Friday 28 August 2015

అవును నేను మంచోన్ని కాదు.........


(ఏదో అలా కుదిరేసింది చదివి తరించండి)

స్వప్రయోజనం లేనిదే ఏ పని చేయని మంచి మనసున్న మనుషులందరూ మంచోల్లే.... ఈ కాలంలో మంచోళ్ళు కాని వారెవ్వరూ లేరు.... అందరూ మంచోల్లే...!!
పసి పాపకి జన్మనిద్దామని ఆసుపత్రికి వెళ్తే ఆ పసి పాప ప్రకృతి ధర్మంగా బయటికెళ్ళే అవకాశం ఉన్నా కానీ.., 'కాణీ' పైసా రాదనీ.., కోసి తీసి పసి పాపని మన చేతిలో పెట్టె ఆ కలియుగ దైవమల్లె కనిపించే ఆ డాక్టరు మంచోడే... పోనీ జబ్బు చేసి తన దగ్గరికి వచ్చిన మంచి మనిషికి మంచిగా జబ్బు నయం చేసినా..., బిల్లు దగ్గరికి వచ్చేసరికి డబ్బు జబ్బుని తగ్గించే మందు లేదని మంచిగా చెప్పే ఇంకో డాక్టర్ ఇంకా మంచోడే..!!
పూటకో మాట చెప్పి గడియకో గుణం ప్రదర్శించి.., ఒటేయక ముందు మూటలు తీసి... ఒటేసాక వాటాల గురించి మాట్లాడుకునే మన ఆదర్శవంతమైన నాయకులూ మంచోల్లే..... 100 రూపాయలు చూపించి 10 రూపాయలు ఇస్తున్నానని.., పైన ఆకాశాన్ని చూపించి కింద నేలపై ఒక్క రూపాయి పడేసి ఆసాంతం నాకించి.., ఈ మంచోల్లందరికీ మంచి చేసింది మేమే అని చెప్పుకొనే మన ప్రభుత్వ పాలకులూ మంచోల్లే....!! 
రోడ్దేస్తాడు..., ఏదో నాలుగు డబ్బులు వెనకేద్దామని అందమైన రోడ్డుకు నాలుగు రోజుల తర్వాత నాలుగు బొక్కలు కనిపిస్తాయి... ఏ అవి బొక్కలు కాదు ఆ రోడ్డుకు అందమైన దిష్టి చుక్కలని చెప్పుకొని తిరిగే ఆ కంట్రాక్టర్ మంచోడే.... ఆ కంట్రాక్టర్ కి పాపం పోనీలే.., అతని కుటుంబం కూడా బ్రతకాలి కదా అని.., ఆ కుటుంబంతో పాటుగా మా కుటుంబమూ బ్రతకాలని చూసి చూడనట్లు వదిలేసి జేబులో నాలుగు రాళ్లు వేసుకుని.., జీవితంలో ఎం సంపాదించలేదని రాళ్ళే మిగిలాయని చెప్పుకొని తిరిగే ఆ గవర్నమెంట్ ఉద్యోగులు మంచోల్లే....!!
భార్య ముందు పక్కింటావిడ కూడా ఎవరో తెలీదన్నట్టుగా ప్రవర్తించి... కడప దాటగానే కనిపించే ప్రతి ఆడదాన్ని, చూసి చూడనట్లు చూసే మంచి మనసులన్న మగ పుంగవులందరూ మంచోల్లే... చూడకున్నా కాని ఏ ఆడదన్న అవకాశం ఇస్తుందేమో అని సొల్లు కార్చుకుంటూ సోగ్గా సూసే మనసున్న మహారాజులందరూ మంచోల్లే....!!
సమాజంలో నీతివంతంగా బ్రతుకుతూ సమాజానికి అలా చేయాలి ఇలా చేయాలి అని.., నీతి వ్యాఖ్యలు.., సూక్తి స్టొరీలు చెప్తూ... తన మటుకు మాత్రం సమాజంలోని 'ప్రకృతి ప్రసాదించిన వనరులను' అడ్డంగా దోచేస్తూ దర్జాగా తిరిగే ప్రబుద్దులూ మంచోల్లే...!!
సిగ్నల్ దాటితే 1000 రూపాయాలని..., అదే డిపార్టుమెంటు కి చెందిన వ్యక్తి మాత్రం ముగ్గురితో కలిసి ప్రయాణించేలా సౌకర్యవంతమైన ఏర్పాటు కలిగిన పెద్ద మనుషులందరూ మంచోల్లే.... 
భక్తే జీవితానికి పెద్ద ముఖ్తంటూ... స్వామి సేవయే సమాజ సేవ అని తోటి మంచోల్లందరినీ నమ్మించి.., ఆ స్వామి దర్శనం పట్టాలంటే ముందున్న డొనేట్ బాక్స్ ని తట్టాలని లీగల్ గా ఆదాయపు పన్ను మినహాయింపుతో మరీ మంచోల్లందరి దగ్గర మంచిగా సంపాదించే ఆ స్వామీ ఇంకా మంచోడే.... 
ఎక్కడ  మంచి అవకాశం దొరుకుతుందా.., ఆ అవకాశాన్ని మంచి ఆదాయంగా ఎప్పుడు మలచుకుందామా అని చూసే పెద్ద మనుషులందరూ మంచోల్లే... 
ఇంత మంచి మంచోల్లన్న ఈ లోకంలో ఉన్న నేను మాత్రం మంచోన్ని కాదట...!!  అవును మరీ నేను మంచోన్ని అంటే ఆశ్చర్య పడాలి కాని మంచోన్ని కాదంటే ఇంత మంచి మంచోల్లున్న ఈ లోకం నిజంగానే వ్యతిరేకిస్తుందేమో..!! 

ఏది ఏమైనా ఈ మంచోళ్ళున్న ఈ మంచి లోకంలో నా లాంటి వాడు పుట్టినందుకు సిగ్గు పడుతూ...  ఈ అవనిలో ఉన్న మంచి మంచోల్లందరికీ అరకోటి దండాలు.....

హరికాంత్ రెడ్డి రామిడి

No comments:

Post a Comment