Saturday 1 August 2015

'ఎం చేస్తున్నావ్....?' ఒక సగటు యువకుడికి ఓ పెద్ద మనిషి ప్రశ్న!!




భారతదేశంలోని యువకులని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య నిరుద్యోగం.... ఈ మధ్య కాలంలో ఇది అతి పెద్ద సమస్యగ రూపుదిద్దుకొంటుదనటంలో ఎలాంటి సందేహం లేదు... నేటి యువకుల దగ్గర అన్ని ప్రశ్నలకి జవాబు ఉంటుంది.... తెలుసుకోవటంలో పేకాట నుండి ప్లే స్టోర్ లో అన్ని గేమ్ ల వరకు... పనులు చేయటంలో ఇతరులకి సాయం చేయటం దగ్గర నుండి వ్యవసాయం చేయటం దగ్గర వరకి.., సరదాలలో చిత్రం చూడటం దగ్గరునుండి చిత్రాంగులను చూసే వరకు.., ఎక్కడ ఏ ప్రశ్న అడిగిన ప్రతి ప్రశ్నకి యువకుని దగ్గర సమాధానం ఉంటుంది.. యువకుడు అనే పదం ఎంత అద్భుతమైన పదం.. శక్తి, ఉడుకు వేగం, నిర్లక్షం, ఆవేశం, ఉద్రేకం, ఆకర్షణ, కెరటం, పందెం ఇలా ఎన్నో పర్యాయ పదాలను ఇవ్వచ్చు.. ఏముంది మరి ఆ యువకునిలో.... ఆకాశానికి నిచ్చెనలు వేయగల దమ్ముంది.. కలలు కనే స్వేచ్చ ఉంది... కిరణాలని కెరటాలని అరచేత్తో అదిమి పట్టగల బలముంది.. ఇన్ని యుక్తులు ఉన్న యువకుని దగ్గర ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం ఉండదు... అదే "ఎం చేస్తున్నావ్" అనే ప్రశ్న.... ఆ ప్రశ్న అతన్ని నిలువెల్లా దహించి వేస్తుంటుంది.. నాకు తెలిసి సగటు యువకుడు తన యవ్వన కాలంలో తప్పనిసరిగా ఈ ప్రశ్న ని ఎదుర్కొంటాడు.... 

తెలివైన యువకుల్లో సాధారణంగా రెండు రకాలు ఉన్నారు... ఒకటి నైపుణ్యం ఉండి సరైన ఉద్యోగం దొరకగా రాజి పడుతున్న వాళ్ళు... అలా రాజీ పడుతున్నవాళ్ళు.., వారి కుటుంబ బాధ్యతల కోసం రాజి పడటం కొనసాగిస్తూనే ఉంటారు... ఉన్నరా అంటే ఉన్నట్టుగానే ఉంటారు వాళ్ళు... రెండు నైపుణ్యం ఉండి ఉద్యోగం దొరికి మరీ సంతృప్తి లేక వదిలేసి సరైన వేదిక కోసం వెతుకుతున్నవాళ్ళు... మన భారత యువకులు సమస్యలతో అనుక్షణం పోరాడే తత్వం కలిగిన యోదులని నా నమ్మకం... తన సంతృప్తి కోసం సదూర ప్రాంతాలకైన వెళ్తాడు యువకుడు.. కాని ఆ యువకునికి సరైన వేదిక దొరకదు.. ముఖ్యంగా మన దేశంలో అంత త్వరగా అవకాశం తలుపు తట్టదు.., సరైన వేదిక కోసం వెతకటంలో ఆలొచిస్తూ ఉన్నవాన్ని చుట్టూ వున్న సమాజ పెద్ద మనుషులు (ఇక్కడ నేను పెద్ద మనిషి అని ఎందుకు అన్నాను అంటే ఎం చేస్తున్నావ్ అనే ప్రశ్న అడిగిన ప్రతి ఒక్కరు నా ద్రుష్టి లో పెద్ద మనిషే.. "సమాజ పెద్ద మనిషి") 'ఎం చేస్తున్నావ్' అనే ఈ ప్రశ్న అడిగేవాణ్ణి మన 5 వేళ్ళ ముద్రలు గుర్తుగా పడేలా చాచి కొట్టాలని అనిపిస్తుంది. కాని కొట్టలేము... మనం నేర్చుకున్న సంస్కారం మనకి సర్దిచేప్తుంది... సరే అదే సమయంలో అతను అడగటం తప్పు కాదు.. అదే సమయంలో ఒక యువకుడు ఖాళిగ తిరుగుతున్నాడు అంటే అతనికి ఏ పని రాదనీ కాదు... అతనికి తనను తాను నిరూపించుకునే అవకాశం రాలేదని....!! సరే.., అవకాశం మన దగ్గరికి రాదు మనమే అవకాశం తలుపు తట్టాలి... దారి దొరకకపోతే మనమే దారి వెతుక్కోవాలి అనే సూక్తులు చూడటానికి, ఉత్తేజపరచటానికి పుస్తకాల్లో బాగుంటాయి... కాని ఆచరణలోనే కొంచెం సమయం తీసుకుంటుంది... అప్పటికప్పుడు ఆ యువకుడు ఆ ఆచరణను ఆపాదించే దిశగా అడుగులు వేస్తున్నాడా లేదా అన్నది కీలకం... 

