Wednesday, 5 October 2016

అందాలానందాల ఆరబోత పండుగచ్చింది.....


ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ....!
ఏమేమి కాయప్పునే గౌరమ్మ.....!
తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ...!! తంగేడు కాయప్పునే గౌరమ్మ.....!!

పల్లెలన్నీ ఒళ్ళు విరుచుకొని ప్రజ్వలించే పండుగ...
ఆడబిడ్డల ఆనందాలు అంబరాన్నెంటే పండుగ...
అమ్మాయిల అందాల ఆరబోత పండుగ....
ఆడపిల్లల ఆలింగనాల పండుగ... 
ఇంటికాడున్న ఆభరణాలన్ని ఒంటిమీదకొచ్చే పండుగ....
పట్టుచీరలన్నీ పక్కున ప్రకాశించే పండుగ....
ముసలోళ్ల మూసి మూసి నవ్వుల పండుగ...
అరుగు మీద అవ్వ ఆనందంగా ఉండే పండుగ...
మగువల సొగసు ఆటను చూసి మబ్బులు సిగ్గుపడే పండుగ...
ముద్దుగుమ్మలు మురిసిపోయే ముచ్చట్ల పండుగ... 
పడుసు పోరగాండ్ల పరాక్రమ ప్రదర్శనల పండుగ...
పడచుల నయనాలు నాట్యమాడే పండుగ....
కన్నె పెదాల ఎరుపుకు ఆకాశంలోని చుక్కలు కూడా చీకట్లలోకెళ్లే పండుగ....
కోలాటాల కౌగిలింతల పండుగ...

ఇది నా తెలంగాణ పూల పండుగ.....!!


హరికాంత్ రెడ్డి

Thursday, 18 August 2016

అందాన్ని చూసాను......!


చూసాను.... ప్రేమతో చూసాను... 
అసలైన అందాన్ని చూసాను... అసలు రంగులంటూ అద్దని (మేకప్ లేని) రూపాన్ని చూసాను....

చందమామ మనసు కూడా చివుక్కుమనేలా చక్కనైన మోము....
నక్షత్రాల్లాంటి నయనాలు
ముట్టుకుంటే మాసిపోయే లేలేత చెక్కిళ్ళు
లేత ఎరుపు రంగు పెదాలు
పెదాల అందాన్ని రెట్టింపు చేసి మత్తెక్కించ్చే పుట్టుమచ్చ...
తన మెడ పైన నుండి జాలువారిన వయ్యారమైన వాలు జడ....
చెవులపై పడుతున్న వెంట్రుకలను సరి చేస్తూ బాణాల్లాంటి చూపులను విసిరే అందాన్ని చూసాను.... 

బ్రహ్మ అందానికి అచ్చుగా ఆ అమ్మాయిని అచ్చేసాడా.....
తన కనురెప్పల శబ్దం నాకే వినబడుతుంది....
మురిపిస్తుంది 
మైమరిపిస్తోంది
వా.... ఆ అనుభూతి.... 

చూసాను అసలైన అందాన్ని చూసాను... అసలు అద్దానికి కూడా అసూయ కలిగే అందాన్ని చూసాను....

హరికాంత్ రెడ్డి 

Sunday, 14 August 2016

స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా......కలల భారత దేశాన్ని ఆవిష్కరిస్తూ.....


దేశానికి స్వాతంత్రం వచ్చి సరిగ్గా 70 సంవత్సరాలు గడచిపోయాయి... దేశ ప్రధాని ప్రతి సంవత్సరం ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరవేసినప్పుడల్లా శరీరంపై రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. ఏదో తెలియని గర్వం... నా దేశమని....  కానీ ఏదో మూల ఒక ఆవేదన. రాజ్యాంగానికి రూపకల్పన చేసి కూడా ఎన్నో ఏళ్ళు గడచిపోయాయి. కాని మనం దానిలో నాలుగో వంతు కాలం కూడా ముందుకు వెళ్ళలేదు. దేశ ప్రజలు స్వేచ్చ వాయువులు పీల్చుకొని ఆరు దశబ్దాలు దాటి ఏడవ దశాబ్దం లోకి అడుగు పెడుతున్నప్పటికినీ ఇప్పటికి కూడా ఇంకా దేశం పేదరిక విషపరిష్వంగంలోనే విలవిలలాడుతుండటం మన దురదృష్టం. 

