Friday 21 August 2015

అదొక ప్రహాసనం (నా కథే ఎవరిదో కాదు) సరదాగా అలా......


రోజూ లాగే గడచిపోతుంది.... డబ్బుల చుట్టూ నా ప్రపంచం తిరుగుతుంది... సంపాదన వెనక నా వయసు ఉరకలేస్తూ పరిగెడుతుంది...., పది రూపాయలతో పెట్టుబడి పెట్టి సంపాదించే ఆలోచన కాకుండా పది రూపాయలు పెట్టుబడి పెట్టకుండా ఎలా సంపాదించాలా అనే ఆలోచన ఉన్న నేను కొన్ని విషయాల్లో మాత్రం తడబడిపోతాను.... 

మధ్యాహ్నసమయం.... జీవితంలో ఏదో కోల్పోతున్నానన్న ఫీలింగ్ మనసులో గరిటె పెట్టి దెవినట్లు అవుతుంది. కొత్తగా పెట్టిన ఆఫీసు లో వంట మనిషి ని భోజనం సిద్దం చేయమని చెప్పి.... ఇవ్వాళ నాకు స్ఫూర్తి నిచ్చిన నా అన్నయ్య పేపర్ "సాక్షి" గా ఏదో వార్త చదువుతూ ఉంటె నా మెదడు లో ఆలోచనలు గిర్రున తిరుగుతున్నాయి.... 

"ఒరే..రాకేశ్... నిన్న పలానా హోటల్ లో బిర్యాని బాగా లేదు రా?"  అన్నాన్నేను ఎగ్జయిటవుతూ.

"ఆరె ఈ రోజు ఓరిస్ బంజారా హిల్స్ రోడ్ నం 2 లో మంచి బఫెట్ ఆఫర్ ఉందట రా" లేటెస్ట్ అప్డేట్ తో వాడు.

"ఓన్లీ బిర్యాని కంటే బఫెట్ బెటర్ లే.... ఏది ఏమైనా బయట భోంచేయ్యాలంటే భయమేస్తుంది రా... ఇంట్లో మన స్వయం పాకంతో అదరగోట్టేద్దాం అంటే బద్దకేమేస్తుంది. ఈ బ్రహ్మచారి జీవితమేమో బోరుకొట్టేస్తుంది. బొత్తిగా కలర్ లేకుండాపోయింది రా జీవితం అంటూ వాపోయన్నేను...! (కలర్ అంటే అమ్మాయని నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు) వాడూ శ్రుతి కలిపి ఒక నిట్టుర్పు విడిచి అవును రా అన్నాడు....

"బోర్ కొట్టదా మరీ..? బిఎస్సి మూడేళ్ళు ఫస్ట్ బెంచ్ లో కూర్చొని కళ్ళు తెరుచుకొని, తల ఊపుతూ నిద్రపోడం తప్ప నువ్ చేసిందేమైనా ఉందా?  " అని నా చరిత్రని తవ్వడం మొదలెట్టేశాడు వాడు. ఇంతలో వంట మనిషి వచ్చి భోజనం సిద్దమయ్యిందని చెప్పాడు. ఇంక మెల్లిగా కిచెన్ వైపు అడుగులు వేస్తూ.... "ఇప్పుడు బాధపడి ఏం లాభం రా రాకేశూ? అసలా A.రవి ,S.రవి లను అనాలి. వాళ్ళ దెబ్బకి డిగ్రీ లో ఏ ఒక్క అమ్మాయినీ నేను చూడలేదు. ఏ ఒక్క అమ్మాయీ నాతో మాట్లాడలేదు... అదే అలా అలవాటయిపోయింది" అయినా కాని అమ్మాయిలు చూసేంత గొప్ప పర్సనాలిటీ కూడా కాదు కదరా నాది అంటూ నాకు నేనే కౌంటర్ ఇచ్చుకున్నాను. 

మా ఈ మాటలు విని పక్కనే 6 రోజుల క్రితం చేసి బయట పడేయటానికి రెడీ గా ఉన్న ఎండు పకోడిలా ఉన్న ఒక పిల్లాడు విని ఇవ్వన్ని ఎందుకు సార్ పెళ్ళి చేసుకోవచ్చుగా.. సింపుల్ సొల్యూషన్" అని సలహా ఇచ్చాడు. నేను వెంటనే "మ్యారీడ్ లైఫ్ బాగుంటుందా రా?" అని ఆశ గా అడిగాను సిగ్గు పడుతూ రాకేశ్ గాన్ని. "ఉహూ.... బ్యాచిలర్ లైఫే బాగుంటుందన్న సంగతి పెళ్ళయ్యాక తెలుస్తుంది" అన్నాడు సాంబార్ లో ముక్కలేరుకుని నముల్తూ.... బెలూన్ కి బొక్కెట్టి గాలుదమన్నట్లు ఉంది నీ ఎదవ సొల్యూషన్ అన్నాన్నేను చిరాగ్గా....... వాడు తల దించుకున్నాడు. 

