Saturday 1 August 2015

జీవిత ప్రయాణ క్రమం......


నేను హైదరాబాద్ నుండి ఢిల్లీ వస్తున్నపుడు నా ప్రక్కన ఎవరో ఒక వ్యక్తి కూర్చొన్నారు... 50 ఏళ్ళు పైబడి ఉంటాయి... అతని కళ్ళలో అతని అనుభవం సాక్షాత్కరిస్తుంది. అతనే పలకరించాడు... మాములుగా మాట్లాడే మాటలే... అవన్నీ పరిచయాలు అయిపోయిన తర్వాత.., ఒక విలువైన విషయం చెప్పాడని అనిపించింది.. ఆలోచిస్తే అర్దముందనే భావన కలిగింది....
"ఒకానొక దేశంలోని ఒక మనిషి తీవ్రమైన ఆనారోగ్యంతో బాధపడుతుంటే అతని వైద్యులు అతను బ్రతకటానికి అవసరమయ్యే మందు ఎక్కడ లభిస్తుందో ఆ ప్రదేశం వివరాలు అన్ని చెప్పారు. అది స్వయంగా రోగి తెచ్చుకుంటేనే సత్ఫలితాన్ని ఇస్తుందని వేరెవరు దాన్ని తాకిన వ్యర్థం అని., కాని అది ఒక్కడి వల్ల కాదని అందరి సహాయం ఉంటేనే అది సాధ్యమని వెల్లడించారు.. ఎందుకంటే ఆ దివ్యౌషధం కోసం సరిగ్గా 5 దశలు దాటాల్సి ఉంటుందని.. చివరి దశలో ప్రాణాలు కూడా పోయే ప్రమాదముండే అవకాశం ఉందని చెప్పి మార్గసూచి కూడా అందచేసారు.. వెంటనే ఆ జబ్బు పడ్డ మనిషి ఆలస్యం చేయకుండా తన బంధువులకి, శ్రేయోభిలాశులకి, స్నేహితులకి, రక్త సంభందికులకి అసలు విషయాన్ని చెప్పారు... వారంతా ధైర్యాన్ని నూరి పోశారు.. బందువులైతే పద ఇప్పుడే వెళ్దాం అన్నంత ధైర్యాన్ని ఇచ్చారు. మంచి సమయం చూస్కొని అందరు కలిసి బయల్దేరారు.
మొదటి దశ: బంధువులంత భలే ధైర్యంగా ఉన్నారు.. మిత్రులంత మేమున్నాము అన్నారు.. రక్త సంభందికులు తండ్రి అక్క అన్న తమ్ముడు చెల్లి కొడుకు కూతురు.. మొదలగు వారంతా అతని వెన్నంటే ఉన్నారు.. ఇంకా ఆలి, తల్లి ఎలాగు వస్తారు ప్రేమ రప్పిస్తుంది.
రెండవ దశ: వెనక్కి తిరిగి చూసేసరికి బంధువుల్లో ఒక వర్గం కనిపించటం లేదు.. మరో వర్గం భయం భయంగా ఉంది..వారిలో కొందరు నసుగుతున్నారు.. మిత్రుల్లో సగం మంది మిత్రులు కనిపించటం లేదు. ఆ మనిషికి మనసులో ఎక్కడో మూలన బాధ అనిపించింది... ఇంకా రక్త సంభందికులు వెంటే ఉన్నారు. ఆలి తల్లి ఆ మనిషి నీడను అనుసరిస్తున్నారు...
మూడవ దశ: బంధువుల్లో ఒకరో ఇద్దరో ఉన్నారు... వాళ్ళు కూడా మన నుండి సహాయం పొంది బ్రతికుంటే ఇంకేమన్నా మల్లి సహాయం చేస్తాడో అని ఆశతో.... నిజంగా మనిషి "ఆశ"నే శ్వాస తీసుకొని బ్రతుకుతాడు. మిత్రుల్లో కూడా ఎంతో కొంత అతని నుండి మేలు పొందిన వాళ్ళే కనిపించారు. రక్త సంభందికులంతా వెంట నడుస్తున్నారు... కాని వాళ్ళలో భయం మొదలయింది... ఆలి తల్లి.., వాళ్ళలో కూడా భయం కనబడుతుంది... కాని ఆ భయం వారి గురించి కాదు అతనికేం ఆపద ముంచుకొస్తందో అన్న భయం.
నాల్గవ దశ: ఇక్కడ అతనికి బంధువులు కనిపించరు... "గిల్లి..,గాయబ్".. మిత్రుల్లో ఒకరో ఇద్దరో ఇక్కడివరకు వెంట నడిచారు... పోనిలే ఆ మనిషి ఆ ఒకరు ఇద్దరు మిత్రులని చూసి సంతృప్తికి లోనయ్యాడు.. రక్తసంభందికుల్లో నా అనుకున్న వాళ్ళు ఉన్నారు... వీడు నాకేం చేసాడు అనే ప్రశ్న ఉదయించిన వాళ్ళు ఉడాయించారు.. ఆలి తల్లి అల్లాడుతూ అనుసరిస్తూనే ఉన్నారు.
ఐదవ దశ: ఆ మనిషి అంతిమ లక్ష్యానికి చేరువలో ఉన్నాడు.. కాని చుట్టూ ఎవరూ లేరు.. ఇంకా అతని తల్లి వేలిని వీడలేదు .. అతని ఆలి తాళిని గుండెల్లోనే దాచుకుంటూ అతన్ని అనునయించింది.. కన్నతల్లి కట్టుకున్న ఆలి తనను ముందుండి నడిపించారు.. ఇలా చెప్పి ముగించాడు ఆ పెద్ద మనిషి.
వామ్మో ఇంక నేను మరి ఎక్కువగా ఆలోచించటం మొదలుపెట్ట్టాను..
ప్రేమంటే చరవాణి తెర పై నిత్యం కదలాడే సందేశం కాదు..
ప్రేమంటే నాలుగు రోడ్ల కూడలిలో నాలుగు పెదాలు కలిసి చేసే పని అంతకన్నా కాదు..

ప్రేమంటే కారులో షికారు కెళ్ళి ఒక నాలుగు పుకార్లు సృష్టించుకోవటం కానే కాదు.. ఇలా అకుంటిత ప్రవాహంలో నా మనసు కొట్టుకుపోతుండగా ఇంకా ఆపు అంది ఎవరో కాదు మల్లి నా మనసే. ఇంతలో విహంగం వీరోచితంగా లాండవటం కూడా జరిగిపోయింది...

హరికాంత్ రెడ్డి

No comments:

Post a Comment