సంపద పంపిణీలో అనూహ్యంగా పెరుగుతున్న అసమానతల కట్టడిపై ఏ ప్రభుత్వాలకు శ్రద్ధ లేకపోవటం వల్లే దేశ జనాభాలో సగానికి సగం దుర్భర దారిద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రపంచంలో మరెక్కడా లేనంతమంది నిరక్షరాస్యులు, నిరుద్యోగులు భారత్ లో ఉన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశుధ్య సౌకర్యాలే గీటురాయిగ ప్రాంతీయ అసమానతలకు తావు లేకుండా విప్లవాత్మక వేగంతో, తిరుగులేని నిబద్దతతో ఎన్నుకోబడ్డ ఒక మంచి ప్రభుత్వం పని చేయాల్సిన సందర్భం ఇది. కాని ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ఒక మంచి "నాయకత్వం"(Leadership) కరవైన ఫలితంగా గుండెలు నిండిన ఆత్మవిశ్వాసంతో దేశం పట్ల గర్వంగా ఉండాల్సిన మనకు భవిష్యత్తు పట్ల ఏదో అలజడి.

ఆర్ధిక అభివృద్ధి విషయంలో అన్యాయమైన అసమానతలు కనిపిస్తున్నాయి. దేశ పౌరులందరికీ సామాజిక ఆర్ధిక, రాజకీయ రంగాల్లో సమన న్యాయాన్ని కల్పిస్తామని పుస్తకాలలోని రాజ్యాంగం చెప్తుంది. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి... ఉంటున్నాయి. సామజిక ఆర్ధిక స్వేచ్చ వల్ల ఒరిగిందేమీ లేదు. అసమానతలపై "పోరాటం" పేరిట దేశంలో మావోయిస్టులు తుపాకులు ఎక్కు పెట్టి దేశంలో కొన్ని ప్రాంతాల్లో హింసతో ఇప్పటికి రాజ్యమేలుతున్నారు. నిజానికి వీరి వల్ల సమస్యలు మరింత సంక్లిష్టం అవుతున్నాయి కానీ పరిష్కారాలు మాత్రం సాధ్యం కావటం లేదు. 

ఒక మేధావి తన మాటల్లో చెప్తుంటే విన్నాను మన ప్రజాస్వామ్యం సంపన్నుల కోసం సంపన్నులు నడుపుతున్నట్లుగా మారిపోయిందని. ప్రజా ప్రతినిధి ఉన్నది ప్రజా శ్రేయస్సు కోసం కాదు పదవిని కాపాడుకోడానికే అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఈ పాలకులకు ఎప్పుడు కనువిప్పు అవుతుంది?  అయిదేళ్ళ కొకసారి ఎన్నికల సందర్భంగా మాత్రమే ప్రజలకు గౌరవం దక్కుతుంది. ఆ ఓట్ల పండగ పూర్తయిన తరువాత ఇక అయిదేళ్ళ పాటు ప్రజాశ్రేయం పట్ల సంపూర్ణ నిబద్దతతో భాద్యతాయుతంగా పాలన సాగించే నాయకుడు మనకు ఎక్కడ దొరకాలి?

దేశ జనాభాలో సగం మంది ఉన్న యువత ఇప్పటికైనా మేల్కొనాలి.. నా అభిప్రాయం ప్రకారం మొత్తం పాలనా వ్యవస్థ లోనే సుపరిపాలన విధానాల అమలుకు నడుముకు అందరు నడుము బిగించాలి. దైనందిన జీవితం లో సగటు సామాన్య పౌరుడికి ఆ మార్పు స్పష్టంగా కనపడాలి. బడిలో చదువు బాగా చెప్పాలి. అంటే ఉపాధ్యాయుల కొరత తీరాలి. బడి సమస్యలు పోవాలి. నిరుద్యోగ సమస్యని పారద్రోలాలి. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో డాక్టర్లు మందులు అందుబాటులో ఉండాలి. వాహన సంచారానికి అనువుగా గతుకులు లేని రహదారులు కావాలి. త్రాగునీరు తో మురుగునీరు కలవని నీటి వ్యవస్థలు రూపొందాలి. సేవల కోసం వచ్చిన ప్రజలకి సిబ్బంది నుండి గౌరవం దక్కాలి. విద్యుత్ కోతలు పోవాలి. దోపిడీ దొంగతనాలు జరగని వ్యవస్థ కావాలి. భద్రత విషయంలో భరోసా ఇచ్చే పోలీస్ వ్యవస్థ కావాలి. అన్నింటిని మించి రాజకీయ నాయకులు ఎటువంటి పోలీస్ రక్షణ లేకుండా నిర్బయంగా తిరగగలిగే సువ్యవస్థ ఆవిష్కృతం కావాలి. సుపరిపాలన స్వపరిపాలనకు ఏనాటికి ప్రత్యామ్నాయం కాలేదని నినదించి, బ్రిటిష్ వారిని ఎదిరించి.. పోరి తెచ్చుకున్న స్వాతంత్రానికి నిజమైన అర్ధం కల్పించగల నిబద్ధత కలిగిన నాయకులు "మంచి నాయకులు" మన దేశానికి అవసరం..! అత్యవసరం...!! అంతిమంగా మనందరం కలసి అబ్దుల్ కలాం కలలు కన్న అభివృద్ధి చెందిన భారతావనిని ఆవిష్కరించాలి. 
ఇది మన దేశం...!!