"అలా కూరలో అరిటాకులా తీసి పారేయకు రా హరి...."
మధ్యలో నేను "అరిటాకు కాదు కరివేపాకు"....

తీసి పారేసేదానికి ఏ ఆకయితే ఏంటి చెప్పూ.. పెళ్ళి విషయం లో నిన్ను చాలా ఎడ్యుకేట్ చెయ్యాలి రా. అసలే అమ్మాయిల కొరత. ముప్పై వచ్చేసరికి నీ నెత్తిమీద ఏడాదికి ఎకరం చొప్పున ఊడిపోతుంది..... మొహం మీద ముడతలు మెల్లిగా కనబడుతున్నాయి. ఉన్న ఆ కాస్త జుట్టు ఊడిపోకముందే, ఆ ముడతలు మడతలు కాకముందే ఆ పెళ్ళి ముచ్చట కాకపోతే ఎం అవుతుందో ఆలోచించావా??

నాలో భయం మొదలయ్యింది... గొంతులో ఆ భయం కనపడనీయకుండా ఆఆఆఆ.....లేదు... అన్నాన్నేను వాడితో గంభీరంగా.....

నీ ఏడాది సంపాదనను పట్టుకొని ఓ  అందమైన అమ్మాయి నీ లైఫ్ లోకి ఎంటరయ్యి... బయటికేల్లెప్పుడు టాటా చెప్తూ, ఇంటికెప్పుడొస్తావా అని రోజూ నీకోసం ఎదురుచూస్తూ... నీకిష్టమైనవన్నీ వండి పెడుతూ... నీకు సేవలు చేస్తూ, సినిమాలకీ షికార్లకీ నీకు తోడొస్తూ...ఫ్రంట్ కెమెరా తో ఇరుక్కుని తీసుకున్న క్లారిటీ లేని మీ ఇద్దరి ఫోటోల్నీ ఫేస్బుక్ లో పెడుతుంటే....అది చూసిన జనాలు మీ జంటని చూసి జుట్టు పీక్కొని పిచ్చెక్కి "ఆహా.. సూపరూ... ఓహో డూపరూ... "nice pair..... made for each other..... Yo dude ummaaa.... super pic raa" అని కామెంట్లు పెడుతూ రచ్చ చేస్తుంటుంటే....... అసలు ఈ కోణం లో ఎప్పుడైనా ఆలోచించావా... ఆ పబ్బుల్లో ఈ పబ్బుల్లో తిరుగుతూ ఏవో పిచ్చి ఫోటో లు పెడుతూ ఉండేకన్నా ఫేస్ బుక్ లో నీకంటూ ఒక అమ్మాయితో సెల్ఫీ దిగి ఇదిగో ఈమే నా కుల్ఫీ అంటూ స్టేటస్ పెడితే ఎలా ఉంటధో ఒక్కసారి ఆలోచించు రా అన్న వాడి మాటలతో నా బుర్ర గిర్రున తిరుగుతుంది. పెళ్ళి చేసుకుంటే జీవితానికి బాగా మరిగించిన పప్పుచారు చల్లారితే వచ్చే రుచొస్తుంది. అసలెంత కాలం రా ఈ బ్యాచిలర్ లైఫ్? తొందరగా ఈ గత కాలం లైఫ్ కి సలాం కొట్టేసి ఒక ఇంటివాడై పోరా అన్న వాడి మాటలతో నా హృదయం ఇప్పుడే పాత సినిమాలో కొత్త హీరోయిన్ని చూసిన మొహంలా కళకళలాడుతూ వెలిగిపోతుంది.

అరేయ్ రాకేశు నిజంగా నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది రా.... 
అరేయ్ హరి నీకు తెలివుంది అనుకుంటావు కాని నిజంగా నీ అంత కోడి మెదడు ఉన్న ఎదవని నేను ఎక్కడ చూడలేదు రా... నీ  మొహం చూడగానే అనుకుంటాను రా నేను రోజూ ఫేస్బుక్ లో పోస్టులు రాసి కామెంట్లు రావట్లేదని ఫీలయ్యే తింగరోడివనీ..!

