Wednesday 2 September 2015

కాఫీ డేలో కళ్యాణ చూపులు......



సంవత్సరం అయ్యేలోపు పెళ్ళి చేసేస్కోవాలని పాకెట్లో ప్రింటవుట్ తీసిన ప్రొఫైల్ పెట్టుకొని మెడలో దేవుడి గొలుసులు.., చేతికి తాయత్తులు కట్టుకొని తిరుగుతున్నా కానీ నాకు, నా భావాలకి సరైన అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో అని ఒంటరి జీవితాన్ని తుంటరిగా గడుపుతున్న దరిద్రపు రోజులు....

గత వారం క్రితం నా స్నేహిత దరిద్రుడు ఒక రెండు రోజులు అలా రిఫ్రెష్ అయినట్టు ఉంటుందని సిటీ కి దూరంగా ఉన్న ఫాం హౌస్ కి వెళ్లి మరీ మల్లి ఫాం లోకి వద్దామని అనుకోని రెండు రోజులు ఏదో 3 బీర్లు 6 వోడ్కా లతో సరిపెట్టుకొని... ఫ్రెష్ గా మైండ్  ని రిఫ్రెష్ చేసుకొని అలా తిరిగి సిటీ కి వచ్చిన రెండు రోజులకే.... ఇంకో స్నేహిత దరిద్రుడు వచ్చి అరే హరీ.... నీకో మంచి అమ్మాయిని చూసి పెట్టన్రా అంటే నా జీవితానికి హలోజన్ బల్ప్ లా వెలుగు నివ్వటానికి వచ్చిన హాలీవుడ్ హీరో లా కనిపించాడు ఆ దరిద్రపు నా సన్... (క్షమించాలి వాణ్ణి తిట్టటానికి ఇంత కంటే బూతులు దొరకటం లేదు). అమ్మాయి అప్పర్ మిడిల్ క్లాసని.., కొంచెం లిబరల్ గా పెరిగిందని.., అలాగే సంప్రదాయాన్ని కూడా గౌరవిస్తుందని... నీ గురించి చెప్తేనే ఆ అమ్మాయి నీతో మాట్లాడాలని చెప్పిందని చెప్పాడు. మాట్లాడాలి అంటే తను భవిష్యత్ గురించి తన ఆలోచనల గురించి ఏమైనా చెప్పాలని అనుకుంటుందేమో అని నేననుకున్నాను.

రిఫ్రెష్ అయిన నాకు మల్లి ఫ్రెష్ గా ఒక అమ్మాయి ఫోటో చూపించి నా మతి పోగొట్టాడు నా స్నేహితుడు ఫోటో చూడగానే కుందనపు బొమ్మ బొమ్మా అని బ్యాక్ గ్రౌండ్ లో సాంగ్ వస్తే బాగుండని అనిపించింది.... ఆ ఫోటో చూడగానే ఇన్నాళ్ళు ఎవరి కోసమైతే తిరిగానో ఆ ముగ్గు బుట్ట తనే అని నా మనసులో గంట కొడుతుంటే... మైండ్ మాత్రం ఇప్పుడే బ్లైండ్ గా ప్రొసీడ్ అవ్వద్దని హెచ్చరించింది. ఏమో ఎన్నో ప్రొఫైల్స్ లోని ఫోటో లు చూసిన మనం ఇది కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దాం అంటుంది మనసు... కాని బయటకి కనపడటం లేదు కాని ఏదో మూలన మనసు మదన పడుతుంది..... కాని ఆ అమ్మాయితో సూటిగా నా మనసులో ఏముందో చెప్పాలని ఫిక్స్ అయ్యా....  మొత్తానికి ఫోటో చూపించిన మరుసటి రోజు ఆ అమ్మాయికి నాకు చూపులు లాంటి మీటింగ్ అరేంజ్ చేసాడు నా స్నేహితుడు... 