ఇకనైనా ప్రజల ఆశయాలు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకొనే ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని నెలకొల్పే సమయం ఆసన్నమైందన్న విషయాన్నీ పాలకులు, ప్రజా ప్రతినిధులు గ్రహించాలి.

నా సోదర సోదరీమణులకు 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో....


హరికాంత్ రెడ్డి

Friday, 5 August 2016

ఇది నా భారత దేశమిది బ్రదర్.... (This is India Dude)


ఇది భారత దేశం బాబు... ఏ దేశమంటే ఇది నా దేశంరా బాబు....

మద్యపానం తప్పు అంటారు... మత్తులో ఉంటేనే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలమని వైన్ షాప్ కి లైన్ కట్టిస్తారు...
మందు కొడతారు.. మందేసిన తర్వాత మందిని కొడతారు.... ఇది నా భారత దేశం బాబు
స్వచ్ఛ భారత్ అంటాం... కానీ ఎక్కడంటే అక్కడే స్వేచ్ఛగా ఉచ్చోసుకుంటాం... ఇది నా దేశం బాబు....
సంపన్నుడు బ్యాంకులో సాఫీగా సొమ్ము తీసుకొని ఏ మాఫీ లేకుండా టోపీ పెట్టచ్చు.... అదే పేదోడు పైసలు తీసుకుంటే పేచీ పెట్టి వాని గోచి ఊడేలా కొట్టి మరీ రాబడతారు. ఇది నా భారత దేశం...
పైసోన్నోడు స్పెషల్ ఇక్కడ... మనీ లేకపోతే మనిషి కిందే చూడరెక్కడ....
మన దగ్గర ఉన్నదీ లేదనుకుంటాం.... లేనిదీ కావాలనుకుంటాం ఇది నా భారత దేశం బాబు... 
రౌడీ అంటూ ఆరోపిస్తామ్ ... కానీ అదే రౌడీకి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని అరచేతిలో పెట్టి మరి అప్పగిస్తాం...
కుల గజ్జి ఇంకా పోదురా అంటూ క్లాసులు పీకుతాము... అదే మన చెల్లెనో, కూతురో కులాంతరం అంటే కళ్ళెర్ర జేస్తాం... ఇది నా దేశం బాబు... 
తెలివిన్నోనితో తీయగా మాట్లాడతారు... తెలివిలేనోన్ని తెల్ల మొహం వేపిస్తారు ఇది నా దేశం... 
పన్ను కట్టడానికి చట్టాలను వాడతాం.. అదే పన్నుని ఎగ్గొట్టడానికి మల్లి మనమే మినహాయింపు చట్టాలను చేస్తాం....
భారత దేశం ఇక్కడ... బంగారు భవిష్యత్తు ఉందక్కడ.... 


హరికాంత్ రెడ్డి 

Wednesday, 11 May 2016

పుట్టిన నెల ప్రత్యేకం: 27 సంవత్సరాల్లో నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు....