నేను కొత్తగా పెట్టిన ఆఫీసు లో ఆ వంటవాడి వంట తిన్న నేనూ, రాకేశు... వాడు బెండకాయ కర్రిలో కోడిగుడ్డు వేసి మాడ గొట్టి వండిన తీరుని చూసి పరిస్థితి ఇలాగే కొనసాగితే చైనీస్ ఫుడ్ ఇండియన్ స్టైల్ లో డెడ్ చీప్ గా తినెయ్యొచ్చురా మనం.... టెక్నికల్ గా మన ఆఫీసు HR భాషలో చెప్పాలంటే దీన్నే "ప్రొసెస్ ఆఫ్ క్రియేటివ్ పాజిటివ్ థింకింగ్ ఇన్ పాథటిక్ సిచువేషన్స్" అంటారు., రాకేశు గాడు చెప్పుకుంటూ పోతున్నాడు..... నేను మాత్రం వాడు ఇచ్చిన దిక్కుమాలిన సలహాని పాటిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. ఎదవ తిరుగుళ్ళు తిరుగుతూ 'పెళ్ళే వద్దని' ఫిక్స్ అయిపోయిన నాలో మల్లి ఏవో ఆశలు చిగురించాయి... ఇంక వెంటనే అప్పటికే  నా పెళ్ళి గురించి బెంగెట్టుకున్న మా అమ్మ నాన్నకి పచ్చజెండా ఊపేశాను.

"నేను పెళ్ళికి రెడీ" అనగానే ఆ ఆనందం లో మా అమ్మ ఇల్లంతా పెనాయిలేసి కడిగి, పనిలో పనిగా నాకు ఒంటికి నలుగెట్టి, జుట్టుకి పులుసెట్టీ స్నానం చేయిచింది. మా నాన్న XXX మాట్రిమొనీలో (అమ్మ బంగారు తల్లులు...అది ట్ర్పిప్లెక్స్ కాదు మాట్రీమోని పేరు తెలియక అలా రాసాను) నాకు తెలీకుండా నా పేరు మీద క్రియేట్ చేసిన అకౌంట్ తాలూకా పాస్ వర్డ్ నాకు ప్రసాదించారు. మర్నాడు పొద్దున్న 5 గంటల 31 నిమిషాలకి కి ముహూర్తం బాగుందనీ, అప్పుడు లాగిన్ అవ్వమని ఆర్డర్ వేసారు. డార్క్ కలర్ జీన్స్ లో లైట్ కలర్ షర్ట్ ని టక్ చేయించారు. కాళ్ళకి హీల్స్ ఉన్న షూ వేయించారు ( నేను కాస్త పొట్టి మరీ) చేతికి ఫాస్ట్ ట్రాక్ వాచ్ పెట్టారు. (నేను ఫాస్ట్ అనుకోవాలనో ఏమో మరీ).. మా నాన్న నేను మొహానికి వేసుకున్న పౌడర్ చాలదన్నట్లు ఇంకాస్త పౌడర్ తెచ్చి మొహానికి అద్దుతూ (నేను ఛామన ఛాయ మరీ) నా మొహాన్ని ఇప్పుడే సున్నం కొట్టిన ఇంటి ముందున్న గోడలా తయారు చేసాడు.

నడుముకి బెల్టేట్టారు. నుదుటున చిన్నగా బొట్టెట్టారు. చివరిగా నన్ను  ఫోటో స్టూడియో లో నించోబెట్టారు. (నాకది కొత్త)

నా వాలకం చూసి విషయం పసిగెట్టేసిన ఫోటోగ్రాఫర్ నా కోడిమెదడు కి అర్ధం కాని లుక్కిచ్చి లైట్లేశాడు.

"సార్... నేన్ చెప్పినట్టూ స్టిల్ ఇవ్వండి.."

"అలాగే..."

"ముందు ఆ నల్ల కళ్ళద్దాలు తీసెయ్యండి"

"తియ్యను... అవి లేకపోతే నా ఫోటో నాది కాదనిపిస్తుంది"

"హ్మ్మ్.. సరే.. నించోండి........ చేతులు కట్టుకోండి.... తల పైకెత్తండీ... కొం...చెం కిందకి దించండి... కుడి చేత్తో ఎడమ బుగ్గ మీద వేలు పెట్టుకోండి......ఆ.... ఇప్పుడు ఎడమవైపుకి చూడండీ"

"ఇది వివేకానంద స్టిల్ లాగా ఉంటుందేమో??"