స్పాట్: జూబ్లిహిల్స్ కాఫీ డే......  (లైఫ్ టర్నింగ్ స్పాటేమో అని నేననుకుంటున్న స్పాట్ అది)
సమయం: ఉదయం 10.30


10.30 కి కాఫీ డే లో ఉంటానని అంతకు ముందు రోజే ఆ అమ్మాయి నా వాట్సప్ కి మెసేజ్ చేసి ఉన్నందున 10.30 కంటే ముందే ఉండాలని ఆదుర్దాగా బయలుదేరి సమయానికి చేరుకొని కార్ పార్క్ చేసి... ఇప్పుడే మొఘల్ సామ్రాజ్యాన్ని మట్టి కరిపించి నెక్స్ట్ ఒక కాఫీ తాగి కాకతీయ సామ్రాజ్యాన్ని కదన రంగంలో కడతెర్చడానికి వెళ్తున్న కథానాయకుడి మల్లె కాఫీ డే ముందు నిల్చున్నా స్టైల్ గా... మనసు అంతోద్దు రోయి... ఎక్కడో బ్రహ్మానందం డైలాగ్ వినబడుతుంది... ఎక్కడో బొక్క బోర్ల పడతావ్రోయని...... కాఫీ డే బయటకి లోపలకి తిరుగుతూ ఉంటె అక్కడి సెక్యురిటి గార్డ్ వింతగా చూస్తున్నాడు... అప్పటికే ఒక కోల్డ్ కాఫీ, ఒక హాట్ కాఫీ చెప్పి రెండింటికి న్యాయం చేకూర్చా..... మనసులో తనతో ఎం మాట్లాడాలో పదే పదే అనుకోని అనుకోని  మొత్తానికి ఈ సారి రీలు కథల్లా కాకుండా రియల్ గా తనతో నా భవిష్యత్ లక్ష్యాలను ముక్కు సూటిగా చెప్పి తన భావాలు ఏంటో తెలుసుకోవాలని  ఫిక్స్ అయ్యా....

ఏది ఎక్కడ తను... నా కన్నులు తనొచ్చే రోడ్ వైపే వెతుకుతున్నాయి...

గంట యిట్టె గడచిపోయింది... ఇంకో గంట అయిపోతుంది అనటానికి 10 నిమిషాలు ఉందనగా అమ్మడు దిగింది... ఎవరో తెలియదు కార్ లో దింపి వెళ్ళిపోయారు. కృత్రిమ నవ్వు తో చెప్పి చెప్పనట్టు హాయ్ విసిరి నా ముందు వచ్చి కూర్చుంది... సారీ అంటూ అందరు చెప్పే రీసన్ ఏ ఫుల్ ట్రాఫిక్ అంటూ రావటానికి కాస్త ఆలస్యం అయిందంటూ ఏదో చెప్పటానికి ప్రయత్నించింది. నేను వెంటనే నా కుడి వైపుకు ఉన్న వాచ్ చూసా... అంతటితో ఆ ఎక్ష్ప్లైన్ ఆపేసింది.... కాని తనని చూసాక ఫోటో చూసినప్పుడు ఎం మాయ చేసావ్ లో కుందనపు బొమ్మా పాట బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఉండాలనిపించటం కరెక్టే అనిపించింది. మొత్తానికి తననే చూస్తుంటే నాలోని కవి హృదయం ఉప్పొంగి నా మనసులోనే వీర తాండవం చేస్తున్నాడు... మెల్లిగా ఇంటికి పోయాక ఆ కవికి పని చెప్పచు లే అనుకోని కామ్ గా కూర్చొని ఆ అమ్మాయి అందాన్ని వర్ణించాలని తహ తహ లాడుతున్న నాలోని పిచ్చి కవిని కంట్రోల్ చేస్తుండగా... ఆ లోపు వెయిటర్ మా దగ్గరకి రావటం జరిగింది... ఆర్డర్ చెప్పమని అనటంతో తను ఏదో చాక్లెట్ ఫ్లేవర్ చెప్పి..., నా వైపు చూస్తే వెంటనే నేను ఒక హాట్ కాఫీ చెప్పాను... ఈ టైంలో హోటేందుకు ఏదైనా కోల్డ్ కాఫీ చెప్పండి అంటూ తనే ఆర్డర్ చేసింది ఏదో ఫ్లేవర్..... నేను ఇంకేం మాట్లడలేదు. 