మంచి చెడు అంటూ ఉండదు మంచి చెడు రెండు కలిస్తేనే మనిషి అవుతాడు అన్న వివేకానంద మాటలు నాకు ఎప్పుడు గుర్తుంటాయి... ఈ లోకంలో పూర్తిగా మంచోళ్ళు ఉండరు.., అలా అని పూర్తిగా చెడ్డోల్లు ఉండరు. పరిస్థితులు మనిషిని ఒక్కో వైపు ముడిపెడతాయి... దేశం లో అయిన సమాజంలో అయిన ఎవ్వరు కూడా గొప్పవాళ్ళు ఉండరు నా దృష్టిలో... దేశం గర్వించే మహామేధావి అబ్దుల్ కలాం కూడా నా దృష్టిలో మంచోడు కానట్టే... అరె ఆయన  మీరన్న మంచోడే అయితే ఇతర దేశాలను నాశనం చేయాలనుకునే లక్ష్యాలున్న మిస్సైల్ లను ఆయన కనిపెట్టకపోయే వాడు.. ఆయన మంచోడే అయితే ఇంకొకరిని చంపే ఆయుధాన్ని తయారుచేసి ఉండేవాడే కాదు. దానికి బదులు శాంతి మంత్రం జపించేవాడు... ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళుగా ఉండరు... ఉండలేరు కూడా... (దీనిపై మళ్ళి చర్చ, వాగ్వ్యుద్దం అనవసరం)  ఈ వేదాంతం ఇప్పుడు మాకెందుకు అనుకోవద్దు కాని కొన్ని కొన్ని సార్లు వేదాంతమే వేల కోట్లు ఇచ్చిన సంతృప్తి ని ఇస్తుంది...

బాల్యంలో మే నెల వస్తే ఏదో ఎండాకాలం సెలవులు వచ్చి మనసార ఆడుకోవటానికి వచ్చిన సమయంగా భావించేవాన్ని... యవ్వన కాలంలో పొద్దున్న పడుకోవటానికి..., మధ్యాహ్నం ఎండ పేరు చెప్పి మల్లి పడుకోవటానికి.., సాయంత్రం స్నేహితులతో బలాదూర్ తిరగటానికి.., రాత్రి నాన్న అంగి జేబులో ఎమన్న నోట్లు తగిలితే స్నేహితులంతా కలిసి తలో యాభై వేసుకొని చల్లటి బీరు వేయటానికి... అదొక అందమైన అనుభూతి... కాని ఇప్పుడు మే నెల అంటే ఆర్ధిక సంవత్సరానికి సరిగ్గా ఒక్క నెల తర్వాత వచ్చేది.... మే లో స్టాక్స్ కొంచెం డౌన్ ఫాల్ లో ఉంటాయి... ఆర్ధిక సంవత్సరం అప్పుడే ఫస్ట్ గేర్ వేసుకొని ముందుకు దూసుకువెళ్ళటానికి ఉన్న సమయం.., పెట్టుబడులకు అనువు కాని నెల..., ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే ఎండ ఎక్కువ కొడితే దీనమ్మ జీవితం ఈ మే నెల ఎప్పుడు పోతుందా అనుకొనే రోజులు.... 

కాని నాకు నేను... గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మే నెలలోనే నేను పుట్టానన్న సంగతి.... మే నెలలో నా పుట్టిన రోజు ఉంటుందన్న విషయం ఎవరన్న గుర్తు చేస్తే తప్పితే గుర్తుకురాదు.... గత సంవత్సరం నుండే మే నెల వస్తే చాలు.. భయం భయపెడుతుంది... ఇంకా ఎం సాధించలేదు సగం జీవితం అప్పుడే అయిపోయిందన్న బెంగ పట్టుకుంది.. ఇంకా చెప్పాలి అంటే జీవితం అతి పెద్ద అచీవ్ మెంట్ గా కొందరు చెప్పుకునే.... "అహ నా పెళ్ళంటా" తంతు ఇంకా కానేలేదు.... గత సంవత్సరం అసలు ఎం సాధించాను అన్న దానిపై ఆగిపోయింది... కాని ఈ సారి మాత్రం కొత్త కొత్త భయాలు సరికొత్తగా మదిలో గూడు కట్టుకుంటున్నాయి... 