"ఫోటో తీసేటప్పుడు మాట్లాడకండి సార్....చెప్పింది చెయ్యండి..... అయ్యో.. కొంచెం ఆ మొహం తుడుచుకోండి..... కొంచెం పౌడర్ రాసుకోండి... తల సరిచేసుకోండి...... ఊపిరి పీల్చండి..... సార్.. కొంచెం జుట్టు ముందుకు అనండి సార్ బట్ట తల బార్ల తెరుచుకొని కనబడుతుంది... ఆ రెడీ రెడీ.... స్మైల్....స్మైల్..."

[కరుణ నిండిన కళ్ళతో కల్మషం లేని నవ్వు రువ్వడానికి విశ్వప్రయత్నం చేస్తూ...నేను]

"అదేం నవ్వు సార్ ?? కొంచెం అందంగా నవ్వండి"

"అందంగానా?? అంటే ఎలాగా??"

"ఏమో నాకూ తెలీదు... మీరు రకరకాలుగా నవ్వండీ..ఏది బాగుంటే అది ఫైనలైజ్ చేద్దాం. రెడీ.. 1....2...3...4...5..."

"(నేను మనసులో అనుకుంటున్నా)" ఒరేయ్... ఎదవ.. మనిషివా మెగాస్టారువా? తొందరగా తీసి చావు. ఏదో సువార్తల సభల్లో యేసు ప్రభువు సేవకుని మల్లె మీకందరికీ నేనే దిక్కంటూ కృత్రిమంగా నవ్వటం ఎంత కష్టమో తెలుసా...?? 

"ఆ.... ఇది ఓకే... ఇప్పుడు ఆఫ్ ఫోటో క్లోజప్ షాట్ తీస్తాను... ఆ కుర్చీ లో స్టైల్ గా కూర్చోండి అంటూ ఎక్కడో మూలకు కొక్కానికి తగిలేసిన మాసిపోయిన కోటు తీసి ఇచ్చాడు... జాగ్రత్తగా నల్లులేమన్నా ఉన్నాయో లేదో చూసుకొని స్టైల్ గా వేసుకొని కుర్చీ లో కూర్చున్నాను.

"ఇవ్వన్ని ఎందుకు ఇప్పుడు తీసిన ఈ ఫోటోనే కట్ చేస్తే ఆఫ్ అవుతుంది కదా అన్నాన్నేను??"

"కుదరదు.... మా రూల్ ప్రకారం.... పెళ్ళి చూపుల ఫోటోలకి నించొని ఒకటి. కూర్చొని ఒకటీ, పాస్పోర్ట్ ఒకటీ తియ్యాల్సిందే " (వీడు వీడి ఎదవ రూల్స్ అనుకున్నా నేను మనసులోనే... ఏదో ఒకటి తొందరగా తగలెట్టు రా ఎదవా)

"సార్... ఫోటోలు ఏ బ్యాక్ గ్రౌండ్ తో కావాలీ? చుక్కలు-చంద్రుడు మధ్యలో మీరు నించొని నవ్వ్తుతున్నట్టూ... మేఘాల్లో తేలుతున్నట్టూ... జలపాతం ముందు కూర్చున్నట్టూ... అక్కడ ఆకాశం లో కూర్చొని మీరు ఈ లోకాన్ని అంతటిని ఉద్దరిస్తున్నట్టు రావాలా సార్ అని అడిగాడు.

"నాయనా... చూసిన జనాలు నన్ను  మనిషిగా గుర్తించేట్టు ఉంటే చాలు... గ్రాఫిక్స్ అక్కర్లేదు."