ఇద్దరం మాటలు కలిపాం... (అప్పుడే బ్యాక్ గ్రౌండ్ లో శ్రీమంతుడి సినిమాలోని.... జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే.., అడుగులు రెండు జత కలిసే సాంగ్).......  మొదట చదువుతో ఆరంభమై... ప్రెసెంట్ వర్క్ ఎలా ఉందనే టాపిక్ కంటిన్యూ చేస్తుంటే మధ్యలో మేమిచ్చిన ఆర్డర్ రానే వచ్చింది. అంతలో తాను ఆర్డర్ చేసిన ఫ్లేవర్ అది కాదని మరీ వెయిటర్ తో గొడవ పెట్టుకొని మరీ ఇంకో ఫ్లేవర్ తెప్పించుకుంది. మల్లి ఎం మాట్లడుకుంటున్నామని తనే టాపిక్ ని....  రైలు తప్పిన పట్టాలని క్షమించండి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నేనేం మాట్లాడుతున్నానో అర్థం కావటం లేదు... పట్టాల్ని తప్పిన రైలుని తనే బలవంతంగా తీసుకువచ్చి మరీ., మల్లి రైలుని పట్టాల మీదకి తీసుకుపోయి తనే డ్రైవర్ అయి నడుపుతున్నట్లు అనిపించింది... తన పెదాలు నిత్యం కదలాడుతునే ఉన్నాయి... (ఆఫ్ కోర్సు ఆ పెదాలను చూస్తూ ఈ  జన్మంతా గడిపేయచ్చు... అదే సమయంలో ఆ మాటలని వింటే మాత్రం మరు జన్మంటూ వద్దని అక్కడే డిసైడై డీలా పడతాం కూడా) నేను మాట్లాడదాం అనుకునేలోపు తను వేరే అంశం తెర ముందుకు తీసుకొస్తూ ఉంది.  కాని తను మాట్లాడుతున్నంత సేపు తన ఆలోచనలంతా గాల్లోనే తేలుతున్నట్లు అనిపించింది. ఇంకా నేను మాట్లాడకుండా ఉండటమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చే ముందే.. అంత నేనే మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడరేం అంది. హమ్మయ్య ఇక నైన నాకు మాట్లాడే అవకాశం వచ్చింది అనుకుంటూ మనసులోనే ఆనందపడుతూ గంభీరంగా... సి మిస్ నిహారిక (ఆ అమ్మాయి పేరు అది) అని స్టార్ట్ చేసి... ఏదో చెప్పాలని ట్రై చేసి ఏమి చెప్పలేక నా మనసులో ఉన్నదీ కక్కలేక అక్కడికే ఇంక కట్ చెప్పాలని అనుకోని కన్క్లూజన్ కి వచ్చే లోపు.. ఇది నా సంగతి మీ దిక్కు వేరు నా దిక్కు వేరని అంటుండగానే.... తనే కల్పించుకొని మీ భావాలకి నా ఆలోచనలకి సెట్ అవ్వవు అంటూ చేయి కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చి నా చేయి ని షేక్ చేసి మరీ అల్ ది బెస్ట్ చెప్పి వెళ్లిపోయింది. మొత్తానికి తను చాలా అడ్వాన్స్డ్ అయినప్పటికినీ సాటి మనిషిని అర్థం చేసుకొనే ఆడపిల్లలా అనిపించింది... అలా కాఫీ డేలో కళ్యాణ చూపులు కాదు లేదు అనకుండా అలా అరగంటలో ముగిసిపోయాయి. ఇంక ఆ అమ్మాయి ఆలోచనలు పక్కన పెట్టి అక్కడి నుండి నా ఆఫీసు కి బయల్దేరాను....

హరికాంత్ రెడ్డి 

No comments:

Post a Comment