ఏది ఏమైనా 27 సంవత్సరాల జీవితం.. (ఈ మే 21 తో సరిగ్గా 28 సంవత్సరాలు) వెనక్కి తిరిగి చూస్తే సగటు యవ్వన కాలం... కొవ్వొత్తిలా కరిగిపోయింది. ఒక్క క్షణం నేను నమ్మని ఆ దేవుడు వరమివ్వమని అడిగితే ఆయన ఇవ్వని (ఇవ్వలేని) ఈ దశలని(బాల్య,యవ్వన) మల్లి అడగాలని ఉంది... చావంటే భయపడలేదేప్పుడు... అలాగని బ్రతుకు మీద తీపి లేదని కాదు. డబ్బంటే ఇష్టం లేదు... అలాగని డబ్బు లేకుండా బతకలేను.., నాకు డబ్బంటే ఇష్టమంటారు కొందరు... కాని నాకు కాసులంటే(డబ్బు) కసి కాని కకృత్తి కాదు.... మొదట్లో ఆదర్శభావాలు చాలా ఉండేవి. దాన్ని ఇలా చేయాలి అలా చేయాలి.., అలా మార్చెయ్యాలి ఇలా మార్చెయ్యాలి.. కొన్ని రోజులు అడవి బాటలో పయనిద్దామని భావించిన నేను ఆ అడవి తల్లిని చూసేంత అర్హత నాలో లేదని ఆ ఆలోచనను ఆదిలోనే చంపేసి ఆదర్శభావాలను అంగట్లో అమ్మకానికి పెట్టి అమ్మనే (దేశాన్నే) తెగ నమ్మేస్తున్నాను.

ఏది ఏమైనా ఈ సగటు జీవన ప్రయాణంలో కొన్ని తీపి గురుతులు.., కొన్ని ఎదురు దెబ్బలు, ఎదురించడాలు.., ఎక్కడాలు.., దిగడాలు.., భయపడటాలు.., భయపెట్టడాలు.., అనారోగ్యాలు., ఆనందాలు.., అసంతృప్తులు..., అవహేళనలు.., అన్ని ఉన్నాయి. ఇంకా ఇవేం చుశావ్ మున్ముందు పల్టి కొట్టాల్సినవి చాలా ఉన్నాయి..., కింద పడి దెబ్బలు తగిలించుకునే సుదూర తీరాలు ఇంకా ఎంతో ఎత్తులో ఉన్నాయి... అన్నట్టు భవిష్యత్ ఏ బాధ లేకుండా రమ్మని స్వాగతం పలుకుతుంది... ఇవ్వన్ని అందరి జీవితాల్లో కామనే అయినా.... కొన్ని క్షణాలు మాత్రం అలాగే గుర్తుండి పోతాయి... జీవితం అనే ఫోటో ఆల్బంలో బాధ, సంతోషం, దుఖం అనే ఫ్రేమ్ ల లాగ... 

అలాంటి క్షణాలేమో కాని ఈ జీవన ప్రయాణంలో కొందరు గొప్ప వ్యక్తులు నాకు ఎదురయ్యారు... (గొప్ప వ్యక్తులు అనేకన్నా నా ప్రయాణ క్రమంలో తారస పడిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అనటం ఇంకా బెటర్ ఏమో.., ఎందుకంటే గొప్ప వ్యక్తులంటూ ఎవరు ఉండరని నేను ఇంతకు ముందే చెప్పాను..) వీళ్ళు నా ప్రయాణ క్రమాన్ని మార్చలేదు కాని.., ఆ ప్రయాణ క్రమంలో ఎంతో కొంత ప్రభావితం చూపారు... 27 సంవత్సరాలలో ఏడుగురు... 

1)అన్నయ్య: అవును నా అన్న కాబట్టి నాకు గొప్ప వ్యక్తే... నా ఆలోచనల్లో, అవసరాల్లో, ఆనందాల్లో అనుక్షణం ఉన్నాడు కాబట్టి గొప్ప వ్యక్తే ఇంక ఇందులో ఏలాంటి సందేహం అవసరం లేదు. చెప్పవలసిన అవసరం లేదు. 