ఆ రకంగా... ఫోటోషాప్ లో ఎడిట్ చేసిన ఫోటోలూ, MS Wordలో ఎడిట్ చేసిన నా Biodata లు పదుల  సంఖ్యలో ప్రింటవుట్ తీయించి ఇంటికి బయలుదేరాను  మా నాన్నతో కలిసి...., 

ఇంటికొచ్చేసరికి ఎప్పటి నుంచో మా ఇంటి వాస్తులు.. మా ఇంటి పూజలు చేస్తూ.. ఇదిగో నా పెళ్లోస్తే, ఆయనకీ ఎంతో కొంత "భారీ" సంభావన ముడుతుందని ఆశగా ఎదురుచూస్తున్న మా పంతులు గారు (మా అమ్మ అయ్యగారు అని పిలుస్తుంది) మా అమ్మ పోసిన చాయ్ నీళ్ళను గతుకుతూ మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు. నన్నొకసారి ఎగాదిగా చూసి.... (అచ్చం ఫోటోగ్రాఫర్ కూడా అలాగే చూశాడు నన్ను)

నా ఫోటోలు తీసుకుని చూసి అయ్యో ఫోటోలు ఇలా ఉన్నాయేంటి... ఎప్పుడైనా ఫారెన్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు మంచులో తీసుకున్న ఫోటో ఏమీ లేదా?" అని అడిగాడు.  మంచులో ఉన్న ఫోటో ఉంది గానీ అది ఫారెన్ ట్రిప్ లో దిగింది కాదని చెప్పాను. "అయితే అక్కర్లేదు" అని తేల్చేసి "ఇంతకీ ఎలాంటి అమ్మాయి కావాలోయి?" అనడిగాడు.

పెద్దగా డబ్బు లేని ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ లో పుట్టి ఏదోక డిగ్రీ పూర్తయ్యి వీలైతే జాబ్ చేస్తూ లేకుంటే జాబ్ వెతుక్కుంటూ... ఆధునిక భావాలతో.., సాంప్రదాయ విలువలు గల వంటొచ్చిన తెలివైన చురుకైన అణకువ గల అందమైన అమ్మాయి కావాలి. ముఖ్యమైన విషయం పొడుగు జడ ఉంటే ప్రయారిటీ ఇస్తా" అన్నాన్నేను. నా రిక్వైర్మెంట్ ను రీసైకిల్ బిన్ లోకీ, నా ఆశల్ని అగాధం లోకీ తోసేస్తూ... "నా దగ్గర ఉన్న 100 సంబంధాల్లో... 93 అబ్బాయిలవీ... మిగిలిన 7 అమ్మాయిలవీ... ఆ వివరాలు అన్ని మీ అమ్మ కి చెప్పాను అని అన్నాడు. అన్నీ కావాలంటే ఎలాగా? నువ్వు ఏ జనరేషన్ లో ఉన్నావ్ బాబు... ఉద్యోగం చేసే పిల్లకి అణకువ ఉండకపోవచ్చు. కట్నం ఇచ్చే అమ్మాయి అందంగా ఉండకపోవచ్చు.. అందంగా ఉండే పిల్ల కట్నం ఇవ్వలేకపోవచ్చు. మూడూ ఉన్న పిల్ల జాతకం కుదరకపోవచ్చు. అన్నీ ఉన్న పిల్ల నిన్నెందుకు చేసుకుంటదీ?" కొంచెం ఆలోచించు.... ఏదో ఒక పిల్లను నచ్చు... ఆ పిల్ల తోనే జత కట్టు... అని సూటిగా చెప్పేసాడు ఆ పంతులు. 

ఆ ఏడింటిలో కత్తిలా ఉన్న (పద ప్రయోగానికి క్షమించాలి) మూడు ఫోటోలు సెలెక్ట్ చేసి మా నాన్నకిచ్చి సిగ్గుపడుతూ నా రూంలోకి వెళ్ళిపోయాను. అందులో జాతకాలు కుదరలేదని ఒకదాన్ని మా నాన్న రిజెక్ట్ చేసారు (అసలే మా నాన్న కి జాతకాల పిచ్చుంది). సరేలే ఇంకా రెండు ఉన్నాయ్ కదా అని మనసులో అనుకున్నా. ఆ రెండిట్లో ఒక అమ్మాయి సంబంధికులకు ఫోన్ చేస్తే మెరిక లాంటోణ్ణీ పెళ్ళిచేస్కొని అమెరికా వెళ్ళిపోయిందని చెప్పారట. ఇంకో అమ్మాయి నెల క్రితం డెలివరీ కోసం ఇంటికొచ్చిందంట. పెళ్లిలు అయిన పిల్లలను చూపెట్టినందుకు ఎక్కడలేని కోపం వచ్చి పంతులుకు ఫోన్ చేసాడు మా నాన్న... పంతులు కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చాడు మరీ.. ఈ రోజుల్లో ఆడపిల్లలు కరువున్నారు మరీ... మీరు తొందరగా క్యాచ్ చేయాలనీ... ఆ మాటలు విన్న నాలో మల్లి భయం మొదలయ్యింది.