ఇంక.., ఇంకో రకం యువకులు అందివచ్చిన అవకాశాన్నీ.., పరిస్థితులని చూసి వదిలేసుకొని ఇంకేం చేద్దామా అని ఆలోచిస్తూ అమితమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగే ఉండే యువకులు... వీరు స్వతంత్రంగా వ్యవహరిస్తారు.. అవకాశం ఉంటుంది.. దాన్ని అందిపుచ్చుకునే ఆలోచన ఉంటుంది.. అదే సమయంలో ఆచరణ ఉంటుంది.... కానీ ఇతను కూడా ఖాళి గానే తిరుగుతుంటాడు... ఖాళిగ తిరిగినంత మాత్రాన అతని కాపళం ఖాళి అని కాదు... తన నైపుణ్యాన్ని ఏ విధంగ సమాజంలో సమర్థవంతంగా ఎలా సద్వినియోగం చేయాలో తపన పడుతున్నాడని అర్ధం.... వీటికి నేను రెండు ఉదహారణలు ఉదహారిస్తాను.... 

ఈ మధ్య నాకు తెలిసిన ఒక మంచి ప్రతిష్టాత్మక సాఫ్ట్ వేర్ సంస్థలో పని చేస్తున్న అబ్బాయి ఒకడు తనకు వచ్చే సకల సౌకర్యభత్యాలన్నిటిని వదులుకొని చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టాడు... వాడు అడుగు పెట్టినప్పుడు వాని చుట్టూ ఉన్న సమాజం వాణ్ణి విమర్శించింది... కాని వాడు తన కిష్టమైన రంగంలోనే ప్రతి అవకాశం కోసం తిరిగాడు... కాని దొరకలేదు.. రాజి పడ్డాడు. మల్లి తను ఇంతకు ముందు ఉన్న రంగంలోనే ఇంకో చిన్న ఉద్యోగం వెతుక్కొని వాని స్థాయికి సరిపోకపోయినా మనసులో ఆశలన్నీ చిదిమేసుకొని తన పని తాను చేసుకుంటున్నాడు... అతని ఆలోచన, కోరిక గొప్పది కాని ఆచరణలో అతడి శ్రమకి మించిన భారం అని అనుకున్నాడు.. ఇంకొకరి విషయంలో ఎందరికో కల అయినటువంటి ఒక మంచి గుర్తింపు సంస్థలో అభ్యసించిన తనకు.... తన చదువుకి, తన నైపుణ్యానికి దేశంలోనే గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించగలడు... కాని అవన్నీ అతనికి సంతృప్తి ఇవ్వలేదు... అన్నింటిని కాదనుకున్నాడు... అవన్నీ కాదనుకున్నపుడు ఎన్నో సమాజ విమర్శనాస్త్రాలను అతను ఎదుర్కొన్నాడు... కొందరు అదేం రోగం అన్నారు.. కాని అవన్నీ అతని సంకల్పాన్ని సంకటపరచలేదు... రెండు సంవత్సరాల క్రితం ఒక చిన్న పాటశాలని ప్రారంభించాడు.. ఇవ్వాళ అది చిన్నదే కావచ్చు కాని అదే రేపటి తరానికి మార్గ దిక్సూచిగా ప్రసిద్ది గాంచవచ్చు.. ఆ నమ్మకం అతనిలో ఉంది... ఏదైనా ఆలోచన తీరుని బట్టి కాకా ఆచరణ తీరుని బట్టి కూడా ఉంటుందనటంలో సంశయించాల్సిన అవసరం లేదు .... మొదటి వాడిది సంకల్పం మాత్రమే... రెండవ వాడిది సంకల్పం మరియు దానితో పాటు దాన్ని ఆచరణలో పెట్టి సకరనాత్మకంగా సాధించేవరకి శ్రమించటం... 

అదే మన చుట్టూ ఉన్న సమాజం మొదటి వాణ్ణి కొంత అయిన ప్రోత్సహిస్తే మొదటివాడి నైపుణ్యం ఈ ప్రపంచానికి తెలిసేదని నేను నమ్ముతాను... యువకులు రాణించటంలో మన సమాజ పాత్ర కూడా ఉందన్నది ఎటువంటి సంశయం లేని వాస్తవం....యువకుడు సమాజంలోని ఆటుపోట్లని అర్ధం చేసుకోవటానికి మనం ఆసరా కావాలి కాని అడ్డు కాకూడదు.... ఇకనైనా మన "సమాజ పెద్ద మనుషులు" ఎక్కడైనా యువకులు కలిసినప్పుడు ఎం చేస్తున్నావని ప్రశ్నించకండి.... "ఎం చేయగలవు" అని అడగండి... ఎందుకంటే మన దేశంలో ఒక్కో నిరుద్యోగి ఒక్కో నిప్పుకణం... అమితమైన దాహంతో సమాజమనే ఎడారిలో తిరుగుతున్న నిరాశ వాదంతో పాటు ఆత్మ విశ్వాసమే ఆలంబనగా ఉన్న ఆశావాది.... "నువ్వు ఎం చేస్తున్నావ్" అనే ప్రశ్న అడిగినప్పుడు ఎం చేస్తున్నావ్ అన్న ప్రశ్న దగ్గరే నువ్వు(సమాజ పెద్ద మనిషి) మిగిలిపోతావ్ కాని అతను ఎం చేయగలడో నిరూపించి ఆ యువకునిలో యుక్తి తో పాటు అదే స్థాయిలో శక్తి ఉందని సవాలు చేయగలడు.. అతని ఆలోచన అద్బుతం.., అతని ఆశయం ఆకాశం.., ఆ ఆలోచనలు, ఆ ఆశయాలు ఆచరణాత్మక దిశగా సాగితే ఏమైనా చేయగలడు… ఏదైనా నిరూపించగలడు.... ఒక కార్తికేయ మిశ్ర, ఒక బాల్క సుమన్, ఒక పూర్ణ మాలవత్, ఒక నిఖిల్ చౌహాన్, ఒక సుహాస్ గోపీనాథ్, ఒక అపర్ణ భూలా., స్పూర్తిగా....

హరికాంత్ రెడ్డి

No comments:

Post a Comment