2)యెడుగూరి సంధింటి అక్కిరెడ్డి: నా జీవితం అతి కీలకమైన మలుపు తీసుకోవటానికి ఉతమిచ్చిన వ్యక్తి... వేళ్ళ మీద కూడా నోట్లు లెక్క పెట్టొచ్చు.., మనుషుల మనస్తత్వాన్ని ముందే కనిపెట్టచ్చు.., బ్రతుక్కి సావుకి మధ్య మనం చేసే పోరాటంలో అటో ఇటో నిర్ణయం తీసుకొనే క్షణాల విలువే ధైర్యమని.., రాజ్యం ఉండాలంటే సంపాదన ఉండాలని సంపాదన కావాలంటే తెలివుండాలని.., తెలివికి లాజిక్ మ్యాజిక్కు రెండు జోడిస్తే ఇంక ఎవడికి వినాల్సిన పని ఉండదని ఇలా ఎన్నో సూత్రాలు ఎన్నో పాటాలు... ప్రపంచంలో "తెల్ల" "నల్ల" అనే పదాలకు అసలు అర్దాలను ఈయన దగ్గరే నేర్చుకోవటం మర్చిపోలేని ముఖ్యమైన ఘట్టం. ఈయన చెప్పిన మాటల్ని, పాటాల్ని నేను నోట్ పాడ్ లోనో... నోట్స్ లోనో రాసుకోలేదు.. మస్థిష్కంలోనే శిలాక్షరాలుగా లిఖించేసుకున్న...

3)కృపాదానం: గురువు... నాకు చిన్నప్పటి నుండి గురువులంటే ఏదో పాటాలు చెప్పి నెలాఖరు రాగానే వాళ్ళ జీతం తీసుకుపోయే వ్యక్తుల లాగ అనిపించేవాళ్ళు... అందుకే నా మీద ఏ గురువు ప్రభావితం చేయలేదు. చేయలేడు కూడా....  కాని ఈ గురువు మాత్రం నా ప్రాపంచిక జ్ఞానానికి నాంది పలికిన విజ్ఞాన దాతగా మిగిలిపోతారు... ఎన్నో విషయాలు ముఖ్యంగా ఆర్ధిక విషయాలపై నాలో అఖండ జ్ఞాన సంపత్తిని నెలకొల్పిన ఈయనకు నేను రుణపడి ఉండాలి అనే మాట చాలా చిన్నది అవుతుంది. 

4)ప్రియాంక: మర్చిపోయిన ఒక మధురమైన జ్ఞాపకం... ఈమె గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కొందరు వ్యక్తులు మన జీవితాల్లోకి కొన్ని విలువైన విషయాలు నేర్పించటానికి వస్తరంటారు. ఈమె ఆ కోవలోకే వస్తుంది. 

5)బాబాయ్: ఈయన నా మీద ఎంతో కొంత ప్రభావితం చూపారు... ముఖ్యంగా నాలో డబ్బు కసిని పెంచిన వ్యక్తి. ఈయన గురించి మాట్లాడేంత గొప్పవాణ్ణి కాదేమో కాని... నైతిక విలువలను నాలో పెంపోదింపజేసిన వ్యక్తి... నాలో అంతో కొంతో మానవత్వపు జాడలు బయటకి కనిపిస్తున్నాయంటే ఈయన వ్యక్తిత్వమే ముమ్మాటికి కారణం. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈయన వ్యక్తిత్వం చూస్తూ పెరిగాను. బంధాలు, భవబంధాలు, అనుబంధాలకు ఎంత విలువిస్తే అనురాగాలు అంత పెనవేసుకుంటాయని, అవి ఒక వెల కట్టలేని ఆస్తి అని నాలో ఆలోచన కలుగజేసిన వ్యక్తి...... కాని నేను మనిషి కంటే మనీకే ఎక్కువ విలువనిచ్చాను. (ఆఫ్ కోర్స్ ఆ తర్వాత ఆయన కూడా ఆప్యాయతలు తెచ్చేవాటికంటే ఆదాయాలు వచ్చేవాటికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు.)

6)వంకిడి కృష్ణ ప్రసాద్: నన్ను ఆర్థికంగా ఆలోచిపజేసిన వ్యక్తి..., నాలోని ఆలోచనలకు అర్దమిచ్చిన వ్యక్తి. నాలో అణువణువునా ఆర్ధిక కోణాన్ని చూసిన వ్యక్తి.

