ని
అర్ధం లేని మాటల్లో శ్రీమంతున్ని
'అర్ధం' కలిగిన శ్రీమంతున్ని
అలుపు లేని శ్రీమంతున్ని
ఆలోచనలో శ్రీమంతున్ని
ఆవేశంలో శ్రీమంతున్ని
అక్రమంలో శ్రీమంతున్ని
అనారోగ్యంలో శ్రీమంతున్ని
ఆపదని ఎదుర్కోవటంలో శ్రీమంతున్ని
అబద్దాలలో శ్రీమంతున్ని
సహాయంలో శ్రీమంతున్ని
సంతోషంలో శ్రీమంతున్ని
సిద్దాంతంలో శ్రీమంతున్ని
ఎదుర్కోవటంలో శ్రీమంతున్ని
ఎదిరించటంలో శ్రీమంతున్ని
భయంలో శ్రీమంతున్ని
భయపెట్టటంలో శ్రీమంతున్ని
బలహీనతలో శ్రీమంతున్ని
బదులివ్వటంలో శ్రీమంతున్ని
తెగింపులో శ్రీమంతున్ని
ఉద్వేగంలో శ్రీమంతున్ని
పగలో శ్రీమంతున్ని
పనిలో శ్రీమంతున్ని
ప్రేమలో శ్రీమంతున్ని
గురిలో శ్రీమంతున్ని 
గురి తప్పటంలో శ్రీమంతున్ని
గుర్తింపులో శ్రీమంతున్ని.........

[సరదాగా అలా..... శ్రీమంతుడు సినిమాలో అలా ఒక పాట వింటూ....... ఇప్పటికి ఇలా శ్రీమంతుడని అనుకుందాం ;-)......]

హరికాంత్ రెడ్డి రామిడి

Saturday, 29 August 2015

ఈ రోజు రక్షాబంధన్ అంట కదా.......


ఉదయం కావస్తుంది.... కాని తెలవారి వారనట్లుగానే అనిపిస్తుంది. రోజూ లాగే రాత్రి కూడా ఆలస్యం కావటం మూలాన కొంచెం మత్తుగా అనిపిస్తుంది. కాని ఇంట్లో ఏదో హడావుడిగా హడావుడిగా ఉన్నట్లు ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి.... అంతకు ముందు రోజే నా కార్యాలయంలోని HR నా క్యాబిన్ కి వచ్చి సార్ ఆఫీసులో పని చేస్తున్న స్టాఫ్.., రక్షా బంధన్ రోజు సెలవు కావాలని అడుగుతున్నారని..., అప్పుడు గుర్తొచ్చింది...ఈ రోజు రక్షా బంధన్ అని.... నాకు అక్కలు చెల్లెళ్ళు లేకపోవటం మూలాన.., చిన్నప్పటి నుండి రక్షాబంధన్ అసలు ఏ నెలలో వస్తుందనేది కూడా తెలియకుండా పెరిగాను.... చిన్నప్పటి నుండి రక్షా బంధన్ రోజు ఎవరో బయటి వాళ్ళు రాఖి కట్టినా, కొన్ని కృత్రిమ ప్రేమల వాళ్ళ కలిగినవే కాని... ఏ రోజు నాకు రక్షా బంధన్ విలువ తెలియలేదు. ముందు నుండే నాకు సెంటిమెంట్ పాళ్ళు తక్కువుండటం మూలాన ఈ బంధాలు..., బాంధవ్యాలను, బంధుత్వాలను.., అంత పెద్దగా నమ్మేవాడిని కాదు... జీవితం నడవాలి అంటే, జీవితం విలువ తెలియాలి అంటే.., చుట్టూ నలుగురు మనుషులు ఉండాలని.., వాళ్ళే మన చుట్టూ క్రియేట్ చేయబడిన ఈ బందుత్వాలని నేను బలంగా విశ్వసిస్తాను.

ఒకానొకరోజు నేను ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దులోని ఒక మారుమూల పల్లెటూరికి వెళ్ళినప్పుడు.., అక్కడ నేను ప్రభుత్వ పాటశాలలో చదువుకుంటున్న కొందరు విద్యార్థులను గమనించాను... పోషకాహార లోపంతో దీనావస్థలో ఉన్నారు... అక్కడ కొన్ని రకాల పరిస్థితుల ప్రభావంతో ఆ పిల్లలు ఆ విధంగా తయారయ్యారని విన్నాను. అంతే గాక ఆ పిల్లల తల్లిదండ్రులు ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్ తో బాధ పడుతున్నారని తెలిసి నాకున్న రాయి లాంటి హృదయాన్ని కూడా ఆ సంఘటన కలచివేసింది. అందరూ అంటున్న (నేననుకోవటం లేదు) నా అక్రమ సంపాదన నుండి.. 'క్రమంగా' కొంత అక్కడ ఆ పిల్లలకి ఏదైనా చేయాలనీ అనిపించింది. కాని ఎం చేయలేను. ఎందుకంటే నాకు ఆ అర్హత లేదని అనిపించింది. కాని మధ్యలో ఒకమ్మాయి నా వద్దకు వచ్చి ఒక కలాన్ని బహుమతిగా ఇచ్చింది. మీకు ఎందుకో ఈ కలం అవసమనిపించి ఇచ్చానని చెప్పింది....  (ఇప్పటికి నేను అదే కలంతో అక్షరాలను జాలు వారుస్తు ఉంటాను) వెంటనే అక్కడ పిల్లలందరినీ 'అన్నయ్య ఫౌండేషన్ ట్రస్ట్' కింద దత్తత తీసుకోవటం జరిగింది. ఇప్పుడు పిల్లలందరూ ఉన్నత చదువులకి ఎదిగారు...అప్పుడు తాత్కాలికంగా ఫౌండేషన్ వారు సహాయం చేసినప్పటికీనీ ఇప్పుడేమి సహాయం చేయటం లేదు.. కాని ఇప్పటికి ఆ కలం ఇచ్చిన అమ్మాయి మాత్రం నాకు రాఖి కట్టటానికి హైదరాబాద్ వరకు వస్తుంది. కాని అమ్మాయి కళ్ళలో నాకు 'అవసరం కోసం ఆప్యాయత' కనిపించదు.... అభిమానం కనిపిస్తుంది. రాఖి విలువ కొంచెం కొంచెంగా అర్థమైంది రాఖి అంటే ఏదో రాఖి కడితే "అన్న చేతికి రాఖి కట్టి నోట్లో స్వీట్ పెట్టి ఎంతో కొంత ఇస్తే బ్యాగులో వేసుకొని భుజానికి తగిలించుకొని నవ్వుతూ బయటికేల్తు స్టైల్ గా బాయ్ అన్నయ లవ్ యూ రా అనటం కాదనిపించింది..." ఈ సెంటిమెంట్ లన్ని నాకు తెలియదు.., నాకు మాట్లాడే అర్హత కూడా లేదు కాని ఏదో ఖాళీగా ఉన్న కదా అని ఒక నాలుగు లైన్లు రాసా నచ్చితే చదవండి... లేకుంటే లేదు.

చలో పండగ జరుపుకుంటున్న వారికి రాఖి బంధన్ శుభాకాంక్షలు....

హరికాంత్ రెడ్డి రామిడి