"అంతం కాదిది ఆరంభం" అనుకొని గుండె రాయి చేసుకొని వచ్చిన సంబంధాలన్నీ పరిగణించటం, తెచ్చిన ఫోటోలన్నీ పరిశీలించటం, నచ్చిన అమ్మాయిలందరినీ చూట్టానికి పోవటం అలవాటు చేసుకున్నాను.

*********************************************************************************
రెండు నెలల తర్వాత రీసెంట్ గా...!!

ఓ రోజు తెల్లవారుఝామున ఏడు గంటలకే నా చరవాణి కయ్యి మని అరచింది. ఈ టైం లో ఎవరా అని చూస్తే.. మా నాన్న... రాత్రి తాగిన బ్రాండ్ ఏదో గుర్తుకు రాక దాని పేరేంటో... పంపించిన నన్నే అడగటం అలవాటు ఆయనకి...,  అందుకు ఫోన్ చేశారేమో అనుకోని ఫోన్ లిఫ్ట్ చేస్తే....

"అరేయి హరీ..  గా వరంగల్ వాళ్ళు నీ మెయిల్ కి  ఫోటో పంపించారంట. వచ్చిందా? చూసుకొని వెంటనే చెప్పమని చెప్పాడు.... 

వెంటనే లాప్ ట్యాప్ కోసం బెడ్ దిగి.. చక చక మెయిల్ తెరచి వచ్చిన మెయిల్ ను చూసుకున్న నాకు నచ్చింది కూడా.... ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే నాన్న కి ఫోన్ చేసి పక్కింటోడికి హార్ట్ అటాక్ వచ్చేట్లు అరచి మరీ ఫోన్ లో చెప్పాను.., నాన్న అమ్మాయి నచ్చిందని....

నీకు నచ్చని అమ్మాయిలున్నారా మన దేశంలో? సరే... అయితే సాయంత్రం 4 గంటల 49 నిమిషాలకి నీ ఫోటో పంపించు. అప్పుడు ముహూర్తం బాగుంది... ఈ సంవత్సరం నీ పెళ్ళి ఖాయం అన్నాడు మా నాన్న... అవునా నాన్న అంటూ నేను సిగ్గు పడుతుండగానే ఫోన్ పెట్టేసాడు మా నాన్న. నేను పడిన సిగ్గు వేస్ట్ అయ్యిందేమో అనిపించింది.

ఏంటి నాన్న ఇదీ పొద్దు పొద్దున్నే? నీ చాదస్తం కాకపోతే మరేంటీ ....!! సరిగ్గా ఆ టైం కి పంపించడం ఎందుకు ఇప్పుడే పంపిస్తా అన్నాను నేను ఆదుర్దా గా మల్లి ఫోన్ చేసి..!!

"ఎదవ యేషాలు చేయకుండా నేను చెప్పింది చేయమని అన్నాడు" మల్లి ఎందుకైనా మంచిదని అలాగే అన్నాను నేను....

"కరెక్ట్ గా ఆ సమయానికి మంచి ఫోటో చూస్కొని అప్ లోడ్ చేసి సెండ్ కొట్టే సమయానికి కరెంట్ పోయింది. నెట్ ఆగిపోయింది....."

ఇలా వందల సంఖ్యలో ఫోటోలూ, పదుల సంఖ్యలో పెళ్ళిచూపులూ చూసి అలుపూ,అనుభవం వచ్చిందిగానీ నా పెళ్ళిగడియ రాలేదు. పెళ్ళి చూపుల్లో రిపీటెడ్ గా ఎదురైన ఆ భయంకర అనుభవాలని ఇక్కడ బుల్లెట్ పాయింట్స్ గా ఇస్తున్నాను. సాటి బ్రహ్మ చారులు ముందుగా ప్రిపేరయి ఉండండి.

"ఎక్కడ పని చేస్తున్నావ్ ?? గవెర్నమెంటా? ప్రైవేటా?? జీతమెంతా??" (ఒక వేళ ఉద్యోగయితే...) లేదు బిజినెస్ అయితే ఎం కంపెనీ ఎక్కడ పెట్టావ్... ఎంత పెట్టుబడి... ఎంత టర్న్ ఓవర్ వస్తుంది... ఎంత మంది పని చేస్తున్నారు.... ఏమైనా వర్క్ అవుట్ అవుతుందా లేదా? 