7)రోహిత్ కృష్ణ రావు: స్నేహితుడు కాని స్నేహితుడు.. (కొందరు వ్యక్తులు వారి ప్రమేయం ఏమి లేకుండానే ఎదుటి వ్యక్తులపై ప్రభావితం చూపిస్తారు. ఆ కోవలోకే ఈ వ్యక్తి కూడా వస్తాడు.. కొన్ని సార్లు కొన్ని సందర్భాల్లో ఇతని ప్రమేయం లేకుండానే నా మీద ప్రభావితం చూపిన వ్యక్తి.) నా 27 ఏళ్ళ జీవితంలో ఒక అర్ధం కాని వ్యక్తిగా మిగిలిపోయే వ్యక్తంటూ ఉంటె కచ్చితంగా ఇతనే... ఇతని నుండి చిన్నప్పటి నుండి చాలా నేర్చుకున్న... కొన్ని సార్లు మదికి అందని మహోన్నత వ్యక్తిగా కనిపిస్తాడు. కొన్ని సార్లు  సంపాదన కోసమే సప్త సముద్రాలను దాటిన వ్యక్తిగా కనిపిస్తాడు... మల్లి ఆ డబ్బు మీద పెద్దగా వ్యామోహం ప్రదర్శించని వ్యక్తిగా కనిపిస్తాడు. ఇప్పటికి నాకు ఆర్థికంగా అర్ధం కాని వ్యక్తి.... ఆలోచన పరంగా అందని వ్యక్తి...

వీళ్ళు కాక ఇంకో ముఖ్యమైనది.... 

నా ఆలోచన: అవును నన్ను నేను ఎంటన్నది ఆలోచింపజేసిన నా ఆలోచన కూడా గొప్పదే... !

మొత్తానికి ఈ 27 సంవత్సరాలలో ఈ ఏడుగురు (7+1) నా ప్రయాణ క్రమంలో ప్రభావితం చూపి పరోక్షంగానో, ప్రత్యక్షంగానో నా ఎదుగుదలకో పతనానికో తోడ్పడినవారు....

హరికాంత్ రెడ్డి


Sunday, 24 April 2016

ఈ సోలో జీవితానికి శుభమెప్పుడు...!


ఏంటో ఈ బ్యాచిలర్ జీవితానికి బొత్తిగా ఒక రంగంటూ ఏలాగు లేదు ఇప్పుడు రుచి కూడా లేకుండా పోతుంది మరి..! అర్రే... మొన్నటికి మొన్న బెండకాయ కూరలో కోడిగుడ్డు వేసి మాడ గొట్టి వండి మరీ మధ్యాహ్న భోజనం సిద్దం చేసిన వంటవాణ్ని మెచ్చుకోవాలో, మీద పడి కరిచేయాలో అర్ధం కాలేదు...!! కొన్ని రకాల వంటలు తిని ఈ మధ్య నాలో నేనే మాట్లాడుకుంటున్న అంటే నమ్మండి... ఉత్తర భారతంలో ఉన్నపుడు ఉప్పు ఎలాగు నాలుకకు అంటదు కారం మాట దేవుడెరుగు... ఆ మధ్య బెల్లం వేసి వండిన బిర్యాని తిని ఒక గంట సేపు జపనీస్ బాషలో మాట్లడానంటా... నాక్కూడా..., నాకు తెలియని జపనీస్ బాష వస్తుందని అది విన్న స్నేహితులు చెప్పేదాకా తెలియలేదు.  అర్రే నా బుర్ర బురదలో ముంచేసి మల్లి నా తలకాయలో పెట్టుకున్నట్లు ... వంకాయలో చింతపులుసు పోయటం ఏంటి మరీ నా శ్రార్ధం కాకపోతే.....  ఛీ అది తిన్న నా నాలుకను గోతిలో తీసి కప్పెట్ట...! ఈ మధ్య అయితే మరీ వింత వింత వంటలు రుచి చూడటం నాకే చెల్లింది. అర్రే మొన్నటికి మొన్న హైదరాబాద్ లో ఖాలిగా ఉన్నప్పుడు కాకరకాయ కరివేపాకు అని యూట్యూబ్ లో చూసి మరీ వండితే కాకరకాయ మాడింది కరివేపాకు మిగిలింది... ఆఫ్ కోర్స్ ఆ మిగిలిన కరివేపాకుతో నా భోజనం కానిచ్చేసానుకో...!

