Tuesday 8 September 2015

ఎక్కడ ఆగానంటే తన అందం దగ్గర ఆగాను....


అబ్బ ఏమందం... అందమా అది....  ఆ అందమైన సౌందర్యం ఇంకా నా కళ్ళల్లో కదలాడుతుంది. డబ్బు చుట్టూ తిరుగుతున్న నా ప్రపంచం, లెక్కలేస్తున్న నా ప్రపంచం తన అందానికి మాత్రం లెక్కంటూ లేనే లేదని చెప్పింది.... ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచనతో ఉండే నా ప్రపంచం తన అందం దగ్గర ఆగిపోయింది.  కాదేమో నేనే తన అందం దగ్గర నా ప్రపంచాన్ని ఆపాను. సంపాదన చుట్టూ ఉరకలేస్తూ పరుగెడుతున్న నా వేగం తన అందం దగ్గర ఆగమని ఆరాటపడింది. ఆ బొమ్మని చెక్కిన బ్రహ్మకే ఆ అపురూపం రూపు దిద్దుకునెప్పుడు ఈర్ష కలగలేదా అనిపించింది. 

ఏమని వర్ణించను తన అందాన్ని.... తన చూపు ఒక వరం... తన నవ్వు ఒక నిండు చందమామ... తన పెదాలను చూస్తూ ఈ లోకంలో పూలు ఉన్నాయన్న సంగతే మర్చిపోతాను... తనను చూస్తూ ఈ ప్రపంచాన్ని జయిస్తాను., తనను చూస్తూ ఈ ప్రపంచాన్ని జయించాననే ఆనందాన్ని మర్చిపోతాను., తనని చూస్తూ ఆనందానికే ఆనందం అంటే ఇదని చెప్తాను., తనని చూస్తూ అందానికే కొత్త నిర్వచనం ఇస్తాను., తనను చూస్తూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లో అందం అంటే ఆమె అని, కొత్త పదాన్ని చేరుస్తాను., తన నృత్యాన్ని చూస్తూ నలుదిక్కులను ఒకే దిక్కుకు తీసుకొస్తాను., తన అందాన్ని ఇంకా అందంగా చూపించటానికి తన అందాన్ని ఆకాశానికి ఆశ పెట్టి అమృతం కురిపిస్తాను., సుతిమెత్తని పూలపై తన పాదం పెట్టి ఆ పూలకే అందం తెప్పిస్తాను., ఆ అందానికే అసలైన అందానిచ్చిన  వయ్యారంగా వంపులు తిరిగినటువంటి ఆ నడుముని చెక్కిన బ్రహ్మకి నాస్తికులచే బ్రహ్మోత్సవం జరిపిస్తాను.,  ముద్దు ముద్దుగా చెక్కిల్ల్లతో కూడిన ఆ చేమంతి పూవంటి చందం... తొలి పొద్దు కిరణాల స్పర్శకి విచ్చుకున్న పొద్దు తిరుగుడు పువ్వుకు అందమంటే అదని అందంగా ఆ అందాన్ని చూపిస్తాను.,

ఆధునికత అంటూ ఆగమైపోతున్న ఈ లోకంలోకి ఆశ్చర్యంగా వచ్చింది నా లోకంలోకి.... అందానికి అసూయ పుట్టలేదా తనని చూసి...! అచ్చ తెలుగమ్మాయంటే కవుల రాతల్లోనో, కళాకారుల ఆకృతుల్లోనో ఉంటాయనకున్నా కాని, నా అభిప్రాయం తప్పేమో అనిపించింది. మెరుపులా మెరిసింది తన అందంతో... పచ్చటి పైరులా, పెరటిలోన సీతకోకచిలుకలా... అయ్యో ఆ అందం... ఒక అద్భుతం.., అపురూపం.., అమూల్యం..., 

హరికాంత్ రెడ్డి

No comments:

Post a Comment