"అదేం ఆ ఎదవ పని చేశావ్?? మా అమ్మాయి పలానా ప్రభుతోద్యోగానికి సెలెక్ట్ అయ్యింది... అలాంటి చెత్త పనులు కాకుండా నువ్వు కూడా అదే ప్రభుత్యోద్యోగం చేస్తే అయిపోయేది కదా?"

{భగవంతుడా... యేసు ప్రభువా అల్లా ఓ శంకరా... 1 2 3 4 5 6 7.. కంట్రోల్... కంట్రోల్...}

"మా అమ్మాయి వెలుగుతున్న ట్యూబ్ లైట్ లా ఉంటాది. నువ్ ఎండిపోయిన చింతపండులా ఉన్నావు. కట్నం కట్"

మా అమ్మాయి కొంచెం బొద్దుగా అందంగా ఉంటుంది... మీరేమో కొక్కానికి తగిలేసిన చొక్కా లా ఉన్నారు...

"బాబూ... నీకు మందు- సిగరెట్టూ లాంటి పాడలవాట్లు ఉన్నాయా??"

(నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఉంటే మాత్రం ఉన్నాయని చెప్తానా? మాసిపోయిన బట్టల్ని ఇస్త్రీ చేసుకొని వేసుకొచ్చిన మొహమూ నువ్వు ఎవడ్రా నువ్వు)

"అబ్బాయి ఎన్ని చలం పుస్తకాలు చదివినా గానీ, ఎంత ఆదర్శ భావాలు ఉన్న కాని అన్నీ ఉండీ కట్నం వద్దంటున్నారంటే మాకెక్క్కడో తేడా కొడుతుంది...మాకు నమ్మకం లేదు... కొంపదీసి మీ అబ్బాయి తేడా కాదు కదా..!!

(తిరుపతి లడ్డూని నాలుకకి తగలకుండా మింగేస్తాననే మీ లాంటి మూర్ఖుల్ని ఎవడూ బాగుచెయ్యలేడు రా ఎదవా.. ఇలాంటి పిచ్చనుమానాలతో అవమానిస్తే నీ చర్మం వలిచి Woodland కంపెనీ వాడికమ్మేస్తా..  నమ్మండి రా... నమ్మకమే జీవితం! టీవీ లో ఎప్పుడూ వినలే?? )

"ఖాళీ టైం లో ఏం చేస్తుంటారండీ?"
(ఫ్లాపయ్యే సినిమాలు చూసి హిట్టయ్యే రివ్యూలు రాస్తుంటానండీ.. మనసులో వెటకారంగా అనుకున్నా)
"అంటే పనికొచ్చే పనులేవీ చెయ్యరన్నమాట..హ..హ హ"
అలా అయితే మీతో మాట్లాడేవాడినా?? హ..హ హ.
"అమ్మా...  వీడు చాలా వెటకారంగా మాట్లాడుతున్నాడు నన్ను ఫ్యూచర్లో బాగా డామినేట్ చేస్తాడు నాకు నచ్చలేదు ఆ పిల్ల నుండి సమాధానం...."

"మీ అబ్బాయిని సంవత్సరం నుండి స్టిల్ బ్యాచిలర్గానే చూస్తున్నా ఇంకా ఏమీ కుదరలేదా?? అసలేంటి ప్రాబ్లం??" (ఎవరో అనామకుడి ఎదవ ప్రశ్నలు)
(నా దరిద్రం నాతో దోబూచులాడుతుంది... చికెన్ సెంటర్ బయట తోకూపుతూ తిరిగే ఊరకుక్కకి వినిపిస్తుందా.... ఆ లోపల చచ్చే బ్రాయిలర్ కోడి ఆర్తనాదం??)

"కార్తీక మాసం ఇప్పుడు చూడండి... పెళ్ళెందుకవ్వదో నేనూ చూస్తానూ"

(రంజాన్ మాసం కూడా చూసానండి...వర్కవుటవ్వలేదూ మా నాన్న సమాధానం... మా వాడిని నచ్చిన అమ్మాయి 'వాడికి' నచ్చదు... మా వాడికి నచ్చిన అమ్మాయి 'వాడిని' నచ్చదు... ఏదో ఒకటి నచ్చినా కాని మా వాడు అమ్మాయి భావాలు నచ్చలేదని వదిలేసి నా భావాలను పరిక్షిస్తుంటాడు.... )