ఈ సారి ఇలా కాదని ఖాళిగా ఉన్నప్పుడు గరిటె తిప్పి మనమెంటో గర్వంగా ఈ ప్రపంచానికి చాటి చెప్పాలని మైండ్ లో బ్లైండ్ గా అనుకున్న. యూట్యూబ్ లో రోజుకో వెరైటీ చూస్తూ వీలున్నపుడల్లా రోజుకో వింత వంటకంతో నా విదేయులపైనే ప్రయోగించా... నా వంటలు తిన్న వాళ్ళు ఆ వంటతో పాటు రోజుకో కొత్త పదాన్ని కూడా నేర్చుకున్నారు.... ఆ వంటలన్నీ ఎలా వండానో ఒక గ్రంథం రాసి అచ్చు వేసి దాని మీద వచ్చిన డబ్బులతో ఏదైనా చారిటీ సంస్థకు విరాళామివ్వాలని నిర్ణయించుకున్నప్పటికి స్నేహితులు వద్దని వారించారు. ఎందుకంటే అది ఎవడైనా పొరపాటున కొని దానిలో ఉన్న వంటలు ప్రయత్నించి.., అది రాసిన నన్ను రోజుకో అడ్రెస్స్ కి వచ్చి కొడతారేమో అని వద్దన్నారని తెలిసి నాక్కూడా నిజమే అనిపించి ఆ వంటల పుస్తకం రాద్దామన్న ఆలోచనను ఆదిలోనే చంపేసాను.... నా వంటలు తిన్న స్నేహితుల్లో ఒకడు అరేయ్ ఎందుకిరా ఇవ్వన్ని బాధలు.. చక్కగా పెళ్లి చేసుకుంటే ఈ అడ్డమైన బాధలు తప్పుతాయి కదా అన్నాడు... నోర్ముయ్ వెధవ..., వండి పెట్టె మనిషి కోసమే మనువాడే ముదనష్టం మొహమూ నువ్వునూ... ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నేను చేసే వారం రోజుల వంటలు ఒకేసారి చేసి నోట్లో కుక్కుతా.... అని, మరో కొత్త వంటకం ఎం దొరుకుతుందా అని యూట్యూబ్ లో వెతుకుతుండగా బుర్రలో ఐడియా గిర్రున తిరిగింది. అసలు వంటలు మనమే ఎందుకు చేయాలి. బట్టలు ఉతకటానికి వాషింగ్ మిషన్ ఉంది... పిండి రుబ్బటానికి గ్రైండర్ ఉంది. మరి వంటలు చేయటానికి మిషన్ ఎందుకు లేదబ్బా.. ఒక మీట నొక్కగానే అన్ని పోపులు వేసేసి మాడగోట్టకుండా మతి పోగొట్టే మిషన్ వస్తే ఎంత బాగుండు... ఏంటి నేను ఇదంతా ఆలోచిస్తున్నా... నేను తినే ఈ వంటల దెబ్బకి నా మతి పొయిందా ఏంటి.... ఇంక వెంటనే మల్లి యూట్యుబ్ ఓపెన్ చేశాను రేపు మసాల మటన్ అనే కొత్త వంటకంతో వేరే వాళ్ళ మతులు పోగొట్టేద్దామని...!!

హరికాంత్ రెడ్డి

Thursday, 14 April 2016

అందమెందుకు అంతందంగా ఉంటుంది బాసూ...?!


అందం... ప్రపంచంలోనే అంత్యంత సంక్లిష్టమైన పదమనుకుంటా..!

అందమైన అమ్మాయిని దగ్గరగా చూడగానే మనసు ముందు ఆందోళన పడి ఆ తర్వాత ఆనందపడుతుంది... ఆ అందాన్ని కలవమని ఆరాటపడుతుంది. తర్వాత ఆ అమ్మాయితో ఆప్యాయంగా మాట్లాడాలని ఆశ పడుతుంది. ఆ అమ్మాయితో అందమైన జీవితాన్ని పంచుకుంటే బాగుంటుందని ఆశ అభిలాషగా మారుతుంది. ఇదంత దగ్గరగా బానే ఉంది. సినిమాల్లో ఒక కథలా నిజంగా ప్రాక్టికల్ జీవితంలో కలిసిన తర్వాత.., లైఫ్ ఆ అమ్మాయి ఉన్నంత అందంగా ఉంటుందా..?! ఉంటుందా అంటే ఏమో మరి ఉండచ్చు...! ఉండకపోవచ్చు కూడా.. !! మగువని చూడగానే మనసులో మల్లె తీగల్లె పదాల అల్లికలు ఎందుకు బయటకి వస్తాయో తెలియదు కాని అతివలు మాత్రం ఈ అవని అందానికి మరింత అందం అద్దటానికి వచ్చిన అద్భుతమైన వన్నె తరగని కుసుమాలేమో....! అటువంటి అందాన్ని కలిసే క్షణాలే వస్తే కదిలే కాలానికి కళ్ళెం వేస్తా...! :)

హరికాంత్ రెడ్డి