"జాతక దోషమేమో....? శాంతి పూజలు చేయించండీ... తూర్పు దిక్కునుండి సంబంధం వెతుక్కుంటూ వచ్చి సెట్టయ్యిపోతుందీ"

[ఇలాంటయిడియాలు వినే కదా పోయినేడాది హోల్ మనీ హోమగుండం లో పోసిందీ? కళ్యాణం కోసం క్షుద్రపూజలు తప్ప అన్నీ చేశామయ్యా సామీ. వింటానే ఉంటే,  పొయ్యిలో నెయ్యి పొయ్యండీ, టీ డికాషన్ లో మజ్జిగేసుకొని తాగండీ అని చెప్తానే ఉంటారు మీలాంటోళ్ళు]

*******************************************************************************
ఫైనల్ గా ఓరోజు  నాతో చదువుకున్న నా క్లాస్ మేట్ నా దగ్గరికి వచ్చి "అరేయి హరీ... పొడుగుజడున్న పెళ్ళాలు  బాపు సినిమాల్లోనే ఉంటారు. నిజ జీవితం లో పిచ్చెక్కించే పెళ్ళాలు మాత్రమే ఉంటారు కావలిస్తే మీ నాన్నని అడుగు.... నీ చెత్త రిక్వయిర్మెంట్స్ లో 80% కాంప్రయిజ్ అవుతానంటే నా దగ్గర సంవత్సరం క్రితం వేసుకున్న బ్యాకప్ ప్లానుంది. ఆమె ఎవరో కాదు నా చెల్లెలేరా.... ముగ్గులో పొర్లించినట్టుండే దానికీ కట్టెకి బట్టలేసినట్టూండే నీకూ సరిగ్గా సరిపోద్దనుకుంటున్నాను...  ఓ సారెళ్ళి కరీంనగర్ వెళ్లి చూసిరా అంది నా క్లాస్ మేట్....

నా ఆలోచన అది కాదు రేఖా (నా క్లాస్ మేట్ పేరు రేఖ)... ఎప్పటికయినా "ఆనంద్ సినిమాలో రూపనీ, గోదావరి సినిమాలో సీతనీ కలిపి మిక్స్ చేసిన అమ్మాయిని చేసుకుంటాను... శేఖర్ కమ్ముల లాంటి తండ్రి ఎక్కడో క్రియేట్ చేసే ఉంటాడు" ఎక్కడో నా భావాలకి.., నా ఆలోచనలకి సరి తూగే అమ్మాయి దొరక్కపోతుందా అని నేను... ఆ ఆలోచనలను అటుకు మీదెసి ఇప్పటికైతే ఒకసారి చూసి రారా అంది....

బాలయ్యబాబు విన్యాసాలకి గ్రాఫిక్స్ తోడయినట్టూ దారుణంగా అయిపోయింది నా పరిస్థితి. నా రిక్వయిర్మెంట్ ని అర్ధమయ్యేట్టూ చెప్పడం ఓపెనర్ లేకుండా వైన్ బాటిల్ మూత తియ్యడమంత కష్టమని అర్ధమయ్యింది. Youtube లో దొరకని పాత సినిమా.., టీవీలో వచ్చి కరుణించినట్టూ ఈ ముగ్గుబుట్టే మన రిక్వయిర్మెంటేమో అని డౌటొచ్చి అలవాటు ప్రకారం చూడ్డానికి వెళ్లాను. ఎప్పటికైనా నా భావాలకి తగిన అమ్మాయిని ఈమె కావచ్చని అని మనసులోనే ఒక మాట అనేసుకొని ధైర్యంగా ఆ అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళాను... వెళ్ళాకా తెలిసింది అమ్మాయి చూడముచ్చటగా ఉంది కాని అమ్మాయితో నా భావాలూ ఆలోచనలు పంచుకొనే సమయం రాలేదు... ఆ సమయం రాగానే అవి కూడా పంచుకున్నాక ఇంట్లో మల్లి చర్చలు ప్రారంభమయ్యాయి...

ఈ కథంత విని నా బ్లాగ్ మూగబోయింది... అంటే పోదా మరీ?? 2015 లో జరిగిన విపరీతాల్లో ఇదొకటి...

పెళ్లి ఫల ప్రదం అయితే ఆ తంతు గురించి... ఫలప్రదం కాకపోతే మరో పెళ్లి చూపు గురించి రాస్తాను... ఇక్కడి వరకైతే ఇంతే మరీ...!

హరికాంత్ రెడ్డి రామిడి

1 comment: